ఐఎస్‌బీ విద్యార్థుల కోసం పోటాపోటీ

* ప్రముఖ కంపెనీల నుంచి 1,093 ఉద్యోగ అవకాశాలు
* ఇప్పటి వరకూ ఇదే అత్యధికం
* గరిష్ఠ పారితోషికం రూ.70 లక్షలు

ఈనాడు - హైదరాబాద్‌: ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ)కు చెందిన హైదరాబాద్‌, మొహాలి ప్రాంగణాల్లోని పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ (పీజీపీ) పూర్తి చేసిన విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వడానికి బడా కంపెనీల నుంచి అంకుర కంపెనీల వరకూ వివిధ కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఐఎస్‌బీ ప్రారంభించిన నాటి నుంచి ఇంత వరకూ లేనంతగా ప్రాంగణ నియామంలో అత్యధిక ఆఫర్లు వచ్చాయి. క్లాస్‌ ఆఫ్‌ 2016లోని మొత్తం 812 మంది విద్యార్థులకు ఇప్పటి వరకూ 1,093 ఆఫర్లు వచ్చినట్లు ఐఎస్‌బీ వెల్లడించింది. గత ఏడాది ఇవ్వజూపిన సగటు పారితోషికంతో పోలిస్తే ఈ సారి ఇది 14 శాతం అధికంగా ఉంది. ఇప్పటి వరకూ గరిష్టంగా ఏడాదికి రూ.70 లక్షల పారితోషికాన్ని ఇవ్వడానికి కంపెనీలు ముందుకు వచ్చాయి.
* మొత్తం ఆఫర్లలో మెకిన్సే, బోస్టన్‌ కన్సల్టింగ్‌, ఈవై, డెలాయిట్‌, కేపీఎంజీ వంటి ప్రముఖ కన్సల్టెంగ్‌ కంపెనీల నుంచి వచ్చిన ఆఫర్లు 19 శాతం ఉన్నాయి.
* మైక్రోసాఫ్ట్‌, యాపిల్‌, ఫిలిప్స్‌, హెచ్‌సీఎల్‌, టెక్‌ మహీంద్రా వంటి టెక్నాలజీ కంపెనీల ఆఫర్లు 11 శాతం ఉన్నాయి.
* అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఇ-కామర్స్‌ కంపెనీలు సైతం ఐఎస్‌బీ విద్యార్థుల కోసం ఎగబడ్డాయి. 10 శాతానికి సమానమైన 109 ఆఫర్లు చేశాయి.
* ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఎక్స్‌ఓ) వంటి సీనియర్‌ నాయకత్వ బాధ్యతలను నిర్వహించడానికి వివిధ కంపెనీలు 92 ఆఫర్లు ఇచ్చాయి. ఈ ఆఫర్లు పొందిన వారిలో మహిళలు కూడా ఉన్నారు. గత ఏడాది 18 ఆఫర్లు ఇచ్చిన యాక్సిస్‌ బ్యాంకు ఈ సారి 30 ఉద్యోగాలను ఇవ్వడానికి ముందుకు వచ్చింది.
* దాదాపు 20 అంతర్జాతీయ కంపెనీలు ఇప్పటి వరకూ 73 ఆఫర్లు చేశాయి.
* టెక్నాలజీ, టెలికామ్‌, ఇ-కామర్స్‌, రవాణా, విద్యా వంటి వివిధ రంగాల్లోని అంకుర కంపెనీలు 7 శాతం ఆఫర్లు ఇచ్చాయి. ఉన్నత స్థాయిలోని నిర్వహణ ఉద్యోగులను నియమించుకోవడానికి కూడా ముందుకు వచ్చాయి.
* బీఎఫ్‌ఎస్‌ఐ, ఆరోగ్య సంరక్షణ, ఔషధ రంగాల్లోని కంపెనీలు కూడా ఏ మాత్రం తగ్గలేదు. మొత్తం ఆఫర్లలో వీటి వాటా 8 శాతం ఉంది.


Posted on 03-03-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning