గేట్‌-2016... తీరూ తెన్నూ

ఇంజినీరింగ్‌లో పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాల కోసం ‘గేట్‌’ను ఇటీవలే దేశవ్యాప్తంగా నిర్వహించారు. సిలబస్‌ లో కొన్ని మార్పులూ, వర్చువల్‌ కాల్‌క్యులేటర్‌ ప్రవేశపెట్టటం లాంటివి ఈసారి ప్రత్యేకతలు. ఈ పరీక్ష సరళి ఎలా ఉంది? ఈసారి రాయబోయే అభ్యర్థులు ఏ విషయాలను గమనించాలి? పరిశీలిద్దాం!
మనదేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పరీక్షలో ఒకటైన గేట్‌ (గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌)ను ఈ ఏడాది ఐఐఎస్‌సీ (బెంగళూరు) నిర్వహించింది.
2013 వరకూ గేట్‌ పరీక్ష ఆఫ్‌లైన్లో మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో జరిగేది. 2014 నుంచి దీన్ని ఆన్‌లైన్లో నిర్వహించటం ప్రారంభించారు. ఈ ఆన్‌లైన్‌ విధానంలో మల్టిపుల్‌ చాయిస్‌తోపాటు న్యూమరికల్‌ సమాధానాలు (ఖాళీలు) వంటి ప్రశ్నలు కూడా అడుగుతున్నారు. గేట్‌-2015 వరకూ పరీక్ష హాల్లోకి కాల్‌క్యులేటర్‌ను అనుమతించేవారు. గేట్‌-2016ను ఆన్‌లైన్లోనే నిర్వహించారు. ఈ ఏడాది వర్చువల్‌ కాల్‌క్యులేటర్‌ను కొత్తగా పొందుపరిచారు. ఈ విధానంలో పరీక్ష హాల్లోకి కాల్‌క్యులేటర్‌ను అనుమతించలేదు.
ప్రాథమికాంశాలే...
వర్చువల్‌ కాల్‌క్యులేటర్లో అన్ని రకాల ఫంక్షన్లు లేకపోవడం వల్ల దీనికి అనుగుణంగానే వివిధ విభాగాల్లో ప్రశ్నలను రూపొందించారు. ఇమాజినరీ ఫంక్షన్స్‌, హైయర్‌ ఆర్డర్‌ సమీకరణాలకు సంబంధించిన ప్రశ్నలను అడగలేదు. కొన్ని ప్రశ్నలకు ట్రయల్‌ అండ్‌ ఎరర్‌ విధానంలో సమాధానం రాబట్టవలసివచ్చింది. ఎక్కువశాతం ప్రశ్నలు ప్రాథమికాంశాలపై ఆధారపడినవి. చాలావరకూ గతంలో అడగని అంశాలపై ప్రశ్నలను ఇచ్చారు. కొన్ని ప్రశ్నలు ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ తరహాలో ఉన్నాయి. ఈ అనుభవంతో రేపటి అభ్యర్థులు గేట్‌, ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ పూర్వప్రశ్నపత్రాలూ, ఇతర అంశాలూ కూడా సాధన చేయటం శ్రేయస్కరం. వివిధ ప్రశ్నపత్రాలను విశ్లేషించిన తర్వాత ఏ సబ్జెక్టుకు ప్రాధాన్యమో, కాదో ఇదమిత్థంగా నిర్ణయించలేని పరిస్థితి. దీన్ని బట్టి ఏ ఒక్క సబ్జెక్టు కూడా పూర్తిగా వదిలివేయలేని పరిస్థితి ఉత్పన్నమైందని అభ్యర్థులు గ్రహించాలి.
పరీక్ష విధానం
గేట్‌ ప్రశ్నపత్రం మొత్తం 100 మార్కులకు ఉంది. పరీక్ష వ్యవధి మూడు గంటలు. ప్రశ్నపత్రంలో రెండు విభాగాలు.
విభాగం-1 (జనరల్‌ ఆప్టిట్యూడ్‌): ఇందులో పది ప్రశ్నలు. ఒకటి నుంచి ఐదు ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. 6 నుంచి 10 ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు.
విభాగం- 2 (సంబంధిత ఇంజినీరింగ్‌ సబ్జెక్టులు): ఈ విభాగంలో 55 ప్రశ్నలు.
* 1 నుంచి 25 ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు.
* 26 నుంచి 55 ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు.
తప్పు జవాబుకు 33.33% రుణాత్మక మార్కులు. అంటే ఒక మార్కు ప్రశ్నలకు 1/3, రెండు మార్కుల వాటికి 2/3 చొప్పున మైనస్‌ మార్కులు. న్యూమరికల్‌ ప్రశ్నలకు రుణాత్మక మార్కులు లేవు.
రేపటి అభ్యర్థులకు సూచనలు
* ఆన్‌లైన్‌ మాదిరి ప్రశ్నపత్రాల సాధన తప్పనిసరి.
* ప్రతి అధ్యాయానికీ సంబంధించి ముఖ్య విషయాలను చిన్న చిన్న పట్టికల ద్వారా సంక్షిప్తంగా తయారుచేసుకోవాలి. పునశ్చరణకు ఇది ఉపయోగం.
* ప్రామాణిక పాఠ్యపుస్తకాలను ఎంచుకోవాలి.
* గేట్‌, ఇంజినీరింగ్‌ సర్వీస్‌ గత ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. దీనివల్ల ఒక అంశాన్ని ఎన్ని విధాలుగా అడగడానికి అవకాశం ఉంటుందో అవగాహన వస్తుంది.
బ్రాంచీల వారీగా విశ్లేషణ
* ఎలక్ట్రికల్‌: ఈ సంవత్సరం గేట్‌లో ప్రధానంగా ఎలక్ట్రికల్‌ సర్క్యూట్స్‌, పవర్‌ ఎలక్ట్రానిక్స్‌ నుంచి అధికంగా ప్రశ్నలు వచ్చాయి. ఈ విభాగంలో అప్లికేషన్‌ ఆధారిత ప్రశ్నలు, మల్టిపుల్‌ సబ్జెక్టులను కలిపి ప్రశ్నలు అడిగారు. ఎలక్ట్రికల్‌ మెజర్‌మెంట్స్‌ నుంచి అభ్యర్థులు అనుకున్నదానికంటే చాలా తక్కువ ప్రశ్నలు అడిగారు. ఆప్టిట్యూడ్‌, ఇంగ్లిష్‌లలో సులభమైన ప్రశ్నలు వచ్చాయి. అభ్యర్థులు వీలైనంత త్వరగా సమాధానాలు రాయటానికి ఎక్కువగా న్యూమరికల్‌ ప్రశ్నలు అడిగారు. వంద మార్కులకు సగటున 45 మార్కులు న్యూమరికల్‌ ప్రశ్నలు వచ్చాయి.
* ఎలక్ట్రానిక్స్‌: ఈ బ్రాంచిలో మొత్తం మూడు సెషన్లలో పరీక్ష నిర్వహించారు. సబ్జెక్టుల వెయిటేజి పరంగా మొదటి సెషన్లో సిగ్నల్స్‌ అండ్‌ సిస్టమ్స్‌ నుంచి ఎక్కువ మార్కులకకూ, నెట్‌ థియరీ సబ్జెక్టుల నుంచి తక్కువ మార్కులకూ, రెండో సెషన్లో వీఎల్‌ఎస్‌ఐ నుంచి ఎక్కువ మార్కులకూ, సిగ్నల్‌ అండ్‌ సిస్టమ్స్‌ తక్కువ మార్కులకూ, మూడో సెషన్లో సిగ్నల్‌ అండ్‌ సిస్టమ్స్‌కు ఎక్కువ, కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌ తక్కువ మార్కులకు అడిగారు. దీన్నిబట్టి ప్రతి సబ్జెక్టునూ అభ్యర్థులు పూర్తి శ్రద్ధతో చదవాలని తెలుస్తోంది. వంద మార్కులకు సగటున 45 మార్కులు న్యూమరికల్‌ ప్రశ్నలు వచ్చాయి.
* సివిల్‌: ఈ బ్రాంచిలో మొత్తం రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించారు. సబ్జెక్టుల వెయిటేజి పరంగా తొలి సెషన్లో జియో టెక్నికల్‌ ఇంజినీరింగ్‌ సబ్జెక్టు నుంచి ఎక్కువ మార్కులకు, బిల్డింగ్‌ మెటీరియల్స్‌ సబ్జెక్టు నుంచి తక్కువ మార్కులకు ప్రశ్నలు వచ్చాయి. రెండో సెషన్లో జియో టెక్నికల్‌ ఇంజినీరింగ్‌ సబ్జెక్టు నుంచి ఎక్కువ మార్కులకూ, బిల్డింగ్‌ మెటీరియల్స్‌ నుంచి తక్కువ మార్కులకూ ప్రశ్నలు అడిగారు. పూర్తిగా ప్రాథమికాంశాలపై ఆధారపడి ప్రశ్నలు వచ్చాయి. వంద మార్కులకు సగటున 34 మార్కులు న్యూమరికల్‌ ప్రశ్నలు వచ్చాయి.
* మెకానికల్‌: ఈ బ్రాంచిలో మూడు సెషన్లలో పరీక్ష నిర్వహించారు. 2 మార్కుల ప్రశ్నల్లో 70 శాతం న్యూమరికల్‌ ప్రశ్నలు టెక్నికల్‌ సబ్జెక్టుల నుంచి అడిగారు. సగటున 100 మార్కులకు 60 మార్కులు న్యూమరికల్‌ ప్రశ్నలు అడిగారు. మెటీరియల్‌ సైన్స్‌, ఇంజినీరింగ్‌ మెకానిక్స్‌ నుంచి అధిక ప్రశ్నలు వచ్చాయి.
* కంప్యూటర్‌ సైన్స్‌: ఈ బ్రాంచిలో రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించారు. మొదటి సెషన్లో డిజైన్‌ అనాలిసిస్‌ అండ్‌ అల్‌గారిధమ్స్‌, కంప్యూటర్‌ నెట్‌వర్క్స్‌ సబ్జెక్టుల నుంచి ఎక్కువ మార్కులకు ప్రశ్నలు వచ్చాయి. కంపైలర్‌ డిజైన్‌ సబ్జెక్టు నుంచి తక్కువ మార్కులకు అడిగారు. రెండో సెషన్లో డిజైన్‌ అనాలిసిస్‌ అండ్‌ అల్‌గారిధమ్స్‌, కంప్యూటర్‌ నెట్‌వర్క్స్‌, ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ సబ్జెక్టుల నుంచి ఎక్కువ మార్కులకు ప్రశ్నలు వచ్చాయి. కంపైలర్‌ డిజైన్‌, డాటా స్ట్రక్చర్స్‌ సబ్జెక్టుల నుంచి తక్కువ మార్కులకు అడిగారు. సగటున వంద మార్కులకు 43 మార్కులు న్యూమరికల్‌ ప్రశ్నలు వచ్చాయి.

Posted on 15-02-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning