తడబడితే ఉద్యోగం హుళక్కే!

* కరచాలనం సరిగా ఇవ్వకున్నా..
* కళ్లలోకి చూడలేకపోయినా..
* పాత యాజమాన్యాన్ని అతిగా తిట్టినా..
* ముఖాముఖిలో అభ్యర్థుల తిరస్కారంపై టైమ్స్‌జాబ్స్‌ అధ్యయనం

ఈనాడు వాణిజ్య విభాగం: ‘నాకు అన్ని అర్హతలున్నాయ్‌.. మార్కులు కూడా ఎక్కువే.. మరి ఉద్యోగానికి ఎందుకు ఎంపిక కాలేదబ్బా..’ అనుకునే వారు గమనించాల్సిన అంశాలు మరికొన్ని ఉన్నాయ్‌ అంటోంది టైమ్స్‌జాబ్స్‌ అధ్యయనం. ముఖాముఖి (ఇంటర్వ్యూ) నిర్వహించేవారి కళ్లలోకి చూడలేకపోయినా, కరచాలనం సరిగా ఇవ్వకపోయినా, ప్రశ్నలకు తడబడినా, పాత యాజమాన్యం (గతంలో పనిచేసిన సంస్థ) గురించి అతిగా చెడు మాట్లాడినా కూడా, కొత్త ఉద్యోగానికి ఎంపికయ్యే అవకాశాలు తగ్గిపోతాయని నివేదిక పేర్కొంది. ఒక అభ్యర్థిని తిరస్కరించేందుకు అతను ఇచ్చే సమాధానాల కంటే, అతని హావభావాలు- ప్రవర్తన ఎక్కువ కారణమవుతోందని తేల్చి చెప్పింది.
తిరస్కరణకు కారణమైన వ్యవహారశైలి
* ‘బలహీన కరచాలనం సహా వ్యవహారశైలి’ వల్లే ఉద్యోగం పొందలేకపోయామని సర్వేలో పాల్గొన్న వారిలో 60 శాతం మంది తెలిపారు.
* ఉద్యోగంపై ఆసక్తి ఉన్నట్లు కనపడటం లేదని నియామక ప్రతినిధి అన్నట్లు 40 శాతం మంది వెల్లడించారు.
* ముఖాముఖికి ఆలస్యంగా వెళ్లినందున కోల్పోయామని 30 శాతం మంది చెప్పారు.
* ముఖాముఖి నిర్వహించే వారి కళ్లలోకి చూడలేకపోయామని, ఇదే ఉద్యోగానికి దూరం చేసిందని 30 శాతం మంది వివరించారు.
* వస్త్రధారణ సరిగా లేక అవకాశం కోల్పోయామని 25 శాతం మంది, బలహీన కరచాలనం, కూర్చునే పద్ధతి సక్రమంగా లేక ఎంపిక కాలేదని 10 శాతం మంది తెలిపారు.
కనీసం 5 తిరస్కరణలు
ముఖాముఖిలో ఎంపిక కాలేకపోవడానికి దారితీస్తున్న అంశాలపై మొత్తం 700 మంది వృత్తి నిపుణులను సర్వే చేసి, ఈ నివేదిక రూపొందించారు. వీరిలో 70 శాతం మంది ఏదోఒక దశలో ఉద్యోగం పొందలేకపోయారు. సగం మందికి పైగా, కనీసం 5 తిరస్కరణలు చవిచూశామని తెలిపారు.
సమాధానాల్లో పొరపాట్లు..
* సమాధానాల్లో తడబడటం వల్ల ఉద్యోగం రాలేదని 40 శాతం మంది చెప్పారు.
* అతిగా మాట్లాడి, అవకాశం కోల్పోయామని 30 శాతం మంది పేర్కొన్నారు.
* పాత యాజమాన్యం గురించి మరీ ఎక్కువగా చెడుగా మాట్లాడటం, చేరబోయే కంపెనీ/సంస్థ గురించి తెలుసుకోకపోవడం కూడా దెబ్బతీసిందని ఇతరులు వెల్లడించారు.
ముందస్తుగా సన్నద్ధం కావాలి
ఉద్యోగంలో బాగా పనిచేయగలమని భావించినప్పుడు, ముఖాముఖిలో తిరస్కరణకు గురైతే బాధ అధికంగా ఉంటుందని టైమ్స్‌ బిజినెస్‌ సొల్యూషన్స్‌, వ్యూహాల విభాగాధిపతి నిలంజన్‌ రాయ్‌ పేర్కొన్నారు. అందువల్ల చేయబోయే సంస్థ, అక్కడ ఉద్యోగ పరిస్థితుల గురించి సమాచారం సేకరించి, అవగాహన చేసుకోవడంతో పాటు, వ్యవహారశైలినీ తగిన విధంగా మార్చుకుని, ముందస్తుగా సన్నద్ధమైతే, తిరస్కరణ బాధ తప్పుతుందని వివరించారు.


Posted on 06-07-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning