గేట్‌-2017 భవితకు మలుపు!

గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌)లో ఉత్తీర్ణత విద్యార్థి సాంకేతిక పరిజ్ఞానానికి సూచిక. ఇంజినీరింగ్‌లో పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలకూ, ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ నియామకాలకూ గేట్‌ స్కోరు ప్రామాణికం. ఈ పరీక్ష వల్ల ప్రత్యక్షంగానే కాకుండా పరోక్ష ప్రయోజనాలూ ఉన్నాయి. దీనికి సర్వసన్నద్ధం ఎలా కావాలో తెలుసుకుందాం!
ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీలతో పాటు ఐఐఎస్‌సీ, బెంగళూరు, వివిధ ఎన్‌ఐటీలు, ప్రముఖ ఇంజినీరింగ్‌/టెక్నాలజీ/ఆర్కిటెక్చర్‌ విభాగాల్లో చేరడానికి గేట్‌ స్కోరు తప్పనిసరి. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ, ఉన్నత విద్యాశాఖల తరఫున ఐఐఎస్‌సీ, ఐఐటీల సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఈసారి గేట్‌ను ఐఐటీ రూర్కీ నిర్వహిస్తోంది.
ఈ సంవత్సరం గేట్‌ను మనదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో- బంగ్లాదేశ్‌, ఇథియోపియా, నేపాల్‌, సింగపూర్‌, శ్రీలంక, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో కూడా నిర్వహిస్తున్నారు.
ప్రత్యక్ష ఉపయోగాలు
* గేట్‌ స్కోరుతో దేశంలోని అన్ని ఉన్నత విద్యాసంస్థల్లో పీజీ కోర్సు ప్రవేశంతోపాటు నెలకు రూ.12,400 ఉపకార వేతనం లభిస్తుంది.
* ఈ స్కోరు పీహెచ్‌డీ ప్రవేశాలకూ ఉపయోగం. ఇంకా నెలకు రూ.28,000 ఉపకార వేతనం అందిస్తారు.
* ఎన్‌ఐటీఐఈ (ముంబయి)లో పీజీ డిప్లొమా చేయటానికి ఈ స్కోరు ఉపయోగపడుతుంది.
* ఈ స్కోరు ద్వారా ఐఐటీ ఢిల్లీ/దిల్లీ, ఎన్‌ఐటీ సూరత్‌కల్‌/తిరుచ్చిలో ఎంటెక్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌ చేయడానికి ఎల్‌అండ్‌టీ ఉపకార వేతనం ఇస్తుంది. విజయవంతంగా ఎంటెక్‌ పూర్తిచేస్తే ఉద్యోగావకాశమూ కల్పిస్తుంది.
* గేట్‌ స్కోరు ఆధారంగా వివిధ ఐఐఎంలలో ఫెలో ప్రోగ్రాం ఇన్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్లు అందిస్తారు.
* బాబా అటామిక్‌ రిసర్చ్‌ సెంటర్‌ వంటి పరిశోధన సంస్థలు కూడా ఈ స్కోరును గుర్తిస్తున్నాయి. గ్రూప్‌-ఏ లెవల్‌ సంబంధిత పోస్టులైన సీనియర్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌, సీనియర్‌ రిసర్చ్‌ ఆఫీసర్‌, ఎస్‌ఆర్‌ఓ (ఎస్‌అండ్‌టీ) నియామకాలకు కూడా గేట్‌ స్కోరే ఆధారం.
* కొత్తగా ఈ సంవత్సరం నుంచి డీఆర్‌డీఓ కూడా తమ సంస్థలో ఉద్యోగ నియామకాలకు గేట్‌ స్కోరును పరిగణనలోకి తీసుకుంటోంది.
* విదేశీ విద్య: ఈ స్కోరు ఆధారంగా ఎంఎస్‌, పీహెచ్‌డీ ప్రోగాం అందించే విదేశీ విశ్వవిద్యాలయాలు 1) సింగపూర్‌లోని నాన్‌యంగ్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ (ఎన్‌టీయూ) 2) నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌ (ఎన్‌యూఎస్‌) 3) జర్మనీలోని RWTH AACHEN, టెక్నికల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ మ్యూనిచ్‌.
పరోక్ష ఉపయోగాలు
* కొత్తగా ప్రవేశపెట్టిన ఈఎస్‌ఈ స్టేజ్‌-1కు సిద్ధమవటానికి గేట్‌ సన్నద్ధత దృఢమైన పునాదిని వేస్తుంది.
* ఇది ఇతర పోటీపరీక్షలకూ ఉపయోగమే.
* ప్రాంగణ నియామకాల్లో, నియామక ఇంటర్వ్యూల్లో గేట్‌ ప్రిపరేషన్‌ పనికివస్తుంది.
దరఖాస్తు ప్రక్రియ
* ఐఐఎస్‌సీ, ఏడు ఐఐటీల్లోని ఏదో ఒక గేట్‌ జోనల్‌ వెబ్‌సైట్‌లోని ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ప్రాసెసింగ్‌ సిస్టమ్‌ (GOAPS ) ఉపయోగించి దరఖాస్తును ఆన్‌లైన్‌లో నింపి రిజిస్టర్‌ చేసుకోవాలి. దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌: http://gate.iitr.ernet.in
* గేట్‌ 2017 దరఖాస్తు ఫారాలు ఆన్‌లైన్‌లో సంబంధిత వెబ్‌సైట్లో మాత్రమే లభిస్తాయి. బయట ఎక్కడా అమ్మరు.
* గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఆఖరి సంవత్సరం చదివే, ఇంజినీరింగ్‌ పూర్తయిన విద్యార్థులు గేట్‌ రాయటానికి అర్హులు. మూడో సంవత్సరం విద్యార్థులు అనర్హులు.
* ఇంజినీరింగ్‌ పూర్తయినవారు డిగ్రీ సర్టిఫికెట్‌/ ప్రొవిజనల్‌తో దరఖాస్తు చేయాల్సివుంటుంది. కోర్సు చదువుతున్న విద్యార్థులకు ప్రిన్సిపల్‌ నుంచి పొందిన అనుమతి పత్రం సరిపోతుంది.
గేట్‌-2017: ప్రధాన విషయాలు
* ఈ పరీక్షను 23 పేపర్లలో నిర్వహిస్తున్నారు. గేట్‌ను ఆన్‌లైన్లో నిర్వహించడం వల్ల ప్రశ్నపత్రాలను వివిధ సెట్లుగా రూపకల్పన చేస్తున్నారు. కాబట్టి అధ్యాయాలతో సహా అన్ని సబ్జెక్టులకూ ప్రాధాన్యం ఇస్తున్నారు. అభ్యర్థులు ఏ సబ్జెక్టునూ నిర్లక్ష్యం చేయకుండా అన్ని సబ్జెక్టుల్లో ప్రతి అధ్యాయాన్నీ చదవాలి.
* గేట్‌ స్కోరు పీజీ ప్రవేశానికి మూడు సంవత్సరాలు, పీఎస్‌యూలకు 1 లేదా 2 సంవత్సరాలు చెల్లుబాటులో ఉంటుంది.
వర్చ్యువల్‌ కాల్‌క్యులేటర్‌:
* పరీక్ష కేంద్రంలోకి కాల్‌క్యులేటర్‌, మొబైల్స్‌ను అనుమతించరు. అభ్యర్థులు కాల్‌క్యులేషన్స్‌ చేసుకోవడానికి ఆన్‌లైన్‌ వర్చువల్‌ కాల్‌క్యులేటర్‌ను అందుబాటులోకి ఉంచుతారు. కంప్యూటర్‌ మౌస్‌ను ఉపయోగించి ఈ కాల్‌క్యులేటర్‌ను వాడుకోవచ్చు.
* వర్చ్యువల్‌ కాల్‌క్యులేటర్లో అన్ని రకాల ఫంక్షన్లు లేకపోవడం వల్ల దీనికి అనుగుణంగానే వివిధ విభాగాల్లో ప్రశ్నలు రూపొందే అవకాశం ఉంది.
* ఇమేజినరీ ఫంక్షన్స్‌, హైయర్‌ ఆర్డర్‌ సమీకరణాలకు సంబంధించిన ప్రశ్నలు అడగకపోవచ్చు.
* గేట్‌ ఉదయం, మధ్యాహ్నం ప్రత్యామ్నాయ వారాంతాల్లో (శనివారం, ఆదివారం) 2017 ఫిబ్రవరి 4, 5; ఫిబ్రవరి 11, 12 లలో జరుగుతుంది.
* ఆన్‌లైన్‌ విధానంలో కంప్యూటర్‌ మౌస్‌ను ఉపయోగించి సరైన ఆప్షన్‌ గుర్తించాలి.
* న్యూమరికల్‌ ప్రశ్నలకు ఆప్షన్లు ఇవ్వరు. ఈ ప్రశ్నలకు సమాధానాలు వర్చువల్‌ కీ బోర్డును ఉపయోగించి రాయాలి.
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభం: సెప్టెంబరు 1, 20160
ఆన్‌లైన్‌ దరఖాస్తుల సమర్పణకు గడువు: అక్టోబరు 4, 2016
గేట్‌-2017 తేదీలు: 2017 ఫిబ్రవరి 4, 5; ఫిబ్రవరి 11, 12
ప్రశ్నలు ఆయా రంగాల్లోని నూతన ఆవిష్కరణలను దృష్టిలో పెట్టుకుని వుంటాయి. ఎలక్ట్రికల్‌ పేపర్లో పవర్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ పేపర్లో డిజిటల్‌ కమ్యూనికేషన్‌, ఇంకా వీఎల్‌ఎస్‌ఐ విభాగాల్లో నిత్యం మార్పులు...! ఈ సబ్జెక్టుల్లో లోతుగా అధ్యయనం చేయాల్సిందే!
విజయానికి సూత్రాలు
1 ఇప్పటినుంచే రోజూ కనీసం 6 నుంచి 8 గంటలు సాధనకు కేటాయించాలి. ప్రతి వారాంతం, నెలకోసారి చదివిన అంశాలను విశ్లేషించుకోవాలి. సన్నద్ధతలో పరిమాణం కంటే నాణ్యత ముఖ్యం.
2 పరీక్షలో ప్రతి ప్రశ్నకూ సరైన సమాధానం రాయడం కష్టం. మూడు గంటల వ్యవధిలో ఎన్ని ప్రశ్నలు, ఏ ప్రశ్నలు రాస్తే ఎన్ని మార్కులు సాధించగలమనేది నిర్ణయించుకోవాలి.
3 సన్నద్ధమయే సమయంలో కూడా ఇదే సూత్రాలు పాటించాలి. అందుబాటులో ఉన్న ఆరునెలల సమయంలో ఏవి చదివితే ఎక్కువ మార్కులు వస్తాయో నిర్ణయించుకోవాలి.
4 ఆన్‌లైన్‌ మోడల్‌ పేపర్లను తప్పనిసరిగా సాధన చేయాలి.
5 తొలిసారి సిద్ధమయేటపుడు ప్రతి అధ్యాయానికీ సంబంధించి ముఖ్య విషయాలను చిన్న పట్టికల ద్వారా సంక్షిప్తంగా తయారుచేసుకోవాలి. పరీక్ష ముందురోజుల్లో పునశ్చరణకు ఇది చాలా ఉపయోగం.
6 ప్రామాణిక పాఠ్యపుస్తకాలను ఎంచుకోవడం ప్రధానం
7 ఇంజినీరింగ్‌, సివిల్‌ సర్వీసెస్‌ గత ప్రశ్నపత్రాల అధ్యయనం చాలా ప్రయోజనకరం. దీనివల్ల ఒక అంశాన్ని ఎన్నివిధాలుగా అడగటానికి అవకాశం ఉంటుందో తెలుస్తుంది.
గేట్‌ ప్రశ్నపత్రం మొత్తం 100 మార్కులకు. పరీక్ష వ్యవధి 3 గంటలు. ప్రశ్నపత్రంలో రెండు విభాగాలుంటాయి.
విభాగం-1 (జనరల్‌ ఆప్టిట్యూడ్‌): ఇందులో 10 ప్రశ్నలుంటాయి. ఒకటి నుంచి ఐదు ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. 6 నుంచి 10 ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు.
* ఈ విభాగంలోని 4 నుంచి 5 ప్రశ్నలు ఇంగ్లిష్‌ సంబంధితం (వెర్బల్‌ ఎబిలిటీ). మిగతావి క్వాంటిటేటివ్‌కు సంబంధించిన ఇవ్వొచ్చు.
విభాగం-2 (సంబంధిత ఇంజినీరింగ్‌ సబ్జెక్టులు): ఇందులో 55 ప్రశ్నలుంటాయి. 1-25 ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. 26-55 ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు.
* గత సంవత్సరం ప్రశ్నపత్రంలో కామన్‌ డేటాబేస్డ్‌ ప్రశ్నలు, లింక్‌ ప్రశ్నలు ఇవ్వలేదు. ఈ ఏడాది కూడా ఈ ప్రశ్నలు ఇవ్వకపోవచ్చు.
నెగిటివ్‌ మార్కులతో జాగ్రత్త: గేట్‌లో ఒక తప్పు జవాబుకు 33.33 శాతం రుణాత్మక మార్కులుంటాయి. అంటే ఒక మార్కు ప్రశ్నలకు 1/3, రెండు మార్కుల ప్రశ్నలకు 2/3 చొప్పున మైనస్‌ మార్కులుంటాయి. న్యూమరికల్‌ ప్రశ్నలకు రుణాత్మక మార్కులుండవు.
ప్రశ్నల సరళి ఎలా ఉంటుంది?
పరీక్షపత్రంలో ప్రశ్నలు ఎలా ఉండాలో, ఏ సబ్జెక్టుకు ఎంత ప్రాధాన్యం ఉండాలో ఐఐటీల కోర్‌ కమిటీ నిర్ణయిస్తుంది. గత పరీక్షపత్రాల సరళి ప్రకారం పరిశీలిద్దాం.
ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ బ్రాంచిల్లో...
35 శాతం ప్రశ్నలు: కామన్‌ సబ్జెక్టుల్లో ఉంటాయి. ఉదా: డిజిటల్‌ ఎలక్ట్రానిక్స్‌, అనలాగ్‌ ఎలక్ట్రానిక్స్‌, మైక్రో ప్రాసెసర్స్‌, నెట్‌వర్క్‌ థియరీ, కంట్రోల్‌ సిస్టమ్స్‌, సిగ్నల్‌ అండ్‌ సిస్టమ్స్‌, ట్రాన్స్‌ఫార్మర్‌ థియరీ
35 శాతం ప్రశ్నలు: సంబంధిత కోర్‌ సబ్జెక్టుల్లో
ఎ) ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌: పవర్‌ సిస్టమ్స్‌, మెషిన్స్‌, మెజర్‌మెంట్స్‌, పవర్‌ ఎలక్ట్రానిక్స్‌
బి) ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌: ఎలక్ట్రో మ్యాగ్నటిక్‌ థియరీ, కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్‌ డివైసెస్‌
సి) ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ ఇంజినీరింగ్‌: సెన్సార్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌, ఎలక్ట్రానిక్‌ మెజర్‌మెంట్స్‌, ఆప్టికల్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌
గణితం: 10-15 శాతం ప్రశ్నలు. అయితే ఈ విభాగంలోనివి శుద్ధ గణితంలాగా ఉండవు. ఇంజినీరింగ్‌ అప్లికేషన్‌తో ఉంటాయి.
* ముఖ్యమైన సూచన ఏమిటంటే... ప్రశ్నలు ఆయా రంగాల్లోని నూతన ఆవిష్కరణలను దృష్టిలో పెట్టుకునివుంటాయి. ఎలక్ట్రికల్‌ పేపర్లో పవర్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ పేపర్లో డిజిటల్‌ కమ్యూనికేషన్‌, వీఎల్‌ఎస్‌ఐ విభాగాల్లో నిత్యం మార్పులు జరుగుతున్నాయి. కాబట్టి ఈ సబ్జెక్టుల్లో లోతుగా అధ్యయనం చేయాల్సిందే!
* ప్రతి పేపర్లో పదికి మించిన సబ్జెక్టులు. కానీ మొత్తం ప్రశ్నలు 65. ఏ సబ్జెక్టుకు ఎన్ని ప్రశ్నలు అనేది ఐఐటీలకు ఒక సవాలుగా మారింది. అందుకని ఐఐటీ ప్రొఫెసర్లు రెండు మూడు సబ్జెక్టుల విషయాలను కలిపి ప్రశ్నలుగా సంధిస్తున్నారు. ప్రతి పేపర్లో వివిధ సబ్జెక్టులను మిళితం చేస్తూ ప్రశ్నలు రూపొందిస్తున్నారు.


- YV గోపాల‌కృష్ణమూర్తి, ఎండీ, ఏస్ ఇంజ‌నీరింగ్ అకాడ‌మీ


Posted on 04-07-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning