నాగార్జున విశ్వవిద్యాలయంలో ‘మూక్స్‌’ కోర్సులు

* తొలిసారిగా ప్రవేశపెట్టిన ఘనత
* 13 కోర్సులకు ఆన్‌లైన్‌లో ఉచిత ప్రవేశాలు
* ప్రవేశం నుంచి పరీక్షల దాకా అంతర్జాలంలోనే

ఈనాడు, గుంటూరు: తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి విశ్వవిద్యాలయ స్థాయిలో ‘మూక్స్‌’ కోర్సులను ప్రవేశపెట్టిన అరుదైన ఘనత ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి (ఏఎన్‌యూ) దక్కింది. మాసివ్‌ ఓపెన్‌ ఆన్‌లైన్‌ కోర్సెస్‌ను సంక్షిప్తంగా ‘మూక్స్‌’ అని పిలుస్తారు. అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌ వర్సిటీ, ఎంఐటీ తదితర ప్రతిష్ఠాత్మక సంస్థలతో పాటు మన దేశంలోని మద్రాస్‌, దిల్లీ, బాంబే ఐఐటీల్లో ‘ఆన్‌లైన్‌’ విద్య కొన్ని కోర్సుల్లో అమలవుతోంది. ప్రస్తుతం వాటి సరసన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం చేరింది. వృత్తి విద్యా కోర్సులు ఆన్‌లైన్‌లో ఉచితంగా అభ్యసించేలా ‘మూక్స్‌’ దోహదం చేస్తుంది. రెగ్యులర్‌గా కళాశాలకు రాలేనివారు సాంకేతిక, ఇతర వృత్తి విద్యార్హతలు పెంచుకోడానికి ఈ కోర్సులను విశ్వవిద్యాలయాల స్థాయిలో ప్రవేశపెట్టాలని విద్యా రంగ నిపుణులు సిఫార్సు చేశారు. ఈ నేపథ్యంలోనే 13 కోర్సులను ఏఎన్‌యూ రూపొందించి ఈ విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి తెచ్చింది. కోర్సులు చేయడానికి ఎవరైనా అర్హులే.
ప్రవేశం నుంచి పరీక్షల దాకా..
మూక్స్‌ కోర్సుల అభ్యాసానికి మొబైల్‌ లేదా కంప్యూటర్‌కు అంతర్జాల సౌకర్యం ఉంటే చాలు. నిర్దేశిత కోర్సులకు సంబంధించిన పాఠ్యాంశాలు ఆన్‌లైన్‌లో ఉంటాయి. కోర్సు అభ్యసించాలనుకునే వారు తొలుత వర్సిటీ సూచించిన వెబ్‌సైట్‌లో పేర్లను నమోదు చేసుకోవాలి. వీరికి విశ్వవిద్యాలయం ఐడీ, పాస్‌వర్డు కేటాయిస్తుంది. ప్రవేశం నుంచి పరీక్షల నిర్వహణ వరకు ప్రతిదీ ఆన్‌లైన్‌లో ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ రుసుములు లేవు. ఆన్‌లైన్‌లో పరీక్షలు రాసి ఏఎన్‌యూ మూక్స్‌ సర్టిఫికెట్‌ పొందాలనుకునేవారు మాత్రం రూ.500 చెల్లించాలి.
పనామా వర్సిటీతో ఒప్పందం
బయోటెక్నాలజీకి సంబంధించి మూక్స్‌ విధానంలో పుస్తకాలను తయారుచేసి ఇస్తామని రిపబ్లికన్‌ ఆఫ్‌ పనామా వర్సిటీ ఏఎన్‌యూతో ఒప్పందం చేసుకుంది. ఆ వర్సిటీ సౌజన్యంతో కొన్ని కోర్సులను నడపాలని ఏఎన్‌యూ నిర్ణయించింది. ప్రాజెక్టు అమలుకు స్టూడియో, ఆడియో, వీడియో సామగ్రి ఏఎన్‌యూలో ఉంది. అవసరమైన సాంకేతిక సహకారాన్ని ముంబయికి చెందిన ‘స్కూల్‌ గురూ ఎడూ సర్వ్‌ ప్రై లిమిటెడ్‌’ సంస్థ అందిస్తోంది. అంతర్జాతీయ విద్యా ప్రమాణాలకు అనుగుణంగా దేశ, విదేశాలకు చెందినవారు కోర్సులను అభ్యసించేలా ఏఎన్‌యూ సీనియర్‌ అధ్యాపకులు పది మంది పాఠ్యాంశాలు రూపొందించారు. మూక్స్‌ కోర్సుల అభ్యాసానికి ఎంతమంది నమోదు చేసుకుంటున్నారు? ఆన్‌లైన్‌లో ఎంతమంది పరిశీలిస్తున్నారో తెలుసుకోడానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేశారు. వెబ్‌సైట్‌ లాగిన్‌ అవ్వాలనుకునేవారు.. వర్సిటీ ఆన్ లైన్ వెబ్ సైటులో సంప్రదించాలని వర్సిటీ అధికారులు సూచించారు. బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు, కంప్యూటర్‌ సైన్సు, మార్కెటింగ్‌ కమ్యూనికేషన్స్‌ విభాగాల్లో ఈ కోర్సులు ఉన్నాయి.
http://anuonline.ac.in/

Posted on 18-07-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning