ఐటీకి కొత్త జోష్‌

* మరో 11 ఐటీ పార్కుల ఏర్పాటు
* ఐటీఐఆర్‌ ఆలస్యమైనా అభివృద్ధి ఆగకూడదనే..
* తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం
* ఒక్కో పార్కుకు కనీసం 50 ఎకరాలు

ఈనాడు - హైదరాబాద్‌: యూపీఏ హయాంలో భారీగా ఆశలు కల్పించి... నత్తనడకన సాగుతున్న ప్రతిష్ఠాత్మక ఐటీఐఆర్‌ (ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌) వచ్చినా రాకున్నా ఐటీ అభివృద్ధి ఆగకూడదని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మరో 11 ఐటీపార్కులకు రంగం సిద్ధం చేస్తోంది. ఒక్కో ఐటీ పార్కు కోసం కనీసం 50 ఎకరాలకు తక్కువ కాకుండా భూసేకరణను వేగవంతం చేసినట్లు సమాచారం. ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు, ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ బాధ్యులు మహమూద్‌ అలీల సారథ్యంలో ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌ శివార్లలోని బాహ్యవలయ రహదారిని ఆనుకొని ఉన్న గ్రోత్‌ కారిడార్‌లో ఈ కొత్త పార్కులు రాబోతున్నాయి. ఏప్రిల్‌ 4న ఐటీ విధాన ప్రకటన సందర్భంగా పలు కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. వారిలో చాలామందికి భూములు కేటాయించాల్సి ఉంటుంది. ఇందుకోసం జూన్‌ 2కల్లా భూములు సిద్ధం చేయాలని ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఉన్న సుమారు 30కిపైగా ఐటీ పార్కులకు ఇవి అదనం. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలంలోని బుద్వేల్‌ పరిధిలో పర్యాటక శాఖ, హెచ్‌ఎండీఏ, వీడీవోటీసీ, వాలంతరి భూములు కొన్నింటిని గుర్తించారు. పర్యాటక శాఖకు చెందిన దాదాపు 84 ఎకరాలను ప్రభుత్వానికి ఇవ్వడానికి సూత్రప్రాయంగా నిర్ణయించారు. హెచ్‌ఎండీఏ తదితర శాఖలకు సంబంధించిన భూముల్లో ఏమైనా ఇబ్బందులున్నాయేమో చూసి వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని మంత్రులు అధికారులను ఆదేశించారు.
ఐటీఐఆర్‌పై ఆలస్యం
వేల కోట్ల నిధులతో, లక్షల ఉద్యోగాలు కల్పిస్తారని ఆశలు కల్పించిన ఐటీఐఆర్‌ ద్వారా రాష్ట్రానికి పెద్దగా ఒనగూరేది ఏమీ ఉండకపోవచ్చని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటిదాకా దీనిపై అడుగు ముందుకు పడకపోవడం అనుమానాలను రేకెత్తిస్తోంది. యూపీఏ ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం పునఃపరిశీలిస్తోంది. అందుకు అనుగుణంగా ఆయా రాష్ట్రాలను ప్రతిపాదనలు మార్చి పంపాలని కూడా కోరారు. కొద్దిరోజుల కిందటే దీనిపై దిల్లీలో సమీక్ష నిర్వహించారు. ఇవన్నీ ఎలా ఉన్నా ఐటీఐఆర్‌కు కేంద్రం నుంచి ఇప్పట్లో ఆమోదం ఇప్పట్లో వచ్చేలా లేదని అధికారవర్గాలు భావిస్తున్నాయి. ‘‘యూపీఏ ప్రవేశపెట్టిన ఐటీఐఆర్‌ ప్రాజెక్టులోనే అనేక లోపాలున్నాయి. పైగా ఈ ప్రాజెక్టుతో రాష్ట్ర ప్రభుత్వానికి నయాపైసా కూడా కేంద్రం నుంచి రాదు. పేరుకే భారీగా నిధులు కన్పిస్తున్నాయంతే. చూపిన నిధుల మేరకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు పనులు చేస్తాయి. వాటిలోనూ తొలిదశ పనుల్లో అనేక కొర్రీలు పెట్టారు’’ అని ప్రభుత్వ అధికారి ఒకరు పెదవి విరిచారు. అయితే ఐటీఐఆర్‌పై ఇంకా ఆశాభావంతోనే ఉన్నామని తెలంగాణ ఐటీశాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్‌ వ్యాఖ్యానించడం గమనార్హం. ‘‘ఐటీఐఆర్‌ ఆలస్యమైనా రాష్ట్రంలో ఐటీ రంగ అభివృద్ధి ఆగకూడదని మంత్రి కేటీఆర్‌ భావిస్తున్నారు. అందుకే కొత్త పార్కుల కోసం ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. ఐటీ విధాన ప్రకటన రోజు ఒప్పందాలు జరిగినవారికి భూముల్ని ఇవ్వాలనుకుంటున్నాం. మిగిలిన భూమి భూనిధిలో ఉంటుంది. భవిష్యత్‌ అవసరాలకు వాడుకుంటాం’’ అని జయేశ్‌రంజన్‌ వివరించారు.

Posted on 13-05-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning