సివిల్స్‌... స్థైర్యానికీ పరీక్షే!

సుదీర్ఘకాలం విస్తృతమైన, లోతైన అధ్యయనం అవసరమయ్యే పరీక్ష సివిల్స్‌. ఓటమీ, నిరాశా ఎదురైనా తట్టుకునే మనోబలం ఉన్నవారే అంతిమంగా లక్ష్యం సాధించగలుగుతారు. ఓరిమితో అవరోధాలను తట్టుకోవాలి; స్థిర సంకల్పంతో ముందుకు సాగాలి. సివిల్స్‌ పయనం నేర్పే విలువైన పాఠమిది!
దరిచేరని నిరుత్సాహం
నాలుగేళ్ళ కష్టం చేకూరి కీర్తిని తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దక్షిణ భారతదేశంలో టాపర్‌గా నిలిపింది. అఖిలభారత స్థాయిలో 14వ ర్యాంకు సాధించారామె. మొదటి రెండు ప్రయత్నాల్లో ఆశించిన ర్యాంకు రానపుడు తాను నిరాశను ఎలా అధిగమించినదీ ఆమె వివరిస్తున్నారు...
మొదటిసారి సివిల్స్‌ పరీక్ష రాస్తే 440 ర్యాంకు వచ్చింది. రెండోసారీ ర్యాంకు విషయంలో మరింత నిరాశ. 512 ర్యాంకు! ఓ పక్క ఐఆర్‌ఎస్‌ శిక్షణ... మరో పక్క సివిల్స్‌కు తయారీ. శిక్షణలో భాగంగా దేశవిదేశాలు తిరగాల్సివచ్చింది. చదవటానికి గంట సమయం కూడా చిక్కేది కాదు. ఇలాంటి క్లిష్ట సమయంలో నాకు నేను ప్రేరణ పొందటానికి చాలా కష్టపడ్డాను.
సివిల్స్‌ లాంటి పరీక్షల్లో ఏకాగ్రత దెబ్బతినకుండా ఉండటం చాలా ముఖ్యం. విఫలమైన ప్రతిసారీ సాధించాలనే కసి పుట్టిందే తప్ప నిరుత్సాహం దరి చేరలేదు. ఆ కృషి ఫలితంగానే మూడోసారి 14వ ర్యాంకు లభించింది!
భావోద్వేగపరమైన మద్దతు సివిల్స్‌ పరీక్షకు చాలా అవసరం. పరీక్షను ఎదుర్కొనే విషయంలో ఎప్పుడైనా మీకు అసంతృప్తి కలగవచ్చు. అభద్రత ఏర్పడవచ్చు. ఈ సందర్భంలో తల్లిదండ్రుల, మార్గదర్శకుల సలహాలు, సూచనలు తీసుకోవటం చాలా మేలు చేస్తుంది. ఈ విషయంలో నా తల్లిదండ్రులు నాకు పెద్ద ఆసరాగా నిలిచారు. వారు మనకేమీ బోధించనక్కర్లేదు; వారు మనతో ఉన్నారనే భావన పెద్ద భరోసాను అందిస్తుంది.
నా అనుభవంతో చెప్పగలిగేదేమిటంటే... పరీక్ష గురించి మొదట ప్రతి అభ్యర్థీ తగిన అవగాహన ఏర్పరచుకోవాలి. నెట్‌లో సమాచారం ఎంత లభిస్తున్నప్పటికీ వృత్తినిపుణుల సలహా ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది. 2012లో మా నాన్నగారితో పాటు బ్రెయిన్‌ట్రీ గోపాలకృష్ణ దగ్గరకు వెళ్ళి పరీక్ష కీలకాంశాలను గ్రహించి, ముందడుగు వేశా. నాది ఐఐటీ నేపథ్యం కాబట్టి నా సబ్జెక్టునే ఆప్షనల్‌గా తీసుకోవాలనుకున్నాను. కానీ హ్యుమానిటీస్‌నే ఎంచుకోవాలన్న సూచనను అంగీకరించటానికి కొంత సమయం పట్టింది. ఇది సరైన నిర్ణయమేనని గ్రహించాను. ఈ రకంగా ఆప్షనల్స్‌ ఎంపికలో నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ఇతర పరీక్షల్లాంటిది కాదు సివిల్స్‌. ఇది విభిన్నం. ఇతర పరీక్షలు నిర్దిష్ట అంశాల్లో మన పరిజ్ఞానాన్ని పరీక్షిస్తే... సివిల్స్‌ వైవిధ్యమైన ఎన్నో అంశాల్లో మన జ్ఞానాన్ని పరీక్షిస్తుంది. అందుకే దీన్ని మనం చూసే దృష్టి కూడా విభిన్నంగా ఉండాలి.
సివిల్స్‌లో నెగ్గాలంటే... తప్పనిసరిగా ఎన్ని గంటలు చదవాల్సివుంటుందని చాలామంది నన్ను అడిగారు. మొదట్లో నేనూ ఈ గంటల లెక్కను పట్టించుకునేదాన్ని. సన్నద్ధత కొనసాగుతున్నపుడు ఎన్ని గంటలు చదవామన్నది కాదు, ఆ సమయంలో ఎంత నేర్చుకున్నావన్నది ముఖ్యమని నాకు అర్థమైంది. ఫలానా గంటలు చదవటం అనేది వ్యక్తుల సామర్థ్యానికీ, ఎంపికకూ సంబంధించినది. దాన్ని ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. ఈ విషయంలో కచ్చితమైన కొలతలేమీ ఉండవు.
ప్రిలిమినరీని చాలామంది అభ్యర్థులు నిర్లక్ష్యం చేస్తుంటారు. ‘ఆబ్జెక్టివ్‌ పేపరే కదా, తేలిగ్గానే పాసవ్వచ్చు’ అనే ధోరణితో ఉంటారు. అయితే వారనుకున్నంత సులువేమీ కాదు, ప్రిలిమ్స్‌. నా విషయానికొస్తే... కటాఫ్‌ కంటే రెండు మార్కులు మాత్రమే ఎక్కువ తెచ్చుకున్నా. ఇదెంత ప్రమాదకరమో చూడండి. పైగా దీనిలో అర్హత పొందే మార్కుల సంఖ్య పెరుగుతూవస్తోంది. అందుకే ప్రిలిమ్స్‌కూ, మెయిన్స్‌కూ ఏకకాలంలో సన్నద్ధత కొనసాగించటంతో పాటు ప్రిలిమ్స్‌లో ఎక్కువ మార్కులు తెచ్చుకునే లక్ష్యం పెట్టుకోవాలి.
మెయిన్‌ పరీక్షలో ఎస్సేను నిర్లక్ష్యం చేయకూడదు. ఎస్సే మార్కులు మొత్తం మీ ఉత్తీర్ణత అవకాశాలనే ప్రభావితం చేసేంత కీలకంగా మారుతుంది.
మెయిన్స్‌ పరీక్ష అంటే మూడు గంటల్లో విభిన్నమైన అంశాలపై జవాబులు రాయటం. ఈ వ్యవధిలో 20 నుంచి 25 ప్రశ్నలకు సమాధానాలను రాయాల్సివుంటుంది. సమగ్రంగా జవాబులు రాసేలా సాధన చేయగలిగితే ఇదంతా సమర్థంగా చేయవచ్చు.
పెద్దలు గానీ, అధ్యాపకులు గానీ మన పరిజ్ఞానంలో, విశ్లేషణలో లోపాలు ఎంచితే వారు మనకు సాయం చేయటానికే అలా చేస్తున్నారని గ్రహించాలి. అలాంటివారిని దూరం చేసుకోకూడదు. సివిల్స్‌లో నిర్మాణాత్మకమైన విమర్శ చాలా ప్రధానం!
సన్నద్ధతలో ఆన్‌లైన్‌ ఆసరా
ఒక పక్క జర్నలిజంలో పరిశోధన చేస్తూ మరోపక్క ఆన్‌లైన్‌ సన్నద్ధతకు ప్రాధాన్యమిచ్చి సివిల్‌సర్వీసెస్‌లో 270వ ర్యాంకు సాధించారు బండ్ల దినేష్‌ ఆదిత్య. వరస వైఫల్యాలను తట్టుకుని, ఎలా సర్వీసు సాధించినదీ ఇలా వివరిస్తున్నారు..
అమ్మానాన్నలు సివిల్స్‌ అధికారులే. వారి స్ఫూర్తితో పరీక్షకు సిద్ధమై 2010లో సివిల్స్‌ రాశాను. సివిల్స్‌ ప్రయత్నాలు కొనసాగిస్తూనే 2012లో ఎస్‌బీఐ పీఓ పోస్టుకు ఎంపికయ్యాను. సంగారెడ్డిలో 8 నెలల పాటు ఉద్యోగం చేశా. లక్ష్యానికి అవరోధమని భావించి, ఉద్యోగానికి రాజీనామా చేశాను. సివిల్స్‌ సన్నద్ధత కొనసాగిస్తూనే ఎంసీజే చేశాను.
ఆంత్రొపాలజీ ఆప్షనల్‌గా ఎంచుకుని ప్రొ. మునిరత్నంరెడ్డి దగ్గర శిక్షణ తీసుకున్నా. జనరల్‌స్టడీస్‌, ఎస్సేలకు ప్రత్యేకంగా కోచింగ్‌ తీసుకోలేదు. విజన్‌ ఐఏఎస్‌ ద్వారా ఆన్‌లైన్‌ టెస్టులు రాశాను.సన్నద్ధతకు కూడా ఆన్‌లైన్‌కే ప్రాధాన్యమిచ్చా. ఇన్‌సైట్స్‌ ఆన్‌ ఇండియా వెబ్‌సైట్‌ బాగా ఉపకరించింది. అవసరమైన సమాచారాన్ని కంప్యూటర్లో పీడీఎఫ్‌ ఫైల్స్‌లో భద్రపరుచుకునేవాణ్ణి.
2010, 2011లో సివిల్స్‌ మెయిన్స్‌ రాసినా ఇంటర్వ్యూ దాకా చేరుకోలేకపోయా. 2013లో ఇంటర్వ్యూ వరకూ వెళ్లినా ఒక్క మార్కుతో సర్వీసు చేజారింది. 2014లో అనూహ్యంగా గట్టి ఎదురుదెబ్బే తగిలింది. ప్రిలిమ్స్‌ పరీక్షే గట్టెక్కలేకపోయా. ఆశాభంగం కలిగింది. కానీ వెంటనే తేరుకున్నాను. అప్పటికే ఉస్మానియా జర్నలిజం శాఖలో జేఆర్‌ఎఫ్‌కు ఎంపికైవున్నా. వెంటనే కమ్యూనికేషన్‌ జర్నలిజం పరిశోధనలో చేరాను. అది కొంత ఉపశమనం కలిగించింది. రెట్టింపు పట్టుదలతో పూర్తిశక్తి యుక్తులను వెచ్చించి పరీక్ష రాస్తే ఐఆర్‌ఎస్‌ వచ్చింది. నాకింకా మరో అవకాశం మాత్రమే ఉంది.
ఆఖరి ప్రయత్నంగా ప్రస్తుతం ఐఏఎస్‌ సాధనకు సిద్ధమవుతున్నా. గత అనుభవాలన్నిటినీ క్రోడీకరించుకుని, సన్నద్ధత వ్యూహంలో సర్దుబాట్లు చేసుకుంటున్నా.
మొదటి ప్రయత్నంలో సివిల్స్‌ సాధిస్తే సరే. లేకుంటే మూడు నాలుగు ప్రయత్నాలు చేయాలంటే ఆర్థిక స్థోమత అవసరమవుతుంది. అందుకే ఆశావహులు తమ ఆర్థికస్థితిని మొదట బేరీజు వేసుకోవాలనేది నా సూచన!Posted on 23-05-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning