యూఎస్‌లో టాప్ ఎంఎస్ స్పెష‌లైజేష‌న్లు ఇవీ....

విదేశాల్లో క‌నీసం పీజీ కోర్సయినా చ‌ద‌వాల‌ని విద్యార్థులు క‌ల‌లు కంటారు. అందులోనూ యూఎస్‌లోనే చ‌ద‌వాల‌నేది ఎక్కువ మంది ల‌క్ష్యం. భార‌త్‌లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికా విమాన‌మెక్కే ఎక్కువ మంది విద్యార్థులు చేరే కోర్సు మాస్టర్స్ ఇన్ సైన్స్ (ఎంఎస్‌). ఇందులో ఎన్నో స్పెష‌లైజేష‌న్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఎక్కువ డిమాండ్ ఉన్నవి, వాటిని అందిస్తోన్న ప్రముఖ యూనివ‌ర్సిటీల వివ‌రాలు చూద్దాం...

ఏటా 8 ల‌క్షల‌కు పైగా విదేశీ విద్యార్థులు చ‌దువు నిమిత్తం యూఎస్ వెళ్తున్నారు. వీరిలో సుమారు స‌గం మంది పీజీ కోర్సుల్లోనే చేరుతున్నారు. ఇలా చేరిన‌వారిలో మూడింట రెండొంతుల మంది స్టెమ్ (సైన్స్‌, టెక్నాల‌జీ, ఇంజినీరింగ్‌, మ్యాథ‌మెటిక్స్‌) కోర్సుల్లో ప్రవేశిస్తున్నారు. విద్యా విధానం మెరుగ్గా ఉండ‌డం, ప్రాక్టిక‌ల్ అప్రోచ్‌...ఈ రెండు కార‌ణాల‌తో ఎక్కువ మంది యూఎస్‌లో ఎంఎస్ కోర్సుల్లో చేరుతున్నారు. అలాగే ఇక్కడ చ‌దివిన‌వారికి పేరున్న కంపెనీల్లో పెద్ద మొత్తంలో ప్యాకేజీతో క్యాంప‌స్ ప్లేస్‌మెంట్లు ల‌భిస్తున్నాయి. కేవ‌లం ప‌రీక్షల్లో సాధించిన మార్కులే కాకుండా ప్రాక్టిక‌ల్ అసైన్‌మెంట్లు, బృంద‌చ‌ర్చలు, త‌ర‌గ‌తుల‌కు త‌ర‌చూ హాజ‌రు కావ‌డం, త‌ర‌గ‌తి గ‌ది కార్యక్రమాల్లో పాల్గొన‌డం...మొద‌లైన‌ వాటిద్వారా కొన్ని పాయింట్లు విద్యార్థి సొంతం చేసుకోవ‌చ్చు. ప‌లు యూనివ‌ర్సిటీలు మంచి స్కోర్ సాధించిన విదేశీ విద్యార్థుల‌కు స్కాల‌ర్‌షిప్పులతో ప్రోత్సహిస్తున్నాయి.

టాప్ స్పెష‌లైజేష‌న్లు ఇవీ...
డేటా సైన్స్‌: ఉన్న స‌మాచారాన్ని స‌మ‌ర్థంగా ఎలా నిర్వహించాలో తెలుసుకోవ‌డాన్ని డేటా సైన్స్‌లో ప్రధానంగా బోధిస్తారు. బిగ్‌డేటా నుంచి క్లైంట్లు, అవ‌స‌రాల‌కు త‌గ్గ స‌మాచార‌న్ని అందించి ల‌క్ష్యాన్ని చేరుకునేలా చేయాలి. క్వాంటిటేటివ్ ఓరియెంటేష‌న్ ఉన్నవాళ్లు ఈ స్పెష‌లైజేష‌న్ ఎంచుకోవాలి. ఎందుకంటే డేటాను విశ్లేషించాలంటే క్వాంటిటేటివ్ విభాగంపై ఆస‌క్తి, ప‌ట్టు రెండూ అవ‌స‌ర‌మే. మొత్తం డేటా నుంచి కీల‌కాంశాలు సంగ్రహించ‌డం, ఎక్కువ మంది యూజ‌ర్లు వేటికి ప్రాధాన్యం ఇస్తున్నారో తెలుసుకోవ‌డం, ఆ స‌మాచారంతో యూజ‌ర్లు, యాడ్ రెవెన్యూ పెరిగేలా బృందానికి సూచ‌న‌లు ఇవ్వడం...ఇవ‌న్నీ డేటా సైన్స్ స్పెష‌లైజేష‌న్ చ‌దివిన‌వాళ్లు తెలుసుకుంటారు. నేటి డిజిట‌ల్ యుగంలో డేటా సైంటిస్ట్‌ల‌కు ఎక్కువ డిమాండ్ ఉంది. ల‌క్ష్య వినియోగ‌దారులు/ పాఠ‌కులు/ ఆడియ‌న్స్‌ను అర్థం చేసుకోవ‌డ‌మే వీరి ప్రధాన విధి. ఐటీ, ఫార్మా, రిటైల్ కంపెనీల్లో వీరికి ఉద్యోగావ‌కాశాలు ఉంటాయి. క్వాంటిటేటివ్ ఎన‌లిస్ట్‌, ఐడెంటిటీ డేటా ఎన‌లిస్ట్‌, డేటా ఆర్కిటెక్ట్‌, డేటా సైంటిస్ట్‌...మొద‌లైన హోదాల‌తో ప‌లు విభాగాల్లో సేవ‌లందించే సంస్థల్లో అవ‌కాశాలు సొంతం చేసుకోవ‌చ్చు.

ఈ స్పెష‌లైజేష‌న్ అందించే ప్రముఖ యూనివ‌ర్సిటీలు:
ఆరిజోనా స్టేట్ యూనివ‌ర్సిటీ- www.asu.edu
స్టాన్‌ఫోర్డ్‌- www.stanford.edu
యూనివ‌ర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా(బెర్క్‌లీ)- www.berkeley.edu
యూనివ‌ర్సిటీ ఆఫ్ శాన్‌ఫ్రాన్సిస్‌కో- www.usfca.edu

కంప్యూట‌ర్ సైన్స్‌: యూఎస్ఏలో టాప్ ఎంఎస్ స్పెష‌లైజేష‌న్లలో ఇదొక‌టి. ఈ స్పెష‌లైజేష‌న్‌లో భాగంగా కంప్యూట‌ర్ హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్ గురించి నేర్చుకుంటారు. కంప్యూట‌ర్ సైన్స్‌ చాలా విస్తృత‌మైంది. కంప్యూట‌ర్ గ్రాఫిక్స్‌, కంప్యూట‌ర్ థియ‌రీ, ప్రొగ్రామింగ్ లాంగ్వేజ్‌లు, ఆప‌రేటింగ్ సిస్టమ్స్‌, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ మొద‌లైనవి కోర్సులో భాగంగా ఉంటాయి. యూఎస్ 2002-2012 డేటా ప్రకారం అక్కడ ల‌భించే ప్రతి ప‌ది ఉద్యోగాల్లో ఆరు కంప్యూట‌ర్‌కు సంబంధించిన‌వే కావ‌డం విశేషం. ఆప‌రేటింగ్ సిస్టమ్‌ను అర్థం చేసుకోవ‌డం, ప్రోగ్రామింగ్ స్కిల్స్ మెరుగుప‌ర్చుకోవ‌డం ద్వారా ఈ విభాగంలో రాణించ‌వ‌చ్చు. బ‌హుళ జాతి సంస్థల్లో డేటాబేస్ అడ్మినిస్ట్రేట‌ర్లగా, ప్రముఖ ఐటీ కంపెనీల్లో సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్లగా వీరు రాణిస్తారు.

ఈ విభాగంలో టాప్ యూనివ‌ర్సిటీలు:
స్టాన్‌ఫోర్డ్- www.stanford.edu
మ‌సాచ్యుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ- www.web.mit.edu
యూనివ‌ర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా(బెర్క్‌లీ)- www.berkeley.edu
కార్నెగీ మెలాన్ యూనివ‌ర్సిటీ- www.cmu.edu
యూనివ‌ర్సిటీ ఆఫ్ స‌ద‌ర‌న్ కాలిఫోర్నియా- www.usc.edu

ఎన‌ర్జీ ఇంజినీరింగ్‌: విద్యుత్‌ ఉత్పాద‌క‌త‌, దాని వినియోగంపై వీరు అధ్యయ‌నం చేస్తారు. ఎన‌ర్జీ ఇంజినీరింగ్ అర్థం చేసుకోవాలంటే కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, ఎక‌నామిక్స్‌, ఎన్విరాన్‌మెంట్‌, మ్యాథ్స్ అంశాల్లో అవ‌గాహ‌న ఉండాలి. ఈ స్పెష‌లైజేష‌న్‌లో అంత‌ర్భాగంగా పెట్రోలియం ఎన‌ర్జీ ఇంజినీరింగ్‌, న్యూక్లియ‌ర్ ఇంజినీరింగ్‌, ప‌వ‌ర్ ఎన‌ర్జీ ఇంజినీరింగ్‌, ప్లాంట్ ఎన‌ర్జీ ఇంజినీరింగ్‌...మొద‌లైన‌వి ఉంటాయి. పెట్రోల్ ఉత్పత్తి సంస్థలు, ఆయిల్‌, గ్యాస్ కంపెనీల్లో వీరికి ఉద్యోగాలు ల‌భిస్తాయి.

ఈ స్పెష‌లైజేష‌న్ అందించే ప్రముఖ యూనివ‌ర్సిటీలు:
నార్త్ వెస్టర్న్ యూనివ‌ర్సిటీ- www.northwestern.edu
యూనివ‌ర్సిటీ ఆఫ్ ఉతాహ్‌- www.utah.edu
స్టాన్‌ఫోర్డ్ యూనివ‌ర్సిటీ- www.stanford.edu
యూనివ‌ర్సిటీ ఆఫ్ స‌ద‌ర‌న్ కాలిఫోర్నియా- www.usc.edu
నార్త్ ఈస్టర్న్ యూనివ‌ర్సిటీ- www.northeastern.edu

ఇన్ఫర్మేస‌న్ సిస్టమ్ మేనేజ్‌మెంట్: ఈ స్పెష‌లైజేష‌న్‌తో ఐటీ స్ట్రాట‌జీ, కమ్యూనికేష‌న్లలో పూర్తి ప‌రిజ్ఞానం పొంద‌వ‌చ్చు. కోర్సు ద్వారా ఇన్ఫర్మేష‌న్ టెక్నాల‌జీలో ప‌రిజ్ఞానం పెంపొందించుకోవ‌డంతోపాటు మేనేజ్‌మెంట్ స్కిల్స్ వృద్ధి చేసుకుని, కొత్త స్ట్రాట‌జీల‌ను అనుస‌రించ‌వ‌చ్చు. ఈ స్పెష‌లైజేష‌న్‌లో భాగంగా బిజినెస్ ఇన్ఫర్మేష‌న్ మేనేజ్‌మెంట్‌, ఐటీ స్ట్రాట‌జీ, ఇన్ఫర్మేష‌న్ టెక్నాల‌జీ, టెలికాం మేనేజ్‌మెంట్ గురించి అభ్యసిస్తారు. ఇన్ఫర్మేష‌న్ సిస్టమ్ మేనేజ‌ర్‌, కంప్యూట‌ర్ సిస్టమ్ ఎన‌లిస్ట్‌, టెక్నాల‌జీ ఆఫీస‌ర్ హోదాల‌తో ప‌లు విభాగాల్లో సేవ‌లు అందించే కంపెనీల్లో అవ‌కాశాలు ల‌భిస్తాయి. ఆ కంపెనీకి సంబంధించి కంప్యూట‌ర్ అడ్మినిస్ట్రేష‌న్‌కు వీరే బాధ్యులు.

ఈ విభాగంలో టాప్ యూనివ‌ర్సిటీలు:
మ‌సాచ్యుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ- web.mit.edu
యూనివ‌ర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బెర్క్‌లీ- www.berkeley.edu
కార్నెగీ మెలాన్ యూనివ‌ర్సిటీ- www.cmu.edu
యూనివ‌ర్సిటీ ఆఫ్ మిన్నెసోటా ట్విన్ సిటీస్‌- https://twin-cities.umn.edu
పుర్డ్యూ యూనివ‌ర్సిటీ- www.purdue.edu

ఫార్మసీ: ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బ‌యాల‌జీల క‌ల‌యికే ఫార్మసీ. ఈ విభాగంలో ఎంఎస్ చేయ‌డం ద్వారా వైద్య ప‌రిశ్రమ‌పై పూర్తిస్థాయిలో అవ‌గాహ‌న పెంపొందించుకోవ‌చ్చు. డ్రగ్స్‌పై పూర్తి స‌మాచారం వీరందించాలి. ఆ మందు రోగికి ప్రయోగించిన‌ప్పుడు వ‌చ్చే సైడ్ ఎఫెక్ట్స్ గమ‌నించాలి. మెడిసిన్‌, పార్మకాల‌జీ, ఫార్మాస్యూటిక‌ల్ కెమిస్ట్రీ...ఇలా ఇందులో ప‌లు ఉప విభాగాలున్నాయి. ఆస్పత్రులు, క్లినిక్కులు, ఫార్మా కంపెనీల్లో వీరికి అవ‌కాశాలుంటాయి. వీరు క్లినిక‌ల్ రిసెర్చ్‌, థిసిస్ రైటింగ్‌వైపు కూడా వెళ్లొచ్చు.

ఈ స్పెష‌లైజేష‌న్ అందించే ప్రముఖ యూనివ‌ర్సిటీలు:
ఓహియో స్టేట్ యూనివ‌ర్సిటీ- www.osu.edu
పుర్డ్యూ యూనివ‌ర్సిటీ- www.purdue.edu
ఆరిజోనా యూనివ‌ర్సిటీ- www.asu.edu
ఇలినాయిస్ (చికాగో) యూనివ‌ర్సిటీ- www.illinois.edu


Posted on 13-07-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning