నైపుణ్యం పెంచుకో.... కొలువు దక్కించుకో!

* అనంతలో ఐటీ ఉద్యోగ జాతర
* సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత

ఎస్‌.కె.విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: ‘‘రాష్ట్రంలో ఉన్న ప్రతీ యువతకు ఉద్యోగ కల్పనే మా ధ్యేయం. తమ్ముళ్లూ మీ శక్తి అపారం. ఆ శక్తికి నైపుణ్యం జోడిస్తే ఇక మీకు తిరుగులేదు. మీలో నైపుణ్యం ఉంటే దిగ్గజ ఐటీ కంపెనీలు మీ ముందుకే వస్తాయి. ఇంటింటికీ ఉద్యోగంలో భాగంగానే నిరుద్యోగ నిర్మూలనే రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయం. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా ఉద్యోగ నైపుణ్యాలు కల్పించి ఉద్యోగం కల్పిస్తాం.'' - ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు
కొలువులు క్యాంపస్‌ ముంగిట్లోకి రానున్నాయి. ఐటీ ఉద్యోగాలు కొల్లగొట్టాలనుకొనే యువతకు ఇదే సరైన వేదిక. కంపెనీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. యువత చేయాల్సిందల్లా ఆయా కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలు మెరుగుపరచుకోవడమే. చంద్రన్న ఉద్యోగమేళా పేరుతో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎస్కేయూ సంయుక్త ఆధ్వర్యంలో యువతకు మెగా ఉద్యోగమేళా నిర్వహించనున్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆయా మల్టీనేషనల్‌ కంపెనీలను నేరుగా విశ్వవిద్యాలయాలకు పంపే ఏర్పాట్లు చేశారు. ఇటీవల నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో ఒకేసారి ఏకంగా 80మంది విద్యార్థులు ఆయా కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. గతంలో శిక్షణ ఇచ్చి ప్రాంగణ నియామకాలకు అవకాశం కల్పించారు. తాజాగా నేరుగా ఇంటర్వ్యూలను యువత ఎదుర్కోవాల్సివస్తోంది. ఈనేపథ్యంలో మే 7న నిర్వహించనున్న ఉద్యోగమేళాకు యువత ఎలా సన్నద్ధం కావాలి. రానున్న ఆయా కంపెనీలు పేర్లు ఎలా నమోదుచేసుకోవాలన్న అంశాలపై నిపుణులు, ఉద్యోగ విజేత అనుభవాలతో న్యూస్‌టుడే ప్రత్యేక కథనం.
ముఖ్యమైన అంశాలు
ప్రాంగణ వేదిక: ఎస్కేయూ భువనవిజయం ఆడిటోరియం
ప్రాంగణ నియామకాల తేదీ: 7.5.2016
సమయం: ఉదయం 9 గంటలకు
ఎవరెవరు అర్హులు: ఏదేని డిగ్రీ, బీటెక్‌, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ
ఏయే జిల్లాలు : అనంతపురం జిల్లాతో పాటు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ఏ జిల్లాల వారైనా
విద్యార్థులూ... పేర్లు ఇలా నమోదుచేసుకోండి
పేర్లు నమోదు చేసుకున్నవారికి మాత్రమే ప్రాంగణ నియామకాల్లో అవకాశం కల్పిస్తారు. http://www.apssdc.in/ లోకి వెళ్లి అక్కడ చంద్రన్న ఉద్యోగమేళాపై క్లిక్‌ చేయాలి. క్లిక్‌ చేయగానే రిజిస్ట్రేషన్‌ జాబ్‌మేళా అనంతపురం పేరుతో కనిపించే వివరాలపై క్లిక్‌ చేస్తే రిజిస్ట్రేషన్‌ ఫారం కనిపిస్తుంది. ఇక్కడ పదోతరగతి హాల్‌టిక్కెట్‌ నంబరు, పేరు, చిరునామా, ప్రభుత్వ గుర్తింపుపత్రం, ఏ కంపెనీకి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటున్నారో ఆ వివరాలు తెలిపే కంపెనీ పేరు, మెయిల్‌ ఐడీ వివరాలను నమోదుచేయాలి. విద్యార్హత వివరాలు పూరించాలి. ఇదంతా పూర్తయ్యాక సబ్‌మిట్‌ చేయాలి. వెంటనే అభ్యర్థుల చరవాణికి ఒక రిఫరెన్సు నంబరు వస్తుంది. మరోసారి అభ్యర్థులు ప్రధాన అంతర్జాలంలోకి వెళ్లి పోర్టల్‌ రిజిస్టర్డ్‌ జాబ్‌మేళా, అనంతపురం మీద క్లిక్‌ చేస్తే అభ్యర్థులకు వచ్చిన రిఫరెన్స్‌ నంబరు, పదోతరగతి హాల్‌టిక్కెట్‌ నంబరు అడిగిన వివరాల్లో నమోదుచేసి బటన్‌ సబ్‌మిట్‌ కొట్టగానే జాబ్‌మేళా ప్రవేశ గుర్తింపుకార్డు వస్తుంది. ఆ కార్డుతోనే అభ్యర్థులు ఎస్కేయూలో నిర్వహించే ప్రాంగణ నియామకాలకు హాజరు కావాల్సివుంది. ఇప్పటికే 1200మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ చేయించుకొన్నారు.
యువతా... ఇవిగో కంపెనీలు
మొత్తం 12 కంపెనీలు ఎస్కేయూకి రానున్నాయి. ఆయా కంపెనీలకు అవసరమైన అర్హతలతో పాటు ఎంత వేతనం అందజేయనున్నారో స్పష్టత ఇచ్చారు. ఇక యువత వారి అర్హతలకు అనుగుణంగా కోరుకున్న కంపెనీ ప్రతినిధుల వద్దకువెళ్లి ఇంటర్వ్యూకు హాజరుకావడమే తరువాయి. ఏడాదికి ఆయా కంపెనీలు గరిష్టంగా 2.40లక్షల నుంచి కనిష్టంగా 1.50లక్షల వరకు వేతనం అందిస్తున్నట్లు ప్రకటించాయి. పొలారిస్‌, టెక్‌మహీంద్ర, ఈ-సెంట్రిక్‌ హెచ్‌ఆర్‌, అరైజ్‌ హెచ్‌ఆర్‌- అమెజాన్‌, ఎస్‌ఎంఎస్‌ కంట్రీ, స్కైస్‌ బిజినెస్‌, విజన్‌2కె ఐఎన్‌సీ, మహవీర్‌ ఆటో, ఐ-ప్రాసస్‌ సర్వీసెస్‌, ఏజిస్‌ లిమిటెడ్‌, ఐకేవైఏ క్యాపిటల్‌, కార్వీతో పాటు మరికొన్ని కంపెనీలు రానున్నాయి.
యువతా మేలుకో... ఉద్యోగం దక్కించుకో - ఆచార్య నాగభూషణరాజు, ఎస్కేయూ స్కిల్‌డెవలప్‌మెంట్‌ సంచాలకులు
* సూటిగా స్పష్టంగా తొణికసలాడే ఆత్మవిశ్వాసం ఉండాలి.
* బయోడేటాలో ఏయే అంశాలు పొందుపరిచారో ఆ అంశాలపై అవగాహన తప్పనిసరి.
* తెలిసిన విషయాలను సులభమైన ఆంగ్లంలో చెప్పేటట్లు ఉండాలి.
* తన గురించి తాను స్పష్టంగా చెప్పేలా ఒకటికి పదిసార్లు రిహార్సల్స్‌ చేసుకోవాలి.
* కంప్యూటర్‌పై కనీస పరిజ్ఞానం తప్పనిసరి
* ఇంజినీరింగ్‌ విద్యార్థులు అయితే సి ప్రొగ్రామింగ్‌, డేటా బేస్‌ ప్రొగ్రామ్‌పై అవగాహన ఉండాలి.
* కార్పొరేట్‌ కంపెనీల్లో పదిమందితో కలిసి పనిచేసే సత్తా, చొరవ, సానుకూలంగా మాట్లాడేతత్వం, నాయకత్వ లక్షణాలు ఉండాలి.
* హెచ్‌ఆర్‌ ఉద్యోగాలు కావాలనుకొనేవారు ధారళంగా మాట్లాడేతత్వం ఉండాలి.
అనంత యువతకు ఉద్యోగానికి దారి : విన్సెంట్‌, ఏపీఎస్‌ఎస్‌డీసీ అసోసియేట్‌ మేనేజరు
వివిధ కంపెనీలను ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ఎస్కేయూకి ఆహ్వానించే ఏర్పాటుచేసింది. విద్యార్థులు ఇంటర్వ్యూలకు హాజరై మంచి నైపుణ్యం ప్రదర్శించి ఎక్కువమంది ఉద్యోగాలు పొందాలి. నిండైన ఆత్మవిశ్వాసం తొణికిసలాడాలి. ఆంగ్లంలో కొంతవరకు స్పష్టంగా మాట్లాడాలి. కచ్చితంగా గుర్తింపుకార్డు తీసుకొని ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఇంటర్వ్యూలకు హాజరయ్యే విద్యార్థులు కచ్చితంగా ఆన్‌లైన్లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.
సాంకేతిక అంశాలపై పట్టు ఉండాలి : మానస, బీఎస్సీ
బీఎస్సీ పట్టా చేతికి రాకముందే ప్రాంగణ నియామకాల్లో ఎంపికయ్యా. ఎక్కువగా సాంకేతిక అంశాల్లో పట్టు ఉందో, లేదో కంపెనీ అభ్యర్థులు పరిశీలిస్తారు. ఆంగ్లంతో పాటు కొన్ని సరికొత్త అంశాలపై అవగాహన ఉంటే ఉద్యోగం సులభంగా సాధించవచ్చు. భయం, బిడియం వీడాలి. తెలిసిన అంశాలను సూటిగా, స్పష్టంగా, నిజాయితీగా చెప్పాలి.

Posted on 07-05-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning