భారత ఐటీకి విదేశీ కేంద్రాల దన్ను

* ఎగుమతుల్లో 21% వాటా వీటిదే
* ప్రపంచంలో 50% కేంద్రాలు ఇక్కడే
* 8 లక్షల మందికి ఉపాధి

ఈనాడు - హైదరాబాద్‌: ప్రపంచ పొరుగు సేవల్లో భారత్‌ అగ్రగామిగా ఉంది. అంతర్జాతీయ పొరుగు సేవల విపణి పరిమాణంలో 56 శాతం వాటా భారత్‌దే. ఎప్పటికప్పుడు ప్రపంచ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను అభివృద్ది ´చేసుకుంటూ.. టెక్నాలజీపై భారీగా పెట్టుబడులు పెడుతూ.. దేశీయ ఐటీ పరిశ్రమ ప్రపంచంలోని అగ్రశ్రేణి బహుళజాతి కంపెనీలకు సేవలను అందిస్తోంది. ఈ నేపథ్యంలో వ్యయ నియంత్రణ, పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాల విస్తరణ, రిస్క్‌ను తగ్గించుకోవడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని విదేశీ కంపెనీలే తమ సొంత అవసరాల కోసం (ఐటీ సేవల డెలివరీ మొదలైన సేవలు) సొంత కేంద్రాలను (క్యాపిటివ్‌ కేంద్రాలు) భారత్‌లో ఏర్పాటు చేస్తున్నాయి. ఈ కేంద్రాలనే గ్లోబల్‌ ఇన్‌-హౌస్‌ కేంద్రాలంటున్నారు (జీఐసీలు). బ్యాక్‌ ఆఫీస్‌ సాఫ్ట్‌వేర్‌ ప్రాజెక్టులను జీఐసీలకు చేస్తున్నాయి. ప్రస్తుతం అత్యధునిక సాంకేతిక పరిజ్ఞానాలు అవసరమైన ప్రాజెక్టులు, డేటా విశ్లేషణ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ప్రాజెక్టులను కూడా ఈ కేంద్రాలకే బహుళ జాతి కంపెనీలు అప్పగిస్తున్నాయి. ఐటీ సేవలు, బీపీఓ, ఇంజినీరింగ్‌ సేవలు, సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తుల అభివృద్ధి తదితరాల కోసం ప్రత్యేక జీఐసీలూ ఉన్నాయి. భవిష్యత్తులో ఏరోస్పేస్‌, ఆరోగ్య సంరక్షణ, బయోటెక్నాలజీ వంటి రంగాల్లో ఇటువంటి కేంద్రాలను ఎక్కువగా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. బహుళజాతి కంపెనీలు ఇటువంటి కేంద్రాలను ప్రపంచ వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నప్పటికీ.. డిజిటల్‌ టెక్నాలజీల నుంచి ఐటీ రంగంలో అన్ని విభాగాల్లో నిష్ణాతులైన నిపుణులు భారత్‌లో అందుబాటులో ఉండడంతోపాటు భారత ఐటీ పరిశ్రమ ప్రపంచానికే అగ్రగామిగా ఉండడంతో అనేక విదేశీ బహుళజాతి కంపెనీలు గత కొద్ది సంవత్సరాలుగా ఇక్కడ జీఐసీలను ఏర్పాటు చేయడానికి మొగ్గు చూపుతున్నాయి. ఆయా కంపెనీలకు భారత జీఐసీలు కీలకం కావడమేకాక.. దేశీయ ఐటీ రంగంలో అంతర్గత భాగంగా మారుతున్నాయి. సొంత అవసరాల కోసం మ్యాప్‌లను అభివృద్ధి చేయడానికి ఇటీవల యాపిల్‌ కంపెనీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కేంద్రం ఇటువంటిదే.
అయిదేళ్లలో 300 కొత్త కేంద్రాలు
గత ఆర్థిక సంవత్సరం భారత ఐటీ-బీపీఎం పరిశ్రమ ఎగుమతులు 10.3 శాతం వృద్ధితో 10,800 కోట్ల డాలర్లకు (రూ.6,69,600 కోట్లు) చేరితే.. ఇందులో జీఐసీల ఆదాయం 2,150 కోట్ల డాలర్లు (అయిదో వంతు) ఉంది. ప్రపంచంలోనే జీఐసీలకు భారత్‌ తొలి గమ్యస్థానంగా ఉంది. 2010లో దేశంలో 750 జీఐసీలు ఉండగా.. ప్రస్తుతం 1,050కి పెరిగాయి. దాదాపు అయిదేళ్లలో 300 కేంద్రాలు వచ్చాయి. 2015-16 చివరి నాటికి దేశీయ ఐటీ-బీపీఓ పరిశ్రమలో 37 లక్షల మంది ప్రత్యక్షంగా పని చేస్తుంటే.. 8 లక్షల మంది ఈ కేంద్రాల్లోనే ఉన్నారు. ప్రస్తుతం ఐరోపా, జపాన్‌కు చెందిన కంపెనీలు ఎక్కువగా భారత్‌లో జీఐసీలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాయని, అధిక శాతం కేంద్రాలు, పరిశోధన అభివృద్ధి, ఉత్పత్తుల అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తున్నాయని ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన నాస్‌కామ్‌ జీఐసీ సదస్సుకు విచ్చేసిన హైదరాబాద్‌కు చెందిన ఐటీ నిపుణుడు ఒకరు తెలిపారు.
* 2015లో ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన జీఐసీలలో 21 శాతం కేంద్రాలను భారత్‌లోనే నెలకొల్పారు.
* 2002-03లో భారత్‌ నుంచి జీఐసీల ఎగుమతులు 300 కోట్ల డాలర్లు ఉంటే.. ఏడాదికి సగటున 16 శాతం చొప్పున వృద్ధి చెందుతూ 2015-16 నాటికి 2,150 కోట్ల డాలర్లకు చేరాయి.
* దేశంలో ఉన్న మొత్త జీఐసీలలో 68 శాతం ఉత్తర అమెరికాకు చెందినవే. 24 శాతం వాటాతో యూరప్‌ రెండో స్థానంలో ఉంది.
* ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జీఐసీలలో 50 శాతం భారత్‌లోనే ఉన్నాయి.
* ప్రపంచ వ్యాప్తంగా జీఐసీలలో పని చేస్తున్న ఉద్యోగుల్లో 79 శాతం మంది ఉద్యోగులు భారత్‌ కేంద్రాల్లోనే ఉన్నారు.
* భారత జీఐసీలు పరిపక్వత చెందుతూ.. ఆయా కంపెనీలకు ఇవి ఎక్స్‌లెన్స్‌ కేంద్రాలుగా ఆవిర్భవిస్తున్నాయి. కంపెనీ విలువ గొలుసుకట్టు (వ్యాల్యూ చైన్‌)ను మరింత పైకి తీసుకువెళ్తున్నాయి.
* జీఐసీ కేంద్రాల్లో ఉద్యోగుల వలసలు అధికంగా ఉండడం ప్రధాన సమస్యగా ఉంది. ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన వారిని ఆకర్షించడం, వారు బయటకు వెళ్లకుండా చూడడం ఒక సవాలుగా ఉంది. నిపుణుల కోసం కంపెనీల మధ్య పోటీ, పెరుగుతున్న వ్యయాలు దేశంలో జీఐసీలు మరింతగా పెరగడానికి అవరోధాలు కనిపిస్తున్నాయి. అయితే.. ఈ కేంద్రాలు భవిష్యత్తులో భారత ఐటీ-బీపీఎం పరిశ్రమ ఎగుమతుల్లో కీలక పాత్ర పోషించగలవని, ఎగుమతుల విలువను పెంచగలవని నాస్‌కామ్‌ అంచనా వేస్తోంది.


Posted on 03-06-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning