పరిశోధనలకు ప్రాధాన్యం పెరగాలి!

* ప్రతిభావంతులకు కొదవ లేదు
* బోధనలో నాణ్యత పెంచేందుకు కృషి అవసరం
* ఇస్రో, డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు శేషగిరిరావు, మురళీకృష్ణ వెల్లడి

విజయవాడ, న్యూస్‌టుడే: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశం ప్రగతి సాధిస్తున్నా అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడాలంటే పరిశోధనలకు ప్రభుత్వం, పరిశ్రమలు, సమాజం ఇచ్చే ప్రాధాన్యం మరింతగా పెరగాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శ్రీహరికోట అసోసియేట్‌ డైరెక్టర్‌ వి.శేషగిరిరావు, భారత రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్‌డీవో) హైదరాబాద్‌ ప్రధాన శాస్త్రవేత్త ఐ.వి.మురళీకృష్ణ తెలిపారు. తేలప్రోలు ఉషారామ ఇంజినీరింగ్‌ కళాశాల వార్షికోత్సవానికి మార్చి 20న ముఖ్యఅతిథులుగా హాజరైన వారు పరిశోధన, సాంకేతిక రంగాల్లో తాజా పరిస్థితులపై ‘న్యూస్‌టుడే’తో మాట్లాడారు.
దేశంలో ప్రధాన పరిశోధన సంస్థలైన డీఆర్‌డీవో, ఇస్రో అత్యుత్తమ ప్రతిభావంతులను తమ వైపు ఆకర్షించగలుగుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదని వారు తెలిపారు. ఇస్రో గతం కంటే తరచుగా కొత్త ఉపగ్రహాలను ప్రయోగిస్తోందని.. సిబ్బంది కొరత కారణంగా ఒక్క ప్రయోగాన్ని కానీ కొత్త ప్రాజెక్టును కానీ వాయిదా వేయలేదని.. తగినంత మంది ప్రతిభావంతులు ఉన్నారనడానికి అదే తార్కాణమని శేషగిరిరావు చెప్పారు. దేశంలోని ఐఐటీలు, ఇతర అత్యుత్తమ కళాశాలల నుంచి ఇస్రో, డీఆర్‌డీవోలలో చేరేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటోందని మురళీకృష్ణ చెప్పారు.
పరిశోధనల్లో రాణిస్తే గౌరవం, ఆదాయం
ప్రతిభావంతులు విదేశాలకు తరలిపోతుండడంతో మనం శాస్త్ర, సాంకేతిక అభివృద్ధిలో వెనుకబడుతున్నామన్న వాదనపై వారు మాట్లాడుతూ కొందరు వెళ్తున్నంత మాత్రాన అందరూ వెళ్లిపోతున్నట్లు కాదని.. ఇక్కడి అవసరాలకు తగినంతమంది ప్రతిభావంతులు ఇక్కడే లభ్యమవుతున్నారని వారన్నారు. వందమంది ప్రతిభావంతుల్లో 30 నుంచి 35 మందే విదేశాలకు వెళ్తున్నారని.. మిగిలినవారు ఇక్కడే స్థిరపడుతున్నారని చెప్పారు. విదేశాలకు వెళ్లిన వారికి లభించినంత ప్రచారం ఇక్కడివారికి రాకపోవడంతో అంతా వెళ్లిపోతున్నారనే అపోహ ఏర్పడుతోందన్నారు. సగటు విద్యార్థుల్లో నైపుణ్యాలు తగ్గుతున్న మాట నిజమే అయినా అత్యున్నత స్థాయిలో రాణిస్తున్నవారూ పెద్దసంఖ్యలో ఉన్నారని మురళీకృష్ణ చెప్పారు. 15-20 శాతం ఉత్తమ ప్రతిభావంతులు, ఇంకో 10 శాతం సాధారణ ప్రతిభావంతులు ఉండగా మిగిలిన 70 శాతం మందిలో సాంకేతిక నైపుణ్యాలు తక్కువగా ఉంటుండడం ఆందోళన చెందాల్సిన అంశమేనని శేషగిరిరావు పేర్కొన్నారు. కళాశాల స్థాయి నుంచే పరిశోధనాత్మక దృష్టి పెరగాలని.. ఓర్పుతో పరిశోధన రంగంలో కృషి చేయగలిగే గౌరవం, ఆదాయం రెండూ దక్కుతాయన్న విషయం విద్యార్థులు, తల్లిదండ్రులు గుర్తించాలని సూచించారు. దేశంలో సాంకేతిక మానవ వనరుల అవసరాలను తీర్చడం కేవలం ప్రభుత్వరంగ విద్యాసంస్థల వల్ల అయ్యే పని కాదు కాబట్టి ప్రైవేటు విద్యాసంస్థలూ అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం, పరిశ్రమలు కలిసి అన్నిరకాల విద్యాసంస్థల్లో బోధన నాణ్యత పెంచడానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని మురళీకృష్ణ సూచించారు. ప్రభుత్వం వైపు నుంచి పరిశోధన రంగానికి ప్రోత్సాహం పెరగాలని.. స్టార్టప్‌ ఇండియా, మేకిన్‌ ఇండియా పథకాలతో ప్రభుత్వం ఈ దిశగా ముందడుగు వేసిందని తెలిపారు.
Posted on 21-03-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning