నియామక పరీక్షలో నెగ్గేదెలా?

ఇది నియామకాల తరుణం. బహుళజాతి సంస్థలు తమ అవసరాల నిమిత్తం వివిధ కళాశాలల ప్రాంగణాలను సందర్శించి, విద్యార్థుల్లో ప్రతిభావంతులను వడపోత పోయటానికి వివిధ పరీక్షలను నిర్వహిస్తుంటాయి. ఆఫ్‌ క్యాంపస్‌ నియామకాలూ జరుపుతుంటాయి. ఈ ప్రక్రియలో ముఖ్యమైనది ‘రాతపరీక్ష’.
ప్రతి సంవత్సరం భారతీయ ఐటీ సంస్థలతో పాటు ‘గ్లోబల్‌ జెయింట్స్‌’ ఐబీఎం, యాక్సెంచర్‌, హెచ్‌పీ మొదలైనవి మనదేశ విద్యార్థులను పెద్ద సంఖ్యలో నియమించుకునేందుకు ప్రణాళికలతో ఉంటాయి. ఈ సంస్థలు రెండు పద్ధతుల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తుంటాయి. వార్తాపత్రికల్లో వాణిజ్యప్రకటనలు ఇచ్చి ఉద్యోగార్థుల దరఖాస్తులను ఆహ్వానించటం ఒక విధానం. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేస్తుంటారు. తక్కువ సంఖ్యలో ఖాళీలు భర్తీ చేయదల్చినపుడు ఈ పద్ధతి పాటిస్తుంటారు.
కానీ ఎక్కువ సంఖ్యలో ఖాళీలున్నపుడు వివిధ సంస్థలు నేరుగా క్యాంపస్‌లను సందర్శించి తమకు అనుకూలమైన విద్యార్థులను ఎంచుకుంటాయి. ఇవే ప్రాంగణ నియామకాలు. నియామక సంస్థలూ, ఉద్యోగార్థులైన విద్యార్థులూ ఒక వేదికపై కలవటానికి ఈ విధానం వీలు కల్పిస్తుంది. కళాశాలల్లో తమను నిరూపించుకోవటానికి ఉత్సాహంతో ఎదురుచూసే ప్రతిభావంతులైన విద్యారులుంటారు. వీరిని ప్రత్యక్షంగా కలిసి మాట్లాడి, అంచనా వేసేందుకు సంస్థలకు అవకాశం లభించేది ఈ సందర్భంగానే. కళాశాల నుంచి ఉద్యోగ మార్కెట్‌కు సాఫీగా, నేరుగా ప్రవేశించే వీలును ఈ విధానం విద్యార్థులకు కల్పిస్తుంది.
ఎన్ని దశలు?
ఎంపిక విధానం స్థూలంగా ఏ సంస్థకైనా దాదాపు ఒకేరకం. ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, బృంద చర్చ (గ్రూప్‌ డిస్కషన్‌), మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ) అనే మూడు దశల్లో సాధారణంగా నియామకాలు జరుగుతాయి.
* ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌: ఎంపిక ప్రక్రియలో చాలా ముఖ్యమైన భాగమిది. ఈ పరీక్షలో సాధారణంగా ఉండే అంశాలు: క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ, రీజనింగ్‌, వెర్బల్‌ ఎబిలిటీ, బేసిక్‌ కంప్యూటర్‌ స్కిల్స్‌. ఏ సంస్థ పరీక్షను నిర్వహిస్తోందనేదానిపై ఆధారపడి, ప్రశ్నల తీరు, టాపిక్స్‌ ఆధారపడివుంటాయి. ప్రతి సంస్థకూ ఓ సొంత శైలి ఉంటుంది.
ఉదాహరణకు... ఇన్‌ఫోసిస్‌ రాతపరీక్షలో రెండు సెక్షన్లుంటాయి. ప్రతిదానికీ నిర్దిష్ట కాలవ్యవధి ఉంటుంది. ఒక సెక్షన్లో 40 నిమిషాల్లో 40 ప్రశ్నలకు జవాబులు రాయమని అడుగుతారు. విద్యార్థికి చెందిన వెర్బల్‌ ఎబిలిటీని దీనిలో పరీక్షిస్తారు. 40 ప్రశ్నల్లో సాధారణంగా 10 ప్రశ్నలు రీడింగ్‌ కాంప్రహెన్షన్‌పై ఉంటాయి. దీనిలో రెండు ప్యాసేజిలు ఇస్తారు. మిగిలిన ప్రశ్నలు ఇంగ్లిష్‌ యూసేజ్‌ మీద ఉంటాయి.
మరో సెక్షన్లో 30 ప్రశ్నలకు 40 నిమిషాల్లో జవాబులు గుర్తించాల్సివుంటుంది. ఇది విద్యార్థి సమస్యా పరిష్కార సామర్థ్యాన్ని పరీక్షిస్తుంది. ఈ తరహా ప్రశ్నలు ఒక పరీక్షకూ మరో పరీక్షకూ స్వల్పంగా తేడాతో ఉంటాయి. కానీ స్థూలంగా చెప్పాలంటే... విభిన్న టాపిక్స్‌ అయిన డాటా ఇంటర్‌ప్రెటేషన్‌, డాటా సఫిషియన్సీ, నాన్‌ వెర్బల్‌ రీజనింగ్‌, అనలిటికల్‌ రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి.
టీసీఎస్‌ ఆన్‌లైన్‌ టెస్టులో మొత్తం 35 ప్రశ్నలు అడుగుతారు. వాటిని విస్తృతమైన ప్రశ్నల నిధినుంచి తీసుకుంటారు. ఈ 35 ప్రశ్నలూ క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌పైన గానీ, రీజనింగ్‌పైన గానీ ఆధారపడివుంటాయి.
విప్రోలో మొత్తం 50 ప్రశ్నలను అడుగుతారు. ఇవి మూడు సెక్షన్లలో ఉంటాయి. 50 నిమిషాల్లో జవాబులు రాయటం ముగించాల్సివుంటుంది. వెర్బల్‌ ఎబిలిటీలో 15 ప్రశ్నలు వస్తాయి. మూడు సెక్షన్లలో ఒక సెక్షన్‌లో 20 ప్రశ్నలుంటాయి. ఇందులో విద్యార్థి సాంకేతిక పరిజ్ఞానాన్ని (టెక్నికల్‌ నాలెడ్జ్‌) పరీక్షిస్తారు. అందుకని కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌లో సీ, సీ++, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ (మైక్రో ప్రాసెసర్స్‌) లాంటి విభిన్న సబ్జెక్టులపై పటిష్ఠమైన అవగాహన అవసరమవుతుంది.
కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ (సీటీఎస్‌)లో టెక్నికల్‌ సెక్షన్‌ ఉండదు. కొత్త విధానం ప్రకారం రెండు సెక్షన్లలో మొత్తం 55 ప్రశ్నలు అడుగుతారు.
* నియామక ప్రక్రియలో మొదటిదైన రాతపరీక్ష ఎంత ముఖ్యమంటే... దీనిలో నెగ్గకపోతే ఎంపిక ప్రక్రియలోని తదుపరి దశల్లోకి ప్రవేశించే వీలే ఉండదు. అందుకే దీనికి అభ్యర్థులు తగినంతగా సన్నద్ధమవ్వాలి. పాత ప్రశ్నపత్రాలు సాధన చేసి లోపాలు సరిదిద్దుకోవాలి!
ఉత్తీర్ణత తప్పనిసరి
వీటిలో ఏ సంస్థలో చేరదల్చినా అభ్యర్థులు తగినంతగా సన్నద్ధమవటం తప్పనిసరి. చాలామంది వూహించే స్థాయిలో అంత తేలిగ్గా ఉండవీ ప్రశ్నలు. ఈ రాతపరీక్ష దశ ఎంత ముఖ్యమంటే... దీనిలో నెగ్గకపోతే ఎంపిక ప్రక్రియలోని తదుపరి దశల్లోకి ప్రవేశించే వీలే ఉండదు.
రాతపరీక్ష- ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, కమ్యూనికేషన్స్‌ స్కిల్స్‌ టెస్టు అని రెండు భాగాలుగా ఉంటుంది.
ఆప్టిట్యూడ్‌ టెస్టును సమర్థంగా రాయాలంటే అభ్యర్థి పెంపొందించుకోవాల్సినవి: 1) మంచి స్టడీ మెటీరియల్‌2) స్థిరమైన, క్రమబద్ధమైన సాధన 3) ప్రణాళిక 4) సమయస్ఫూర్తి 5) సమయ నిర్వహణ.
టీసీఎస్‌, ఇన్‌ఫోసిస్‌, విప్రో, యాక్సెంచర్‌, హెచ్‌సీఎల్‌ లాంటి సంస్థలు నిర్వహించే ఆప్టిట్యూడ్‌ పరీక్షలు సాపేక్షంగా సులువుగానే ఉంటాయి. ఎక్కువ ప్రశ్నలు డైరెక్ట్‌ ఫార్ములాల ఆధారంగానే ఉంటాయి. కానీ కొందరు విద్యార్థులు వాటిలో చాలా ప్రశ్నలను రాయలేకపోతుంటారు.
అందరు విద్యార్థులూ వేగం, దూరం, కాలం మొదలైన టాపిక్స్‌ను గతంలో చదివి, సాధన చేసేవుంటారు. కానీ ఉద్యోగనియామక పరీక్షలు రాయటం మొదలుపెట్టేసరికి వాటి జవాబులు గుర్తించటంలో మాత్రం తడబడుతుంటారు, వెనకబడుతుంటారు.
ఈ అభ్యర్థులు ఇలాంటి ప్రశ్నలను ఎప్పుడో ఐదారేళ్ల క్రితం చేసివుంటారు. దీంతో కొత్తగా అనిపించి భయపెడుతుంటాయి. కానీ గుర్తించాల్సింది ఏమిటంటే... పదో తరగతి స్థాయి గణితంపై ప్రాథమిక పరిజ్ఞానం ఉంటే చాలు.. ఆప్టిట్యూడ్‌ టెస్టుల్లో విజయవంతంగా నెగ్గేయవచ్చు.
మొదట ఫార్ములాలన్నిటినీ నేర్చుకుని, ఆపై సాధన మొదలుపెట్టటం సరైన పని.
వివిధ టాపిక్స్‌ అన్నిటినీ పునశ్చరణ చేసుకోవాలి. పదో తరగతి గణిత పుస్తకం కానీ, ఏదైనా ప్రామాణిక పుస్తకం గానీ అభ్యాసానికి ఉపయోగపడుతుంది. ఆ పుస్తకంలోని క్లిష్టమైన ప్రశ్నలకు సంబంధించి ఫార్ములాలను అనువర్తింపజేయటంపై దృష్టి కేంద్రీకరించాలి.
భాషా నైపుణ్యాలు
ఆప్టిట్యూడ్‌తో పాటు అభ్యర్థులకు ఇంగ్లిష్‌ భాషలో తగిన పరిజ్ఞానం ఉండాల్సిందే... ముఖ్యంగా పెద్ద బహుళజాతి సంస్థల్లో. వారు రాతపరీక్ష ద్వారా అభ్యర్థి భావవ్యక్తీకరణ తీరును ప్రాథమికంగా పరీక్షిస్తారు.
ఇంగ్లిష్‌లో తగిన పరిజ్ఞానం పెంచుకోవాలంటే ఆంగ్ల వార్తాపత్రికను రోజూ చదవటం చాలా ముఖ్యం. తెలియని పదాల అర్థాలను తెలుసుకుని, ఓ పుస్తకంలో రాసుకుంటూవుండాలి. వ్యాకరణాన్ని సాధన చేస్తుండాలి. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో ఆంగ్లంలో సంభాషిస్తుండాలి. పొరపాట్లు వస్తాయని బిడియపడకూడదు. క్రమంగా పొరపాట్లు తగ్గుతూవస్తాయి. బెరుకు తగ్గి ఆత్మవిశ్వాసం పెరిగి, భాషను మెరుగుపర్చుకోగలుగుతారు. మౌఖిక పరీక్షల సందర్భంలో తడబడకుండా ధీమాతో జవాబులు చెప్పటానికి ఈ అనుభవం పనికి వస్తుంది.
క్వాంటిటేటివ్‌, వెర్బల్‌ ఎబిలిటీ విభాగాల్లో సమర్థంగా జవాబులు గుర్తించటానికి ఈ అంశాలన్నీ తోడ్పడతాయి.
పాత ప్రశ్నపత్రాలు
నియామక పరీక్షలు రాసేముందే అభ్యర్థులు వివిధ సంస్థలు నిర్వహించిన పాత ప్రశ్నపత్రాలను సేకరించి, వాటిని విస్తృతంగా అభ్యాసం చేయడం ముఖ్యం. దీనివల్ల రాయబోయే పరీక్ష పద్ధతిపై, ప్రశ్నలకు పట్టే సమయంపై ముందస్తుగానే అవగాహన ఏర్పడివుంటుంది. పరీక్షలో సులువుగా విజయవంతం కావటానికి ఇది అవసరం.
అంతర్జాలంలో వివిధ సంస్థల ప్రశ్నపత్రాలు లభ్యమవుతున్నాయి. వాటిని డౌన్‌లోడ్‌ చేసుకుని, సాధన చేయాలి. ఈ కసరత్తు సంతృప్తికరంగా చేస్తే అభ్యర్థి నైపుణ్యాలూ, ఆత్మవిశ్వాసం తగినంతగా వృద్ధిచెందుతాయి.
ప్రశ్నల్లో సులువుగా జవాబు గుర్తించగలిగేవి మొదట చేస్తూపోవాలి. కష్టమైన ప్రశ్నల దగ్గర ఆగి అధిక సమయం వెచ్చించకూడదు. సమయం మిగిలితే రెండో విడతలో వాటి పని చూడవచ్చు. ప్రతి నిమిషం విలువైనది కాబట్టి వేగంగా, కచ్చితంగా వీలైనన్ని ప్రశ్నలకు జవాబులు ఇవ్వటం ప్రధానం.
ఇవి ఉపయోగపడతాయి
రాతపరీక్షకు ఉపయోగపడే పుస్తకాలు:
* క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ By RS Agarwal
* పజిల్స్‌ By Shakuntala Devi
* జీఆర్‌ఈ బ్యారన్స్‌ ఫర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌
* రీజనింగ్‌ అండ్‌ ఇంగ్లిష్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ By RS Agarwal
* ఏ మోడర్న్‌ అప్రోచ్‌ టు వెర్బల్‌ అండ్‌ నాన్‌ వెర్బల్‌ రీజనింగ్‌ By RS Agarwal
వెబ్‌సైట్లు
1. indiabix.com
2. Careerbless.com

 


Posted on 14-03-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning