‘గేట్‌’ దాటాక ఏ దారి?

దేశంలోనే అత్యధిక సంఖ్యలో ఇంజినీరింగ్‌ విద్యార్థులు/పట్టభద్రులు పోటీపడే పరీక్ష ‘గేట్‌’. ఈ మధ్యనే ఫలితాలు వెలువడ్డాయి. ఈ పరీక్షలో ర్యాంకు సాధించటం ఒక ఎత్తయితే, మంచి కాలేజీలో మంచి స్పెషలైజేషన్లో సీటు పొందడం మరో ఎత్తు. అందుకు ఉపకరించే మెలకువలు మీకోసం!
గేట్‌ను రాసేవారు రెండు ప్రయోజనాలను ఆశిస్తారు. 1) ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగాలు 2) ఉన్నత స్థాయి చదువులు (ఎంటెక్‌, ఎంఎస్‌, పీహెచ్‌డీ).
కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూ) గేట్‌ స్కోరు ఆధారంగా, తదుపరి ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తాయి. చాలా మంచి ఉద్యోగ భత్యాలు (సుమారు ఏడాదికి రూ. 12 లక్షల వరకూ) లభిస్తాయి. ఉద్యోగంలో చేరాలనుకునేవారు ఈ ఇంటర్వ్యూలకు సిద్ధం కావాల్సివుంటుంది.
ఎంటెక్‌ /ఎంఎస్‌ ఎందుకు?
దీనికి ఈ కారణాలు చెప్పుకోవచ్చు.
1) సంబంధిత సబ్జెక్టుల్లో సంపూర్ణ అవగాహన, ఉన్నత విద్యార్హత
2) మంచి ప్రాంగణ నియామకాలు
3) ఉన్నత పరిశోధన (పీహెచ్‌డీ)
4) అధ్యాపక రంగంలో ప్రవేశం
గేట్‌ స్కోరు ఆధారంగా ఎంటెక్‌ ఎక్కడ చేసినా ఉపకార వేతనంగా నెలకు రూ. 12,400 ఇస్తారు.
దరఖాస్తు సమయంలో ఏం చూడాలి?
ఎంటెక్‌ ప్రోగ్రాం ఐఐఎస్‌సీ, ఐఐటీలు, ఎన్‌ఐటీలు, కొన్ని ప్రైవేటు కళాశాలల్లో ఉంటుంది. వీటిలో ప్రతిభను బట్టి గేట్‌ స్కోరు ఆధారంగా అభ్యర్థులకు సీట్లు కేటాయిస్తారు.
దరఖాస్తు సమయంలో చూడాల్సిన అంశాలు:
* ఎంచుకునే కళాశాల విశిష్టత
* బ్రాంచి ప్రాముఖ్యం
* ప్రాంగణ నియామక అవకాశాలు
* ఆశించేది ఏ విధమైన ఉద్యోగం (కోర్‌/సాఫ్ట్‌వేర్‌)?
* కళాశాల ఉండే ప్రదేశం, రవాణా సౌకర్యాలు
గేట్‌ స్కోరు ఆధారంగా నాణ్యమైన కళాశాలలను ఎంచుకునే ప్రాధాన్యక్రమం-
ఐఐఎస్‌సీ ఐఐటీలు ఎన్‌ఐటీలు విశ్వవిద్యాలయాలు ప్రైవేటు కళాశాలలు
ఐఐఎస్‌సీ /ఐఐటీలో సీటు పొందడం ఎలా?
సహజంగా ఎంటెక్‌ చేయాలనుకునే విద్యార్థులు మొదట ప్రాధాన్యం ఇచ్చేవిద్యాసంస్థలు- ఐఐఎస్‌సీ/ఐఐటీలు.
* కొన్ని ఐఐటీల్లో గేటు స్కోరుతో పాటు రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఎంపిక విధానం అనేది స్పెషలైజేషన్‌ ఆధారంగా మారే అవకాశం ఉంది.
* గత ఏడాది కటాఫ్‌ స్కోర్లను ఆధారంగా చేసుకుని, ప్రతి ఐఐటీకీ వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు వివరాల కోసం, గత ఏడాది కటాఫ్‌ స్కోర్ల కోసం అభ్యర్థులు ఆయా కళాశాలల వెబ్‌సైట్లను పరిశీలించాల్సివుంటుంది.
* ఐఐటీ/ఎన్‌ఐటీ/కొన్ని విశ్వవిద్యాలయాల్లో కొన్ని సీట్లు సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోటాలో కూడా ఉంటాయి. ఇది కూడా మెరిట్‌ పద్ధతిలో గేట్‌ స్కోరు ఆధారంగా ఇస్తారు. ఈ పద్ధతి ద్వారా సీటు పొందిన విద్యార్థులకు ఉపకార వేతనం లభించే అవకాశం ఉండదు. అయితే ఈ విధానం ఎంచుకునే విద్యార్థులు తక్కువ కాబట్టి మంచి కళాశాలలో సీటు పొందే అవకాశాలు అధికం. ఆర్థిక సమస్యలు లేనివారు ఈ విధంగా కోరుకున్న స్పెషలైజేషన్‌ను మంచి కళాశాలలో పొందే అవకాశం ఉంది.
ఎంఎస్‌... ఏ ప్రత్యేకత?

* ఎంఎస్‌ (మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ బై రిసర్చ్‌) విద్యార్థులను చాలా ఐఐటీల్లో గేట్‌ స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దీని కాల వ్యవధి రెండేళ్ళ కన్నా ఎక్కువ. కానీ ఉద్యోగ అవకాశాలు సమానంగానే ఉంటాయి కాబట్టి ఎంటెక్‌ సీటు సరైన కళాశాలలో రాని అభ్యర్థులు దీనికి ప్రాధాన్యం ఇస్తారు. పరిశోధన అభిరుచి ఉండి పీహెచ్‌డీ చేయాలనుకున్న విద్యార్థులకు ఇదొక అవకాశం!
* పూర్వ విద్యార్థుల సమాచారం ఆధారంగా ఇచ్చిన వివరాలివి. ఇది ప్రతి సంవత్సరమూ మారవచ్చు. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులు 10,000 ర్యాంకు వరకూ ఐఐటీల్లో సీటు పొందే అవకాశం ఉంది.
* NITIE (ముంబయి) కళాశాలలో పీజీడీఐఈ కోర్సు (రెండు సంవత్సరాలు) చేయడానికి గేట్‌ స్కోరు, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. మేనేజ్‌మెంట్‌లో అభిరుచి ఉన్న ఇంజినీరింగ్‌ పట్టభద్రులకు ఇదో సువర్ణావకాశం. ఈ కళాశాలలో కోర్సు చేసే మంచి ఉద్యోగావకాశాలుంటాయి. ఇది ఐఐఎంలకు సమానంగా ఉంటుంది.
ఎన్‌ఐటీల్లో సీటు పొందడం ఎలా?
* దేశంలో ఉన్న చాలా ఎన్‌ఐటీలకు సీసీఎంటీ (సెంట్రలైజ్డ్‌ కౌన్సెలింగ్‌ ఫర్‌ ఎంటెక్‌) పద్ధతి ద్వారా ఏటా ఎంటెక్‌ ప్రవేశాలు జరుగుతాయి. ఈ సీసీఎంటీ రిజిస్ట్రేషన్‌ ఏప్రిల్‌ రెండోవారంలో మొదలయ్యే అవకాశం ఉంది.
* సీసీఎంటీ వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ అయిన తర్వాత, ఎన్‌ఐటీలను ప్రాధాన్యం ఆధారంగా వరసక్రమంలో నింపాలి. ఆ ఎంపికను మూడు విడతల్లో నిర్వహిస్తారు. ఈ మూడు విడతల్లో సీటు లభించకపోయినా, నచ్చిన సీటు రాకపోయినా స్పాట్‌ రౌండుకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ రౌండును ఆయా ఎన్‌ఐటీలు వేర్వేరుగా నిర్వహిస్తాయి. ఇది ఒక చక్కని అవకాశం. కొన్ని సార్లు మంచి స్కోరు లేకపోయినా, మంచి కళాశాలలో సీటు లభించే అవకాశం ఉంది.
* కొన్ని విశ్వవిద్యాలయాలు గేట్‌ స్కోరును పరిగణనలోకి తీసుకోకుండా ప్రత్యేకంగా పరీక్ష పెట్టి, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తాయి. ఉదా: ఢిల్లీ యూనివర్సిటీ, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ, ఐఐటీలు, పాండిచ్చేరి యూనివర్సిటీ మొదలైనవి.
* ఈ మధ్యకాలంలో చాలామంది గేట్‌ను ఉద్యోగం కోసం మాత్రమే రాస్తున్నారు. గేట్‌ స్కోరు మూడేళ్ళ వరకూ చెల్లుబాటు ఉంటుంది. కాబట్టి రాసే ప్రతి అభ్యర్థీ ఎంటెక్‌లో చేరటం లేదు కాబట్టి పైన తెలిపిన కటాఫ్‌ ర్యాంకులు 25 శాతం వరకూ మారవచ్చు.
* ఎల్‌ అండ్‌ టీ కంపెనీల్లో బిల్డ్‌ ఇండియా స్కాలర్‌షిప్‌ (బీఐఎస్‌)కు దరఖాస్తు చేసుకుని, తద్వారా కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌ బ్రాంచిలో ఎంటెక్‌ చేసుకోవచ్చు. ఇది ఐఐటీ మద్రాస్‌, ఐఐటీ దిల్లీల్లో ఉంది. సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ బ్రాంచి అభ్యర్థులు మాత్రమే అర్హులు. నెలవారీ ఉపకారవేతనం ఉంటుంది. ఫీజు మొత్తం ఎల్‌ అండ్‌ టీ కంపెనీయే భరిస్తుంది. ఎంటెక్‌ అయిన తర్వాత ఈ కంపెనీల్లో ఉద్యోగం కూడా లభిస్తుంది.
* గేట్‌ స్కోరు ఆధారంగా సింగపూర్‌, జర్మనీ లాంటి దేశాల్లో ఎంటెక్‌/ఎంఎస్‌లో చేరే వీలుంది.

* ఐఐటీ/ఎన్‌ఐటీలలో కచ్చితంగా సీటు లభిస్తుందనే నమ్మకం లేకపోతే ఐఐఐటీలు, యూనివర్సిటీలకు కూడా దరఖాస్తు చేసుకోవడం మేలు. ఉదా: అన్నా వర్సిటీ, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ, బిట్స్‌, పీఎస్‌సీ (కొయంబత్తూర్‌) మొదలైనవి.
* తెలుగు రాష్ట్రాల్లో జేఎన్‌టీయూ హైదరాబాద్‌, కాకినాడ, అనంతపురం; ఉస్మానియా, ఎస్‌వీయూ, ఆంధ్ర విశ్వవిద్యాలయాలకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
* గేట్‌ ఉత్తీర్ణత సాధించనివారు పీజీఈసెట్‌ (తెలుగు రాష్ట్రాలు), టీఏఎన్‌సెట్‌ (తమిళనాడు) రాసే వీలుంది. వీటి ద్వారా ఆయా రాష్ట్రాల్లో స్థానిక కళాశాలలో ఎంటెక్‌ సీటు పొందవచ్చు. కానీ ఉపకార వేతనం లభించదు.
* అభ్యర్థులు ఒకటి రెండు కళాశాలలకే కాకుండా సుమారు పది విద్యాసంస్థలకు దరఖాస్తు చేసుకుంటే మంచి స్పెషలైజేషన్‌ దొరికే అవకాశం ఉంటుంది.
* కౌన్సెలింగ్‌ సమయంలో సీనియర్ల, తెలిసిన అధ్యాపకుల నుంచి సలహాలు తీసుకుంటే ఎంతో ఉపయోగపడతాయి.
Posted on 11-04-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning