ఇంజినీరింగ్ కాలేజీల్లో కేంబ్రిడ్జి ఆంగ్ల శిక్షణ

* టాస్క్ ద్వారా తొలుత 4-5 జిల్లాల్లో అమలు
* అనంతరం డిగ్రీ కాలేజీలకూ విస్తరింపు
* తెలంగాణ ఐటీశాఖ నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్: 'ఇంజినీరింగ్ విద్యార్థులకు ఆంగ్ల పరిజ్ఞానం తక్కువ' జాతీయ స్థాయిలో ఏ సర్వే తీసుకున్నా తేల్చి చేప్పేదిదే! తెలంగాణలోని 300కుపైగా ఇంజినీరింగ్ కాలేజీల్లోనూ పరిస్థితేమీ ఇందుకు భిన్నంగా లేదు. అయితే ఇకపై ఈ పరిస్థితి ఉండకూడదని తెలంగాణ ఐటీశాఖ నిర్ణయించింది. కేవలం ఇంజినీరింగ్ అనే కాకుండా ఏ పట్టభద్రులైనా తమ కోర్సు పూర్తయ్యేసరికి ఆంగ్లంపై పట్టు సంపాదించేలా ప్రణాళిక రూపొందించింది. అందులో భాగంగా... విశ్వవిఖ్యాత కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంతో తెలంగాణ విజ్ఞాన నైపుణ్యాభివృద్ధి కేంద్రం (టాస్క్) ఒప్పందం కుదుర్చుకుంది. బుధవారం (ఏప్రిల్ 27న) ఇందుకు సంబంధించిన లాంఛనాలు పూర్తయ్యాయి. తొలుత ప్రయోగాత్మకంగా 4-5 జిల్లాల్లోని ఇంజినీరింగ్ కాలేజీలతో మొదలెట్టి... అనంతరం డిగ్రీ కాలేజీల వరకూ విస్తరించాలన్నది ఆలోచన. ఈ ఒప్పందంలో భాగంగా కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం మొదట ఎంపిక చేసిన ఇంజినీరింగ్ కాలేజీల్లోని ఆంగ్ల అధ్యాపకులకు శిక్షణ ఇస్తుంది. సుమారు 6 నుంచి 9 నెలల పాటు ఈ శిక్షణ ఉంటుంది. టాస్క్ ద్వారా కేంబ్రిడ్జి ప్రతినిధులు ఆయా కాలేజీలకు వెళ్లటం... అధ్యాపకులను టాస్క్‌కు పిలిపించే రెండు మార్గాల్లో ఈ శిక్షణ నిర్వహిస్తారు. అనంతరం చివర్లో పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి బెక్ (బిజినెస్ ఇంగ్లిష్ సర్టిఫికేషన్) ధ్రువపత్రాన్ని అందజేస్తారు. మొదట శిక్షకులకు (అధ్యాపకులకు) శిక్షణతో మొదలెట్టి అనంతరం పరిస్థితుల ఆధారంగా విద్యార్థులకు నేరుగా ఇవ్వటానికున్న అవకాశాలను కూడా పరిశీలిస్తారు.
* విద్యార్థుల్లో ఆంగ్ల నైపుణ్యం పెంచేందుకే..
'విద్యార్థుల అవసరాలను, బయటి మార్కెట్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మేం ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. ఆంగ్లంలో మాట్లాడే నైపుణ్యాన్ని పెంచటం మా ప్రధాన ఉద్దేశం. ఈ కోర్సులో భాగంగా కొన్ని సెమినార్లు, సదస్సులు కూడా ఉంటాయి. తొలుత అధ్యాపకుల నైపుణ్యాలను పెంచాలనుకుంటున్నాం.'
             - ఇమాన్యుయెల్ రాజ్, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం ప్రతినిధి
* ఏ విద్యార్థీ ఆంగ్లంతో ఇబ్బంది పడకూడదని..
'తొలుత ఇంజినీరింగ్ కాలేజీలతో మొదలెట్టి తర్వాతి దశలో డిగ్రీ, ఇతర కాలేజీలకు కూడా విస్తరించాలన్నది మా ఆలోచన. పట్టా తీసుకొని బయటకు వచ్చే ఏ విద్యార్థి కూడా ఆంగ్లంతో ఇబ్బంది పడకుండా చూడాలన్నది ప్రభుత్వ ఆలోచన. దానికనుగుణంగానే ఈ ఏర్పాటు చేశాం. కొత్త విద్యాసంవత్సరం (జులై నుంచి) ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం.'
             - సుజీవ్ నాయర్, టాస్క్ సీఈవో
Posted on 28-04-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning