ఒక్క అడ్మిషన్‌.. రెండు డిగ్రీలు

* ఇక్కడ మొదలెట్టి.. విదేశాల్లో పూర్తి
* ఐదేళ్లలోనే 'పట్టాల'దారు

* కళాశాలలతో విదేశీ విశ్వవిద్యాలయాల ఒప్పందాలు

*డ్యూయల్‌ డిగ్రీలపై పెరుగుతున్న మోజు!

క్క దెబ్బకు రెండు పిట్టలన్నది పాత సామెత! ఒక్క అడ్మిషన్‌తో రెండు డిగ్రీలన్నది నయా ధోరణి! ఐదేళ్లలోనే డిగ్రీ, పీజీ.. రెండు పట్టాలు! అది కూడా ఒకటి దేశీ, మరోటి విదేశీ! ఒక్క మొబైల్‌లో రెండు సిమ్‌లన్నా ఎగబడ్డారు! ఇప్పుడు ఒక్క అడ్మిషన్‌తో.. రెండు డిగ్రీలన్నా అంతే మోజు! అవును.. యువతరం కొత్తదనాన్ని ఎప్పుడూ ఆస్వాదిస్తుంది! అది సరదా అయినా.. కెరీర్‌ అయినా.. ఈతరం తీరే వేరు. ఏమిటా రెండు డిగ్రీలు.. ఏమా కథ?

ప్రశాంత్‌ ఎంసెట్‌ రాశాడు. ఇంజినీరింగ్‌ చేసి.. విదేశాల్లో పీజీ చేయాలన్నది లక్ష్యం. అది కాస్తా ఒక్క అడ్మిషన్‌తోనే తీరింది. ఇక్కడ జేఎన్‌టీయూ, హైదరాబాద్‌లో బీటెక్‌.. బ్యాంకాక్‌ విశ్వవిద్యాలయంలో పీజీ పూర్తిచేసేలా అడ్మిషన్‌ సంపాదించాడు. ఐదేళ్లు.. ఖర్చులన్నీ కలిపి రూ.20 లక్షలు.. ఎలాంటి వీసా గొడవలు లేకుండానే తను బ్యాంకాక్‌లో చదువుకునే అవకాశం లభించింది. ఇదొక ఉదాహరణే! ఇప్పుడు యువతరం డ్యూయల్‌ డిగ్రీల వైపు పరుగులుపెడుతోంది. నాలుగేళ్లు బీటెక్‌, ఆ తర్వాత విదేశాల్లో పీజీ కోసం రెండేళ్లు.. అక్కడ సీటు సంపాదించడానికి నానా అగచాట్లు, వీసా సమస్యలు, నిర్వాహక సంస్థలతో తలనొప్పి.. ఇవేవీ లేకుండా విదేశాల్లో పీజీ సీటు లభిస్తుండడంతో విద్యార్థులు డ్యూయల్‌ డిగ్రీల వైపు దృష్టి పెడుతున్నారు.
సీటు సవాలే!
ఒకప్పుడు ఒకేసారి రెండు కోర్సులు చేయడమంటే అభ్యంతరం పెట్టేవాళ్లు. ఉద్యోగం కోసం వెళ్తే ఇదెలా సాధ్యమని ఎగాదిగా చూసేవాళ్లూ. విద్యా విధానం, బోధనలో వచ్చిన మార్పులు.. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం పుణ్యమాని.. ఒకేసారి రెండు విశ్వవిద్యాలయాల నుంచి డిగ్రీలు అందుకునే అవకాశం వచ్చేసింది. విదేశీ విశ్వ విద్యాలయాలు ఇక్కడ మన రాష్ట్రంలోని జేఎన్‌టీయూ, ఐఐటీ, ఐఐఐటీ, కేంద్రీయ విశ్వవిద్యాలయం.. వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలతో పాటు.. కొన్ని ప్రైవేటు కళాశాలలతో కూడా ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. కంప్యూటర్‌ సైన్సు, ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్స్‌, సివిల్స్‌.. తదితర విభాగాల్లో పీజీ కోర్సుకు ఆహ్వానిస్తున్నారు. ఒక్కో బ్రాంచీలో సుమారు 60 వరకూ సీట్లు ఉంటాయి. పోటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. ఇందులో సీటు సంపాదించడం ఓ విధంగా సవాలే!

కొత్తదనం ఏమిటి?
కొంచెం వైవిధ్యంగా, పరిశోధనాత్మకంగా ఉండే కోర్సులు చేయాలనుకునేవారికి సరైన కోర్సు డ్యూయల్‌ డిగ్రీ. ఏయూ, జేఎన్‌టీయూ(హైదరాబాద్‌)లు స్వీడన్‌లోని బ్లెకింగె ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో చేరితే బీటెక్‌తో పాటు ఎంటెక్‌ను ఐదేళ్లలోనే పూర్తిచేయొచ్చు. సాధారణంగా విడివిడిగా చేయాలంటే కనీసం ఆరేళ్లు పడుతుంది. డ్యూయల్‌ డిగ్రీలో భాగంగా మూడున్నరేళ్లు స్థానిక విశ్వవిద్యాలయంలో అండర్‌ గ్రాడ్యుయేషన్‌(యూజీ) పూర్తిచేసి.. మిగతా ఏడాదిన్నర విదేశీ విశ్వవిద్యాలయంలో చదవాల్సి ఉంటుంది. వీటి కరిక్యులమ్‌ సాధారణ డిగ్రీలతో పోల్చితే భిన్నంగా ఉంటాయి. యూజీ స్థాయి విద్యార్థులు సైతం పరిశోధనల్లో పాల్గొనేలా వీటిని రూపకల్పన చేశారు. విదేశాల్లో చదవబోయే కోర్సుకు అనుగుణంగా యూజీ పాఠ్యాంశాలుంటాయి. కంప్యూటర్స్‌, ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్స్‌, సివిల్‌, కెమికల్‌ తదితర విభాగాల్లో ఎక్కువగా విద్యార్థులు డ్యూయల్‌ డిగ్రీలను ఎంపికచేసుకుంటున్నారు. ''మా జేఎన్‌టీయూతో బ్యాంకాక్‌, స్వీడన్‌ విశ్వవిద్యాలయాలు ఒపందం కుదుర్చుకున్నాయి. ఇంటర్మీడియేట్‌ ఎంపీసీ విద్యార్థులు అర్హులు. ఎంసెట్‌ నిబంధనలు, సెలబస్‌లే దీని ప్రవేశ పరీక్షకు ఉంటాయి. ప్రతి ఏడాది ఎంసెట్‌ పరీక్ష తర్వాత దీనికి పరీక్ష నిర్వహిస్తున్నాం'' అని చెబుతున్నారు జేఎన్‌టీయూ, హైదరాబాద్‌ ప్రిన్సిపల్‌, ఎ. వినయ్‌బాబు.
ఫీజుల సంగతి!
సాధారణ కోర్సులతో పోల్చితే వీటి ఫీజులు ఎక్కువేనని చెప్పొచ్చు. అయితే విదేశాల్లో చదువుకుంటే అయ్యే ఖర్చంత ఉండదు. మూడున్నరేళ్లు స్థానికంగానే అభ్యాసన ఉంటుంది కాబట్టి.. ఆ మేరకు ఆర్థిక భారం తగ్గినట్లే! ఏడాదికి సుమారు రూ.రెండున్నర లక్షల దాకా ఖర్చు అవుతుంది. అంటే ఐదేళ్ల చదువుకు రూ.12.5 లక్షల వరకూ ఖర్చు అవుతుంది. ఇతర వసతులు, ప్రయాణ ఖర్చుల్ని చూసుకుంటే.. రూ.20 లక్షల వరకూ ఖర్చు అవ్వొచ్చు. విదేశాల్లో చదివేటప్పుడు పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేసుకునే వెసలుబాటు ఉండొచ్చు. ప్రతిభను బట్టి ఫెలోషిప్‌ కూడా అందుకోవచ్చు. బోధన, పరిశోధనల్లో అక్కడి అధ్యాపకులకు సహాయకులుగా పనిచేసే అవకాశమూ దక్కుతుంది. ప్రతిగా వేతనం ఇస్తారు. ఇవి ఆయా విద్యా సంస్థల మధ్య ఒప్పందాలను బట్టి ఉంటాయి. ఈ కోర్సుల్లో చేరాలనుకునేవారు సంబంధిత విద్యా సంస్థల అధికారులతో మాట్లాడి అవగాహన కలిగించుకోవడం మంచిది.
ఇవీ లాభాలు..
* సాధారణ డిగ్రీల కంటే డ్యూయల్‌ డిగ్రీ కోర్సులతో చాలా లాభాలే ఉంటాయి. ఐదేళ్లలోనే బ్యాచిలర్‌, పీజీ డిగ్రీలు అందుకోవచ్చు.. ఏడాది సమయం కూడా మిగులుతుంది.
* స్థానిక విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్స్‌ డిగ్రీ అందిస్తే.. విదేశీ విశ్వవిద్యాలయం నుంచి పీజీ పట్టా పొందొచ్చు. వీటికి దేశ, విదేశాల్లో గుర్తింపు ఉంటుంది. డ్యూయల్‌ డిగ్రీ కోర్సుల్లో చేరితే.. జీఆర్‌ఈ, టోఫెల్‌ వంటి పరీక్షలు రాయకుండానే విదేశాల్లో చదువుకోవచ్చు.
* చివరి ఏడాది విదేశీ విద్యార్థులతో కలిసి ప్రాజెక్టు వర్కు చేయాల్సి ఉంటుంది కాబట్టి.. కోర్సు పూర్తయ్యాక దేశ, విదేశాల్లో ఉద్యోగావకాశాలుంటున్నాయి. పరిశోధనల్లోనూ అవకాశాలెక్కువ.
 • Industry      Interaction

  Higher Education

  Job Skills

  Soft Skills

  Comm. English

  Mock Test

  E-learning