నెగ్గడమే కాదు.. తగ్గడమూ తెలిస్తే విజయం మీదే

* ప్రాంగణ ఉద్యోగానికి 'బృంద చర్చ' గండం
* సీజీపీని కాదని.. నైపుణ్యాలనే పరిగణిస్తున్న సంస్థలు

* ఇది ఎంపికల తరుణం.. సన్నద్ధత అవశ్యం

ఇంజినీరింగ్ పూర్తయ్యేనాటికే కొలువు చేజిక్కించుకోవాలని నేటి విద్యార్థులు ఎంతో తపిస్తుంటారు... ఐదంకెల జీతం.. మంచి జీవితం గురించి కలలు కంటుంటారు... కంపెనీలు తమ క్యాంపస్ తలుపు తట్టేసరికి అందరిలోనూ ఒకటే ఆందోళన... మేం ఎంపికవుతామా లేదా అని మథనపడతారు... ఇంజినీరింగ్ పూర్తిచేసినవారిలో చివరికి కేవలం 20 శాతం మంది మాత్రమే ఎంపికవుతున్నారు... మిగిలివారందరికీ నిరాశే!

ఓ సాంకేతిక నిపుణుడికీ, సమర్థుడైన ఉద్యోగికీ ఉన్న తేడా ఏమిటి?
కేవలం కొన్ని సాంకేతిక అంశాల్లో నైపుణ్యం ఉన్నత ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహించడానికి సరిపోదు. తన నైపుణ్యాన్ని తనఉద్యోగబృందంలోని ఇతరుల నైపుణ్యాలతో సమన్వయం చేసుకొనే నేర్పుకావాలి. అంటే ఐక్యూ(మేథోశక్తి) మాత్రమే కాకుండా, ఇక్యూ (ఎమోషనల్ కోషియంట్/ఉద్వేగ నియంత్రణ శక్తి), సమాచార ప్రసార శక్తి మూడూ కావాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మంచి వ్యక్తిత్వముండాలి. అలాంటి వ్యక్తిత్వానికి గీటురాయిగా బృంద చర్చను వినియోగించడం అంతర్జాతీయంగా ఆమోదం పొందిన పద్ధతి అయిపోయింది.
ఆకట్టుకునే భావ వ్యక్తీకరణకే ప్రాధాన్యం
ఓ బాధ్యతాయుతమైన ఉద్యోగికి చెప్పడమే కాదు, వినడమూ రావాలి. తనకు నచ్చిన అంశాన్నీ, నచ్చని, వచ్చినదీ, రాని అంశాలనైనా సరే.. ఆకట్టుకునే పద్ధతిలో వ్యక్తీకరించి, అవతలి వారిని నొప్పించకుండా ఒప్పించాలి. నాకు తెలుసు అనే ఆత్మవిశ్వాసం ఉండాలి. అయితే నాకు మాత్రమే తెలుసనే అహంకారం ఉండకూడదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఎక్కడ నెగ్గాలో మాత్రమే గాక.. ఎక్కడ తగ్గాలో కూడా తెలిసి ఉండాలి. ఇవన్నీ అలవోకగా అలవర్చుకునేందుకు, ప్రదర్శించేకు మంచి వేదిక బృంద చర్చ.
'ప్రాంగణ' ఉద్యోగం రావాలంటే.. దీన్ని అధిగమించాల్సిందే
ప్రాంగణ ఎంపికల్లో ఎక్కువ ఉద్యోగాలు సాధించడం ఇంజినీరింగ్ కళాశాలల ప్రతిభకూ, ప్రతిష్ఠకూ కొలమానంగా మారిన ఈ రోజుల్లో బృంద చర్చల ప్రాధాన్యతను అన్ని ఇంజినీరింగ్ కళాశాలల వారూ గుర్తించారు. జిల్లాలోని అన్ని ఇంజినీరింగ్ కళాశాలల్లో మొదటి ఏడాది నుంచే విద్యార్థులకు బృంద చర్చలపై శిక్షణ ఇవ్వడం జరుగుతోంది. వారానికి మూడు గంటలు లేదా ఒక పూట ఈ అంశానికి కేటాయించడం సాధారణ విషయమైపోయింది.
ఫలితాలెన్నో..
బృంద చర్చల వల్ల విద్యార్థులకు ఆంగ్లభాషా నైపుణ్యం మెరుగుపడుతోందని, ముఖ్యంగా భావ వ్యక్తీకరణ పెరుగుతోందని చెప్తున్నారు ఉషారామ ఇంజినీరింగ్ కళాశాలలో బృంద చర్చల అంశంలో విద్యార్థులకు శిక్షణనిస్తున్న తూమాటి శామ్యూల్‌జాన్. ఈయన ఇంతకుముందు జిల్లాలోని ఇతర ప్రతిష్ఠాత్మక కళాశాలల్లో ఇదే రంగంలో పనిచేశారు. భావవ్యక్తీకరణ వల్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరగడం, తరగతిలో వివిధ అంశాల్లో భాగస్వామ్యం పెరగడమూ తాను గుర్తించినట్టు చెప్పారు. అలాగే పిల్లల్లో కళాశాలతో అనుబంధం కూడా మెరుగవుతుందని ఆయన వివరించారు.
గండం గట్టెక్కాలంటే.. ఇవిగో నిపుణుల సూచనలు..ముందు..:
* చర్చించే అంశం మీద అనుమానాలు, సందేహాలు ఉంటే అడగాలి. సమయం ఎంత ఉందో తెలుసుకోవాలి. చర్చకు కొంచెం ముందే అంశం తెలిస్తే మనసులో పాయింట్లు సిద్ధం చేసుకోవాలి.
* ఇది కేవలం ఒక అంశంపై విభిన్నమైన ఆలోచనలు ఇచ్చిపుచ్చుకునేందుకు వేదిక మాత్రమే. ఒక విధాన నిర్ణయం తీసుకునే చోటు కాదనే అవగాహన విద్యార్థులకు చాలా అవసరం.
చర్చ సమయంలో..:
* చెప్పాం? అనేది ఎంత ముఖ్యమో, ఎలా చెప్పాం అనేది అంతకన్నా ముఖ్యమని గ్రహించాలి.
* చర్చలో అవకాశం అందిపుచ్చుకోవడం ఎంత ముఖ్యమో, ఇతరులకు అవకాశం ఇవ్వడమూ అంతే ముఖ్యం.
* 'అది కాదు', 'మీరు చెప్పింది తప్పు' ఇలా వ్యతిరేకార్థ పదాలను ఉపయోగించి ఖండించకూడదు.
* స్పష్టంగా మాట్లాడాలి. గొణగడం, గుసగుసలాడడం ఎంతమాత్రం తగదు. అలాగని అరచినట్టు కూడా మాట్లాడకూడదు.
* మంచైనా, చెడైనా గొంతులోనూ, ముఖంలోనూ, శరీర కదలికల్లోనూ ఆవేశం ప్రదర్శించకూడదు. ఎదుటివారిని వేలితో చూపించడం, బల్లను చరచడం అసలు చేయకూడదు.
* మర్యాదగా, క్లుప్తంగా మాట్లాడాలి.
* ఎదుటివారు చెప్పేది శ్రద్ధగా వినాలి. పక్కవారికి మాట్లాడేందుకు అవకాశమివ్వాలి.
* ఎదుటివారు మాట్లాడేది పూర్తికాకుండా ఖండిచకూడదు. వారిని వేళాకోళం, హేళన చేయకూడదు. విమర్శించకూడదు.
* సవాళ్లకు బృంద చర్చ వేదికకాదని గుర్తించాలి.
జనవరిలో రెండో విడత ప్రాంగణ ఎంపికలు
ప్రస్తుతం నాలుగో సంవత్సరం ఇంజినీరింగ్ విద్యార్థులకు జిల్లాలో ప్రాంగణ ఎంపికలు ప్రారంభమయ్యాయి. టెక్‌మహీంద్ర, ఇన్‌ఫో టెక్, విప్రో, టీసీఎస్, హెచ్‌పీ, జెన్‌పాక్ట్ తదితర సంస్థలు కొన్ని కళాశాలల్లో మొదటి విడత ప్రాంగణ ఎంపికలు పూర్తిచేశాయి. జనవరిలో రెండో విడత ప్రాంగణ ఎంపికలు మిగిలిన కళాశాలల్లో కూడా జరగనున్నాయి. బృందచర్చల మీద తగినంత అవగాహన కలిగివుండాలని నిపుణులు సూచిస్తున్నారు.

 • Industry      Interaction

  Higher Education

  Job Skills

  Soft Skills

  Comm. English

  Mock Test

  E-learning