‘పని’కొచ్చే ఐటీ కోర్సులు!

* ఉపాధి లక్ష్యంగా తిరుపతిలో ఐఐడీసీ ఏర్పాటు
* దేశంలోనే మొదటి భవిష్యతర సాంకేతిక శిక్షణ సంస్థ
* అమరావతి, విశాఖపట్నాల్లోనూ ఏర్పాటు చేసే యోచన

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా, పూర్తి స్థాయిలో భవిష్యతరం సాంకేతిక నైపుణాల్లో శిక్షణ అందించేందుకు అంతర్జాతీయ డిజిటల్‌ టెక్నాలజీల సంస్థ (ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ డిజిటల్‌ టెక్నాలజీస్‌-ఐఐడీటీ) ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. తిరుపతిలోని ఎస్వీ విశ్వవిద్యాలయంలో 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలోని భవనంలో ఈ ఏడాదే శిక్షణా తరగతులను ప్రారంభిస్తారు. మూడేళ్ల పాటు దీని నిర్వహణ ఖర్చుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.39.97 కోట్లను విడుదల చేస్తూ జూన్ 30న ఉత్తర్వులు జారీ చేసింది.
ఐఐడీటీ ప్రత్యేకతలు ఇవీ..
* ఐఐడీటీలో ఐదు అంశాలపై శిక్షణ ఉంటుంది. డేటా అనలిటిక్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, వర్చువల్‌ రియాలటీ, క్లౌడ్‌ టెక్నాలజీ, ఇంటర్నెట్‌ఆఫ్‌ టెక్నాలజీ (ఐఓటీ)ల్లో తర్ఫీదునిస్తారు.
* ఏడాది శిక్షణ ఉంటుంది. బర్క్‌లీ, స్టాన్‌ఫర్డ్‌, యూటీ-ఆస్టిన్‌వంటి వర్సిటీలతోపాటు వివిధ వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు చెందిన నిపుణుల ద్వారా శిక్షణ అందజేస్తారు.
* సిలికాన్‌ వ్యాలీ నుంచి కూడా ఆయా రంగాల్లో నిపుణులు ఆన్‌లైన్‌లో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శిక్షణ ఇస్తారు.
* ఐఐడీటీలో శిక్షణ పొందేందుకు ఏదైనా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. రాతపరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు.
* తొలి సంవత్సరం 200 సీట్లతో ప్రారంభిస్తున్నారు. ఒక్కో శిక్షణాంశంలో 20 మందికి శిక్షణ అందిస్తారు.
* నాలుగో ఏడాది నుంచి ఐఐడీటీ సొంత వనరులను సమకూర్చుకుని స్వతంత్ర సంస్థగా శిక్షణ అందించనుంది. ఫీజు వివరాలను త్వరలోనే వెల్లడిస్తారు.
* ఎస్వీ విశ్వవిద్యాలయంలో తాత్కాలికంగా తరగతులు నిర్వహించనున్నారు. త్వరలో విశ్వవిద్యాలయంలోనే సొంతంగా భవనం ఏర్పాటు చేసుకోనున్నారు.
* నాలుగేళ్లలో విద్యార్థుల సంఖ్యను 1500కు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
* నాలుగేళ్లలో 45 డిజిటల్‌ సాఫ్ట్‌వేర్‌ అంకుర సంస్థలు, ఎనిమిది ‘ఏపీలో తయారీ’ కింద డిజిటల్‌ సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తులు, పెటెంట్‌ స్థాయిలో డిజిటల్‌ ఆవిష్కరణలను జరపాలనేది లక్ష్యం.
* తిరుపతి సంస్థ విజయవంతమైతే అమరావతి, విశాఖపట్నంలలో కూడా ఏర్పాటు చేస్తారు.
ప్రయోజనాలు
* ప్రస్తుతం కళాశాలల్లో ప్రాథమిక అంశాలపైనే శిక్షణ లభిస్తోంది. ఐఐడీటీలో ఉద్యోగ అవకాశాలు కల్పించే నైపుణ్య కోర్సుల్లో శిక్షణ ఇస్తారు.
* ప్రస్తుతం ఆన్‌లైన్‌ బ్యాంకు లావాదేవీల నుంచి షాపింగ్‌, బోధన, భద్రతా, పరిపాలన.. ఇలా ఎన్నో రకాల అంశాలు సాంకేతికతతో ముడిపడి ఉన్న నేపథ్యంలో వాటిలో పూర్తిస్థాయి పట్టు సాధించేలా శిక్షణ ఇస్తారు.
* ఐఐడీటీ శిక్షణతో ఐటీ, ఈ-కామర్స్‌, బ్యాంకులు తదితర సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
* ఈ కోర్సులో శిక్షణకు ఏపీ యువత హైదరాబాద్‌, బెంగళూరు, దిల్లీ వంటి ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిన అవసరం తప్పుతుంది.
* ఐఐడీటీలో ప్రవేశాలకు తొలి ప్రాధాన్యం ఏపీ యువతకే కల్పిస్తారు.
* ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) తరహాలో బోధన ఉంటుంది. శిక్షణ అంశాలు కాలానుగుణంగా మారుతాయి. పారిశ్రామిక, వాణిజ్య, పరిపాలన రంగాలకు అవసరాలకు తగినట్లుగా తర్ఫీదునిస్తారు.

Posted on 01-07-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning