విజయం వైపు... కొత్త శక్తుల కూర్పు

* ఉద్యోగాల సాధనలో నైపుణ్యాలదే పైచేయి
* ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ముందడుగేయాలి

* నిపుణుల కొరత ఓ అవకాశంగా తీసుకోవాలి

ఇంజినీరింగ్ పూర్తయ్యేనాటికే కొలువు చేజిక్కించుకోవాలని నేటి విద్యార్థులు ఎంతో తపిస్తుంటారు... ఐదంకెల జీతం.. మంచి జీవితం గురించి కలలు కంటుంటారు... కంపెనీలు తమ క్యాంపస్ తలుపు తట్టేసరికి అందరిలోనూ ఒకటే ఆందోళన... మేం ఎంపికవుతామా లేదా అని మథనపడతారు... ఇంజినీరింగ్ పూర్తిచేసినవారిలో చివరికి కేవలం 20 శాతం మంది మాత్రమే ఎంపికవుతున్నారు... మిగిలివారందరికీ నిరాశే!!

అయితే ఆ నిరాశలో జీవితం కొట్టుకుపోకుండా ఉండాలంటే ముందే మేల్కొనాలి... కొత్త శక్తులు సమకూర్చుకోవడంపై దృష్టిపెట్టడంలేదు... రానున్న కాలంలో నైపుణ్యం కలిగిన కార్మికశక్తి లోటు దేశంలో తీవ్రంగా ఉండబోతోంది... దీన్ని పూరించాలంటే మన ప్రతిభకు సానపెట్టుకోవాలి... అవకాశాన్ని చేజిక్కించుకోవాలి... విరామమెరుగక పరిశ్రమిస్తూ ముందడుగు వేయాలి...
     నిన్నమొన్నటి వరకూ ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని వణికించడంతో ప్రాంగణ ఎంపికలు చేపట్టేందుకు పలు కంపెనీలు కాస్త వెనుకంజ వేశాయి. అయితే ఇప్పుడు మళ్లీ కంపెనీలు ఒక్కొక్కటిగా ఉద్యోగాల భర్తీపై దృష్టిపెడుతున్నాయి. నిపుణత లేకపోయినా గతంలో అభ్యర్థులను ఎంపిక చేసుకున్న కంపెనీలు ప్రస్తుతం పక్కాగా వ్యవహరిస్తున్నాయి. ఎన్నెన్నో వడపోత పద్ధతులను సిద్ధం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అన్ని రకాల నైపుణ్యాల ఉన్నవారే ఉద్యోగాలు పొందగలుగుతారని నిపుణులు చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగా అభ్యర్థులు తమనుతాము మలచుకుంటేనే చక్కని భవిత సాకారమవుతుంది.
కొలువు సాధనలో అడ్డంకులివీ..
     ఇంజినీరింగ్ కళాశాలల్లోకి ఏటా సుమారు 2లక్షల‌ మంది విద్యార్థులు చేరుతున్నారు. వీరిలో 75 శాతం మంది గ్రామీణ ప్రాంతాలు వారే కావడంతో ఆంగ్ల భాషా నైపుణ్యాలపై అవగాహన కొరవడుతుందని నిపుణుల అభిప్రాయం. ఈ కారణంగా ప్రాంగణ ఎంపికల్లో ఉద్యోగాల్లో చేరుతున్నవారు కేవలం 23 శాతం మంది మాత్రమే ఉంటున్నారు. మిగిలిన 77 శాతంలో 7 శాతం మంది పీజీ కోర్సులకు వెళ్తున్నారు. ఇక బోధనా రంగం, ఇతర కొలువుల్లో చేరుతున్నవారు 23 శాతం మంది ఉంటున్నారు. ఇక రూ.2వేల నుంచి రూ.6వేల జీతంతో చిరుద్యోగులుగా మిగిలినపోతున్నవారు 47 శాతం మంది ఇంజినీర్లు ఉండటం విశేషం.

ప్రాంగణ ఎంపిక విధానం ఇలా
* ప్రాంగణ ఎంపికలకు మొదటగా కళాశాలల్లో క్యాంపస్ కనెక్టు ద్వారా నిర్వహించిన పలు పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు.
* రెండో దశలో ఆంగ్ల భాషపై అభ్యర్థికి ఉన్న సామర్థ్యాన్ని అంచనా వేసేలా పరీక్ష నిర్వహిస్తారు. దీన్ని అధిగమించాలంటే భావ వ్యక్తీకరణ నైపుణ్యాలపై దృష్టి పెట్టాలి.
* మూడో దశలో ఆన్‌లైన్ పరీక్షలో భాగంగా క్వాంటిటేటివ్ అనాలసిస్, రీజనింగ్, క్రిటికల్ రీజనింగ్ తదితర అంశాలపై నిర్వహిస్తారు. అందులో కొంతమందిని ఎంపికచేసి, వారిని మౌఖిక పరీక్షలకు పంపుతారు.
* మౌఖిక పరీక్షల్లో భాగంగా టెక్నికల్ రౌండును నిర్వహిస్తారు. ఇందులో ప్రోగ్రామ్ చేయడంతో పాటు అభ్యర్థిలో సాంకేతిక పరిజ్ఞానం ఏస్థాయిలో ఉందో అంచనా వేసే పరీక్షలను నిర్వహిస్తారు.
* తరువాత మేనేజ్‌మెంటు రౌండు. ఇందులో సైకోమెట్రిక్ టెస్ట్‌ను నిర్వహిస్తారు. సమస్యలు వచ్చినప్పుడు అభ్యర్థి ఎలా స్పందిస్తాడు? నాయకత్వ లక్షణాలు తదితర అంశాల పరిశీలన దీని ఉద్దేశం.
* అనంతరం హెచ్ఆర్ రౌండు. ఇందులో అభ్యర్థి వైఖరి, హుందాతనం, డ్రెస్ కోడ్ తదితర అంశాలను పరిశీలిస్తారు.
ఇలా చేస్తే విజయం మీదే!
* క్యాంపస్ కనెక్టు పేరుతో నిర్వహించే కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొనాలి. ప్రావీణ్యం కనబరచాలి.
* ఆంగ్ల పరీక్షను విద్యార్థులు కష్టంగా భావిస్తున్నారు. కానీ మొదటినుంచీ ఆసక్తితో సాధన చేస్తే అదేమీ కష్టం కాదన్నది నిపుణుల మాట. ఆంగ్లంలో వ్యాకరణంతో సహా పట్టు కోసం సాధన చేయాలి.
* క్వాంటిటేటివ్ అనాలసిస్‌లో విద్యార్థులుగా నిలవాలంటే ఆప్టిట్యూడ్‌పై పట్టు సాధించాలి. రీజనింగ్, లాజికల్ థింకింగ్, క్రిటికల్ రీజనింగ్‌కు సంబంధించిన పుస్తకాలను చదవాలి. సమయం తక్కువగా ఉంటుంది కనుక షార్ట్‌కట్ పద్ధతులను సాధన చేయాలి. మోడల్ పేపర్లను అభ్యసన చేయాలి.
* టెక్నికల్ రౌండు విద్యార్థుల సాంకేతిక పరిజ్ఞానాన్ని పరీక్షిస్తుంది. ఈ రౌండులో విజేతులగా నిలవాలంటే సి, సి++, జావా వంటి పరిభాషలపై పట్టు సాధించాలి. వీటిలో ప్రోగ్రామ్‌ల సాధన అవసరం.
* మేనేజ్‌మెంటు రౌండులో విజయం సాధించాలంటే కళాశాలల్లో జరిగే కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనాలి. ముఖ్యంగా బృందంతో కలవడం, బృంద చర్చల్లో పాల్గొనడం, ఇతరులకు అభిప్రాయాలను తెలియజేయడం, ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం వంటివి అలవర్చుకోవాలి. వీటి వల్ల ఓపిక, సహనం అలవడతాయి.
* హుందాతనం, పాజిటివ్ దృక్పథం వంటివి అలవాటుగా మారితే హెచ్ఆర్ రౌండ్లో విజయం మీదే. నైపుణ్యాలు పెంచుకునేందుకు కళాశాలల్లోని ప్లేస్‌మెంటు సెల్‌ను ఉపయోగించుకోవాలి. ఒత్తిడిని అధిగమించే ప్రక్రియలను సాధన చేయాలి. వస్త్రధారణ పద్ధతులను కూడా ముందు నుంచీ అలవర్చుకోవాలి.
ఎంపికల్లో నిర్వహించే పరీక్షలో 60 శాతం వరకూ
     ముఖ్యంగా ప్రాజెక్టు వర్క్‌పై విద్యార్థులు దృష్టి సారిస్తే.. ప్రాంగణ ఎంపికల్లో నిర్వహించే పరీక్షలో 60 శాతం వరకూ అర్హత సాధించే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు ప్రాజెక్టు వర్కును సొంతంగా కాకుండా.. అంగట్లో లభ్యమయ్యే వాటిని తీసుకుని ప్రజెంటు చేస్తున్నారు. దీంతో విద్యార్థిలోని సృజనాత్మక కరవవుతుంది. అలాగే కళాశాలల్లో జరిగే ప్రతి వర్కు షాపుల్లో పాల్గొంటే ప్రయోజనం ఉంటుంది.
సాంకేతిక పరిజ్ఞానం అవసరం
     ముఖ్యంగా ప్రతి విద్యార్థీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒడిసి పట్టుకోవాలి. అవకాశాలను తెలుసుకోవాలి. కళాశాలల్లో ఇస్తున్న ఆయా నైపుణ్యాలపై పూర్తిస్థాయి శిక్షణ తీసుకోవాలి. మారుతున్న సాంకేతిక అవసరాలు, విస్తృతమవుతున్న శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులు అవగాహన పొందేందుకు అంతర్జాలంపై పట్టు సాధించాలి. ప్రస్తుతం ప్రాంగణ ఎంపికలు నిర్వహిస్తున్న సంస్థలు వ్యూహాత్మకంగా వ్యవహరించడం వల్ల విద్యార్థులు అన్ని నైపుణ్యాలపై దృష్టి పెట్టాలి.
 • Industry      Interaction

  Higher Education

  Job Skills

  Soft Skills

  Comm. English

  Mock Test

  E-learning