యూఎస్‌లో ఎంఎస్ చేయాలంటే...

ఇంజినీరింగ్ విద్యార్థులు ఎక్కువ‌గా దేనిగురించి మాట్లాడుకుంటార‌ని ఎవ‌రైనా ప్రశ్నిస్తే ఠ‌క్కున ఎంఎస్‌, యూఎస్ అని చెప్పేయ‌వ‌చ్చు. వీరితోపాటు చాలా మంది త‌ల్లిదండ్రులు కూడా పిల్లల‌ను యూఎస్‌లో ఎంఎస్ చ‌దివించాల‌ని కోరుకుంటున్నారు. అయితే కేవ‌లం యూఎస్‌లో ఎంఎస్ చేయాల‌ని క‌ల‌లు కంటే స‌రిపోదు. అక్కడి యూనివ‌ర్సిటీల్లో ప్రవేశం పొంద‌డానికి దాదాపు ఏడాది ముందు నుంచే ప్రణాళిక రూపొందించుకోవాలి. ప‌లు ద‌ర‌ఖాస్తులు పూరించాలి, వివ‌రాల‌న్నీ సిద్ధం చేసుకోవాలి. యూఎస్‌లో ఎంఎస్ చేయాలంటే ఏమి అవ‌స‌ర‌మో తెలుసుకుందాం...

భార‌త్‌లో ఉన్నట్లు ఏదైనా సెట్ రాసి, కౌన్సెలింగ్‌కు వెళ్లి కాలేజీలో నేరుగా చేరిపోవ‌డం అమెరికాలో సాధ్యం కాదు. అమెరికా కాలేజీల్లో చేరడానికి దాదాపు 12-15 నెల‌ల ముందు నుంచి స‌న్నద్ధత ప్రారంభించాలి. భార‌త్‌లో కొత్త విద్యా సంవ‌త్సరం ఏడాదికి ఒక‌సారే మొద‌లవుతుంది. సాధార‌ణంగా యూజీ, పీజీ కోర్సుల‌న్నీ జులై/ ఆగ‌స్టుల్లోనే ఇక్కడ మొద‌ల‌వుతాయి. కానీ అమెరికాలో ఏడాదికి మూడుసార్లు ప్రవేశాలు నిర్వహిస్తారు. అవి ఫాల్‌, స్ప్రింగ్‌, స‌మ్మర్ అడ్మిష‌న్లు. అయితే ఎక్కువ కోర్సులు మాత్రం ఫాల్ సీజ‌న్‌లోనే మొద‌లవుతాయి. ప‌లు యూనివ‌ర్సిటీలు సైతం ఫాల్ సీజ‌న్‌లోనే ప్రవేశాల‌కు ప్రాధాన్యమిస్తున్నాయి. అలాగే భార‌తీయ విద్యార్థుల‌కు అనువైన‌ది కూడా ఫాల్ సీజ‌నే. ఎందుకంటే ఇక్కడ మే/జూన్‌తో సాధార‌ణంగా ఇంజినీరింగ్ పూర్తవుతుంది. ఆగ‌స్టు/సెప్టెంబ‌రు నుంచి ఫాల్ కోర్సులు ప్రారంభమ‌వుతాయి. యూఎస్‌లో చ‌దువుకునే విదేశీ విద్యార్థుల్లో ఎక్కువ మంది ఈ సీజ‌న్‌లోనే చేరుతారు. అందువ‌ల్ల ప్రవేశాల‌కు డిమాండ్ కూడా ఎక్కువ‌గానే ఉంటోంది. వ‌చ్చే ఆగ‌స్టు/సెప్టెంబరులో ప్రవేశాల‌కు ఈ ఆగ‌స్టు/ సెప్టెంబ‌రులోనే ద‌ర‌ఖాస్తులు మొద‌ల‌వుతాయి. ఫైనాన్షియ‌ల్ ఎయిడ్ ఫామ్‌లు కూడా ఈ నెల‌ల్లోనే ఇస్తారు. ఫాల్ సీజ‌న్‌లో చేరిన వారికి ఆర్థిక తోడ్పాటు కూడా ల‌భించ‌డానికి అవ‌కాశాలున్నాయి. ద‌ర‌ఖాస్తులు డిసెంబ‌రులోగా పూర్తిచేసి, అందించాలి. ఈ స‌మ‌యానికి రిక‌మండేష‌న్ లెట‌ర్‌, ఏదైనా ప్రామాణిక ప‌రీక్షలో స్కోర్ ఈ రెండు సిద్ధంగా ఉండాలి. అక‌డ‌మిక్ స‌ర్టిఫికెట్లు కూడా చేతిలో ఉండాలి. ద‌ర‌ఖాస్తు చేసుకున్న యూనివ‌ర్సిటీ నుంచి ఏప్రిల్ లేదా మేలో వ‌ర్తమానం అందుతుంది. ఫీజుకు త‌గ్గ డ‌బ్బులు సిద్ధంగా ఉన్నట్లు ఏదైనా ఆధారం / హామీ చూప‌గ‌లిగితే సంబంధిత యూనివ‌ర్సిటీ ఇమ్మిగ్రేష‌న్ ప్రక్రియ‌ను ప్రారంభిస్తుంది. అన్నీ స‌వ్యంగా జ‌రిగితే జూన్‌/ జులైలో స్టూడెంట్ వీసాకు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. అనుమ‌తి రాగానే అమెరికా విమానం ఎక్కేయొచ్చు.

కోర్సు గుర్తించ‌డం
యూఎస్‌లో మాస్టర్స్ ఇన్ సైన్స్ (ఎంఎస్‌)లో ఏ కోర్సులో చేరాల‌నుకుంటున్నారో నిర్ణయించుకోండి. పూర్తిగా ఆస‌క్తి ఉన్న కోర్సుకే ప్రాధాన్యం ఇవ్వండి. వ్యక్తిగ‌త అభిరుచులు, ల‌క్ష్యాలు, స్కిల్స్‌...వీటిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌డం ద్వారా ఏ కోర్సు మీకు న‌ప్పుతుందో, ఎలాంటి కోర్సుల‌కు మీరు స‌రిపోతారో తెలుసుకోవ‌చ్చు.

విశ్వవిద్యాల‌యాల‌ను ఎంచుకోవ‌డం
కోర్సును గుర్తించిన త‌ర్వాత ఆ కోర్సు ఏ యూనివ‌ర్సిటీల్లో అందుబాటులో ఉందో తెలుసుకోవాలి. ప్రాధాన్యం ప్రకారం ఆ యూనివ‌ర్సిటీల‌ను ఒక వ‌రుస క్రమంలో రాసుకోవాలి. మెరుగైన యూనివ‌ర్సిటీకి తొలి ప్రాధాన్యం ఇవ్వాలి.

గ‌డువులోగా ద‌ర‌ఖాస్తు
ఆయా యూనివ‌ర్సిటీల‌వారీ ఒక్కో కోర్సుకు ఒక్కో గ‌డువు తేదీ ఉంటుంది. వీటిని గ‌మ‌నించి చివ‌రి తేదీలోగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. మ‌న‌ద‌గ్గర ఉన్నట్లు అన్ని కోర్సుల‌కూ ఒకే డెడ్‌లైన్ అక్కడ దాదాపు ఉండ‌దు. ఒకే యూనివ‌ర్సిటీలో అదే డిపార్ట్‌మెంట్ ప‌రిధిలో ఉన్న వివిధ కోర్సుల‌కు ఒక్కో ర‌క‌మైన డెడ్‌లైన్ ఉంటుంది. కాబ‌ట్టి దాన్ని గ‌మ‌నించాలి. ఉదాహ‌ర‌ణ‌కు మాసాచ్యుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ, హార్వార్డ్‌, స్టాన్‌ఫోర్డు యూనివ‌ర్సిటీలో పీజీ కోర్సుల్లో చేరాలంటే అక్టోబ‌రులో ద‌ర‌ఖాస్తులు మొద‌ల‌వుతాయి. డిసెంబ‌రు/ జ‌న‌వ‌రిలోగా వాటిని అందించాలి.

అర్హత‌లు ప‌రిశీలించాలి..
ఒక్కో కోర్సుకు ఒక్కో ర‌క‌మైన అర్హత అవ‌స‌రం. అందువ‌ల్ల చేసుకోవ‌డానికి ముందుగానే వీటిని ప‌రిశీలించుకోవాలి. సాధార‌ణంగా యూఎస్‌లో ఎంఎస్ చేయాలంటే 16 ఏళ్ల విద్యాభ్యాసం అవస‌రం. అంటే ప‌దోత‌ర‌గ‌తి త‌ర్వాత ఇంట‌ర్‌/మూడేళ్ల డిప్లొమా అనంత‌రం బీటెక్ చ‌ద‌వాలి. ఇంట‌ర్ త‌ర్వాత ఏదైనా 4 ఏళ్ల కోర్సు చద‌వ‌డం త‌ప్పనిస‌రి. సాధార‌ణ డిగ్రీ విద్యార్థులు అంటే బీఎస్సీ త‌దిత‌ర మూడేళ్ల కోర్సులు పూర్తిచేసిన‌వాళ్లు ఎంఎస్ కోర్సుల‌కు అన‌ర్హులు. వీరు మ‌రో ఏడాది పాటు ఏదైనా కోర్సు పూర్తిచేస్తేనే ఎంఎస్‌కు అర్హుల‌వుతారు.

జీమ్యాట్‌, జీఆర్ఈ, టోఫెల్‌...ఇలా ఏదైనా ప్రామాణిక ప‌రీక్షలో అవ‌స‌ర‌మైనంత స్కోర్ పొంద‌డం త‌ప్పనిస‌రి. ద‌ర‌ఖాస్తు చేసుకునే స‌మ‌యానికే అవ‌స‌ర‌మైన స్కోర్ సాధించ‌డం మంచిది. ఆ స్కోర్‌కు ద‌ర‌ఖాస్తు చేయాల‌నుకుంటున్న విశ్వవిద్యాల‌యంలో సంబంధిత కోర్సులో సీటు వ‌స్తుందో, లేదో తెలుసుకోవ‌చ్చు. త‌గినంత స్కోర్ లేకుండా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డం నిష్ప్రయోజ‌నం.

అప్లికేష‌న్‌తోపాటు...
ద‌ర‌ఖాస్తు పూరించ‌డం ఒక్కటే స‌రిపోదు. ఆ కోర్సు ఎందుకు చ‌ద‌వాల‌నుకుంటున్నారు, భ‌విష్యత్తు ఆశ‌యాలేంటి...త‌దిత‌ర వివ‌రాల‌తో స్టేట్‌మెంట్ ఆఫ్ ప‌ర్పస్ రూపొందించాలి. ఆ కోర్సు నుంచి ఏం ఆశిస్తున్నారో తెల‌పాలి. ప‌రిమిత‌ ప‌దాల‌తో, స్పష్టంగా దీన్ని త‌యారుచేసుకోవాలి. దీంతోపాటు ప‌లు యూనివ‌ర్సిటీలు రిక‌మెండేష‌న్ లెట‌ర్‌ను కూడా కోరుతున్నాయి. క‌నీసం ఇద్దరు లేదా ముగ్గురు నుంచి ఈ లేఖ‌లను అందించాలి. ఇందుకోసం ప్రొఫెస‌ర్లు, ఉన్నతోద్యోగులు, తెలిసిన పెద్దల సాయం కోర‌వ‌చ్చు. అలాగే కొన్ని యూనివ‌ర్సిటీల‌కు రెజ్యుమే కూడా త‌ప్పనిస‌రి. ఇందులో ప్రాథ‌మిక స‌మాచారం.. విద్యార్హత‌లు, పుట్టిన తేదీ...మొద‌లైన‌వి చేర్చాలి.

డాక్యుమెంట్స్ చెక్ లిస్టు:
* రిక‌మెండేష‌న్ లెట‌ర్ (ఇద్దరు లేదా ముగ్గురు నుంచి)
* జీఆర్ఈ/ టోఫెల్‌/ జీమ్యాట్‌/ ఐఈఎల్‌టీఎస్ వీటిలో ఏదైనా స్కోర్ ప్రూఫ్‌
* అర్హత‌ల‌కు సంబంధించిన ప‌త్రాలు
* స్టేట్‌మెంట్ ఆఫ్ ప‌ర్పస్‌
* ప‌ని అనుభ‌వం స‌ర్టిఫికెట్లు (ఉన్నట్లైతే)
* పాస్‌పోర్టు సైజ్ ఫొటో కాపీలు
* ఎక్‌స్ట్రా క‌రిక్యుల‌ర్ యాక్టివిటీస్ స‌ర్టిఫికెట్లు (ద‌ర‌ఖాస్తులో పేర్కొన్నట్లయితే)

ఇవ‌న్నీ సిద్ధం చేసుకుని గడువులోగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. అనంత‌రం ప్రవేశం ల‌భించినా, తిర‌స్కర‌ణ‌కు గురైనా స‌మాచారం అందుతుంది. ఏప్రిల్‌లోగా ఈ వ‌ర్తమానం పొంద‌వ‌చ్చు. ప్రవేశం పొందిన‌వారు స్టూడెంట్ వీసాకు ద‌ర‌ఖాస్తు చేసుకుని, అది వ‌చ్చిన త‌ర్వాత అమెరికా విమానం ఎక్కి ఎంఎస్ కోర్సులో చేరిపోవ‌చ్చు.
Posted on 14-07-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning