జూన్‌లో ప్రిలిమ్స్‌...అక్టోబర్లో మెయిన్స్‌!

తాజాగా ప్రకటించిన యూపీఎస్‌సీ పరీక్షల షెడ్యూల్‌ ప్రకారం... 2017 జూన్‌ 18న సివిల్‌ సర్వీసెస్‌, ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసుల ప్రిలిమినరీ పరీక్ష జరగ బోతోంది. ఈ రకంగా సివిల్స్‌ పరీక్షను ముందుకు జరిపినట్టయింది!
వచ్చే ఏడు ఫిబ్రవరి 22న సివిల్స్‌ నోటిఫికేషన్‌ విడుదల అవుతుంది. మార్చి 17లోపు దరఖాస్తులను పంపుకోవచ్చు. ప్రిలిమినరీని 2017 జూన్‌ 18న నిర్వహించాక మెయిన్‌ పరీక్ష అక్టోబరు 28న ఐదు రోజులపాటు జరుగుతుంది.
మొదట్లో సివిల్స్‌ నోటిఫికేషన్ను డిసెంబర్లో ఇచ్చి మే/జూన్‌లలో పరీక్షను నిర్వహించేవారు. సీశాట్‌ను... అంటే అభ్యర్థులందరికీ కామన్‌ పేపర్లను ప్రవేశపెట్టాక షెడ్యూల్‌ మారిపోయింది. ప్రిలిమ్స్‌ ఆగస్టులోనూ, మెయిన్స్‌ డిసెంబర్లోనూ జరగటం మొదలైంది. అయితే వచ్చే ఏడాది (2017) నుంచీ ప్రిలిమ్స్‌ను జూన్‌లో జరపటానికి నిశ్చయించారు.
ఎందుకీ మార్పు?
2000 సంవత్సరంలోని అలఘ్‌ కమిటీ దగ్గర్నుంచి 2007లోని రెండో పాలనా సంస్కరణల కమిటీ, 2013లోని నిగవేకర్‌ కమిటీ వరకూ అందరూ సిఫార్సు చేసిందేమిటంటే... సివిల్స్‌ పరీక్ష కాలవ్యవధిని తగ్గించాలని! సివిల్స్‌ పరీక్ష వ్యవధి సుదీర్ఘంగానూ, సమయం హరించేదిలాగానూ ఉండటం వల్ల ప్రతిభావంతులైన అభ్యర్థులు చాలామంది ఈ పరీక్షవైపు మొగ్గు చూపకపోయే ప్రమాదం ఉందనేది ఈ కమిటీల సిఫార్సు వెనకున్న కారణం. ఈ సిఫార్సుల మూలంగా నోటిఫికేషన్‌ దగ్గర్నుంచి పరీక్ష ఫలితాల వరకూ పట్టే వ్యవధిని 18 నెలల నుంచి 12 నెలలకు ఇటీవలి సంవత్సరాల్లో ప్రభుత్వం తగ్గించింది. మరింత సమయం తగ్గించటం కోసమే (అంటే వ్యవధిని 10 నెలలకు కుదించటం) తాజా మార్పు నిర్ణయం తీసుకున్నారని గ్రహించవచ్చు.
ఈ రకంగా వచ్చే ఏడాది నుంచీ ప్రిలిమినరీ పరీక్ష జూన్‌లో, మెయిన్‌ పరీక్ష అక్టోబర్లో జరగనున్నాయి. పర్సనాలిటీ టెస్ట్‌ (ఇంటర్వ్యూ) ఆపై ఏడాది జనవరి రెండో/మూడో వారంలో ప్రారంభం అవుతాయని అంచనా. ఇక తుది ఫలితాలను మార్చి చివరివారంలో కానీ, ఏప్రిల్‌ మొదటి వారంలోకానీ ప్రకటించే అవకాశం ఉంది.
ప్రిలిమినరీని భవిష్యత్తులో ‘ఆన్‌లైన్‌’ పద్ధతిలోకి మార్చటానికి సూచనలు కనపడుతున్నాయి. అయితే ఈ మార్పును వెంటనే కాకుండా... దశలవారీగా ప్రవేశపెడతారు.
ఆగస్టులో బస్వాన్‌ కమిటీ సిఫార్సులను సమర్పించాక... మార్పులపై చర్చలు జరుగుతాయి. అంతే తప్ప సమీప భవిష్యత్తులో మరెలాంటి మార్పులకూ ఆస్కారం ఉండదని అభ్యర్థులు గ్రహించాలి.

- వి. గోపాల‌కృష్ణ, డైరెక్టర్‌, బ్రెయిన్ ట్రీ


Posted on 13-06-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning