‘అంకురం’ వికాస తరంగం

* సరికొత్త ఆలోచనలతో దూసుకెళుతున్న ఔత్సాహికులు
* స్టార్టప్‌ పరిశ్రమల ఫలితాలు ప్రారంభం
* స్టార్టప్‌ నగరంగా హైదరాబాద్‌ రూపాంతరం
* నగరంలో 1500 అంకుర పరిశ్రమలకు అండగా టీహబ్‌
* చేయూతనిందిస్తున్న దేశవిదేశీ సంస్థలు

ఈనాడు - హైదరాబాద్‌: యువతలో మొగ్గతొడిగే సరికొత్త ఆలోచనలకు ప్రోత్సాహాన్నందిస్తూ అంకుర పరిశ్రమలు (స్టార్టప్స్‌)గా ఆకృతిదాల్చేందుకు అండగా నిలుస్తున్న టీ-హబ్‌...కృషి సత్ఫలితాలనిస్తోంది. ఎనిమిది నెలల క్రితం హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చిన దేశంలోనే అతిపెద్ద ఇంక్యూబేటర్‌ అయిన టీ-హబ్‌ నేడు నగరంలోని దాదాపు 1500 అంకుర పరిశ్రమలకు అండగా నిలుస్తోంది. సుమారు రెండు వందల స్టార్టప్‌లు టీహబ్‌లోనే ఉన్నాయి. వందల మంది యువ, అనుభజ్ఞులైన వారి ఆలోచలను పండించే కేంద్రంగా గుర్తింపు పొందుతోంది. టీహబ్‌లో స్టార్టప్‌లుగా అడుగుపెట్టిన వారి ఆలోచనలు ఉత్పాదనల దిశగా మళ్లుతున్నాయి. ఐఐఐటీ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఐఐఐటీ, ఐఎస్‌బీ, నల్సార్‌లు కలసి ఏర్పాటు చేసిన టీహబ్‌తో దేశవిదేశాల్లోని ప్రముఖ ఐటీ సంస్థలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. టీహబ్‌లోని అనేక అంకురపరిశ్రమలకు ఆర్థిక తోడ్పాటును అందించడానికి ముందుకు వస్తున్నాయి. టెక్నాలజీ స్టార్టప్‌ల కేంద్రంగా ప్రారంభమైనా వివిధ రంగాల్లో అవకాశాలను, హైదరాబాద్‌కు ప్రత్యేకమైన రంగాల్లోని అంశాలపై టీహబ్‌ ప్రత్యేక దృషి సారించింది. హైదరాబాద్‌ను స్టార్టప్‌ సిటీగా మార్చడం లక్ష్యంగా కార్యక్రమాలను విస్తరిస్తోంది. నగరంలోని అనేక పరిశోధన సంస్థలతో కలసి పనిచేస్తోంది.
అంకుర పరిశ్రమల కేంద్రంగా హైదరాబాద్‌ - శ్రీనివాస్‌ కొల్లిపర చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌, టీహబ్
టీహబ్‌ కేవలం ఇక్కడ ఉన్న స్టార్టప్‌లకు మాత్రమే పరిమితం కావడంలేదు. హైదరాబాద్‌ నగరంలో ఉన్న అన్ని స్టార్టప్‌లకు తోడ్పాటును అందిస్తుంది. హైదరాబాద్‌ను అంకుర పరిశ్రమల నగరంగా మార్చడం మా లక్ష్యం. టీహబ్‌లో స్టార్టప్‌లకు పూర్తి అనుకూలమైన వాతావరణ కల్పించడంతో పాటు అవసరమైన అన్ని వనరులు అందుబాటులో ఉన్నాయి. ఎవరికివారు అంకుర పరిశ్రమలను ప్రారంభించుకుని వివిధ అంశాలపై కలసి పనిచేస్తున్న స్టార్టప్‌లు అనేకం ఉన్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం సుమారు 1500 అంకురపరిశ్రమలు ఉన్నాయి. టీహబ్‌ స్టార్టప్‌లు అనేక ప్రజాసమస్యల పరిష్కారానికి దృష్టిసారించాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల సమస్యల పరిష్కారంపై అవి పని చేస్తున్నాయి. అగ్రిటెక్‌, హెల్త్‌ టెక్‌, ఫిన్‌టెక్‌, స్మార్ట్‌సిటీ, సాంప్రదాయేతర ఇంధన వనరులు, సోషల్‌ ఇంపాక్ట్‌, ఏవియేషన్‌ అంశాల స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. వ్యవసాయానికి సంబంధించి ఇప్పటికే ఇక్రిశాట్‌తో కలసి టీహబ్‌ పనిచేస్తోంది. ఆలోచనలను తదుపరి దశకు తీసుకెళ్లేందుకు అవసరమైన తోడ్పాటును విజ్ఞానపరంగా, ఆర్థికంగా తోడ్పాటును అందించేందుకు అనేకమంది ముందుకు వస్తున్నారు. బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, సింగపూర్‌, చైనా, ఇజ్రాయెల్‌ వంటి దేశాలతో టీహబ్‌ అవగాహనలు కుదుర్చుకుంది. ఫలితంగా ఇతర దేశాల స్టార్టప్‌లు టీహబ్‌కు వస్తాయి, ఇక్కడి స్టార్టప్‌లు అక్కడికి వెళ్తాయి. ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు ఇటీవల అమెరికా పర్యటనతో టీహబ్‌కు మరింత ప్రాధాన్యం పెరిగింది. సిలికాన్‌ వ్యాలీలో కూడా టీహబ్‌ కార్యక్రమాలను ప్రారంభిస్తుంది. విజయవంతమైన వ్యాపారవేత్తలను హైదరాబాద్‌ నుంచి సృష్టించడం మా లక్ష్యం. ఉత్పాదకత లేదా కార్యక్రమాలను ప్రారంభించే దశకు కొన్ని స్టార్టప్‌లు చేరుకున్నాయి. ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాయి.
కీలక పరిశోధనలకు టీహబ్‌ తోడ్పాటు - డాక్టర్‌ శిబిచక్రవర్తి కన్నన్‌
వృత్తిపరంగా డాక్టర్‌ అయిన నేను క్యాన్సర్‌కు సంబంధించి కీలకమైన పరిశోధన చేస్తున్నాను. సుదీర్ఘకాలం విదేశాల్లో ఉండి వచ్చాను. నా పరిశోధనకు అత్యంత అనువైన ప్రదేశంగా టీహబ్‌ ఉంది. ఇక్కడ పూర్తి స్థాయిలో సౌకర్యాలు ఉండటమే కాకుండా అవసరమైన సాంకేతిక తోడ్పాటు అందుతోంది. నా పరిశోధనలకు సంబంధించి హైదరాబాద్‌ ఎంతో అనువైన నగరం. ఇక్కడ పూర్తిస్థాయిలో అవసరమైన మానవవనరులు ఉన్నాయి. అనేక స్టార్టప్‌లు విడివిడిగా ఉన్నా అవసరమైన అంశాల్లో కలసి పనిచేసేందుకు టీహబ్‌ చక్కటి వేదిక. అమెరికా లాంటి దేశాలకు ధీటుగా ఇక్కడ మౌలిక సదుపాయాలు ఉన్నాయి.
కొత్తవారి ఇళ్ల సమస్యకు పరిష్కారం -కరుణాకరరాజు, వ్యవస్థాపకులు, స్మార్ట్‌లివ్‌ఇన్‌
వృత్తిపరంగా, విద్య లేదా ఇతర రంగాలకు సంబంధించిన వారు పెద్ద పెద్ద నగరాలకు వస్తుంటారు. ఇటువంటి వారు ఎక్కడ ఉండాలి? వారి అవసరాలకు తగినట్లుగా సౌకర్యాల కొరత సహా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటన్నిటికీ పరిష్కారంగా మేం స్మార్ట్‌లివ్‌ఇన్‌ ద్వారా విశ్వసనీయ నివాసాన్ని అందుబాటులోకి తెస్తున్నాం. టీహబ్‌ వేదికగా మేం దీన్ని అభివృద్ధి చేశాం. హైదరాబాద్‌లో 200 అపార్ట్‌మెంట్లతో చేసిన ప్రయోగం విజయవంతమైంది. త్వరలో దీన్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తున్నాం. అపార్ట్‌మెంట్లను అద్దెకు తీసుకుని వాటిలో పూర్తి సౌకర్యాలు కల్పించనున్నాం. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారు అద్దె ఇళ్ల కోసం వెతుక్కోకుండా వారికి అవసరాలకు తగినట్లు, వారి బడ్జెట్‌ మేరకు అందుబాటులో ఉంటాయి. ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లో పూర్తి చేసుకుని నేరుగా ఇంటిలో దిగొచ్చు.
అమెరికా వెళ్లేవారికి అండగా పోర్టల్‌ - యల్లంకి నరేందర్‌, సహవ్యవస్థాపకులు, దేశీఓపీటీ.డాట్‌కాం
మన దేశం నుంచి అమెరికా వెళ్లే వారికి ఆన్‌లైన్‌ పోర్టల్‌ను టీహబ్‌ వేదికగా అభివృద్ధి చేశాం. ప్రధానంగా ఇక్కడ నుంచి వెళ్లేవారు ఉద్యోగాలు పొందడం ప్రధాన సమస్యగా ఉంటోంది. మా నెట్‌వర్క్‌లో అమెరికాకు చెందిన అనేక సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థల అవసరాలకు తగిన ఉద్యోగులను మేం సమకూరుస్తున్నాం. ఉచితంగా సేవలు అందిస్తున్నాం. అమెరికాలో న్యాయ సాయం పొందడం ఖరీదైన అంశం. దీన్ని కూడా మేం పలువురి సాయంతో ఉచితంగా అందిస్తున్నాం. అమెరికా వెళ్లే యువకులకు అండగా నిలవడం మా లక్ష్యం.
టీహబ్‌ వేదికగా రూ.కోట్ల వ్యాపారం -వెంకటేశన్‌ శేషాద్రి, సహవ్యవస్థాపకులు, ప్లాట్‌పెబెల్‌ డాట్‌కాం.
పెళ్లి ఫొటోలు, మెహిందీ, మేకప్‌, కేటరింగ్‌, బేబీ ఫొటో, నగలు అద్దె వంటివి వాటికి ఇబ్బంది పడకుండా అందుబాటులోకి తీసుకువచ్చిన వేదిక ప్లాట్‌పెబెల్‌ డాట్‌కాం. టీహబ్‌ ద్వారా దీన్ని మేం విస్తరించాం. సుమారు 100 నగరాల్లో సేవలు అందిస్తున్నాం. 3700 మందికి పైగా సర్వీస్‌ ప్రొవైడర్లను అందుబాటులోకి తెచ్చాం. దీన్ని మరింత విస్తరించనున్నాం. ఇప్పటికే కోట్ల రూపాయల వ్యాపారం చేశాం.

Posted on 15-07-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning