ఐటీ కొలు‘వర్రీ’

* ఆటోమేషన్‌తో 20 % ఉద్యోగాలు తగ్గొచ్చు
* నాస్కామ్‌ అంచనా
* అదనపు నైపుణ్యమే శ్రీరామ రక్ష
* కొత్త సాంకేతికతల్లో అవకాశాలు బోలెడు: నిపుణులు

ఈనాడు - హైదరాబాద్‌: ఇప్పటిదాకా చాలా అమెరికన్‌ కంపెనీలు నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేషన్‌, టెస్టింగ్‌ల కోసం భారత్‌లో పని అప్పగించేవి. ఇప్పుడా పనికి ప్రత్యేకమైన టూల్స్‌ వచ్చాయి. 10 మంది పది రోజుల్లో చేసేపనిని ఒక టూల్‌ నిమిషంలో చేసేస్తోంది.
ఐటీ కొలువు.. భారతీయ యువతలో అత్యధిక మంది లక్ష్యం. ఆకర్షణీయమైన వేతనాలు, వృత్తిలో వేగంగా ఎదిగే అవకాశం, మంచి సౌకర్యాలు.. ఇతర ఉద్యోగాలతో పోల్చుకుంటే దాదాపు అన్ని అంశాల్లోనూ దీనికి తిరుగులేదు. అందుకే దాదాపు పదిహేనేళ్లుగా మన యువతరానికి ఐటీ రంగమే కొలువుల కల్పవృక్షం. అయితే ఆటోమేషన్‌ (మనుషుల పని యంత్రాలు చేయడం) వల్ల ఐటీ రంగంలో ఉద్యోగాలు తగ్గుతాయన్న నిపుణుల అంచనాలు యువతలో గుబులు పుట్టిస్తున్నాయి. ఆటోమేషన్‌ ప్రభావం ఐటీ ఉద్యోగాలపై భారీగానే పడే అవకాశం కనిపిస్తోంది. దీనివల్ల 20 శాతం దాకా కొలువులు తగ్గే అవకాశముందన్నది నాస్కామ్‌ అంచనా.
నాస్కామ్‌ (నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీసెస్‌ కంపెనీస్‌) ఛైర్మన్‌, టెక్‌ మహీంద్రా సీఈవో గుర్నాని కూడా తాజాగా ఈ విషయమై హెచ్చరించారు. ఆటోమేషన్‌ ప్రక్రియ క్రమంగా వూపందుకుంటోంది. భారతీయ ఐటీ కంపెనీలు కొన్ని ఉద్యోగాలను తగ్గించుకొని ఆటోమేషన్‌కు మొగ్గు చూపుతున్నాయంటున్నారు. కొన్ని సంస్థలు ఆటోమేషన్‌ టూల్స్‌ను తయారు చేయడంలో పెట్టుబడులు కూడా పెడుతున్నాయి. మేధస్సును పెద్దగా ఉపయోగించాల్సిన అవసరం లేని పనులు, అలవాటైతే యాంత్రికంగా (రొటీన్‌గా) చేసుకుంటూ పోయే పనులపై ఆటోమేషన్‌ ప్రభావం ప్రధానంగా పడుతుంది. ఇప్పటిదాకా చాలా అమెరికన్‌ కంపెనీలు నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేషన్‌, టెస్టింగ్‌ల కోసం భారత్‌లో పని అప్పగించేవి. ఇప్పుడా పనికి ప్రత్యేకమైన టూల్స్‌ వచ్చాయి. 10 మంది పది రోజుల్లో చేసేపనిని ఒక టూల్‌ నిమిషంలో చేసేస్తోంది. ఇలాంటి ఉద్యోగాలతోపాటు ప్రాసెసింగ్‌, వాయిస్‌ వర్క్‌లన్నీ ఆటోమేషన్‌కు మారిపోతాయంటున్నారు. ముఖ్యంగా ఐటీ ఆధారిత బీపీఓ రంగంపై దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశముంది.
సవాలుగా స్వీకరిస్తే.. ఆటోమేషన్‌ ప్రక్రియ రెండు మూడేళ్ల కిందటే ప్రారంభమైనా.. క్రమంగా వేగవంతమై ఇప్పుడు స్థిరపడే దశకు చేరుకుంటోంది. అలాగని ఐటీ రంగంలో ఉద్యోగాలన్నీ యంత్రాల పరమవుతాయనుకోవడానికి కూడా లేదు. ‘‘ఆటోమేషన్‌ మనకు సరికొత్త సవాలు విసురుతోంది. ఇకమీదట ఐటీలో రాణించాలంటే అదనపు నైపుణ్యాలను సంపాదించుకోవాలి. ఐటీ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యా రంగంలోనూ మార్పులొస్తేనే అది సాధ్యం’’ అని ఇన్‌వెస్కో మానవవనరుల డైరెక్టర్‌ మమత వేగుట విశ్లేషించారు. అప్పగించిన పనికే పరిమితం కాకుండా మనవల్ల కంపెనీకి అదనపు ప్రయోజనం చేకూరే నైపుణ్యాలను జోడించుకోవడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడుతోందని డెలాయిట్‌ సీనియర్‌ మేనేజర్‌ ఆనంద్‌ దాట్ల అన్నారు. నిర్వహణపరమైన సేవల నుంచి... నిర్ణయాత్మక, వ్యూహాత్మక అంశాల్లో సేవలను సమర్థంగా నిర్వర్తించే వారికి కొలువుల్లో ఎక్కువ ప్రాధాన్యం లభించొచ్చు. సైబర్‌ భద్రత, అనలటిక్స్‌, డిజిటలైజేషన్‌, బిగ్‌డాటా, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌...లాంటి కొత్త ప్రక్రియల్లో ఎక్కువ ఉద్యోగావకాశాలు ఉంటాయంటున్నారు.
అదనపు నైపుణ్యాలు అత్యవసరం
2013లో ప్రతి బిలియన్‌ డాలర్ల ఆదాయం సంపాదనకు సుమారు 26 వేల మంది ఉద్యోగులు అవసరమయ్యేవారు. ఆటోమేషన్‌తో ఇప్పుడు 13 వేల మంది సరిపోతున్నారు. అలా అని యువతరం కంగారుపడనక్కర్లేదు. ఐటీలోనే కొత్త రంగాలు ఉత్పన్నమవుతున్నాయి. నిర్ణయాత్మక, వ్యూహాత్మక అంశాల్లో మానవవనరులు ఎప్పటికీ అవసరమే. వాటికి తగ్గ అదనపు నైపుణ్యాల సముపార్జనపై దృష్టిసారించాలి. కళాశాలలో ఉండగానే అదనపు నైపుణ్యాలు నేర్చుకుంటేనే ఉద్యోగావకాశాలు ఎక్కువ. చదువుతోపాటే అనుభవం అవసరమని గుర్తించాలి.
             - ఆనంద్‌ దాట్ల, సీనియర్‌ మేనేజర్‌, డెలాయిట్‌
బీపీఓపైనే తొలి ప్రభావం
ఆటోమేషన్‌ వల్ల ఉద్యోగాలు తగ్గడానికి కాస్త సమయం పడుతుంది. బీపీఓలాంటి రంగాలపై తొలుత ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో కొత్త అవకాశాలు పుట్టుకొస్తున్నాయి. ఎక్కువ విలువున్న పనులకు ప్రాధాన్యం లభిస్తున్నందున కన్సల్టింగ్‌, ఉత్పత్తి అభివృద్ధి (ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌) లాంటి వాటిపై ఎక్కువ దృష్టిసారించాలి. వాటికి తగ్గట్లుగా క్లౌడ్‌, బిగ్‌డేటా, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ, అనలటిక్స్‌...లాంటి ఆధునిక సాంకేతికాంశాల్లో ప్రావీణ్యం సంపాదించుకోవాలి.
             - మమత వేగుంట, ఇన్‌వెస్కో మానవ వనరుల విభాగం డైరెక్టర్‌
Posted on 24-04-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning