నైపుణ్య‘కోటి’కి నయా కేంద్రాలు!

* 1500 బహుళ నైపుణ్య శిక్షణ కేంద్రాల ప్రకటన
* రూ.1700 కోట్ల కేటాయింపు
* గతేడాది కేటాయింపు రూ.1350 కోట్లు

దేశంలోని యువతలో నైపుణ్యాల పెంపునకు ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యం పెరిగింది. ప్రధాన మంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన కింద మరో మూడేళ్లలో కోటి మంది యువతను నిపుణులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగా 1500 బహుళ నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ.1700 కోట్లను వెచ్చించారు. ప్రధాన మంత్రి కౌశల్‌ యోజనను మరింత పటిష్ఠం చేయడంతో పాటు.. నైపుణ్యాభివృద్ధి ధ్రువీకరణ మండలిని ఏర్పాటు చేస్తారు. దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌ గ్రామీణ కౌశల్య యోజన కింద అందించే సేవలకు సేవా పన్నును మినహాయించారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు వీలుగా 2200 కళాశాలలు, 300 పాఠశాలలు, 500 ప్రభుత్వ ఐటీఐ సంస్థలు, 50 వృత్తి శిక్షణ సంస్థల్లో వ్యాపార, విద్య శిక్షణను అమలు చేస్తామని ఈ బడ్జెట్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం కింద అధునాతన ఐటీఐలను బహుళ నైపుణ్య శిక్షణ కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నారు. ఈ కేంద్రాలను వెనుకబడిన జిల్లాల్లో ఏర్పాటు చేస్తారు. దేశాభివృద్ధికి దోహదపడే తొమ్మిది అంశాల్లో విద్య, నైపుణ్యం.. ఉపాధి సృష్టిలు కూడా కీలకమని జైట్లీ చెప్పారు. మరోవైపు జులై 2015లో జాతీయ కెరీర్‌ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా 3.5 కోట్ల మంది యువత ఉద్యోగాల కోసం నమోదు చేసుకున్నారు. దీన్ని రాష్ట్రాల్లోని ఉపాధి కల్పనా కేంద్రాలకు అనుసంధానం చేయనున్నారు. యువతకు ఉపాధి అవకాశాలను పెంచేందుకు ఈ ఏడాది ఆఖరుకు 100 ఆదర్శ కెరీర్‌ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
ర్యాంకుల వెర్రిలో ప్రతిభకు కొర్రీ!
దేశంలో అపారమైన మానవ వనరులున్నాయి. యువశక్తీ పుష్కలంగా ఉంది. కానీ ఏం లాభం? నైపుణ్యం లేదు. దేశంలోని 58 శాతం కంపెనీలు తమకు నిపుణులైన మానవ వనరుల్లేక చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితిని రూపుమాపేందుకే మోదీ సర్కారు ‘నైపుణ్య భారత్‌’ పథకాన్ని చేపట్టింది. మరో ఆరేళ్లలో దేశంలో 40 కోట్ల మందిని నైపుణ్యమున్న యువతగా తీర్చిదిద్దాలన్నది ఈ పథక లక్ష్యం.
* 2022 నాటికి దేశంలో నిర్మాణ రంగంలో 3కోట్ల మంది నిపుణులైన పనివారు అవసరమని అంచనా.
* ఎలక్ట్రానిక్‌, హార్డ్‌వేర్‌ రంగాల్లో 46 లక్షల మంది నిపుణులవసరం.
నైపుణ్యంలో మనమెక్కడ?
* దక్షిణ కొరియాలో నైపుణ్యమున్న యువత 96 శాతం
* జపాన్‌లో 80 శాతం
* జర్మనీ 75 శాతం
* బ్రిటన్‌ 69 శాతం
* ...మరి భారత్‌లో.. 3 కన్నా తక్కువ శాతం!!
ప్రస్తుత పరిస్థితి
* భారత్‌లోని ప్రతి ముగ్గురు పట్టభద్రుల్లో ఒకరు నిరుద్యోగి
* ఇక్కడ ఎంబీఏ పూర్తిచేసిన వారికీ 10 శాతం మందికే తగిన నైపుణ్యముంటోంది.
* ఇంజినీరింగ్‌లోనూ ఇంతే.. 17 శాతం మందే ప్రతిభావంతులుగా బయటకొస్తున్నారు.Posted on 01-03-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning