ర్యాంకు తేల్చేది ఆ లెక్కలే

ఎంబీఏ/ఎంసీఏ ఉమ్మడి ప్రవేశపరీక్ష ‘ఐసెట్‌’ రెండు తెలుగు రాష్ట్రాల్లో ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌లో మే 16నా, తెలంగాణలో మే 19నా నిర్వహించారు. నెలాఖర్లో ఫలితాలు ప్రకటించనున్నారు. ఐసెట్‌ ప్రశ్నపత్రం ఎలా ఉంది? ఏ అంశాలు ఏ తీరులో ఉన్నాయి? విశ్లేషణ ఇదిగో!
రెండు పరీక్షల్లోనూ ఐసెట్‌ ప్రశ్నల సంఖ్య 200. వ్యవధి 150 నిమిషాలు. ముందుగా ఏపీ ఐసెట్‌ పరీక్షను పరిశీలిద్దాం...
డాటా అనాలిసిస్‌: టేబుల్‌ ఆధారంగా 5 ప్రశ్నలు, వెన్‌ డయాగ్రాం ఆధారంగా ఐదు ప్రశ్నలను ఇచ్చారు. టేబుల్‌ రూపంలో ఇచ్చిన ప్రశ్నలు అర్థం చేసుకోవడానికి తేలిగ్గా ఉన్నా, ఇవి సూక్ష్మీకరించడానికి సమయం తీసుకునేవిగా ఉన్నాయి. దీంతో అభ్యర్థులు సమయం బాగా తీసుకోవలసివచ్చింది. వెన్‌ డయాగ్రాం ఆధారిత ప్రశ్నలు, అర్థం చేసుకునేందుకూ, సూక్ష్మీకరణలకు కూడా తక్కువ సమయం తీసుకున్నాయి. అందుకే నేరుగా ఈ ప్రశ్నలను ప్రయత్నించినవారికి సమయం కలిసివచ్చింది.
రీజనింగ్‌: ఈ విభాగం నుంచి 40-45 ప్రశ్నలు వచ్చాయి. దాదాపు 30-35 మేర శ్రేణి (సిరీస్‌)లో ఉన్నాయి. 18 ప్రశ్నలు అనాలజీ ఆధారంగా ఇవ్వగా, మిగతావి ఆడ్‌మన్‌ అవుట్‌ నుంచి వచ్చినవి. గణిత శ్రేణి ఆధారంగా వచ్చిన ఎనిమిది ప్రశ్నలు చాలా తేలికగా ఉన్నాయి. కోడింగ్‌-డీకోడింగ్‌ నుంచి వచ్చినవి సులువే. తెలంగాణలో నిర్వహించిన ప్రశ్నలతో పోలిస్తే ఇవి సులభం. గడియారాలు, రక్తసంబంధాలు తదితర ఆధారిత ప్రశ్నలు సైతం సులువుగా ఉన్నాయి. మొత్తంగా పరిశీలిస్తే... ఈ విభాగంలో 28 నుంచి 33 ప్రశ్నలమేర అభ్యర్థులు స్కోరు చేశారు.
గణిత సామర్థ్యం: ఈ ఏడాది పరీక్షలో అన్నిటికంటే క్లిష్టమైన విభాగం ఇదేనని చెప్పాలి. కేవలం సూత్రాల ఆధారంగా లెక్కలు చేయడం కాకుండా, వాటిని అనువర్తింపజేసేలా ప్రశ్నల రూపకల్పన జరిగింది. గతంలో ఎప్పుడూ అడగనివిధంగా ట్రిగొనామెట్రీ, మాట్రిసెస్‌ తదితర అంశాల నుంచి కొత్త విధానంలో ప్రశ్నలు రావడంతో అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు. అరిథ్‌మెటిక్‌ నుంచి 35 ప్రశ్నల్లో దాదాపు సగం (17-20) మేర క్లిష్టత స్థాయి ఉన్నవే. దీంతో ఎక్కువగా స్కోరింగ్‌ చేసుకోలేకపోయారు. స్టాటిస్టిక్స్‌, జామెట్రీ, ఆల్‌జీబ్రా అంశాల నుంచి వచ్చిన మొత్తం 40 ప్రశ్నల్లో కూడా దాదాపుగా సగం అంటే 20 కఠినంగా ఉన్నాయని చాలామంది అభ్యర్థుల అభిప్రాయం. గణిత సామర్థ్యం కేవలం సూత్రాల ఆధారంగా ప్రశ్నలకు జవాబులు కనుగొనేవారిని ఇబ్బందిపెట్టింది. సూత్రాల వెనక మర్మం అర్థం చేసుకుని, వాటిని సమయానుకూలంగా అనువర్తింపజేసినవారికి మాత్రం స్కోరింగ్‌.
కమ్యూనికేషన్‌ ఎబిలిటీ: ఇందులో పదసంపద, ఆంగ్ల వ్యాకరణం, కాంప్రహెన్షన్‌ల నుంచి ప్రశ్నలు వచ్చాయి. ఇటీవలికాలంలో తరచూ దినపత్రికల్లో వచ్చిన పదాలకు సంబంధించిన పదజాలాన్నే ఇచ్చారు. ఇటీవలికాలంలో వార్తాపత్రికల్లో కనిపించిన Amnestyకి సమానార్థకం అడిగారు. ఫిల్‌ ఇన్‌ ద బ్లాంక్స్‌ సైతం గ్రామర్‌ ఆధారంగా కాకుండా పదసంపద ఆధారంగానే వచ్చినవి కాబట్టి ఇవి తేలిగ్గానే ఉన్నాయి.
కమ్యూనికేషన్‌ ఎబిలిటీలో మొత్తం క్లిష్టంగా ఉండేది- రీడింగ్‌ కాంప్రహెన్షన్‌. మొత్తం మూడింటిని ఇచ్చారు. ఒక్కోదానికి 5 చొప్పున 15 ప్రశ్నలు వచ్చాయి. రెండు ప్యాసేజిలు అర్థం చేసుకునేందుకు చాలా తేలికగా ఉన్నాయని చెప్పొచ్చు. ఒకటి మాత్రమే కొంత ఇబ్బందిపెట్టింది. మొత్తంగా ఇంగ్లిష్‌లో క్లిష్టమైనది ఇదే. కంప్యూటర్‌, వ్యాపార పద సంపద అంశంలో వచ్చిన ప్రశ్నలు సైతం, అంత క్లిష్టంగా లేవు.
గణితం మినహా మిగతావన్నీ స్కోరింగ్‌కు అనుకూలించేలాగా ఉన్నాయి.
తెలంగాణ ఐసెట్‌
డాటా సఫిషియన్సీ: ఏపీ ప్రశ్నపత్రానికి భిన్నంగా తెలంగాణలో ఎక్కువ ప్రశ్నలు జ్యామితీయ (జామెట్రీ) అంశాల నుంచి అడిగారు. కేవలం సంఖ్యల ఆధారంగా వచ్చిన ప్రశ్నలు సైతం ఇందులో ఉన్నాయి. ఈ రెండు అంశాల నుంచే ఎక్కువ సంఖ్యలో ప్రశ్నలు డాటా సఫిషియన్సీలో ఉన్నాయి. డాటా అనాలిసిస్‌లో మొత్తం 10 ప్రశ్నలు ఇచ్చారు. ఇందులో ఐదు టేబుల్‌ ఆధారంగా, మరో ఐదు పై చార్ట్‌ ఆధారంగా వచ్చినవి. తేలిగ్గా ఉండటంతో ప్రశ్నలన్నిటినీ చాలామంది ప్రయత్నించారు. సూక్ష్మీకరణలకు కూడా ఇది ఎక్కువగా అవకాశం ఇవ్వకపోవడం, అర్థం చేసుకోవడానికి సులువుగా ఉండటంతో స్కోరింగ్‌గా భావించారు.
రీజనింగ్‌: ఇందులో కోడింగ్‌-డీకోడింగ్‌, సమయం, ఆరెంజ్‌మెంట్‌ అంశాల నుంచి ప్రశ్నలు అడిగారు. కోడింగ్‌-డీకోడింగ్‌లో (3n+2/26) ఆధారంగా వచ్చిన ఐదు ప్రశ్నలను అర్థం చేసుకోలేక వదిలివేశారు చాలామంది. అయితే ఈ అంశాన్ని అర్థం చేసుకున్నవారికి ఇది చాలా స్కోరింగ్‌గా మారుతుంది. ఇవి మినహా రీజనింగ్‌లో మిగతా అన్ని విభాగాల ప్రశ్నలు తేలిగ్గా ఉన్నాయి.
గణిత సామర్థ్యం: మొత్తం ఐసెట్‌లో ఇదే క్లిష్టమైన అంశమని చెప్పొచ్చు. ప్రశ్నలను అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు లేకపోయినా, సూక్ష్మీకరణాలకు ఎక్కువ సమయం వెచ్చించాల్సివచ్చింది. దీంతో ఒక్కో ప్రశ్నకు ఎక్కువ సమయం వెచ్చించడంతో మొత్తం స్కోరింగ్‌ తగ్గింది. సూక్ష్మీకరణలు తక్కువ అవసరమైన లెక్కలకు మాత్రం సూత్రాల ఆధారంగా కాకుండా వాటి అనువర్తనాల ఆధారంగా ఇచ్చారు. దీంతో క్లిష్టత ఉందని చెప్పొచ్చు.
కమ్యూనికేషన్‌ ఎబిలిటీకి సంబంధించినంతవరకూ పదసంపద అంశంలో ప్రశ్నలు సులువుగానే ఉన్నాయి. సాధారణ పరిభాషలో వాడిన పదాలు కాకుండా కొంచెం క్లిష్టమైనవే అడిగారు. గ్రామర్‌ నుంచి వచ్చిన 15 ప్రశ్నలు కూడా సులభం, స్కోరింగ్‌కు అనుకూలం. కాంప్రహెన్షన్‌లో ఆంధ్రప్రదేశ్‌ తరహాలోనే మూడు ప్యాసేజ్‌లు, ఒక్కోదానికి అయిదు చొప్పున మొత్తం 15 ప్రశ్నలు ఇచ్చారు. ఇవి అర్థం చేసుకునేలా ఉండటంతోపాటు ప్రశ్నలు కూడా తికమక లేకుండా నేరుగా ఉన్నాయి. ఇది కూడా స్కోరింగ్‌గా ఉందని చెప్పవచ్చు.
కంప్యూటర్‌, బిజినెస్‌ టెర్మినాలజీ: బిజినెస్‌ టెర్మినాలజీ ప్రశ్నలు సులభంగా ఉన్నాయి. వ్యాపారపరంగా లభించే కంప్యూటర్‌ ఏదంటూ అడిగారు. ఐఎస్‌పీ ఏమిటంటూ అడిగారు. లోతైన పదసంపద జోలికి పోలేదు. బిజినెస్‌ కమ్యూనికేషన్లో కూడా ఇదే ఒరవడి సాగింది.
క్లిష్టమైనవీ, సులువైనవీ
ఆంధ్రప్రదేశ్‌ ఐసెట్‌
* డేటా సఫిషియన్సీ నుంచి వచ్చిన 20 ప్రశ్నల్లో దాదాపు 8 కఠినంగా ఉన్నాయి. 6 ప్రశ్నలు ఒకింత కఠినంగా, మిగతా 6 సులువుగా ఉన్నాయి.
* రీజనింగ్‌లోని 40 ప్రశ్నల్లో క్లిష్టమైనవి దాదాపు 10. కొంచెం కఠినంగా ఉన్నవి 15, మిగతా 15 తేలికవి.
* గణిత సామర్థ్యం ఆధారంగా వచ్చిన ప్రశ్నలు 75. దాదాపు 40 క్లిష్టంగా, 16 తేలిగ్గా ఉన్నాయి. మిగతా 19 కొంచెం క్లిష్టం. ఈ విభాగంలో స్కోర్‌ సాధించినవారు మంచి ర్యాంకును ఆశించవచ్చు.
* కమ్యూనికేషన్‌ ఎబిలిటీలో 50 ప్రశ్నల్లో తేలికగా 25 నుంచి 35 మార్కులు తెచ్చుకోవచ్చు. కాంప్రహెన్షన్లో 8 మార్కులు సాధించేలా ఉన్నాయన్నది చాలామంది అభ్యర్థుల అభిప్రాయం.
తెలంగాణ ఐసెట్‌
* డాటా సఫిషియన్సీలోని 20 ప్రశ్నల్లో 8 క్లిష్టం, మరో 8 తేలిగ్గా ఉన్నాయని, 4 కొంచెం క్లిష్టంగా ఉన్నాయని చాలామంది విద్యార్థుల అభిప్రాయం.
* రీజనింగ్‌లోని 45 ప్రశ్నల్లో దాదాపు 15 కఠినంగా, మరో 15 తేలిగ్గా వచ్చాయి. ఇంకో 10 ప్రశ్నలు ఒకింత కఠినం. ముఖ్యంగా ఈ విభాగంలోనే కోడింగ్‌-డీకోడింగ్‌లో ఆధార ప్రశ్నలు అసలు అర్థం చేసుకోలేకపోయినట్లు విద్యార్థులు చెప్పారు. గణిత సామర్థ్యంలో మొత్తం 75 ప్రశ్నలకు దాదాపు 35 ప్రశ్నలు కఠినంగా, 25 తేలికగా ఉండగా మరో 15 ఒకింత క్లిష్టంగా ఉన్నట్లు విద్యార్థుల అభిప్రాయం.
* కమ్యూనికేషన్‌ ఎబిలిటీలో దాదాపు 30 ప్రశ్నలు తేలిగ్గా ఉన్నాయి. ముఖ్యంగా కాంప్రహెన్షన్‌ అభ్యర్థులను అంతగా ఇబ్బంది పెట్టలేదు.Posted on 25-05-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning