గేట్‌ ఫలితాల్లో తెలుగు వెలుగు

* 1, 4, 7, 15, 23 ర్యాంకులు కైవసం చేసుకున్న విద్యార్థులు
ఈనాడు, హైదరాబాద్‌, విశాఖపట్నం: ప్రతిష్ఠాత్మక ఐఐటీ, ఎన్‌ఐటీ, ఇతర విద్యాసంస్థలు అందించే ఎంటెక్‌ కోర్సుల్లో ప్రవేశానికి... బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ) నిర్వహించిన గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌) ఫలితాల్లో పలువురు తెలుగు విద్యార్థులు అగ్ర ర్యాంకులను సాధించారు. ఈ ర్యాంకుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలకు కూడా వీరు దరఖాస్తు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా జనవరి 30, 31, ఫిబ్రవరి 6, 7వ తేదీల్లో ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించిన పరీక్షకు 8,18,850 మంది హాజరయ్యారు. ఈ పరీక్ష ఫలితాలను ఐఐఎస్‌సీ మార్చి 19న ఉదయం విడుదల చేసింది. మొత్తం 100 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో 1000 స్కోర్‌కు లెక్కించి ర్యాంకు ఇస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 1.25 లక్షల మంది హాజరై ఉంటారని అంచనా.
* చిత్తూరు జిల్లా ముల్కలచెరువు మండలం వీరుపికోటకు చెందిన శ్రీహరి సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో మొదటి ర్యాంకు సాధించారు. 2003లో బీటెక్‌ పూర్తిచేసిన ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ అకాడమీ నిర్వహిస్తున్నారు. మొత్తం 100 మార్కులకు 87.86 మార్కులు సాధించారు.
* ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన నవీన్‌ కొల్లి ఈసీఈలో నాలుగో ర్యాంకు దక్కించుకున్నారు. బిట్స్‌-హైదరాబాద్‌లో బీటెక్‌ (ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌) నాలుగో సంవత్సరం చదువుతున్న నవీన్‌ది ప్రకాశం జిల్లా మార్కాపురం. ఇంజినీరింగ్‌ అయ్యాక బెంగళూరు ఐఐటీలో ఎంటెక్‌ చేయాలని ఉందని నవీన్‌ చెప్పాడు.
* విజయనగరానికి చెందిన కృష్ణమూర్తి సీఎస్‌ఈ విభాగంలో 7వ ర్యాంకు సాధించారు.
* ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈసీఈ చదువుతున్న కసుకుర్తి లీలారామ్‌చౌదరి గేట్‌లో 15వ ర్యాంకు సాధించారు. లీలారామ్‌చౌదరిని ఈ సందర్భంగా ఏయూ రిజిస్ట్రార్‌ వి.ఉమామహేశ్వరరావు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.
* విశాఖ నగరానికి చెందిన బొప్పన శశాంక్‌ 23వ ర్యాంకు సాధించారు. బొప్పన శశాంక్‌ ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనే గత సంవత్సరం మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. శశాంక్‌ స్కేటింగ్‌లోనూ నిపుణుడు. ఇందులో 20కు పైగా బంగారు పతకాలు సాధించాడు. ప్రస్తుతం స్కేటింగ్‌ పోటీల జడ్జిగా వ్యవహరిస్తున్నారు. బెంగళూరులోని ‘ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌’లో ఎంటెక్‌ చదువుతానని శశాంక్‌ ‘ఈనాడు’కు తెలిపారు.
బోధన రంగంలో స్థిరపడతా
బిట్స్‌-హైదరాబాద్‌లో బీటెక్‌ (ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌) నాలుగో సంవత్సరం చదువుతున్నా. మాది ప్రకాశం జిల్లాలోని మర్కాపురం. ఇంటర్‌ వరకూ గుంటూరులో చదివా. నాన్న చిన్నవ్యాపారి. అమ్మ గృహిణి. బీటెక్‌ పూర్తవగానే బెంగళూరు ఐఐటీలో ఎంటెక్‌ చేయాలని ఉంది. విదేశాలకు వెళ్లి చదవడం ఇష్టంలేదు. తొలుత ఐటీ పరిశ్రమలో పనిచేసి, అనంతరం బోధన రంగంలో స్థిరపడాలన్నది నా లక్ష్యం. ఉత్తమ బోధనతో నాణ్యమైన ఇంజినీర్లను తయారుచేయాలన్నది నా కల!
       - నవీన్‌ కొల్లి, గేట్‌ నాలుగో ర్యాంకర్‌, ఈసీఈ

Posted on 20-03-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning