ఐటీలో ఆధునికం

ప్రపంచస్థాయిలో ఇంజినీర్లను రూపొందించే లక్ష్యంతో 15 ఏళ్లుగా కొనసాగుతున్న కోర్సు... ‘ఎంఎస్‌ఐటీ’. కార్నెగీ మెలన్‌ విశ్వవిద్యాలయ సహకారంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ పీజీ కోర్సు అందుబాటులో ఉంది. దీని ప్రత్యేకతలూ, ప్రవేశపరీక్ష సన్నద్ధత వివరాలూ తెలుసుకుందామా!
తెలుగు రాష్ట్రాల్లోని ఎన్నో కళాశాలల్లో ఇంజినీరింగ్‌ విద్య నాణ్యత నిరాశాజనకం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఏర్పాటైన కన్సార్టియం ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ ఆఫ్‌ హయ్యర్‌ లర్నింగ్‌ (CIHL)ఆధ్వర్యంలో ప్రమాణాలను పాటిస్తూ విజయవంతంగా కొనసాగుతోంది ఎంఎస్‌ఐటీ (మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఇన్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ). ప్రపంచస్థాయి నైపుణ్యాల సాధన లక్ష్యంగా ఈ కోర్సును రూపొందించారు. కాలానుగుణమైన మార్పులతో తాజా సాంకేతికతను దీనిలో భాగం చేస్తున్నారు. అందుకే ఈ విద్యార్థులు ఉద్యోగులుగానే కాకుండా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా కూడా రాణిస్తున్నారు.
ఆధునిక కార్పొరేట్‌ ప్రపంచం ఎదుర్కొంటున్న చిక్కు సమస్యలను పరిష్కరించగల విద్యార్థులను ఎంఎస్‌ఐటీలో సిద్ధం చేస్తారు. పరిశ్రమ వర్తమాన అవసరాలను ప్రతిఫలించే స్పెషలైజేషన్లూ, సబ్జెక్టులు దీనిలో ప్రవేశపెడుతున్నారు. నాణ్యమైన ఇంటర్న్‌షిప్‌లూ, ప్రాజెక్టులూ కీలకం కాబట్టి వాటికోసం ప్రసిద్ధ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ‘ఆచరణ ద్వారా అభ్యాసం’ (Learning by doing) అనే బోధనా పద్ధతిని ఈ కోర్సు అమలుచేస్తోంది.
అత్యాధునిక మౌలిక సదుపాయాలు, కార్నెగీ మెలన్‌ విశ్వవిద్యాలయం, ఇతర సుప్రసిద్ధ విశ్వవిద్యాలయాల డిజిటల్‌ లెక్చర్లు, ప్రతి పది మంది విద్యార్థులకు ఒక మెంటర్‌... ఈ ప్రోగ్రాంలో కొన్ని విశేషాలు. దీనిలో చేరిన గ్రామీణ విద్యార్థులు భావ వ్యక్తీకరణ, ప్రెజెంటేషన్‌, ఇతర జీవన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవటం విశేషం.
వివిధ సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌ల ద్వారా పరిశ్రమతో అనుసంధానం ఏర్పడి విద్యార్థులు చక్కని అనుభవం సాధించగలుగుతున్నారు.కంపెనీలు ప్రత్యేకంగా ఆశిస్తున్న భాషాసామర్థ్యాల నైపుణ్యాల శిక్షణను కూడా జోడించి ఎంఎస్‌ఐటీ విద్యార్థులను ఉద్యోగ సంసిద్ధులుగా మలుస్తున్నారు.
పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఈ ప్రోగ్రాంలో స్పెషలైజేషన్లను అందిస్తున్నారు. అవి- కంప్యూటర్‌ నెట్‌వర్క్స్‌, ఈ-బిజినెస్‌ టెక్నాలజీస్‌, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌, డాటా ఎనలిటిక్స్‌ అండ్‌ డేటా విజువలైజేషన్‌, మొబైల్‌ టెక్నాలజీస్‌.
ప్రవేశం ఎలా?
గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ GAT అనే ప్రవేశపరీక్ష ఆధారంగా ఈ కోర్సులో ప్రవేశాలుంటాయి. మరో మార్గం- వాక్‌ ఇన్‌ ఎంట్రన్స్‌. ఏప్రిల్‌ 14 నుంచి మే 21 వరకూ ఇవి జరుగుతాయి. బీటెక్‌/ బీఈ అన్ని బ్రాంచిలవారూ ఈ పీజీ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, కాకినాడ, అనంతపురం, విశాఖపట్నం, తిరుపతిల్లో గ్యాట్‌ జరుగుతుంది. వాక్‌ ఇన్‌ టెస్టులను హైదరాబాద్‌, కాకినాడల్లో నిర్వహిస్తారు. గ్యాట్‌లో సాధించిన ర్యాంకుల ఆధారంగా ప్రవేశం లభిస్తుంది.
* జులై 2013 తర్వాత జీఆర్‌ఈ రాసి 275/2.5 స్కోరు తెచ్చుకున్నవారికి ప్రవేశపరీక్ష నుంచి మినహాయింపు లభిస్తుంది.
* జులై 2014 తర్వాత టోఫెల్‌/ఐఈఎల్‌టీఎస్‌ రాసినవారికి ప్రవేశపరీక్ష స్టేజ్‌-2లోని లిసనింగ్‌ కాంప్రహెన్షన్‌ నుంచి మినహాయింపు ఇస్తారు. టోఫెల్‌లో 79/120 (ఐబీటీ); ఐఈఎల్‌టీఎస్‌లో కనీసం 6.0 స్కోరు సాధించివుండాలి.
ప్రిపరేటరీ కోర్సు ఫీజు రూ. 20,000. వార్షిక ఫీజు రూ.1.50 లక్షలు.
ముఖ్యమైన తేదీలు
* వాక్‌ ఇన్‌ ఎంట్రన్స్‌: ఏప్రిల్‌ 14- మే 21, 2016
* దరఖాస్తుల సమర్పణ గడువు: మే 16, 2016
* GAT ప్రారంభం: మే 22, 2016
* ప్రవేశపరీక్ష ఫలితాలు: జూన్‌ 2, 2016
* కౌన్సెలింగ్‌ ఆరంభం: జూన్‌ 13, 2016
* ప్రిపరేటరీ కోర్సు మొదలు: జూన్‌ 27, 2016
* మెయిన్‌ కోర్సు ప్రారంభం: ఆగస్టు 1, 2016
ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్లో www.msitprogram.net దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు హైదరాబాద్‌ గచ్చిబౌలిలో ఐఐఐటీ క్యాంపస్‌లో ఉన్న ఎంఎస్‌ఐటీ డీన్‌ను సంప్రదించవచ్చు.
ఫోన్‌: 7799834583
ఈ-మెయిల్‌: enquiries2016@msitprogram.net
ఎంఎస్‌ఐటీ 4 కేంద్రాల్లో అందుబాటులో ఉంది. ఒక్కో కేంద్రంలో సీట్లు- ఐఐఐటీ హైదరాబాద్‌: 160, జేఎన్‌టీయూ హైదరాబాద్‌: 140, జేఎన్‌టీయూ కాకినాడ: 50, జేఎన్‌టీయూ అనంతపురం: 50
గ్యాట్‌ కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సెక్షన్‌ -3 మినహా). ఈ ఆన్‌లైన్‌ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. దీనిలో 90 బహుళైచ్ఛిక ప్రశ్నలు, ఒక వ్యాసం (10 మార్కులకు పేపర్‌ మీద రాయాలి) ఉంటాయి. పరీక్ష సమయం రెండున్నర గంటలు.
విద్యార్థి పాఠశాల/ఉన్నతపాఠశాల రోజుల నుంచి 12వ తరగతి వరకూ ఏం నేర్చుకున్నాడనేది గ్యాట్‌ లెక్కలోకి తీసుకుంటుంది. అందుకని దీనికి చదవడం కంటే సాధన ముఖ్యం. వెబ్‌సైట్లు, పుస్తకాల ద్వారా నమూనా టెస్టులను అభ్యాసం చేయటం మేలు.
www.practiceaptitudetests.com/, www.indiabix.com/ మొదలైన వెబ్‌సైట్లు ఉపయోగపడతాయి.
గ్యాట్‌కు పనికొచ్చే రిఫరెన్స్‌ పుస్తకాలు:
1) బ్యారన్స్‌ స్ట్రాటజీస్‌ అండ్‌ ప్రాక్టీస్‌ ఫర్‌ ద న్యూ PSAT/NMSQT by Barron
2) ఏ మోడర్న్‌ అప్రోచ్‌ టు వెర్బల్‌ అండ్‌ నాన్‌ వెర్బల్‌ రీజనింగ్‌ బై డా. ఆర్‌ఎస్‌ అగర్వాల్‌
3) క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ ఫర్‌ కాంపిటీటివ్‌ ఎగ్జామినేషన్స్‌ బై ఆర్‌ఎస్‌ అగర్వాల్‌
4) క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ ఫర్‌ కాంపిటిటివ్‌ ఎగ్జామ్స్‌ బై త్రిష్ణాస్‌
ఎంఎస్‌ఐటీ నూరుశాతం ప్లేస్‌మెంట్లు ఏటా సాధిస్తూవస్తోంది. తాజా గణాంకాలు పరిశీలిస్తే- ఎంఎస్‌ఐటీ 2014-16లో దాదాపు నూరుశాతం నియామకాలను ఇక్కడి విద్యార్థులు పొందారు. ఐఐఐటీ హైదరాబాద్‌లో 64/71 మందీ, జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో 45/47 మందికీ, జేఎన్‌టీయూ కాకినాడలో 21/21 మందికీ, జేఎన్‌టీయూ అనంతపురంలో 6/6 మందికీ ఉద్యోగాలు లభించాయి.
సరికొత్త కోర్సులు
సాంప్రదాయక ఐటీ కోర్సులతో పాటు ఈ సంవత్సరం పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నాం. వీటిలో ఆధునిక అంశాలైన సోషల్ కంప్యూటింగ్, మొబైల్ కంప్యూటింగ్, అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భాగంగా ఉంటాయి. వర్తమాన ఐటీ పరిశ్రమ అవసరాలను తీర్చడంలో ఇవి సహాయపడగలవు. ఈ రంగాల్లో శిక్షణ పొందిన విద్యార్థుల కొరత ఎక్కువగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఎంఎస్ఐటీలో ఈ కోర్సులను ప్రవేశపెట్టాం.
             - ప్రొఫెసర్ మేడా శ్రీనివాసరావు, డీన్, సీఐహెచ్ఎల్
నాన్ ఐటీ విద్యార్థిగా ఎంఎస్ఐటీలో చేరి టీసీఎస్ లో ఉద్యోగం పొందాను. నైపుణ్యాలను అద్భుతంగా మెరుగుపరచుకోవడానికి ఈ కోర్సు నాకెంతో ఉపకరించింది. సాఫ్ట్ స్కిల్స్ శిక్షణ నా భావ ప్రసారణను మెరుగుపరిచింది.
             - పల్లవి గుప్తా, జేఎన్టీయూ అనంతపురం
నేర్చుకుంటూ ఉండటమనేది మా సంస్థ ప్రయాణంలో ముఖ్య భాగం. ఆ బీజాన్ని నాలో నాటింది ఎంఎస్ఐటీనే. ఈ పోటీ ప్రపంచంలో నెగ్గేలా సాఫ్ట్ స్కిల్స్ ఎంతో ఉపకరిస్తున్నాయి. లెర్నింగ్ బై డూయింగ్ పద్ధతిని మా విధుల్లో పాటిస్తున్నాం.
             - హర్ష ఎస్.ఆలూరి, ఫౌండర్, Zlapch TechStudios

Posted on 02-05-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning