ఆడబిడ్డకు ఐటీ హారతి

* ఉద్యోగాల్లో అందరికంటే ఎక్కువగా మహిళలకు పెద్దపీట
* అత్యధిక మహిళా ఉద్యోగినుల్లో హైదరాబాద్‌ది రెండోస్థానం
* అబ్బాయిలకంటే అమ్మాయిలనే ప్రోత్సహిస్తున్న కంపెనీలు

ఈనాడు, హైదరాబాద్‌: పూర్వీకులు... ఎక్కడ మహిళలు పూజలందుకుంటారో అక్కడ దేవతలుంటారన్నారు. ఆధునికులు... ఆకాశంలో నువ్వు సగమని ఆకాశానికెత్తారు... ..ఎవరేమన్నా అవన్నీ మాటలకే పరిమితమయ్యాయి. అరకొరగా కొలువులిచ్చి.. అమ్మాయిలను భారంగానే చూశారు! ఫలితంగా చేతల్లో ఆమె ఇంటికే పరిమితమైంది! కానీ.. ఎలాంటి ప్రశంసలు కురిపించకుండా ఆడబిడ్డలా అగ్రతాంబూలమిచ్చి.. గౌరవించి.. మగవారితోపాటు సమానంగా జీతాలిస్తూ, హోదాలిస్తూ..
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి.. ఉద్యోగ కల్పనలో ప్రభుత్వాలు సహా ప్రైవేటులోనూ మరెవ్వరూ చేయనంతగా అతి స్వల్పకాలంలో మన దేశంలో అమ్మాయిలకు పెద్దపీట వేసిందీ.. వేస్తున్నదీ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) రంగం! జైజవాన్‌, జైకిసాన్‌ల మాదిరిగా జై నారీ అనేస్థాయిలో అమ్మాయిలకు ఐటీ రంగం హారతి పట్టడంతో దేశ ఆర్థిక, సామాజిక ముఖచిత్రంలో అనేకానేక మార్పులు చోటుచేసుకున్నాయి.
లక్ష్మి (పేరు మార్చాం) తాపీ మేస్త్రీ కుమార్తె. నలుగురు పిల్లల (ముగ్గురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి) కుటుంబంలో పెద్దమ్మాయి! పాచి పనుల్లో అమ్మకు సాయం చేస్తూ.. తాము పనిచేసే ఇంటివాళ్లు ఆర్థిక సాయం చేస్తే చదువుకుంది. ఇంజినీరింగ్‌ చివరి ఏడాది ప్రాంగణ నియామకాల్లో విప్రోలో ఉద్యోగం వచ్చింది! ఇక లక్ష్మి కుటుంబ పరిస్థితులే మారిపోయాయి. మూడేళ్ళలో చిన్న ఇల్లు కొనుక్కున్నారు. చెల్లెల చదువులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగిపోతున్నాయి.
శ్రావణిది (పేరు మార్చాం) మధ్యతరగతి కుటుంబం. ఒక్కర్తే కూతురు. గారాబంగా పెరిగింది. ఇంజినీరింగ్‌ ఫైనలియర్‌ కాగానే టీసీఎస్‌లో ఉద్యోగం రావటం.. పెళ్లికావటం ఒకేసారి జరిగాయి. ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు మరోవైపు అత్తవారింట బాధ్యతలతో కొంత సతమతమైనా క్రమేణా ఇటు ఇంటినీ.. అటు ఆఫీస్‌ పనినీ సమన్వయం చేసుకోవటం అలవాటు చేసుకుంది. ఇంతలో పాప పుట్టింది. ఆఫీస్‌లో టీమ్‌ లీడర్‌గా పదోన్నతి పొందింది. అయినా టెన్షన్‌ లేదు. ఎందుకంటే ముందులా ప్రతిదానికీ టెన్షన్‌ పడే శ్రావణి కాదిప్పుడు తను!
లక్ష్మి, శ్రావణిల్లా సామాజికంగా, ఆర్థికంగా ఎదగటమే కాకుండా తమకు తెలియని తమలోని నైపుణ్యాలను వెలికి తీసుకొని, నయా జీవన నైపుణ్యాలను సంతరించుకుంటున్నవారెంతోమంది ఐటీ రంగంలో అడుగడుగునా కనిపిస్తారు.
అబ్బాయిలతో పోటీ లేదు....
ప్రస్తుతం దేశంలో ఏటా 35-40 లక్షల మందికి ప్రత్యక్షంగా, కోటిమందికిపైగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న ఐటీరంగం- నియామకాల్లో పురుషులతో సమానంగా కాకుండా మహిళలకే పెద్దపీట వేయటానికి ప్రయత్నిస్తోంది. ‘నిజానికి తగినంతమంది అమ్మాయిలు కళాశాలల నుంచి రావట్లేదు. లేదంటే ఐటీ ఉద్యోగాల్లో పురుషుల, మహిళల నిష్పత్తి మరింత మెరుగ్గా ఉండేది. కానీ ఇప్పుడిప్పుడే పరిస్థితి మారుతోంది. ఇంజినీరింగ్‌ కాలేజీల నుంచి పెద్దసంఖ్యలో అమ్మాయిలు ఉత్తీర్ణులై వస్తున్నారు. కొన్ని సందర్భాల్లో బీఎస్సీ విద్యార్థినులకు కూడా కొలువులిస్తున్నాం’ అని ఓ ప్రముఖ ఐటీ సంస్థ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐటీ, ఐటీ ఆధారిత రంగాల్లో పనిచేస్తున్న 35-40 లక్షలమందిలో కనీసం 12.5 లక్షలమంది దాకా మహిళలున్నారు. హైదరాబాద్‌లో 3.5 నుంచి 4 లక్షలమంది ఉద్యోగులుండగా... వారిలో 1.5 లక్షలమంది దాకా అమ్మాయిలే! అంటే మహిళల సంఖ్య సుమారు 40 శాతానికి చేరుతోంది. బెంగళూరు తర్వాత దేశంలో ఇంత పెద్దమొత్తంలో మహిళలు పని చేస్తున్నది ఇక్కడేనన్నది తెలంగాణ ఐటీ సంఘం (టీటా) అంచనా! నాస్కామ్‌ అంచనాల ప్రకారం ఐటీ కంపెనీల్లో మహిళా ఉద్యోగుల శాతం 30-35 దాకా ఉంటే.. బీపీఓల్లో ఇది 40శాతం దాటుతోంది. చిన్నచిన్న కంపెనీల్లో మరింత ఎక్కువగా ఉంటోంది.
ఒకప్పుడు భారం.. కానీ నేడు వరం
అమ్మాయిలంటే ఒకప్పుడు భారంగా చూసేవారు! ప్రభుత్వ విధానాల వల్లనో మరే కారణం చేతనో ఉద్యోగం ఇచ్చినా సరిగ్గా చేయరని, టైమైందంటే వెళ్ళిపోతారని, ఇంటి బాధ్యతల కారణంగా సెలవులెక్కువగా పెడుతుంటారని.. ఇలా మహిళల పనితీరుపై పెదవి విరిచేవారు. వదిలించుకోవటానికి చూసేవారు. కానీ ఇప్పుడలా కాదు! ముఖ్యంగా ఐటీరంగంలోనైతే అమ్మాయిలను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. మహిళలు ఉద్యోగం వదిలి వెళ్లిపోకుండా కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తున్నారు. అబ్బాయిలతో దీటుగా అన్ని వేళల్లోనూ పనిచేస్తుండటంతో పదోన్నతుల్లోనూ అమ్మాయిలకే ఎక్కువ ప్రాధాన్యం! బృంద సారథులుగా ఎంపిక చేయటంలోనూ అమ్మాయిలను పరిశీలించిన తర్వాత అబ్బాయిల వైపు చూస్తున్నాయి యాజమాన్యాలు! ఎందుకంటే అమ్మాయిల నిర్ణాయక సామర్థ్యంపై నమ్మకం! అబ్బాయిలకంటే కూడా అమ్మాయిలు సరైన నిర్ణయాలు తీసుకుంటారని, పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకుంటారని యాజమాన్యాలు భావిస్తున్నాయి. ‘ఇంటినీ, ఆఫీస్‌నూ సమర్థంగా నడిపిస్తున్న తీరు వారికి అడ్డంకిగా కాకుండా ఇప్పుడు అదనపు అర్హతగా మారింది. అందుకే క్లిష్టమైన సమయాల్లో పురుషులకంటే కూడా మహిళలు సమ్యక్‌దృక్పథంతో (బ్యాలెన్స్‌డ్‌) ఉంటారనీ, భావావేశాలకు, ఉద్వేగాలకు లోనుకాకుండా పనిచేస్తారనే పేరు సంపాదించుకున్నారు’ అని రాన్‌స్టాడ్‌ టెక్నాలజీస్‌ సంస్థ టెక్నికల్‌ రెక్రూటర్‌ రాజా పూర్ణిమ వ్యాఖ్యానించారు.
సమన్వయానికి ప్రత్యేక శిక్షణ...
అర్ధరాత్రి, అపరాత్రి పనివేళలతో ఇబ్బంది పడకుండా, ఇంటి బాధ్యతలను- ఆఫీస్‌ పనిని సమన్వయం చేసుకునేలా.. వారిలో ఒత్తిడి తలెత్తకుండా ఉండేలా మహిళలకు ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాలు కూడా ఐటీ సంస్థలే ఏర్పాటు చేస్తుండటం గమనార్హం. అలాగే రాత్రి విధులు ముగించుకుని వెళ్లే సమయంలో ఎదురయ్యే సమస్యల మీద కూడా చాలా సంస్థలు ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. అమ్మాయిలు భారమవుతున్నారని వదిలించుకోకుండా... వారిని తీర్చిదిద్దితే మరింత అంకితభావంతో పనిచేస్తారనే నమ్మకంతో జీవననైపుణ్యాలను మెరుగు పర్చుకోవటానికి సంస్థలు తోడ్పడుతున్నాయి. అంతేగాకుండా ఐటీరంగంలో మహిళల ప్రవేశంతో సామాజికంగా కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంటి ఆదాయం పెరిగింది. ఇంట్లోనే ఆర్థిక స్తోమత, అధికారం పెరిగాయి. గతంలో ఉండే సామాజిక ఆంక్షలు తగ్గాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఐటీరంగం మహిళల్లో నాయకత్వ లక్షణాలను పెంచింది. ‘ఒకరకంగా చెప్పాలంటే ఐటీరంగం భారతీయ మహిళలకు అంతర్జాతీయ ముఖద్వారమైంది’ అని తెలంగాణ ఐటీ అసోసియేషన్‌ (టీటా) అధ్యక్షుడు సందీప్‌కుమార్‌, మహిళా విభాగం నేత శ్రీలత వ్యాఖ్యానించారు.
అమ్మాయిలంటే అపురూపం..
* రవాణా సౌకర్యం; ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు; ఇంటి నుంచే పనిచేసే సౌలభ్యం, పిల్లలు పుడితే సెలవుల్లో వెసులుబాటు,
* నెలల పిల్లల్ని వదిలి రావటం కష్టమైతే వారికోసం కొన్ని సంస్థలు తమ కార్యాలయంలోనే స్థలం కేటాయిస్తున్నాయి. పిల్లల్ని చూసుకోవటానికి ప్రత్యేకంగా శిక్షితులైన సిబ్బందిని నియమిస్తున్నాయి.
* శారీరకంగా పెద్దగా శ్రమలేకుండా మేథోపరమైన నైపుణ్యాలతో కూడుకొని ఉండటంతో చాలామంది అమ్మాయిలు ఐటీ రంగంలోకి రావటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. మంచి జీతాలు అమ్మాయిలను ఆకర్షించటానికి మరో ప్రధాన కారణం.
* 1980ల్లో ఐటీరంగంవైపు వచ్చే మహిళా గ్రాడ్యుయేట్లు 5-8 శాతం కాగా.. ఇప్పుడా సంఖ్య 30-45 శాతానికి పెరిగింది.
అంతా కోరుకునేది హైదరాబాద్‌నే..
దేశవ్యాప్తంగా ఐటీ రంగంలో మహిళలకు ఉద్యోగాలు లభిస్తున్నా అందులో మహిళలంతా ఉద్యోగానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్న చోటు హైదరాబాదే! ఎందుకంటే అన్ని ప్రదేశాలకంటే కూడా ఇక్కడే ఐటీ రంగంలో రక్షణ ఎక్కువ కాబట్టి! తెలంగాణ ప్రభుత్వం ఆరంభించిన షీ టీమ్స్‌తో పాటు ఐటీరంగంలోని మహిళా ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన షీ షటిల్స్‌ (రవాణా సదుపాయం) అత్యంత వినూత్నమైంది. భద్రతపరంగా ఎంతో అనువైంది. మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ ప్రయాణ సౌకర్యం వల్ల హైదరాబాద్‌లో మహిళా ఉద్యోగులకు భద్రతుంది అనే పేరొచ్చింది.

- మమత వేగుంట, ఇన్‌వెస్కో హెచ్‌ఆర్‌ డైరెక్టర్‌
మహిళలెక్కడుంటే..
మహిళలకు పెద్దపీట వేసిన కంపెనీలు మిగిలినవాటికంటే 30 శాతం ముందున్నాయనేది ప్రపంచవ్యాప్త సర్వేలు చెబుతున్న నిజం. దానికి తగ్గట్లుగానే ఐటీ కంపెనీలు వ్యవహరిస్తున్నాయి. పైగా ఇప్పుడున్నదంతా కొత్తతరం పరిశ్రమ! ఇందులో యంత్రాలకంటే మానవ వనరులకు ప్రాధాన్యం పెరిగింది. అందులో మహిళలు కుదురుగా పనిచేస్తారనే నమ్మకంతో నైపుణ్యమున్నవారిని తీసుకుంటున్నారు. మునుముందు ఉన్నతస్థానాల్లో ఎక్కువమంది మహిళలను చూస్తాం.
- కిరణ్మయి పెండ్యాల, ఏఎండీ హెచ్‌ఆర్‌ హెడ్‌


Posted on 08-03-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning