3.7 లక్షల ఐటీ కొలువుల ఆశ

* త్వరలో ఐటీఐఆర్‌ ముసాయిదా
* ఆమోదానికి ఎదురుచూస్తున్న ఏపీ సర్కారు

ఈనాడు, హైదరాబాద్‌: విశాఖలో ఐటీ పెట్టుబడుల ప్రాంతం(ఐటీఐఆర్‌) విషయంలో ఏడాదిన్నర క్రితం పంపిన ప్రతిపాదనకు త్వరలోనే ఆమోదం లభిస్తుందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆశిస్తోంది. నూతన ఐటీఐఆర్‌ ముసాయిదా విధానం సిద్ధమైందని, త్వరలోనే కేంద్ర మంత్రివర్గం ముందుకు తీసుకువస్తామని ఇటీవల కేంద్ర ఐటీశాఖ నుంచి సమాచారం అందింది. తొలుత భువనేశ్వర్‌, విశాఖపట్నం ఐటీఐఆర్‌లను ఆమోదిస్తామని సూత్రప్రాయంగా ఇప్పటికే కేంద్ర ఐటీ మంత్రి ప్రకటించారు. విశాఖ ఐటీఐఆర్‌కు ఆమోదం లభిస్తే 3.7లక్షల ఐటీ ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని అంచనా.
విశాఖపట్నం ఐటీఐఆర్‌ ప్రతిపాదన కేంద్ర ఐటీ శాఖ వద్ద పెండింగ్‌లో ఉంది. గత విధానం మేరకు ప్రతిపాదనను ఆమోదించాలని కోరినప్పటికీ, కేంద్రం అంగీకరించలేదు. నూతన ఐటీఐఆర్‌ విధానం మేరకు ముందుకు వెళ్తామని ప్రకటించింది. ఇప్పటికే హైదరాబాద్‌ ఐటీఐఆర్‌ ఆమోదించినప్పటికీ, కేంద్రం నుంచి నిధులు విడుదల కాలేదు. నూతన ఐటీఐఆర్‌ విధానం ప్రకటన తరువాతే నిధులిస్తామని తెలిపింది. ఏపీ నుంచి ఒకే ప్రతిపాదన ఉన్నందున రాష్ట్రానికి తొలి ప్రాధాన్యం లభిస్తుందని ఐటీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఐటీఐఆర్‌ ప్రాజెక్టుకు ఆమోదం లభిస్తే, ఆ పరిధిలో ఐటీ మౌలిక సదుపాయాలకు అవసరమైన నిధులను కేంద్రం అందిస్తుంది. విశాఖపట్నంలో దీనికోసం మూడు జోన్లు ఎంపిక చేశారు. వీటి పరిధిలో 9979 ఎకరాల భూమిని ఐటీ పెట్టుబడులకు అనుకూలంగా అభివృద్ధి చేస్తారు. రానున్న 25 ఏళ్ల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని బాహ్య మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. ఐటీఐఆర్‌కు ఆమోదం లభిస్తే 2035 నాటికి ప్రత్యక్షంగా 3.7 లక్షలు, పరోక్షంగా 14.7 లక్షల ఉద్యోగాలు లభిస్తాయి. రెండు విడతల్లో బాహ్య, అంతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్రం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఐటీఐఆర్‌ పరిధిలో బీఆర్‌టీఎస్‌, మెట్రో రవాణా వ్యవస్థలు అందుబాటులోకి వస్తాయి. తాగునీరు, రోడ్డు, మురుగునీటి పారుదల వ్యవస్థల్ని సర్కారు అభివృద్ధి చేస్తుంది. రెండు దశల్లో చేపట్టే అభివృద్ధి పనులకు దాదాపు రూ.10,357 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా.
Posted on 07-04-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning