తెలంగాణ... సాంకేతిక వీణ!

* ఉద్యమ స్ఫూర్తితో ‘టీటా’ డిజితాన్‌
* సాంకేతిక పాఠాలు నేర్పుతున్న ఐటీ నిపుణులు
* తొలి డిజిటల్‌ గ్రామంగా బాసర

ఈనాడు - హైదరాబాద్‌: స్వరాష్ట్రం కోసం కలిసిన గొంతులు తెలంగాణను సాధించాయి! సురాష్ట్రం కోసం కలిసిన మనసులు సాధించిన రాష్ట్రాన్ని సాంకేతికమయం చేస్తున్నాయి! ఇదిగిదిగో ఐటీ తెలంగాణ... ‘టీటా’ మీటిన సాంకేతిక వీణ!
ఐటీ రంగంలో దూసుకుపోతున్న హైదరాబాద్‌కు... సర్కారు ప్రకటించిన ఐటీ విధానం తోడయ్యింది. భాగ్యనగరం ఐటీ రాజధానిగా రూపొందుతున్న తరుణంలో... ఈ ఫలాలను యువతరం అందిపుచ్చుకోవాలని తెలంగాణ సమాచార సాంకేతిక సంఘం (టీటా) భావించింది. బీటెక్‌ చదువుతున్న యువతే లక్ష్యంగా యువనిర్మాణ్‌ చేపట్టింది. వారికి ఐటీ రంగం అవసరాలను వివరిస్తోంది. కళాశాల చదువులకు తోడు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తోంది. క్షేత్రస్థాయి పరిస్థితులను వివరించి ఉద్యోగాలకు వారిని సన్నద్ధం చేస్తోంది. అక్కడితో ఆగలేదు!
ఐటీ ఫలాలను పల్లెజనానికి అందివ్వాలని నిశ్చయించింది. ‘డిజితాన్‌’ కార్యక్రమంతో డిజిటల్‌ తెలంగాణ ఆవిష్కరణకు కంకణం బూనింది. చదువుల తల్లి కొలువుదీరిన బాసరను ముందుగా ఎంచుకుంది. ఏడు ఆదివారాలు గ్రామంలో ఉన్నవారందరికీ ఐటీ పాఠాలు చెప్పి, మొట్టమొదటి డిజిటల్‌ గ్రామంగా బాసరను తీర్చిదిద్దింది. అక్కడితో ఆగలేదు!
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేస్తోంది. సైబరాబాద్‌లో బోనాలు నిర్వహించి, బతుకమ్మ ఆటలాడించింది.
10 వేల మంది సైన్యం...
టీటాలో పది వేల మంది సభ్యులున్నారు. వీరిలో వృత్తినిపుణులు, విద్యార్థులు, ఎన్‌ఆర్‌ఐలు, కార్పొరేట్‌ సంస్థలకు చెందిన ప్రతినిధులతో కూడిన నాలుగు విభాగాలున్నాయి. సందీప్‌ మక్తాలా... 2013లో టీటాను ఏర్పాటుచేశారు. ఆయన అధ్యక్షులుగా, రాణాప్రతాప్‌, నవీన్‌ గడ్డం ఉపాధ్యక్షులుగా, నవీన్‌ చింతల, అశ్విన్‌చంద్ర ప్రధాన కార్యదర్శులుగా ఈ సంస్థ ఏర్పడింది. యువతకు మంచి ఉపాధి అవకాశాలు, విద్యావకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో 2014లో ‘తెలంగాణ యువ నిర్మాణ్‌’ను ఏర్పాటుచేశారు. మంచి మార్కులున్నా, సాంకేతిక పరిజ్ఞానం అంతగాలేని యువత రాష్ట్రంలో ఎంతోమంది ఉన్నారు. వారికి సాంకేతిక నైపుణ్యంపైన, కోర్సులు, ఉద్యోగావాకాశాలపై అవగాహన కల్పిస్తే ఉపయోగంగా ఉంటుందని భావించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వారి కోసం మొట్టమొదటి శిక్షణ సదస్సును నిర్వహించారు. ఇలా ఇప్పటివరకూ 76 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో యువ నిర్మాణ్‌ కార్యక్రమాలను టీటా ఏర్పాటు చేసింది. దాదాపు 50 వేల మంది విద్యార్థులను ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా తీర్చిదిద్దింది. అంకుర పరిశ్రమలకూ చేయూతనిస్తోంది. తెలంగాణ విద్యార్థులకే కాదు... రాష్ట్రంలో ఉండే విద్యార్థులందరికీ యువ నిర్మాణ్‌లో భాగస్వామ్యం కల్పించింది. శిక్షణ ఇచ్చి వారిని ఉద్యోగార్హులుగా తీర్చిదిద్దుతోంది.
పల్లెపల్లెకూ చేరుకోవాలని...
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పల్లెలకూ అందజేయాలనే ఉద్దేశంతో ‘డిజిటల్‌ తెలంగాణ’ కార్యక్రమాన్ని టీటా రెండో కార్యక్రమంగా చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా అవినీతికి అంతం చెప్పాలని నిశ్చయించింది. ప్రపంచ అవసరాలకు అనుగుణంగా పంటలు పండించడం.. వాటిని అమ్ముకోడానికి ఇంటర్నెట్‌ను వినియోగించడం అందరికీ తెలిసుండాలని భావించింది. కరెంటు, టెలిఫోను, ఇంటి పన్నుల చెల్లింపులు, బ్యాంకు లావాదేవీలన్నీ ఆన్‌లైన్‌లో నిర్వహించుకోవడంపై గ్రామీణులకు శిక్షణ ఇచ్చింది. ఇందుకు ముందుగా బాసరను ఎంపిక చేసుకుని, అక్కడి ఐఐఐటీ విద్యార్థులతో చేతులు కలిపింది. ఏడు వారాల పాటు ప్రతి ఆదివారం గ్రామీణులకు శిక్షణ ఇచ్చి, వంద శాతం డిజిటల్‌ అక్షరాస్యత సాధించిన గ్రామంగా బాసరను తీర్చిదిద్దింది. ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ స్వయంగా అక్కడకు వెళ్లి, 100% డిజిటల్‌ అక్షరాస్యత సాధించిన తొలి గ్రామంగా బాసరను ప్రకటించారు. ఇప్పుడు తెలంగాణ విశ్వవిద్యాలయంతో కలిసి... నిజామాబాద్‌ జిల్లాలోని నరసింగాపురాన్ని డిజిటల్‌ మయం చేస్తోంది. ‘ఈ-సాగు’ యాప్‌ ద్వారా రైతులకు చేయూతనివ్వడానికి డిజిటల్‌ తెలంగాణ కార్యక్రమం ఉపయోగపడింది. పంటకు చీడ పడితే... దానిని ఫొటో తీసి ‘ఈ-సాగు’ ద్వారా పంపితే, అప్పటికప్పుడు ఎలాంటి పురుగుమందులు వాడాలో, ఎలాంటి ఎరువులు వేయాలో చెప్పడానికి దారి చూపింది.
డిజిటల్‌ తెలంగాణ సాధనే లక్ష్యం -సందీప్‌కుమార్‌ మక్తాల, టీటా వ్యవస్థాపక అధ్యక్షుడు
ఉద్యమ సమయంలో ఐటీ పరిశ్రమ తరలిపోతుందనే ప్రచారానికి అడ్డుకట్ట వేయడానికి ఎంతో కృషి చేశాం. ఉద్యమం ఉద్ధృతంగా జరుగుతున్న 2009-10లో ఇక్కడ ఐటీ పరిశ్రమ 48% అభివృద్ధి సాధించింది. ఫేస్‌బుక్‌, యునైటెడ్‌ హెల్త్‌ గ్రూప్‌ వంటి సంస్థలు ఇక్కడ కార్యాలయాలు తెరిచాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత.. ఇక్కడి విద్యార్థుల్లో నైపుణ్యం పెంచాలని ‘యువనిర్మాణ్‌’ చేపట్టాం. డిజిటల్‌ తెలంగాణ సాధనే లక్ష్యంగా పనిచేస్తున్నాం. జేఎన్‌టీయూహెచ్‌ ప్రధానాచార్యులు డా.అలిసేరి గోవర్థన్‌ను టీటా విద్యాబోధన విభాగ అధ్యక్షులుగా నియమించుకుని, ‘యువనిర్మాణ్‌’ను మరింత ముందుకు తీసుకెళ్తాం.
బీటెక్‌ అవ్వగానే ఉద్యోగం -వివేక్‌ బుద్ధం, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి
సీఎంఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో చదువుతుండగా.. టీటా నిర్వహించిన యువనిర్మాణ్‌ కార్యక్రమంలో పాల్గొన్నా. రూపాయి ఖర్చు లేకుండా సాంకేతిక శిక్షణ పొందాను. ఇంటర్వ్యూను ఎదుర్కొనే మెళకువలను తెలుసుకుని, హిటాచి కన్సల్టింగ్‌ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా చేరాను. టీటా కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేస్తూ, ఆదివారాలు డిజిటల్‌ తెలంగాణ కోసం కృషి చేస్తున్నాను.
అంకుర సంస్థకు టీటా సహకారం -ప్రవీణ్‌ మడిపూజు
మొబైల్‌ యాప్స్‌, వెబ్‌సైట్ల రూపకల్పనకు ‘శుక్ర ఇన్ఫోటెక్‌’ అంకుర పరిశ్రమ స్థాపించడానికి టీటా సహకారం ఎంతగానో ఉపయోగపడింది. దేశ విదేశాల్లోని ఐటీ నిపుణులతో నేరుగా సంప్రదింపులు జరిపేందుకు వీలు కలిగింది. ప్రస్తుతం డిజితాన్‌ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నాను. మేము రూపొందించిన యాప్స్‌తో గ్రామీణులకు సేవలందుతున్నాయి. స్కౌట్‌ ప్లస్‌ యాప్‌ ద్వారా విద్యార్థులకు విద్యావకాశాలు తెలుసుకునే వీలు కల్పించాం.
Posted on 18-04-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning