ఎంటెక్‌ @ రూ.లక్ష

* వార్షిక గరిష్ఠ రుసుము ఇదీ..
* కనిష్ఠం రూ.55 వేలు

ఈనాడు - హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో ఎంటెక్‌ వార్షిక రుసుము గరిష్ఠంగా రూ.లక్ష వరకు ఖరారైంది. కనిష్ఠ రుసుము (ఫీజు) రూ.55,000గా నిర్థరించారు. కళాశాలల యాజమాన్యాల నుంచి అందిన ఆదాయ, వ్యయ వివరాల్ని అనుసరించి 2016-17, 2017-18, 2018-19 విద్యా సంవత్సరాల్లో అమల్లో ఉండేలా ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (ఎ.ఎఫ్‌.ఆర్‌.సి.) ఖరారుచేసిన 229 కళాశాలల రుసుముల జాబితా రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. ఇంజినీరింగ్‌ విద్యను అందించే బీటెక్‌ కళాశాలల్లో ఇంజినీరింగ్‌ ఫీజు అధికంగా ఉన్నా.. అదే కళాశాలలో ఎంటెక్‌ కోర్సు రుసుము కనీస స్థాయిలోనే ఉంది. ఇంజినీరింగ్‌ వార్షిక రుసుము రూ.లక్ష దాటిన కళాశాలల్లోనూ ఇంచుమించు ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. వీఆర్‌ సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఎంటెక్‌ కోర్సు వార్షిక ఫీజు రూ.లక్షగా ఖరారుచేశారు. రాష్ట్రంలో లక్ష రూపాయలమేర ఫీజు ఖరారుచేసిన కళాశాల ఇదొక్కటే. రూ.90,000 నుంచి రూ.91,000 మధ్య వార్షిక రుసుము గల కళాశాలలు మూడు ఉన్నాయి. రూ.70,000 నుంచి 80వేలలోపు వార్షిక రుసుము కలిగిన కళాశాలలు 13 వరకు ఉన్నాయి. 157 కళాశాలల్లో సగటు ఫీజు రూ.57,000 వరకు ఉంది. కొద్ది కళాశాలల్లో మాత్రమే రూ.55వేల వంతున రుసుమును ఖరారుచేశారు. మిగిలిన కళాశాలల్లో రుసుము రూ.60వేల నుంచి 70వేలలోపు రుసుము ఉంది. మొత్తమ్మీద కిందటేడుతో పోలిస్తే.. రుసుముల పెరుగుదల పరిమిత కళాశాలల్లోనే పది శాతం నుంచి 15 శాతం వరకు ఉంది.
రుసుముల పెంపునకు పోటీ తక్కువ!
ఎంటెక్‌ కోర్సుల ఫీజు పెంచాలని ఏఎఫ్‌ఆర్‌సీకి వచ్చిన ప్రతిపాదనలు తక్కువగా ఉన్నట్లు తెలిసింది. రాష్ట్రంలోని అనేక కళాశాలల్లో ఎంటెక్‌ కోర్సు నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. ఈ కోర్సుల నిర్వహణకు తగినట్లు తరగతి గదులు, బోధకులు, మౌలిక సదుపాయాల కల్పన ఉండాలి. ఇవన్నీ కాగితాలపైనే ఉంటున్నాయి. ఈ కోర్సుల్లో చేరే విద్యార్థులు కొన్నిచోట్ల తరగతులకు దూరంగా ఉంటూ పరీక్షల సమయంలో వస్తున్నారు. ఖర్చు లేకుండా ఈ కోర్సును నిర్వహించేందుకు వీలు ఉండడంతో.. కొన్ని కళాశాలల యాజమాన్యాలు ఆ పరిస్థితిని అవకాశంగా మలచుకుంటున్నాయి. అందువల్లే రుసుముల పెంపు కోసం ప్రతిపాదనలు ఏఎఫ్‌ఆర్‌సీకి తక్కువగా వచ్చాయని చెబుతున్నారు. విద్యార్థుల నుంచి వచ్చే రుసుమునే పెట్టుబడిగా వాడుకుంటూ కళాశాలలు కాలం వెళ్లబుచ్చుతున్నాయి. బయోమెట్రిక్‌ ద్వారా విద్యార్థుల నుంచి హాజరు తీసుకోవాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఎంటెక్‌ కోర్సువల్లే వచ్చింది.
యాజమాన్యాల ఆవేదన!
ఇంజినీరింగ్‌ విద్యను అందించే కళాశాలల్లో కిందటేడు 220 కళాశాలల్లో వార్షిక రుసుము రూ.35వేలు మాత్రమే ఉంది. కొత్త రుసుముల కళాశాలల జాబితాలో ఈ సంఖ్య 63కు పరిమితమైంది. అధిక శాతం కళాశాలల్లో రుసుము రూ.35వేల కంటే పెరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, ఫీజు పెరిగిన కళాశాలలు నిజంగా నిబంధనలను అనుసరిస్తున్నాయా? అర్హులైన వారితో బోధన చేయిస్తున్నాయా? అన్నది చర్చనీయాశంగా మారింది. మరోవైపు.. పలు కళాశాలల యాజమాన్యాలు ‘‘కేవలం కిందటేడాదితో పోలిస్తే రూ.1000లోపు మాత్రమే రుసుము పెరిగిందని’’ ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. రూ.వంద పెరిగిన కళాశాలలు కూడా పలు ఉన్నట్లు తెలిసింది. ద్రవ్యోల్బణం పరంగా చూసినా రుసుములు ఇంకా పెరగాల్సిన అవసరం ఉందని యాజమాన్యాలు చెబుతున్నాయి.
కమిటీ ఏర్పాటు
కళాశాలల ఆదాయ వ్యయవివరాలు, ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ సంతకాలతో కూడిన పత్రాల్ని అనుసరించి ఎ.ఎఫ్‌.ఆర్‌.సి. రుసుములను ఖరారు చేసింది. అర్హులైన బోధకులు ఉన్నారా ? లేదా? అన్నది యాజమాన్యాలు ఇచ్చిన వివరాల్ని అనుసరించే పరిగణనలోనికి తీసుకున్నారు. వేతనాల చెల్లింపుల విషయంలోనూ అంతే. అయితే.. ఎప్పుడైనా అనుమానం వస్తే ప్రభుత్వం తరఫున తనిఖీ చేసేందుకు అవకాశం ఉంది. దీనికి వీలుగా త్రిసభ్య కమిటీ ఏర్పాటు కాబోతోంది.
త్వరలో ఆ కళాశాలల యాజమాన్యాలతో ఎ.ఎఫ్‌.ఆర్‌.సి. భేటీ
ఫార్మసీ కళాశాలల ఫీజులు ఇంకా ఖరారు కాలేదు. జూన్‌ 3వ తేదీ నుంచి ఈ కోర్సును అందించే కళాశాలల యాజమాన్యాలతో ఎ.ఎఫ్‌.ఆర్‌.సి. సమావేశం కానుంది. అలాగే ఇంకా ఫీజుల్ని ఖరారు చేయాల్సిన 42 ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలతోనూ ఎ.ఎఫ్‌.ఆర్‌.సి. త్వరలో భేటీ కానుంది. ఈ వివరాలన్నీ ఇంజినీరింగ్‌, ఫార్మసీ ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఆరంభం నాటికి విద్యార్థులకు అందుబాటులో ఉంచుతారు.
Posted on 31-05-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning