డిజిటల్‌ నిపుణలేరీ?

* నైపుణ్యాలు-పరిశ్రమ అవసరాల మధ్య పెరుగుతున్న వ్యత్యాసం
* ఆటోమేటెడ్‌ టూల్స్‌తో సంప్రదాయ ఉద్యోగాలకు గండి
* ఒకేసారి నియామకాలకు కంపెనీల స్వస్తి

ఈనాడు - హైదరాబాద్‌: డిజిటల్‌ టెక్నాలజీలతో సమాచార సాంకేతిక పరిజ్ఞాన (ఐటీ) రంగం తదుపరి దశకు (వెర్షన్‌ 2.0) చేరింది. అంతర్జాతీయంగా అనేక మార్పులు వస్తున్నాయి. ఆటోమేటెడ్‌ టూల్స్‌ అందుబాటులోకి వస్తున్నాయి. 20 మంది ఆరు నెలల్లో చేసే ప్రాజెక్టును ఇప్పుడు ఇద్దరు నిపుణులు నెల రోజుల్లో పూర్తి చేస్తున్నారు. ఇ-బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ వినియోగం గణనీయంగా పెరగడంతో, కొన్ని దేశాల్లో పెద్ద, పెద్ద బ్యాంకులు శాఖలను మూసి వేస్తున్నాయి. బ్యాంకింగ్‌ లావాదేవీలన్నీ వర్చ్యువల్‌గానే జరుగుతున్నాయి. ఈ తరహా వర్చ్యువల్‌ రియాలిటీ మరిన్ని రంగాలకు విస్తరించనుంది. అయితే.. ఇందుకు భిన్నంగా డిజిటల్‌ నిపుణుల లభ్యత ఉంది.
దేశంలో ఏటా లక్షలమంది విద్యార్థులు ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణత సాధిస్తున్నా, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు వారిలో ఉండడం లేదు. ఐటీ రంగంలోని సంప్రదాయ ఉద్యోగాలకే విద్యార్థుల నైపుణ్యాలు సరిపోవడం లేదు. పరిశ్రమ అవసరాలు మాత్రం వేగంగా మారిపోతున్నాయి. సైబర్‌ సెక్యూరిటీ, డేటా విశ్లేషణ వంటి డిజిటల్‌ టెక్నాలజీలలో నిపుణులకు లెక్కలు, స్టాటిస్టిక్స్‌ వంటి అంశాల్లో చాలా పట్టు ఉండాలి. విశ్లేషణ సామర్థ్యాలు కావాలి. డిజిటల్‌ టెక్నాలజీ ఉద్యోగాలు సంక్లిష్టంగా ఉంటాయి. ప్రస్తుతం బిగ్‌ డేటా విశ్లేషణలో వేల ఉద్యోగాలు ఉన్నప్పటికీ.. అందుకు తగ్గ ఇంజినీర్ల (డేటా సైన్స్‌ నిపుణులు) లేరు. కొరత చాలా ఎక్కువగా ఉంది. వచ్చే రెండేళ్లలో ఐటీ రంగంలో లభించే ఉద్యోగాల్లో 15-18 శాతం ఉద్యోగాలు బిగ్‌ డేటా విభాగంలోనే లభించగలవని పరిశ్రమ వర్గాల అంచనా.
సైబర్‌ సెక్యూరిటీలో..
బ్యాంకింగ్‌ లావాదేవీలు, ఇతర ఫైనాన్షియల్‌ లావాదేవీల్లో హ్యాకింగ్‌ ముప్పు పెరిగిపోతోంది. చిన్న కంపెనీల నుంచి పెద్ద కంపెనీల వరకూ అన్ని కంపెనీలు, వ్యాపార సంస్థలు సమాచార చౌర్యం భయాన్ని ఎదుర్కొంటున్నాయి. వీటిని అరికట్టడానికి పటిష్ఠమైన సైబర్‌ సెక్యూరిటీ టూల్స్‌ అభివృద్ధి చేయాల్సి ఉంది. 2025 నాటికి సైబర్‌ సెక్యూరిటీ విభాగంలో దాదాపు 10 లక్షల మంది నిపుణులు అవసరమవుతారని భావిస్తున్నారు. వచ్చే పదేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా సైబర్‌ సెక్యూరిటీ విభాగం 3,500 కోట్ల డాలర్ల(దాదాపు రూ.2.3 లక్షల కోట్లు) వ్యాపార అవకాశాలను అందించగలదని నాస్‌కామ్‌ చెబుతోంది.
ఇంజినీరింగ్‌ కళాశాలలపై కీలక బాధ్యత
ఇంజినీరింగ్‌ కళాశాలలు కొత్త తరం విద్యా ప్రమాణాలు, పరిశ్రమకు అవసరమైన టెక్నాలజీలను బోధించాలని, అప్పుడు పరిశ్రమకు - విద్యార్థుల్లోని నైపుణ్యాలకు మధ్య వ్యత్యాసం తగ్గుతుందని ఐటీ పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా ఇంజినీరింగ్‌ కాలేజీలు ఉన్నప్పటికీ.. భవిష్యత్తు అవసరాలను, టెక్నాలజీలను ముందుగా ఊహించి పరిశ్రమ సహకారంతో బోధనలో మార్పులు చేస్తున్న కళాశాలలు చాలా తక్కువగా ఉన్నాయని అంటున్నారు. కంపెనీలపై ఉత్పాదకత ఒత్తిళ్లు పెరిగిపోవడంతో, ప్రాంగణాలకు వెళ్లి ఒకే సారి విద్యార్థులను నియమించుకునే సంప్రదాయానికి కూడా కంపెనీలు స్వస్తి చెబుతున్నాయి. అవసరమైనప్పుడు (జస్ట్‌-ఇన్‌-టైమ్‌) పరిశ్రమ అవసరాలకు సిద్ధంగా ఉన్న విద్యార్థులను నియమించుకుంటున్నాయని, కంపెనీలో చేరిన మొదటి రోజు నుంచే విద్యార్థులు ప్రాజెక్టులపై పని చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఐటీ సలహాదారు జె.ఎ.చౌదరి తెలిపారు.
5 నెలల్లో తిరుపతిలో ఐఐడీటీ
ఇంజినీరింగ్‌, ఇతర విద్యార్థులకు భవిష్యత్తు తరం విద్యను అందించి, వారిలో డిజిటల్‌ టెక్నాలజీల నైపుణ్యాలను పెంచడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముందడుగు వేసింది. బిగ్‌ డేటా, సైబర్‌ సెక్యూరిటీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ), రోబోటిక్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (కృత్రిమ మేధ) వంటి డిజిటల్‌ టెక్నాలజీల్లో విద్యార్థులను నిష్ణాతులను చేయనుంది. బడా కంపెనీల సహకారంతో హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) స్థాయిలో ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజిటల్‌ టెక్నాలజీస్‌ (ఐఐడీటీ)ని తిరుపతిలో ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరు లేదా అక్టోబరు నాటికి ఇది అందుబాటులోకి రానుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో డిజిటల్‌ టెక్నాలజీలలో ఒక ఏడాది పీజీ డిప్లొమో కోర్సును ఐఐడీటీ అందిస్తుంది. కోర్సు ఫీజు దాదాపు రూ.2 లక్షలు ఉంటుంది. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేసుకుంటారు. ప్రభుత్వం మౌలిక సదుపాయాలను కల్పిస్తే ఐటీ కంపెనీలు తమ టెక్నాలజీ ల్యాబ్‌లను ప్రారంభిస్తాయి. దాదాపు రూ.200 కోట్లను దీనికి వెచ్చించనున్నారు. ముందుగా తాత్కాలిక భవనంలో ఐఐడీటీని ప్రారంభించనున్నారు. తర్వాత సొంత ప్రాంగణాన్ని ఏర్పాటు చేసుకోవడానికి స్థలం కేటాయిస్తారు. ఐఐడీటీలో రోబోటిక్స్‌, అనలిటిక్స్‌ విభాగంలో ఎక్సెలెన్స్‌ కేంద్రాన్ని టెక్‌ మహీంద్రా ఏర్పాటు చేయనుంది. సిస్కో అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ, రీసెర్చ్‌ ఎక్సెలెన్స్‌ కేంద్రాన్ని నెలకొల్పుతోంది. ఈ కేంద్రంలో సైబర్‌ సెక్యూరిటీ, స్మార్ట్‌ సిటీలు, తయారీ రంగానికి అవసరమైన అత్యాధునిక డిజిటల్‌ సొల్యూషన్ల అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తారు. వీటితోపాటు హ్యూలెట్‌ ప్యాకార్డ్‌ (హెచ్‌పీ) వంటి అగ్రశ్రేణి కంపెనీలు కూడా ఐఐడీటీలో ల్యాబ్‌లను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాయి. అంకుర సంస్థలను ప్రోత్సహించడానికి తిరుపతిలో ఇంక్యుబేటర్‌, యాసిలరేటర్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇందులో మొదటి ఏడాది 500 సీట్లు ఉంటాయి.

Posted on 29-05-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning