సన్నద్ధతే సగం విజయం!

* ఉద్యోగ సాధనలో మీగురించి చెప్పుకోవడం కీలకం
* చిన్న చిన్న మెలకువలతో కొలువు సులువు

బోథ్‌, న్యూస్‌టుడే: ఉద్యోగం పురుష లక్షణం.. ఇది గతంలో మాట. ఉద్యోగం మనిషి లక్షణం.. ఇది ఇప్పటి మాట. ఏ చిన్న ఉద్యోగానికైనా విపరీతమైన పోటీ. మారుతున్న పరిస్థితుల్లో కేవలం మార్కులు ఉంటేనే సరిపోదు. ఇతర రంగాల్లోనూ నైపుణ్యం ఉండాల్సిందే. ఉద్యోగం కోసం ముఖాముఖి అనగానే అభ్యర్థుల గుండెల్లో అలజడి.. ‘నువ్వేమి చదివావు.. అనేదానికన్నా నిన్ను చదివేందుకే’ అనే తరహాలో ఆయా సంస్థలు అభ్యర్థితో మాటామంతీ సాగిస్తున్నాయి. ఇటీవల జరుగుతున్న ప్రాంగణ నియామకాల్లో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఉద్యోగం కోసం యువత అందించే రెజ్యుమో(బయోడేటా) కీలకంగా మారుతోంది. అందులో పొందుపరిచే సమాచారమే ప్రతిభకు కొలమానంగా గుర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెజ్యుమో తయారీలో పాటించాల్సిన సూచనలు, సలహాలు తదితర అంశాలతో ‘న్యూస్‌టుడే’ కథనం..
ఉద్యోగాన్వేషణ చేసేవారు తమ ప్రయాణంలో వేసే మొట్టమొదటి అడుగు రెజ్యుమో తయారుచేయడం. తమకున్న విద్యార్హతలతో పాటు.. సంస్థలో పనిచేయడానకి అవసరమైన నైపుణ్యాలు తమలో ఉన్నాయంటూ రిక్రూటర్లకు వివరించేదే రెజ్యుమో. అందుకే అభ్యర్థిని ఉద్యోగ ఎంపికకు పిలిచే ముందు ఆయా సంస్థలు బయోడేటాను పంపించమని అడుగుతాయి. దాన్ని పరిశీలించిన అనంతరం వారు తమ సంస్థలో పనిచేయడానికి అర్హులని భావిస్తేనే ఇంటర్వ్యూకి ఆహ్వానిస్తారు. కాబట్టి రెజ్యుమోను చాలా జాగ్రత్తగా తయారుచేయాల్సి ఉంటుంది. అయితే ఈ క్రమంలో కొన్నిసార్లు మనకు తెలియకుండానే దొర్లే చిన్న తప్పులు అవకాశం కోల్పోయేలా చేస్తాయి. అందుకే రెజ్యుమోలో సాధారణంగా దొర్లె తప్పులను సరిదిద్దుకుంటే ఉన్నత భవిత సొంతం అవుతుంది.
అలవాట్లు, అభిరుచులు..
సాధారణంగా రెజ్యుమోలో విద్యార్థిగా సాధించిన విజయాలు, అందుకున్న పురస్కారాల గురించి పొందుపరుస్తుంటారు. వీటితో పాటు తమకున్న అలవాట్లు, అభిరుచుల గురించి కూడా జతచేస్తుంటారు కొందరు. ఇలాంటివి ఒకటో రెండో అయితే ఫర్వాలేదు. కొంతమంది మాత్రం వీటికే అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఇవి మన వ్యక్తిత్వాన్ని అంచనా వేయడానికి పనికొస్తాయి. కానీ ఉద్యోగాన్ని తెచ్చిపెట్టవు. అందుకే ఇలాంటి వాటి గురించి వీలైనంత తక్కువ ప్రస్తావించాల్సి ఉంటుంది. వాటిని పొందుపరచకపోయినా పెదద నష్టం ఉండదు. రిక్రూటర్లు రెజ్యుమోను చూడటానికి సగటున పది సెకండ్లు మాత్రమే కేటాయిస్తారని ఓ అంచనా. మీరు చేయాలనుకుంటున్న ఉద్యోగానికి సంబంధించి నిర్దేశించుకున్న లక్ష్యాన్ని తెలియజేస్తే బాగుంటుంది. కేవలం 16 నుంచి 20 సెకండ్లలోపే చదవడానికి వీలుగా రెజ్యూమోను తయారు చేసుకోవాలి.
కెరీర్‌ ఆబ్జెక్టివ్‌..
రెజ్యుమోలో మొట్టమొదటగా మనకు కనిపించేది కెరీర్‌ ఆబ్జెక్టివ్‌. ఇది ఎంత క్లుప్తంగా ఉంటే అంత మంచిది. కానీ చాలా మంది పేరాలకు పేరాలు తాము నిర్దేశించుకున్న వృత్తి పరమైన లక్ష్యాలను వివరిస్తుంటారు. చాలా రెజ్యుమోల్లో ఇది ఒకే రకంగా కనిపిస్తుంది. ఇది కూడా మన కెరీర్‌పై కాస్త ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అందుకే మీరు స్పష్టంగా నిర్దేశించుకున్న లక్ష్యాల గురించి సొంత మాటల్లో వివరించాలి. సంస్థ అభివృద్ధిలో మీదైన పాత్ర ఎలా పోషిస్తారో కూడా తెలియజేయాల్సి ఉంటుంది. ఇది మొత్తంగా మూడు నుంచి ఐదు వాఖ్యాలకు మించకుండా ఉండాలి.
పని చేయని చరవాణి సంఖ్యలు..
ఇప్పటి యువతలో ఎక్కువగా కనిపిస్తున్న అలవాటు తరచూ చరవాణి సంఖ్యలు మార్చడం. రెజ్యుమోలో పేర్కొన్న చరవాణి సంఖ్య ఒకటి.. ప్రస్తుతం ఉపయోగిస్తున్నది మరొకటైతే మనపై ప్రతికూల అభిప్రాయం ఏర్పరిచే అవకాశం ఉంటుంది. అందుకే బయోడేటాలో మనం ఇచ్చిన చరవాణి సంఖ్య ఎప్పుడూ పనిచేసేలా, అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. మరికొందరు కుటుంబ సభ్యుల చరవాణి సంఖ్యలూ జతచేస్తుంటారు. ఇది సరికాదు. రెజ్యుమోలో ఎప్పుడూ మనం ఉపయోగించే.. మన దగ్గర ఉండే చరవాణి సంఖ్య మాత్రమే ఇవ్వాలి.
ఆకర్షణీయంగా..
కొన్ని రెజ్యుమోలను పరిశీలించినపుడు బుల్లెట్‌ పాయింట్స్‌ రూపంలో లేదంటే పేరాల రూపంలో వివరాల్ని పొందుపరుస్తుంటారు. ఇలా పైనుంచి కింది వరకు ఒకే రకంగా ఉంటే రెజ్యుమో అంత ఆకర్షణీయంగా కన్పించదు. పైగా సమాచారం గందరగోళంగా ఉండి, ఎన్నో సందేహాలు తలెత్తి రిక్రూటర్లు దాన్ని పక్కన పడేసే అవకాశం ఉంది. అందుకే అవసరాన్ని బట్టి పట్టికలు, పేరాలు, బుల్లెట్‌ పాయింట్లను ఉపయోగించాలి. ఏ అంశాలను ఎలా పొందుపరచాలో ముందుగా అవగాహన ఏర్పరచుకోవడం ముఖ్యం. అన్నింటి కంటే ముఖ్యంగా రెజ్యుమోలో అక్షరదోషాలు దొర్లకుండా జాగ్రత్తపడాలి.
మూడు రకాలుగా..
‘బయోడేటా, రెజ్యుమో, కరిక్యులంవిటే’.. ఇలా మూడురకాలుగా ఏదో ఒకటి ఉద్యోగాలకు వెళ్లే వారు తయారుచేసి తీసుకెళ్తున్నారు. బయోడేటాలో పేరు, చిరునామాలతో కూడిన సమాచారాన్ని అందిస్తుండగా.. రెజ్యుమోలో ఇంకాస్త వివరంగా విద్యార్హతలతో పాటు ఆసక్తులు, అభిరుచులు పొందుపరుస్తున్నారు. రెజ్యుమో అనేది ‘ఫ్రెంచి’ పదం. ఇక కరిక్యులంవిటేలో ఇంకాస్త వివరంగా అనుభవసారంతో పాటు అదరపు అర్హతల్ని జతచేస్తుంటాం. లాటిన్‌ భాషలో ‘కరిక్యులంవిటే’ అంటే అదనపు అలవాట్లు, ఆసక్తులు అని అర్థం.
వీడియో రెజ్యుమో.. కొత్త విధానం
ఇప్పటివరకు అభ్యర్థి బయోడేటా పరిశీలన అనంతరం దూరంగా ఉన్న సంస్థలు టెలిఫోనిక్‌ ఇంటర్వ్యూ చేసేవి. సాంకేతిక పరిజ్ఞానం విస్తృతమవడంతో ముఖాముఖిలు సైతం కొత్త పుంతలు తొక్కుతుంది. ఇప్పుడు కొత్తగా వస్తున్న వీడియో రెజ్యుమో పరిజ్ఞానం పాత రెండంచెల విధానానికి స్వస్తి పలికింది. రెజ్యుమోని వీడియోలో రిక్రూటర్లు చూస్తున్నప్పుడే నైపుణ్యాలను అంచనా వేసే అవకాశం విజ్యుమో కల్పిస్తుంది.
ఇవి సరిచూసుకోవాలి..
1. ఇచ్చే బయోడేటా ముడతలు పడి, చిరిగి, పెన్ను గీతలతో చూడగానే ఇబ్బంది కలిగించేలా ఉండదు.
2. మన వ్యక్తిత్వాన్ని బట్టి చూపించే ధ్రువీకరణ కాబట్టి దాన్ని అందించే తీరులో మన దర్పం కనబడాలి.
3. ఆత్మ విశ్వాసంతో కూడిన సమాధానాలివ్వాలి. బయోడేటాలో ఏ అంశాన్ని అడిగినా తడుముకోకుండా చెప్పాగలగాలి.
4. ఆంగ్లభాష పరిజ్ఞానం ముఖ్యమే. మనకున్న పట్టు వల్లే సులభంగా సమాధానాలివ్వొచ్చు.
5. పరిజ్ఞానంతో పాటు భావ వ్యక్తీకరణలో స్పష్టత, సూక్ష్మదృష్టి ఉండాలి.
వంద మంది యువతను ‘న్యూస్‌టుడే’ రెజ్యుమో తయారీపై అభిప్రాయ సేకరణ చేపట్టింది. ఆ వివరాలు..
ప్రశ్న: రెజ్యుమో ఎలా తయారుచేయాలో అవగాహన ఉందా?
జవాబు: 37% లేదు
63% ఉంది
ప్రశ్న: రెజ్యుమో ఎలా తయారుచేసుకుంటారు?
జవాబు : సొంతంగా 40 శాతం
ఇతరుల ఆధారంగా 60 శాతం
ప్రశ్న : వీడియో రెజ్యుమో గురించి తెలుసా?
జవాబు : తెలుసు 15 శాతం
తెలియదు 85 శాతం
ప్రతి అంశంపై అవగాహన కలిగి ఉండాలి - సిరికొండ ప్రశాంత్‌, సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌
ఉద్యోగాలకు వెళ్లే విద్యార్థులకు తొలుత కావాల్సింది రెజ్యూమో(బయోడేటా). అందులో పేర్కొనే ప్రతి అంశంపై తప్పనిసరిగా అవగాహన ఉండాలి. ఎక్కువగా అందులో ఉన్న సమాచారం ఆధారంగానే వ్యక్తి విజ్ఞతను పరిశీలిస్తారు. చాలా మంది ఎవరో రాసింది చూసి పేర్లు, ఇతర సమాచారాన్ని మార్చి మిగతా అంశాల్ని అలాగే ఉంచుతున్నారు. దీని ప్రభావం కచ్చితంగా ముఖాముఖిలో పడుతుంది. అందుకే రెజ్యుమోలో ఉన్న ప్రతి పదంపై పట్టు ఉండాలి.
ఇలా మారాలి..
1. భావ వ్యక్తీకరణ నైపుణ్యం పెంచుకోవాలి. ముఖాముఖి సమయంలో భావాలు, ఇచ్చే సమాధానాలు వారిని మెప్పించేలా ఉండాలి.
2. తెలియని వాటి గురించి నిర్మొహమాటంగా చెప్పేయాలి. బయోడేటాలో పేర్కొన్న అంశాలపై పూర్తిగా అవగాహన ఉండాలి.
3. ఇంటర్వ్యూకి హాజరయ్యే సంస్థ, పరిశ్రమ అవసరాన్ని బట్టి బయోడేటా మార్పు చేయాలి. కొలువు స్థాయి తీరుని బట్టి వ్యవహారమూ మార్చుకోవాలి.
4. కేవలం విద్యార్హతలే కాదు.. సామాజిక కోణంలో మనకున్న ఆసక్తిని పరిచయం చేయాలి. వీటితో రిక్రూటర్ల దృష్టిని ఆకర్షించవచ్చు.
సంస్థకు సంబంధించి అధ్యయనం చేయాలి - తుల అరుణ్‌, సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌, రిక్రూటర్‌
అభ్యర్థులు ముందుగా ఏ ఉద్యోగం కోసం ముఖాముఖికి వెళుతున్నారో ఆ సంస్థకు సంబంధించిన సమాచారంపై అధ్యయనం చేయాలి. సంభాషణ సామర్థ్యం(కమ్యూనికేషన్‌ స్కిల్స్‌), భావ ప్రదర్శన(అప్పియరెన్స్‌), వేషధారణను మొదట గమనిస్తారు. అభ్యర్థికి ఉన్న డిగ్రీలకు తదుపరి ప్రాధాన్యం ఇస్తారు. రిక్రూటర్లు అభ్యర్థి నైపుణ్యాన్ని మాత్రమే పరిశీలిస్తారు. ప్రస్తుతం గుర్తింపు పొందిన కోర్సులకు ఎక్కువగా డిమాండ్‌ ఉంది.

Posted on 05-06-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning