కొలువుల తీరం

* విశాఖ-కాకినాడ పెట్రో రీజియన్‌లో 11.98 లక్షల ఉద్యోగాలు
* ప్రత్యక్షంగా 5.25 లక్షలు... పరోక్షంగా 6.73 లక్షలు
* నైపుణ్యాల పెంపుదల తక్షణావసరం

ఈనాడు, హైదరాబాద్‌: విశాఖపట్నం - కాకినాడ మధ్య పెట్రో, రసాయనాల రంగం అభివృద్ధితో కొలువుల జాతర మొదలవుతోంది. వందలు, వేలు ఉద్యోగాలు కాదు... లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి. గుజరాత్‌, ఒడిశా, తమిళనాడుల్లోని పెట్రో రీజియన్ల కంటే మెరుగైన ఉపాధికి ఆంధ్రప్రదేశ్‌ తీరంలోనే ఆస్కారం ఉంది. రూ. లక్షల కోట్ల పెట్టుబడితో ‘విశాఖపట్నం - కాకినాడ పెట్రోలియం, పెట్రో రసాయనాల పెట్టుబడి ప్రాంతం’(వీకే-పీసీపీఐఆర్‌) పురుడు పోసుకోబోతోంది. ఇక్కడ పెట్రోలియం, పెట్రోకెమికల్‌, రసాయనాలు, ఎరువులు, వీటి అనుబంధ పరిశ్రమలు, ఇన్‌ఫ్రా యూనిట్లు ఏర్పాటవుతాయి. వీటి ద్వారా విశాఖ - కాకినాడ తీరంలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధులకు అవకాశాలు మెరుగవుతాయి. ఈ పెట్టుబడి ప్రాంతం పూర్తయితే కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారమే 11.98 లక్షల మందికి ఉద్యోగావకాశాలు వస్తాయి. ఈ శాఖ విశాఖ-కాకినాడ పీసీపీఐఆర్‌కి సంబంధించిన పెట్టుబడులు, ఉపాధి అవకాశాల వివరాలను సమగ్రంగా ఓ నివేదిక రూపంలో పేర్కొంది.
దేశంలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు గుజరాత్‌, ఒడిశా, తమిళనాడు తీరాల్లో పెట్రోలియయం, పెట్రో రసాయనాల పెట్టుబడి ప్రాంతాలను అభివృద్ధి చేసే దిశగా ప్రాజెక్టులు మొదలయ్యాయి. గుజరాత్‌లో దహేజ్‌, ఒడిశాలో పారదీప్‌, తమిళనాడులో కడలూరు-నాగపట్టిణం తీరాల్లో పీసీపీఐఆర్‌లు రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం - కాకినాడ తీరాన్ని ఇందుకు అనువైన ప్రాంతంగా గుర్తించారు. ఇతర రాష్ట్రాలకంటే ఏపీలోనే ఎక్కువ పెట్టుబడులు, ఉద్యోగాలు రాబోతున్నాయి. ఈ పెట్టుబడుల ప్రాంతానికి సంబంధించిన తుది ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం 2014లోనే కేంద్రానికి అందించింది. ఈ ప్రాజెక్టుకి సంబంధించి తీరంలో ఉన్న అనువైన పరిస్థితులన్నింటినీ అందులో పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న సెజ్‌లు, రైలు రవాణా అనుసంధాన వ్యవస్థ, రహదారి వ్యవస్థ, నౌకాశ్రయాల వివరాలు ప్రణాళికలో తెలిపారు. రైల్వే ఇన్‌ఫ్రా టెక్నికల్‌ అండ్‌ ఎకనమిక్‌ సర్వీసెస్‌ కూడా దీనిపై సర్వే చేసి సమగ్రంగా సాధ్యతపై నివేదిక ఇచ్చింది. దీనిపై పురపాలక, అటవీ, పర్యావరణ, రెవెన్యూ తదితర శాఖలు, విశాఖ, తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగాలు సమగ్రమైన వివరాలను కేంద్రానికి ఇచ్చాయి.
పెట్టుబడులు రూ.3.43 లక్షల కోట్లు
పీసీపీఐఆర్‌ పరిధిలో పెట్రో, పెట్రో రసాయన, వాటి అనుబంధ ఆధారిత పరిశ్రమలు వస్తాయి. వీటీ ద్వారా రూ.3.43 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని కేంద్రం అంచనా వేసింది. ఇందులో మౌలిక సదుపాయాల రంగంలోనే రూ.17,971 కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ తీరంలో పారిశ్రామిక పార్క్‌లు, ఫార్మాసిటీ, సెజ్‌లు ఉండటం కూడా పీసీపీఐఆర్‌ అభివృద్ధికి అనువైన అంశంగా మారనుంది.
నైపుణ్యాల అభివృద్ధే కీలకం
లక్షల కోట్ల పెట్టుబడుల మూలంగా పెట్రోలియం, పెట్రో కెమికల్స్‌, రసాయనాలు, ఎరువులు, వాటి అనుంబంధ రంగాలు, లాజిస్టిక్స్‌, జోన్‌ హబ్స్‌, నౌకాశ్రయాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో భారీగా ఉద్యోగాలు ఉండబోతున్న విషయాన్ని కేంద్ర రసాయనాల శాఖ వర్గాలు తమ నివేదికల్లో స్పష్టంగా వెల్లడించాయి. పీసీపీఐఆర్‌ పూర్తయ్యే నాటికి 11.98 లక్షల మందికి ఉపాధి లభిస్తుందంటూనే స్థానికుల్లో నైపుణ్యాలు అభివృద్ధి చెందాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. పీసీపీఐఆర్‌ పరిధిలోకి వచ్చే పరిశ్రమలు, యూనిట్లలో లభించే ఉపాధి అవకాశాలకు అనువైన నైపుణ్యాల్లో శిక్షణనిచ్చి మెరుగుపరచే కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాల్సిన అవసరం ఉంది. ఆ పరిశ్రమలు వచ్చేనాటికి తగిన నైపుణ్యాలతో ఉంటే స్థానికులకే ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి.


Posted on 29-02-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning