ప్రారంభ‌మైన‌ ప్రాంగణ నియామకాల సంద‌డి

 • * అమెరికా ఆర్థిక పరిస్థితులతో ఆచితూచి అడుగేస్తున్న    కంపెనీలు
  * 15 నుంచి 20 శాతం తగ్గనున్న నియామ‌కాలు

  ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రాంగణ నియామకాల హడావుడి మొదలైంది. విద్యార్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు.


       కొన్ని కళాశాలల యాజమాన్యాలు వీరికి ప్రత్యేకంగా శిక్షణనిచ్చే ప్రక్రియలో నిమగ్నమయ్యాయి. టీసీఎస్‌, సీటీఎస్‌, విప్రో, ఇన్ఫోసిస్‌, డెలాయిట్‌, నెట్‌క్రాకర్‌, మైక్రోసాఫ్ట్‌ ఇతర కంపెనీలు ప్రాంగణ నియామకాలపై దృష్టిసారించాయి. అమెరికా ఆర్థిక రంగం ఒడుదుడుకులు ఎదుర్కొంటున్న నేప‌థ్యంలో 2013-14 విద్యా సంవత్సరంలో భారత్‌ నుంచి నియామకాలు కొంత మేర తగ్గేలా కనిపిస్తున్నాయి. మ‌రోవైపు రాష్ట్రంలో నెల‌కొన్న పరిస్థితుల నేపథ్యంలో చాలా కళాశాలల్లో ప్రాంగణ నియామకాలు ఊపందుకోవ‌డంలేదు.

       ఐటీ, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు అంతర్జాతీయ అవసరాలకు అనుగుణంగా ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఏటా ప్రాంగణ నియామకాలు చేపడ‌తాయి. ప్రధానంగా అమెరికా, ఇతర దేశాల నుంచి వచ్చే ప్రాజెక్టుల ఆధారంగా నియామకాలు జరుపుతాయి. అయితే కొంతకాలంగా అమెరికా ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా లేనందున ప్రాంగణ నియామకాలు స్వల్పంగా తగ్గనున్నాయని ప్రాంగణ నియామకాల పర్యవేక్షణ అధికారులు (ప్లేస్‌మెంట్స్ ఆఫీసర్స్‌) అంచనా వేస్తున్నారు.
  కిందటేడాదితో పోలిస్తే నియామకాలు 15 నుంచి 20% వరకు తగ్గనున్నాయ‌ని జేఎన్‌టీయూ, ఉస్మానియా విశ్వవిద్యాలయాల ప్లేస్‌మెంట్స్‌ అధికారులు తెలిపారు. ప్రస్తుతం నెల‌కొన్న పరిస్థితులతో వచ్చే ఏడాది పరిస్థితులపై కంపెనీలు ఒక‌ అంచనాకు రాలేక పోతున్నాయి. అందుకే నియామకాలను తక్కువగా జరిపేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. పేరొందిన కళాశాలల్లో మాత్రం నియామకాలు యథావిధిగా కొన‌సాగుతాయని, మిగిలిన కళాశాలల్లో తగ్గేలా క‌న‌బ‌డుతున్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు. గతంలో ఐటీ, సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో పనిచేసే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు అందుబాటులో ఉండే ఉద్యోగావకాశాల ఆధారంగా తరచూ కంపెనీలు మారేవారు. తాజా పరిస్థితులు అందుకు అనుకూలంగా లేనందువ‌ల్ల చేరినచోటే పనిచేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ పరిణామం కూడా సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో నియామకాలు తగ్గుముఖం పట్టేందుకు ఒక కారణమని సంబంధిత వర్గాల వారు విశ్లేషిస్తున్నారు.

       ఏదేమైనా ప్రముఖ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రాంగణ నియామకాల వేగం క్రమంగా పెరుగుతోంది.
  * హైదరాబాద్‌ జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ నాలుగో సంవత్సరంలో ఉన్న విద్యార్థులను ఎంపిక చేసేందుకు... టీసీఎస్‌, విప్రో, డెలాయిట్‌, మోడల్‌ ఎన్‌, నెట్‌క్రాకర్‌, ఎఫ్‌ఎన్‌సీ టెక్నాలజీసెస్‌, మురుగుప్పా లాంటి కంపెనీలు నియామకాల ప్రక్రియను మొదలుపెట్టాయి. ఐటీసీ భద్రాచలం కంపెనీ ప్రాంగణ నియామకాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్‌ వరకు ఈ నియామకాల ప్రక్రియ జరిగే అవకాశాలున్నాయి.
  * ప్రాంగణ నియామకాల ద్వారా హైదరాబాద్‌లోని సీబీఐటీలో ఇప్పటివరకు 700 మంది ఉద్యోగాలకు అర్హత సాధించారు. వాసవి ఇంజినీరింగ్‌ కళాశాలలో ఇప్పటివరకు 70% మంది విద్యార్థులు ప్లేస్‌మెంట్స్‌ పొందారు. ఈ రెండు కళాశాలల్లో నియామకాలు 90% వరకు జరగబోతున్నట్లు కళాశాలల వర్గాలు పేర్కొన్నాయి. ఈ కళాశాలల ద్వారా ఎంపికచేసిన విద్యార్థులకు మైక్రోసాఫ్ట్‌ ఏడాదికి వార్షిక వేతనం కింద 11 లక్షల రూపాయల వరకు ఇవ్వబోతుంది. మైక్రోసాఫ్ట్‌ కింద ఎంపికైన వారి సంఖ్య పది వరకు ఉంది.
  * ఉస్మానియా ఇంజినీరింగ్‌ కళాశాలలో ప్రాంగణ నియామకాలు ఇంకా ప్రారంభంకాలేదు. ప్రస్తుతం పరీక్షల సమయం అయినందున కొద్దిరోజుల అనంతరం నియామకాలను చేపట్టనున్నారు.
  * సీమాంధ్రలో పరిస్థితుల నేపథ్యంలో జేఎన్‌టీయూ కాకినాడ, అనంతపురం ఇంజినీరింగ్‌ కళాశాలలు, వీటి అనుబంధ కళాశాలల్లో ప్రాంగణ నియామకాలు ఊపందుకోలేదు. నాలుగో సంవత్సరంలో ఉన్న విద్యార్థులకు ఆగస్టు నుంచి ప్రాంగణ నియామకాలు చేపట్టేందుకు సన్నాహాలు జరిగినా... ఉద్యమాల కారణంగా నియామకాల ప్రక్రియ ప్రారంభ దశలోనే ఉంది. కళాశాలలస్థాయిని అనుసరించి విద్యార్థుల ఎంపికపై ఇప్పటికే ఆయా ఐటీ, సాఫ్ట్‌వేర్‌ సంస్థల వద్ద తగిన ప్రతిపాదనలు ఉన్నందున కాస్త ఆలస్యంగా ప్రాంగణనియామకాలు జరిపినా ఉద్యోగావకాశాల్లో ఎలాంటి తేడా ఉండదని సంబంధిత వర్గాలు వ్యాఖ్యానించాయి. ప్రాంగణ నియామకాల ద్వారా ఎంపిక చేసిన వారిని వచ్చే ఏడాది జూన్‌ తరువాత విధుల్లోకి తీసుకోనున్నారు.

 • Industry      Interaction

  Higher Education

  Job Skills

  Soft Skills

  Comm. English

  Mock Test

  E-learning