రాష్ట్రంలో విస్తరణకు ఏఎండీ సంసిద్ధత

* వీఎల్‌ఎస్‌ఐ అకాడమీలో భాగస్వామిగా ఉండేందుకు నిర్ణయం
* కేటీఆర్‌తో భేటీలో కుదిరిన అంగీకారం
* పరిశోధనల్లో తెలంగాణ విద్యార్థులకు భాగస్వామ్యం!

ఈనాడు, హైదరాబాద్‌: చిప్‌ తయారీ రంగంలో విశ్వవిఖ్యాత సంస్థగా పేరొందిన ఏఎండీ.. తెలంగాణలో తన పరిధిని మరింతగా విస్తరించాలని నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే వీఎల్‌ఎస్‌ఐ (వెరీ లార్జ్‌ స్కేల్‌ ఇంటిగ్రేషన్‌) అకాడమీలో భాగస్వామిగా ఉండేందుకు ఏఎండీ అంగీకరించింది. వేలకొలది ట్రాన్సిస్టర్స్‌ను ఒకే చిప్‌లోకి అనుసంధానించి తయారుచేసే ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్‌ (ఐసీ) విధానాన్నే వీఎల్‌ఎస్‌ఐ అంటారు. అమెరికాలో ఉన్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు సిలికాన్‌ వ్యాలీ పర్యటనలో భాగంగా ఏఎండీ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. సంస్థ చీఫ్‌ టెక్నాలజీ అధికారి, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మార్క్‌ పేపర్‌ మాస్టర్‌, సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌ రూత్‌ కాటర్‌లతో సనీవేల్‌లోని ఏఎండీ ప్రధాన కార్యాలయంలో చర్చించారు. ఇప్పటికే హైదరాబాద్‌లో చిప్‌లు తయారీ చేస్తున్న ఏఎండీ తెలంగాణ ప్రభుత్వ రెండేళ్ల పనితీరుపై ప్రశంసలు కురిపించింది. ‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా, ఆ తదనంతర పరిణామాల వల్ల హైదరాబాద్‌లో మా కంపెనీ కార్యకలాపాలు, భవిష్యత్‌పట్ల అనుమానాలుండేవి. కానీ ఈ రెండేళ్లలో అవన్నీ పటాపంచలయ్యాయి. ఈ రెండేళ్లలో మీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు అద్భుతం. హైదరాబాద్‌ నగరం పట్ల మాకున్న నమ్మకాన్ని కాపాడారు’’ అంటూ మార్క్‌ పేపర్‌ మాస్టర్‌ కృతజ్ఞతలు తెలిపారు. తాము కొత్తగా తయారు చేసిన చిప్‌ జెన్‌ (చిప్‌పేరు)ను పూర్తిగా హైదరాబాద్‌లోనే డిజైన్‌ చేశామని ఆయన తెలిపారు. సంస్థ కొత్త ఉత్పత్తులు, మార్కెట్‌ వ్యూహాలను వెల్లడించిన మార్క్‌ పేపర్‌ మాస్టర్‌ .. తెలంగాణలో కంపెనీ పనితీరును మంత్రి కేటీఆర్‌కు వివరించారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్‌ క్యాంపస్‌ నుంచి కొత్త ఉత్పత్తులను రూపొందించనున్నట్లు ప్రకటించారు. తమ కంపెనీ చిప్‌ సాంకేతికతతో బాహుబలిలాంటి సినిమాకు గ్రాఫిక్స్‌ అందించామని రూత్‌ కాటర్‌ తెలిపారు. తెలుగు సినిమాతో పాటు ఇతర సినిమా పరిశమ్రలతో గ్రాఫిక్‌ విభాగంలో భాగస్వాములయ్యేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ‘‘కంపెనీ భవిష్యత్‌ ప్రణాళికల్లో గ్రాఫిక్స్‌, వర్చువల్‌ రియాలిటీ, గేమింగ్‌, మాన్యుఫాక్చరింగ్‌లాంటి వాటిని ప్రధాన లక్ష్యాలుగా పెట్టుకున్నాం’’ అని సంస్థ ఉన్నతాధికారులు తెలపగానే... ఆయా రంగాల్లో తెలంగాణలో పెట్టుబడి, విస్తరణలకున్న అవకాశాలను మంత్రి కేటీఆర్‌ వివరించారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ఇమేజ్‌ సిటీలో భాగస్వాములు కావాలని ఏఎండీని కోరారు. ఏఎండీ పరిశోధనల్లో తెలంగాణలోని ట్రిపుల్‌ఐటీ, ఐఐటీ, బిట్స్‌ పిలానీ, బాసర ట్రిపుల్‌ ఐటీ, వరంగల్‌ ఎన్‌ఐటీ విద్యార్థులను కూడా భాగస్వాములను చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు ఏఎండీ అధికారులు సానుకూలంగా స్పందించారు. దీంతోపాటు వీఎల్‌ఎస్‌ఐ అకాడమీలో కూడా భాగస్వాములవుతామని మంత్రికి హామీ ఇచ్చారు. ఎలక్ట్రానిక్స్‌ తయారీకి తెలంగాణ ప్రభుత్వమిస్తున్న రాయితీలను, పారిశ్రామిక, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ విధానాలను వివరించిన మంత్రి- తెలంగాణలో ఏఎండీ ఉత్పత్తులను విస్తృతంగా తయారు చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని కోరారు.

Posted on 04-06-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning