2035 నాటికి 10 లక్షల కొలువులు!

* విమానయాన సంస్థల్లో అత్యధికం
* నైపుణ్యాల కొరతతో పరిశ్రమ సతమతం
* జాతీయ విమానయాన శిక్షణ సంస్థ ఏర్పాటుకు సూచన

ఈనాడు - హైదరాబాద్‌: దేశీయ విమానయాన రంగం అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది. 2015లో దేశీయ విమానయాన కంపెనీలు 8.1 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. అంతక్రితం ప్రయాణికుల సంఖ్య 6.74 కోట్లతో పోలిస్తే 20 శాతానికి పైగా పెరిగింది. 2016 మొదటి మూడు నెలల్లో ప్రయాణికుల వృద్ధిరేటు 23 శాతం ఉంది. ఇదే వృద్ధిరేటు కొనసాగితే దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 10 కోట్లకు చేరుతుందని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) అంచనా వేస్తోంది. 2020 నాటికి ప్రపంచంలోనే భారత్‌ మూడో అతిపెద్ద, 2030 నాటికి అగ్రగామి విమానయాన విపణి కాగలదని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు పరిశ్రమకు వూతమిచ్చే విధంగా కొత్త విమానయాన విధానాన్ని ప్రభుత్వం వెల్లడించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితులను సడలించి విమానయాన కంపెనీలు, విమానాశ్రయాల్లో 100 శాతం ఎఫ్‌డీఐలకు ఆమోదం తెలిపింది. ఈ రెండు కీలక నిర్ణయాలు పరిశ్రమకు మరింత వూతం ఇవ్వనున్నాయి. భారీగా విదేశీ పెట్టుబడులు వచ్చే వీలుంది. కొత్త విధానం ద్వారా ప్రాంతీయ అనుసంధానతను పెంచడమే కాక గంటకు రూ.2,500కే విమాన ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే దేశంలో ఉన్న దాదాపు 160 విమానాశ్రయాలను వినియోగించుకోవడానికి, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో భారీ విమానాశ్రయాలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తోంది. అయితే.. పరిశ్రమ వృద్ధికి అనుగుణంగా నిపుణులు, శిక్షణ పొందిన సిబ్బంది లభ్యత లేదని, భవిష్యత్తులో ఈ సమస్య మరింత పెరిగే వీలున్నందున పరిశ్రమ, ప్రభుత్వం శిక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. పైలట్లు, ఇంజినీర్ల వంటి సాంకేతిక సిబ్బందే కాక, విమానాశ్రయాల నిర్వహణ, టెర్మినల్‌ ఆపరేటర్లు, కార్గో నిర్వహణ సిబ్బంది, ఫ్లైట్‌ క్యాటరింగ్‌ తదితర అనేక రకాల ఉద్యోగుల కొరత ఉందని, వచ్చే కొద్ది సంవత్సరాల్లో విమానయానం రంగంలో భారీగా ఉద్యోగాలు రానున్నాయని చెబుతున్నారు. విమానయాన రంగంలో మొత్తం 70 రకాల ఉద్యోగాలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. 2035 నాటికి దేశీయ విమానయాన రంగంలో (విమానాశ్రయాలు, విమానయాన కంపెనీలు, కార్గో, నిర్వహణ, మరమ్మతు (ఎంఆర్‌ఓ), గ్రౌండ్‌ హ్యాండిలింగ్‌) తదితర రంగాల్లో దాదాపు 8 లక్షల నుంచి 10 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు, మరో 30 లక్షల పరోక్ష ఉద్యోగాలు లభించగలవని విమానయాన రంగ నిపుణుల అవసరాలపై ప్రభుత్వం నిర్వహించిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఉద్యోగాల్లో 32% విమానయాన కంపెనీలు 25% కార్గో, 23% విమానాశ్రయాలు, దాదాపు 17% గ్రౌండ్‌ హ్యాండిలింగ్‌, 3% ఎంఆర్‌ఓ విభాగాలు అందించనున్నాయి.
ప్రధాన ఉద్యోగాలు
* రన్‌వే వద్ద భద్రత అధికారులు: కార్యకలాపాల నియంత్రణ అధికారులు, ఎమర్జెన్సీ ప్లానర్లు, అగ్ని ప్రమాద నివారణ సిబ్బంది, నిర్వహణ సిబ్బంది
* టెర్మినల్‌ నిర్వహణ: ట్యాలీ వర్కర్లు, లోడర్లు, షిఫ్ట్‌ మేనేజర్లు, విమానాశ్రయ నిర్వహణ సిబ్బంది, హౌస్‌ కీపింగ్‌, కార్గో హ్యాండిలింగ్‌
* ఎయిర్‌ నావిగేషన్‌: ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌, రాడార్‌ కంట్రోలర్‌, సెక్టర్‌ ఫ్లైట్‌ డేటా అసిస్టెంట్‌, డ్యూటీ కమ్యూనికేషన్‌ అధికారి, ఐటీ అధికారి
* విమానాశ్రయాల్లో: చెక్‌-ఇన్‌ ఏజెంట్లు, టికెటింగ్‌ ఏజెంట్లు, బోర్డింగ్‌ సిబ్బంది
* విమానంలో: పైలట్లు, ఫ్లైట్‌ ఆపరేషన్‌ సిబ్బంది, క్యాబిన్‌ సిబ్బంది, భద్రత సిబ్బంది, విమాన నిర్వహణ సిబ్బంది.
విమానయాన రంగ వృద్ధికి కారణాలు ఇవీ..
* జీడీపీ: స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ఆకర్షణీయంగా వృద్ధి చెందడం. అధిక ఆర్థిక కార్యకలాపాల కారణంగా వ్యాపార అవసరాల కోసం ప్రయాణించే వారి సంఖ్య పెరగడమేకాక విహార యాత్రలు చేసే యాత్రికుల సంఖ్య కూడా అధికమవుతుంది.
* మధ్య ఆదాయ వర్గం: పెరుగుతున్న మధ్య స్థాయి ఆదాయ వర్గం విమానయాన రంగ వృద్ధికి కీలకంగా నిలుస్తోంది. 2010లో మొత్తం జనాభాలో 13.3 శాతానికి సమానమైన 16 కోట్ల మంది ఈ వర్గంలో ఉంటే.. 2025 నాటికి జనాభాలో 37.2 శాతానికి సమానమైన 54.7 కోట్ల మంది ఈ వర్గం కిందకు రానున్నారు.
* పట్టణ జనాభా: 2030 నాటికి దేశ జనాభాలో దాదాపు 40 శాతానికి సమానమైన 59 కోట్ల మంది పట్టణాల్లోనే ఉంటారని వివిధ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 10 లక్షల జనాభా మించిన నగరాలు 2030 నాటికి 68 ఉంటాయని అంచనా.
* చౌక విమానయాన కంపెనీలు: చౌక విమానయాన వ్యాపార విధానం మరింత మందిని విమానయానానికి దగ్గర చేస్తోంది. కంపెనీల మధ్య పోటీ కూడా ఇందుకు దోహదం చేస్తోంది.
* 2027 నాటికి 50 కోట్ల దేశీయ విమానయాన టికెట్లను విక్రయించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
విమానయాన రంగంలో సాంకేతికేతర విభాగాల్లో ఉద్యోగాలకు అపార అవకాశాలు ఉన్నాయి. నిజానికి సరైన నిపుణులు లేక విమానయాన కంపెనీలు, విమానాశ్రయాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. సమాచార సాంకేతిక పరిజ్ఞానం (ఐటీ), హోటల్‌ మేనేజిమెంట్‌, ఔషధ తదితర పరిశ్రమల్లో ఉన్నట్లుగా విమానయాన రంగంలో అంతర్జాతీయ ప్రమాణాల్లో శిక్షణ ఇచ్చే నైపుణ్యాల అభివృద్ధి సంస్థలు దేశంలో లేవు. ఇటువంటి శిక్షణ సంస్థలను ఏర్పాటు చేసి అందుబాటు వ్యయంలో శిక్షణ ఇచ్చే విధంగా పరిశ్రమ, ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం దేశీయ విమానయాన సంస్థల చేతిలో దాదాపు 450 విమానాలు మాత్రమే ఉన్నాయి. వచ్చే కొద్ది సంవత్సరాల్లో ఇవి 3,000 నుంచి 4,000 వరకూ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అత్యున్నత స్థాయిలో జాతీయ విమానయాన శిక్షణ సంస్థను ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ రంగంలోని అన్ని శిక్షణ కార్యకలాపాలు దీని కిందకు తీసుకురావాలన్నది వారి ఆలోచన.
     - డి.పి.హేమంత్‌, సీఓఓ, ఏరోకమర్షియల్‌, కార్గో, ఏషియా పసిఫిక్‌ ఫ్లైయింగ్‌ స్కూల్‌, జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌.

Posted on 28-06-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning