సత్తా చాటుతున్న తెలంగాణ ఐటీ రంగం

* రెండేళ్లలో సర్కారు స్పష్టమైన ముద్ర
హైదరాబాద్‌: ఐటీ రంగంలో హైదరాబాద్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రఖ్యాతిగాంచిన సంస్థలు నగరానికి తరలివస్తున్నాయి. ఇక్కడి వాతావరణం..అవసరమైన మానవ వనరుల లభ్యత తిరుగులేని శక్తిగా మారుస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రకటించిన ఐటీ, పారిశ్రామిక విధానం అందరినీ ఆకర్షిస్తోంది. పేరెన్నిక గల సంస్థలు ఐటీకి చిరునామాగా మార్చుకుంటున్నాయి. దిల్లీ, చెన్నై, ముంబయి, పుణె, బెంగళూరులను అధిగమిస్తూ నగరం పరుగులు పెడుతోంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌, టీసీఎస్‌, విప్రో, ఇన్ఫోసిస్‌, కాగ్నిజెంట్‌, ఒరాకిల్‌, యాక్సెంచర్‌ వంటి సంస్థలతో పాటు.. గూగుల్‌, యాపిల్‌, అమోజాన్‌ వంటి సంస్థలు ఇక్కడ అతిపెద్ద ప్రాంగణాలను నెలకొల్పాయి.
వడివడిగా అడుగులు
దేశంలో ఐటీ రంగం అభివృద్ధి 12 నుంచి 13 శాతం ఉంటే.. ఒక్క హైదరాబాద్‌ నగరమే 15 నుంచి 16 శాతానికి చేరింది. ఇప్పటికే ఇక్కడ నమోదైన ప్రముఖ సంస్థలు 1300 వరకూ ఉంటే.. అంకుర సంస్థలు వెయ్యికి పైగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానాలతో వినూత్న శైలి చూపింది. వివిధ సంస్థలకు అవసరమైన నిపుణులను తయారుచేయడంపై దృష్టిపెట్టింది. అంకుర సంస్థలను ప్రోత్సహించేందుకు టీహబ్‌ పని చేస్తుంటే.. ఐటీ నిపుణులను తీర్చిదిద్దడానికి టాస్క్‌ కృషి చేస్తోంది. వీటికి తోడు ఇంజినీరింగ్‌ కళాశాలలను కూడా శక్తిమంతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో ప్రముఖ సంస్థలు నగరంలో తమ ప్రాంగణాలను నెలకొల్పుతున్నాయి. తాజాగా యాపిల్‌ సంస్థ తన మ్యాపింగ్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు శంకుస్థాపన చేసింది. అనుకూలమైన పరిస్థితులు ఉండడం, ప్రభుత్వ తోడ్పాటు వంటివి ఆకర్షిస్తున్నాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఐటీ ఉద్యోగులకు రక్షణ కల్పించడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసి మహిళా ఉద్యోగులకు పూర్తి భద్రత కల్పిస్తోంది. షీ బృందాలను ఏర్పాటుచేసింది.. అలాగే షీ షటిల్‌ మినీ వాహనాలను పెట్టి.. హైటెక్‌సిటీ, మాదాపూర్‌, గచ్చిబౌలి, మైండ్‌స్పేస్‌ పరిసరాల్లో మహిళా ఉద్యోగులు ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని సెక్యూరిటీ కౌన్సిల్‌ పర్యవేక్షిస్తోంది. ఇలా ఉద్యోగులకు, సంస్థలకు పూర్తి రక్షణ కల్పించడం ప్రపంచ స్థాయి కంపెనీలను ఆకర్షిస్తోంది.
నిపుణులను తయారుచేస్తూ
ఇంజినీరింగ్‌ కళాశాలలకు.. ఐటీ సంస్థలకు వారధిగా ఉంటూ.. యువతకు ఉపాధి బాట వేసేందుకు టాస్క్‌ (తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌) కృషిచేస్తోంది. ఐటీతోపాటు బ్యాంకింగ్‌, సేవారంగానికి చెందిన సంస్థల్లో పనిచేసేందుకు కావల్సిన నిపుణులను తయారుచేయడంలో నిమగ్నమైంది. ఐబీఎం కెరీర్‌ ఎడ్యుకేషన్‌, సాప్‌ స్టూడెంట్‌ అకాడమీ ప్రోగ్రాంలతో భాగస్వామ్యమై పారిశ్రామిక అవసరాలమేరకు యువతను తీర్చిదిద్దుతున్నారు. అలానే హైసియాతో కలిసి ఎగ్జైట్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. పరిశ్రమల అవసరాలను ఇంజినీరింగ్‌ కళాశాలలకు చెప్పడం.. కోర్సుల్లో మార్పులు చేర్పులకు సూచనలివ్వడం వంటివీ చేస్తున్నారు. జేఎన్‌టీయూతో కలిసి ఇంజినీరింగ్‌ చదివే విద్యార్థులకు 5 వారాలపాటు ప్రతి ఏటా వేసవిలో కార్యశాల(వర్కుషాప్‌)ను నిర్వహిస్తోంది. కొత్త ఆవిష్కరణలు చేయడమెలా.. వాటికి తగిన చేయూతనందించడం వంటివి చేస్తోంది. ఇంజినీరింగ్‌ విద్య పూర్తవగానే వెంటనే ఉద్యోగ అవకాశాలు పొందేలా తోడ్పడుతోంది.
అంకుర సంస్థలకు అండ
ఆలోచనలతో రండి.. ఆవిష్కరణలతో వెళ్లండి అనే నినాదంతో అంకుర సంస్థలకు చేయూతనందిస్తోంది టీహబ్‌. గచ్చిబౌలిలోని ఐఐఐటీ క్యాంపస్‌లో 24 గంటలూ సేవలందిస్తూ అనేకమందికి సాంకేతిక, పారిశ్రామిక అభివృద్ధిని అందజేస్తోంది. గత నవంబర్‌ 5న ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా, గవర్నర్‌ నరసింహన్‌, ఐటీ శాఖమంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ఇది ప్రారంభమైంది. తెలంగాణ ప్రభుత్వం ప్రధాన భాగస్వామిగా ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌, ట్రిపుల్‌ ఐటీ హైదరాబాద్‌, నల్సార్‌ విశ్వవిద్యాలయాలతో పాటు మరికొన్ని సంస్థల సహకారంతో దీనిని ఏర్పాటుచేశారు. యువత కలల సాకార సాధనకు వూతమిచ్చేందుకు ఇది దోహదం చేస్తుంది. అంకుర సంస్థలను ఒకే గొడుగు కిందకు తెస్తుంది.. ఇందులో నిత్యం అనేక సంస్థలు అంకురార్పణ జరిగేలా కార్యకలాపాలు సాగుతున్నాయి. కొత్త పారిశ్రామిక వేత్తలకు చేయూతనందించడం, వారి వ్యాపార ప్రణాళికలను ప్రోత్సహించడం జరుగుతున్నాయి.
ఏడాదిలో ఎంతో ప్రగతి
అమెరికా తర్వాత అతి పెద్ద ప్రాంగణాన్ని గూగుల్‌ సంస్థ హైదరాబాద్‌లో ఏర్పాటుచేస్తోంది. దీనిలో 13 వేల ఉద్యోగాల కల్పన జరగనుందని అంచనా.
యాపిల్‌ సంస్థ ఇక్కడ యాపిల్‌ మ్యాప్స్‌ను అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చింది. ఇటీవల టిమ్‌కుక్‌ నగరాన్ని సందర్శించి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అలాగే ఇక్కడి జి.నారాయణమ్మ ఇంజినీరింగ్‌ కళాశాలలో ప్రత్యేకంగా ల్యాబ్‌ను ఏర్పాటుచేసి నైపుణ్య శిక్షణ ఇస్తోంది.
అమెజాన్‌ కంపెనీ మహబూబ్‌నగర్‌ జిల్లాలో పెద్ద గోదామును ఏర్పాటుచేస్తోంది. అనేక వస్తువులను వినియోగదారులకు చేరువ చేయనుంది. ఇలా దాదాపు 12 వేలకు పైగా ఉపాది పొందే అవకాశం ఉంది. ఇదే సంస్థ హైదరాబాద్‌లోనూ ఐటీ విభాగాన్ని ఏర్పాటుచేయనుంది.
డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ సింగపూర్‌(డీబీఎస్‌) తన మొట్టమొదటి గ్లోబల్‌ సాంకేతిక కేంద్రాన్ని నగరంలోనే ఏర్పాటు చేయనుంది.
సెల్‌కాన్‌ కంపెనీ సెల్‌ఫోన్ల తయారీ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఉత్పత్తి కూడా ప్రారంభించింది.
క్యాబ్‌ సర్వీసులతో పాటు రవాణా రంగంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఉబర్‌ నగరంలో పెట్టుబడులు పెడుతోంది.
పరిశ్రమలకు- ప్రభుత్వానికి వారధి
నగరంలో విస్తృతంగా ఉన్న ఐటీ సంస్థలకు, ప్రభుత్వానికి వారధిగా హైసియా(హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌) పనిచేస్తోంది. సంస్థల అవసరాలను ప్రభుత్వానికి నివేదించి మౌలిక వసతులు అందేలా కృషి చేస్తోంది. పరిశ్రమలు పెట్టడానికి హైదరాబాద్‌ అనువైన ప్రాంతమని చాటి చెప్పడంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తోంది. టిటా(తెలంగాణ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌) కూడా తోడై విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచడంతోపాటు తెలంగాణ డిజిథాన్‌ కార్యక్రమాన్ని గ్రామాలకూ చేరవేసి వారికీ ఐటీ వినియోగాన్ని చేరువచేసేందుకు ప్రణాళికలు చేపట్టింది.
గణనీయ వృద్ధిరేటు
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014-15లో ఐటీ రంగం ఎగుమతులు పెరిగాయి. దాదాపు 16 శాతం వృద్ధి రేటును సాధించింది. 2015-16కు సంబంధించి ఆర్థిక వివరాలు రానప్పటికీ ఈ వృద్ధి రేటు మరో రెండు శాతం పెరిగే అవకాశం ఉంటుందని హైసియా ప్రతినిధి రమేష్‌ లోగనాథం చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 5 లక్షల వరకు ఐటీ ఉద్యోగులున్నారు. ఏడాదికి 80 వేల మంది చొప్పున ఇక్కడ అవకాశాలను పొందుతున్నారు. ఈ సంఖ్య 2020 నాటికి 7 లక్షలు దాటుతుందని హైసియా పేర్కొంటోంది.

Posted on 02-06-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning