బిగ్‌ డేటా అనలిటిక్స్‌.. ఉద్యోగాల గని

* ఇంజినీరింగ్‌ యువతకు ఉద్యోగావకాశాలు
* కొత్త కోర్సులకు విశ్వవిద్యాలయాలు సమాయత్తం
* ఐటీ శిక్షణ సంస్థల్లోనూ జోరు

ఈనాడు - హైదరాబాద్‌: ఐటీ, సాఫ్ట్‌వేర్‌ నిపుణులకు దీటుగా సమీప భవిష్యత్తులో బిగ్‌ డేటా విశ్లేషకుల హవా సాగనుంది. ఈ-కామర్స్‌, ఆన్‌లైన్‌ వ్యాపారం విస్తృతం కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ ఉద్యోగాలకు భారీ డిమాండ్‌ నెలకొంది. వేతనం కూడా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ల కంటే 40% ఎక్కువే! ఇలాంటి నిపుణులను తయారుచేసేందుకు తెలుగు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలు సిద్ధమవుతున్నాయి. సిలబస్‌ను మార్చేందుకు కసరత్తులు చేస్తున్నాయి. ఐటీ శిక్షణ సంస్థలు సైతం బిగ్‌ డేటా అనలిటిక్స్‌పై అనుభవజ్ఞులైన నిపుణులతో ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్నాయి. ఇంజినీరింగ్‌ విద్యార్థులకే కాకుండా... గణిత, గణాంకశాస్త్రాలు అభ్యసించినవారికీ ఇదో బృహత్తర అవకాశమంటున్నారు నిపుణులు!
మనం స్మార్ట్‌ఫోన్‌ కొందామనుకుని ఇంటర్నెట్‌లో కాసేపు వెతికి వూరుకుంటాం.
కానీ... ఆ తర్వాతి నుంచి మనం ఏ వెబ్‌సైట్‌ను తెరిచినా.. రకరకాల ఫోన్లు, వాటి బంపర్‌ ఆఫర్లకు సంబంధించిన ప్రకటనలే కనిపిస్తుంటాయి!
అలాంటి ప్రకటనలను మనం చూడకుండా ఉండగలమా? కొనకుండా ఆగగలమా?
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది తమకు అవసరమైన వస్తువులు, సేవల గురించి ఫోన్లు, కంప్యూటర్లు, ట్యాబ్‌ల ద్వారా నిత్యం అంతర్జాలంలో వెతుకుతూనే ఉంటారు.
ఇలా భారీగా వచ్చే డేటాను విశ్లేషించి... మన అభిరుచులకు తగినట్టు ఆన్‌లైన్‌లో వస్తువులు, సేవలను అందించడం, వ్యాపారాభివృద్ధికి ఇతోధికంగా తోట్పడటం ‘బిగ్‌ డేటా విశ్లేషణ’తో సుసాధ్యం!
సాఫ్ట్‌వేర్‌ రంగంలోని బిగ్‌ డేటా అనలిటిక్స్‌ విభాగం సమీప భవిష్యత్తులో యువతకు భారీ ఉద్యోగ అవకాశాలు సృష్టించనుంది. ఇందుకు అవసరమైన నిపుణులను తయారుచేసేందుకు విశ్వవిద్యాలయాలు మమేకం కావాలని ఐఐటీ ఆచార్యులు కూడా సూచిస్తున్నారు. ఈ దిశగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని సాంకేతిక విశ్వవిద్యాలయాలు ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్నాయి. జేఎన్‌టీయూ కాకినాడ, అనంతపురం, హైదరాబాద్‌ ప్రాంగణాల అధికారులు సిలబస్‌లో మార్పులు, చేర్పులపై దృష్టి సారించారు.
కొన్నేళ్లుగా ఈ-కామర్స్‌ జోరందుకొంది. ఆన్‌లైన్‌లో ఆర్థిక కార్యకలాపాలు జరిపేవారు అధికమవుతున్నారు. బ్యాంకింగ్‌ రంగం నానాటికీ విస్తరిస్తోంది. అంతర్జాలం, సామాజిక మాధ్యమాలను వినియోగించేవారు ఎక్కువవుతున్నారు. దీంతో నిరంతరం అనంతంగా డేటా వచ్చి పడుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటాలో 90% గత కొన్ని సంవత్సరాల్లో వచ్చిందే. 2020 నాటికి ఇది ఎన్నో జెటాబైట్లకు చేరనుంది. ఇంతటి భారీ సమాచారాన్నీ, వివరాలను విశ్లేషించి ఆయా రంగాలకు అందిస్తే... సంస్థలు, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు వీలవుతుంది. డేటాను విశ్లేషిస్తే కంపెనీలు తమ వ్యాపార వ్యూహాలను మార్చుకునేందుకు అవకాశముంటుంది. దేశవ్యాప్తంగా వినియోగదారులు ఏ వస్తువులను ఎక్కువగా కొంటున్నారు? ఎంత ధరకు వాటిని ఇష్టపడుతున్నారు? ఏ సమయంలో షాపింగ్‌ చేస్తున్నారు..? వంటి విలువైన సమాచారమూ తెలుస్తుంది. అందుకే ఇది వ్యాపార రంగానికే కాకుండా... బ్యాంకింగ్‌, ఆర్థిక, స్టాక్‌మార్కెట్‌, వైద్యం తదితర ఎన్నో రంగాలకూ కీలకమే!
పదేళ్లలో 8 రెట్ల వృద్ధి..
సాఫ్ట్‌వేర్‌ రంగంలో బిగ్‌డేటా విశ్లేషణ విభాగం భారీ వృద్ధిరేటును నమోదు చేయనుందని నాస్కామ్‌ అంచనా వేసింది. ప్రస్తుతం దేశీయ బిగ్‌ డేటా విశ్లేషణ విభాగం సేవలు ఏడాదికి 200 కోట్ల డాలర్లు ఉంది. 2025 నాటికి అది 1,600 కోట్ల డాలర్ల (రూ.99,200 కోట్ల)కు చేరుతుందని ఆ సంస్థ అంచనా. డేటా విశ్లేషణలో ప్రపంచంలో మొదటి పది స్థానాల్లో భారత్‌ ఒకటిగా ఉన్న భారత్‌... వచ్చే మూడేళ్లలో తొలి మూడుస్థానాల్లో చోటు సంపాదిస్తుందని భావిస్తున్నారు.
‘అమీర్‌పేట’ సంస్థలు సిద్ధం
ఐటీ శిక్షణ సంస్థలకు హైదరాబాద్‌లోని అమీర్‌పేట ప్రాంతం నిలయం. ఐటీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఏ కొత్త సాఫ్ట్‌వేర్‌ వచ్చినా.. మార్పులు చోటుచేసుకున్నా అందుకు అనుగుణంగా ఇక్కడి సంస్థలు కోర్సులు, శిక్షణ ఇస్తాయి. బిగ్‌ డేటాపై కొన్నేళ్ల క్రితం నుంచే పలు సంస్థలు శిక్షణ ఇస్తుండగా, ఇప్పుడు బిగ్‌డేటా అనలిటిక్స్‌పైనా తర్ఫీదు ప్రారంభిస్తున్నాయి. వచ్చేనెలలోనే ఈ కోర్సులు నడిపేందుకు సమాయత్తమవుతున్నట్లు బిగ్‌డేటా శిక్షణ నిపుణుడు మూర్తి ఎన్‌వీఎస్‌ చెప్పారు. ప్రస్తుతానికి ఇప్పటికే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ బిగ్‌ డేటా విశ్లేషణ విభాగానికి వెళ్లాలనుకునేవారికి శిక్షణ ఇవ్వనున్నారు.
బిగ్‌ డేటా శాస్త్రవేత్తలదే హవా
ఈ శాస్త్రవేత్తలకు ప్రాధాన్యం పెరగనుంది. అమెరికాలో అత్యధిక వేతనాలు కలిగిన ఉద్యోగంగా బిగ్‌ డేటా సైంటిస్టును గుర్తించారు. దీనిని కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ కూడా గమనించి దేశవ్యాప్తంగా ఐఐటీలు, విశ్వవిద్యాలయాల విద్యార్థులు, అధ్యాపకులకు శిక్షణ కార్యక్రమాల్ని చేపట్టింది. ఇప్పటివరకు 40 రకాల కార్యక్రమాలు జరిగాయి. చెన్నై ఐఐటీలో యాహూ గ్రిడ్‌ ల్యాబ్‌లో బిగ్‌ డేటా అండ్‌ క్లౌడ్‌ కంప్యూటింగ్‌పై పరిశోధనలు జరుగుతున్నాయి. సాంకేతిక విశ్వవిద్యాయాలు ఇంజినీరింగ్‌ విద్యకు సంబంధించిన పాఠ్య ప్రణాళికలో దీనికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరముంది.
      - ఆచార్య జానకిరామ్‌, ఐఐటీ మద్రాస్‌ (సీఎస్‌ఈ)
ప్రభుత్వం సహకరిస్తే సర్టిఫికెట్‌ కోర్సులు
అన్ని రంగాలకు సంబంధించిన సమాచారం, గణాంకాలు ప్రతినిమిషం పెరుగుతున్నాయి. గతంలో కొద్ది సమాచారం ఉంటే మానవవనరులతో విశ్లేషణ చేసేవారు. ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటేనే అది సాధ్యమవుతుంది. ఈ క్రమంలో బిగ్‌ డేటా విశ్లేషణకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఇప్పటికే మా సంస్థ దీనిపై సదస్సులు నిర్వహించింది. విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నా.. వసతిగృహం అవసరం. నిధులపరంగా సమస్య లేకుంటే సర్టిఫికెట్‌ కోర్సులను అందిస్తాం. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అందుకు సహకరించాలి. బిగ్‌ డేటా విశ్లేషణ వల్ల ఇంజినీరింగ్‌ విద్యార్థులకే కాకుండా ఎంఎస్‌సీ గణితం, స్టాటిస్టిక్స్‌ (గణాంకశాస్త్రం) చదివినవారికి కూడా అవకాశాలు పెరుగుతాయి.
      - ఆచార్య ప్రకాశరావు,ఇన్‌ఛార్జి సంచాలకుడు, సీఆర్‌ రావు సంస్థ
సిలబస్‌లో మార్పులు చేశాం
బిగ్‌ డేటా అనలిటిక్స్‌ ప్రాధాన్యాన్ని గుర్తించి, అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. విశ్వవిద్యాలయాల ఇంజినీరింగ్‌ కళాశాలల్లో మూడో సంవత్సరం రెండో సెమిస్టరులో బిగ్‌ డేటా అనలిటిక్స్‌ కోర్సును ప్రవేశపెట్టాం. 2016-17లో నాలుగో సంవత్సరం మొదటి సెమిస్టర్‌లో అనలిటిక్స్‌-2, రెండో సెమిస్టరులో అనలిటిక్స్‌-3 సబ్జెక్టులను ప్రవేశపెడతాం. ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చదివే విద్యార్థులకూ వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సిలబస్‌లో అవసరమైన మార్పులు చేశాం.
      - ఎం.ఎం.ఎం.సర్కార్‌, ఉపకులపతి, జేఎన్‌టీయూ అనంతపురం
కళాశాలల దృక్ఫథంలో మార్పు రావాలి
బిగ్‌ డేటా విశ్లేషణకు డిమాండ్‌ పెరుగుతున్నందున కొన్ని కళాశాలలు ఆ సబ్జెక్టులను ఐచ్ఛికంగా కాకుండా తప్పనిసరిగా తీసుకోవాలని విద్యార్థులకు చెప్పే అవకాశముంది. నాస్కామ్‌ అధ్యయనం నేపథ్యంలో ఈసారి వాటిపై ఎక్కువ కళాశాలలు దృష్టి సారిస్తాయని భావిస్తున్నా. గత ఏడాది జేఎన్‌టీయూహెచ్‌లోని స్కూల్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఎస్‌ఐటీ) నాస్కామ్‌తో కలిసి బిగ్‌ డేటా విశ్లేషణపై అధ్యాపకులకు శిక్షణ ఇచ్చింది.
      - ఆచార్య కామాక్షి ప్రసాద్‌, సీఎస్‌ఈ విభాగాధిపతి, జేఎన్‌టీయూహెచ్‌ కళాశాల
భారీగా ఉద్యోగావకాశాలు
బిగ్‌ డేటా అనలిటిక్స్‌ విభాగం గణనీయ వృద్ధిని నమోదు చేస్తుండటంతో నిపుణుల కొరత కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ రంగంలో ప్రపంచవ్యాప్తంగా 90 వేల మంది నిపుణులే పనిచేస్తున్నారు. 2018 నాటికి ఒక్క అమెరికాలోనే 1.90 లక్షల మంది డేటా సైంటిస్టులు, 15 లక్షల మంది డేటా మేనేజర్లు, విశ్లేషకుల కొరత ఉంటుందని మెకన్సీ గ్లోబల్‌ ఇన్‌స్టిట్యూట్‌ అధ్యయనంలో వెల్లడైంది. ఈ క్రమంలో విద్యాసంస్థలు బిగ్‌ డేటా విశ్లేషణపై దృష్టిసారిస్తే తెలుగు విద్యార్థులు ఉద్యోగావకాశాలను దక్కించుకుంటారని నిపుణులు సూచిస్తున్నారు. ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఈ సబ్జెక్టుపై పట్టు సంపాదించాల్సిన అవసరముందని ఓ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రవీంద్ర అభిప్రాయపడ్డారు.
* బిగ్‌ డేటా, బిగ్‌ డేటా అనలిటిక్స్‌కు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని జేఎన్‌టీయూ హైదరాబాద్‌ గమనించింది. అందుకే బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ మూడో సంవత్సరం రెండో సెమిస్టర్‌లో ఇంటర్‌డక్షన్‌ టూ అనలిటిక్స్‌ పేరిట ఐచ్ఛిక సబ్జెక్టు(ఎలెక్టివ్‌)ను ప్రవేశపెట్టింది.
* నాలుగో సంవత్సరం ప్రథమ సెమిస్టర్‌లో బిగ్‌ డేటా అనలిటిక్స్‌, ప్రెడిక్టివ్‌ అనలిటిక్స్‌ పేరిట మరో రెండు ఐచ్ఛిక సబ్జెక్టులను అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు కోరుకుంటే ఈ రెండు సబ్జెక్టులను చదవొచ్చు.
* వీటిని జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలోని స్వయంప్రతిపత్తి ఉన్న కళాశాలల్లో 2015-16 విద్యా సంవత్సరం నుంచి ప్రవేశపెట్టగా... 2016-17 నుంచి అన్ని అనుబంధ కళాశాలల్లోనూ అందుబాటులోకి రానున్నాయి.
* ఎంటెక్‌ మొదటి సెమిస్టర్‌ కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ కోర్సుల్లో బిగ్‌ డేటా విశ్లేషణపై పాఠ్యాంశాలున్నాయి. మార్కెట్‌ అవసరాల్ని అనుసరించి ప్రస్తుతానికి ఐచ్ఛిక సబ్జెక్టులుగా ఉన్న బిగ్‌ డేటాను కోర్సుగా మార్చాలని ఆలోచిస్తున్నట్లు ఓయూ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రధానాచార్యులు రామచంద్రం తెలిపారు. జేఎన్‌టీయూ అనంతపురం, కాకినాడ అధికారులు కూడా ఈ అంశంపై కోర్సుల్ని నిర్వహిస్తున్నారు. క్రమేణా దీనిని విస్తృతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Posted on 29-06-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning