దేశంలో నైపుణ్య రహిత ఇంజినీరింగ్

* ఇంజినీరింగ్‌ నైపుణ్యం నాస్తి
* మూల విభాగాల్లో ఉద్యోగిత శాతం 8 కంటే తక్కువే
* చేదు వాస్తవాలను వెల్లడించిన తాజా నివేదిక

దిల్లీ: ‘ప్రపంచ తయారీ కేంద్రం’గా ఆవిర్భవించాలంటే మనదేశంలో ఇంజినీరింగ్‌ విద్య ప్రమాణాలను గణనీయంగా మెరుగుపర్చాల్సిన ఆవశ్యకతను తాజా అధ్యయనమొకటి నొక్కిచెప్పింది. ఐటీ-సాఫ్ట్‌వేర్‌ మినహా ఇంజినీరింగ్‌ మూల విభాగాల్లో దేశవ్యాప్తంగా ఎనిమిది శాతం కన్నా తక్కువ మంది విద్యార్థులే ఉద్యోగాలు సాధించగలుగుతున్నారంటూ ప్రస్తుత ప్రమాణాల దుస్థితిని కళ్లకు కట్టింది. పరిశ్రమలు కోరుకుంటున్న నైపుణ్య స్థాయికి, ఇంజినీర్ల నైపుణ్యాలకు మధ్య భారీ అంతరం ఉంటోందన్న చేదు నిజాలనూ వెల్లడించింది. ఐటీ-సాఫ్ట్‌వేర్‌ రంగాలు మినహా ఇంజినీరింగ్‌లోని ఇతర మూల విభాగాల్లో ఉపాధి అవకాశాలను ‘ఆస్పైరింగ్‌ మైండ్స్‌’ అనే సంస్థ విశ్లేషించింది. దేశవ్యాప్తంగా మొత్తం 1.5 లక్షల మంది ఇంజినీర్లపై అధ్యయనం అనంతరం ‘జాతీయ ఉద్యోగిత నివేదిక’ పేరుతో ఈ ఏడాది తొలిసారిగా నివేదికను విడుదల చేసింది.
తాజా నివేదిక ప్రకారం... దేశవ్యాప్తంగా ప్రస్తుతం ప్రతిఒక్కరి దృష్టి ఐటీపైనే ఉంది. ఈ రంగాల్లోనే ఇంజినీరింగ్‌లో అత్యధిక ఉద్యోగిత శాతం నమోదవుతోంది. ఇంజినీరింగ్‌లోని ఇతర మూల విభాగాల్లో ఎలక్ట్రానిక్స్‌లో అత్యధికంగా 7.7 శాతం ఉద్యోగిత నమోదైంది. మెట్రోనగరాల్లో దిల్లీ, ముంబయిల్లో ఉద్యోగిత ఎక్కువ. ఈ నగరాల్లో ఎలక్ట్రానిక్స్‌ డిజైన్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో ఉద్యోగిత అత్యధికంగా 19 శాతంగా నమోదైంది. బెంగళూరు, కోల్‌కతా, హైదరాబాద్‌లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అత్యల్పంగా చెన్నైలో సివిల్‌ డిజైన్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో కేవలం ఒక శాతం ఉద్యోగిత నమోదైంది.
ఇంజినీర్లలో అల్ప ఉద్యోగిత మనదేశ ఉత్పత్తిరంగ వృద్ధికి అడ్డంకిగా మారుతుందని ‘ఆస్పైరింగ్‌ మైండ్స్‌’ స్థాపకుడు వరుణ్‌ అగర్వాల్‌ సూచించారు. ఐటీ-సాఫ్ట్‌వేర్‌ రంగాల్లోనే కాకుండా ఇంజినీరింగ్‌లోని ఇతర మూల విభాగాల్లోనూ అందుబాటులో ఉన్న ఉద్యోగాల పట్ల విద్యార్థులను ఉత్తేజితుల్ని చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. సరికొత్త బోధనా విధానాలు, సాంకేతికతను వినియోగించుకొని ఇంజినీరింగ్‌ విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని పేర్కొన్నారు.

Posted on 15-06-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning