ప్రతిభకు దర్పణం... ప్రాజెక్టు

ఇంజినీరింగ్‌లో చివరి ఘట్టం ప్రాజెక్టు. నాలుగో సంవత్సరం రెండో సెమిస్టర్లో ప్రతి విద్యార్థీ ప్రాజెక్టు చేయాల్సి ఉంటుంది. నాలుగేళ్లలో చదువుకున్న సబ్జెక్టుల్లో నుంచి నచ్చిన అంశంలో ఇది ఎంచుకోవాలి. లేబొరేటరీలో ప్రయోగాలు చేయడం కన్నా విభిన్నమైన అంశమిది. వృత్తి విద్యాకోర్సులు చేసే బీటెక్/ బి.ఇ. విద్యార్థులు దీన్ని ఆషామాషీగా తీసుకోకూడదు.

పాఠ్యపుస్తకాల్లో చదివిన అంశాలు నిజజీవితంలో సాంకేతికతగా/ ఉత్పత్తిగా/ సేవలందించే వినిమయ వస్తువుగా ఎలా పెంపొందించవచ్చో పరిచయం కలిగిస్తుంది ప్రాజెక్టు. విద్యార్థి సృజనాత్మకతకు కూడా ఇది అవకాశాన్నిస్తుంది. చక్కగా చేసిన ప్రాజెక్టు ఉద్యోగానికి తొలిమెట్టు అవుతుంది. ఎంత జటిలమైన ప్రాజెక్టు చేశాం అనేదాని కంటే- ఎంత బాగా చేశాం, దానివల్ల సంఘానికి ఎంత ఉపయోగం అనే అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది.
దేనిలో ప్రాజెక్టు చేయాలి, ఎలా ఎంచుకోవాలి, ఎక్కడ చేయాలి, నా బ్రాంచికి సంబంధించినవాటికే పరిమితమవ్వాలా అనేవి ప్రతి విద్యార్థికీ ప్రశ్నలే. ముందస్తుగానే వీటన్నింటికీ సమాధానాలు రాబట్టుకోవడం ముఖ్యం. అవసరమైన వ్యవధి, మూల్యాంకనం జరిగే విధానాలపై అవగాహన కూడా ఎంతో అవసరం. జేఎన్‌టీయూ నిబంధనల మేరకు బీటెక్ నాలుగో సంవత్సరం రెండో సెమిస్టర్లో మూడు సబ్జెక్టులు, ఒక టెక్నికల్ సెమినార్, కాంప్రహెన్సివ్ వైవాతోపాటు ఒక ప్రాజెక్టు చెయ్యాల్సి ఉంటుంది.
మొత్తం మార్కులు ఎన్ని?
ప్రాజెక్టుకు 200 మార్కులు. ఇందులో 50 మార్కులకు అంతర్గతంగా, 150 అంతిమ పరీక్షలో మూల్యాంకనం జరుగుతుంది. అంతర్గత మార్కులు విభాగం అధీనంలో ఉంటాయి. వీటి మూల్యాంకనం విభాగ అధిపతి, సీనియర్ అధ్యాపకులు, విభాగం నియమించిన గైడ్‌లతో కూడిన పానెల్ చేస్తుంది. ఈ పానెల్‌లో కనీసం ముగ్గురు సభ్యులుంటారు. అందులో విభాగానికి కేటాయించిన అంతర్గత గైడ్ తప్పనిసరిగా ఉండాలి. సాధారణంగా ఈ 50 మార్కులు నాలుగు/ ఐదు భాగాలుగా విభజించి కేటాయిస్తారు.
తుది మౌఖిక పరీక్షకు కేటాయించిన 150 మార్కుల మూల్యాంకనం కోసం వేరే ప్రత్యేక పానెల్‌ను నియమిస్తారు. ఈ పానెల్‌లో జేఎన్‌టీయూ నియమించిన ఒక ఎగ్జామినర్, కళాశాల తరపున కనీసం ముగ్గురు సభ్యులుంటారు. ఇందులో ప్రధానంగా విద్యార్థి తాను చేసిన ప్రాజెక్టు ఎలా పనిచేస్తుందో ప్రదర్శించగలగాలి. ఇంకా పానెల్ అడిగే ప్రశ్నలకు సంతృప్తికరమైన జవాబులివ్వాలి.
ఎంచుకునే విధానం
ముగ్గురికి మించకుండా విద్యార్థులు బృందంగా ఏర్పడి తాము చేయదలచుకున్న ప్రాజెక్టును ఎంచుకోవాలి- కింది పద్ధతుల్లో ఏదో ఒకటి...
* తమ విభాగంలో పరిశోధన చేస్తున్న అధ్యాపకులు కేటాయించేవి చేయడం
* ఏదైనా కంపెనీ నుంచి ఇంటర్న్‌షిప్ తెచ్చుకోవడం
* కంపెనీ వారిచ్చిన ప్రాజెక్టు చేయటం
* ప్రచురితమైన పరిశోధన పేపర్‌లోని ప్రతిపాదిత అంశానికి ఒక నమూనా చేయడం
* ఇంజినీరింగ్‌లో చదివిన సబ్జెక్టుల్లో బాగా నచ్చిన సబ్జెక్టులోని ఒక అంశంలో ప్రాజెక్టు వెతుక్కోవడం
పైన పేర్కొన్న పద్ధతుల్లో చేసినవి నాణ్యత ప్రమాణాల పరంగా బాగుంటాయి.
అయితే కొన్ని నాసిరకం సంస్థలు ముందస్తుగా తయారు చేసిపెట్టుకున్న ప్రాజెక్టులను చౌక ధరలకు అమ్ముతున్నాయి. అనధికార అంచనాల మేరకు ప్రతి సంవత్సరం కొన్ని పదుల సంస్థలు డిసెంబర్ నెలలో మొదలుపెట్టి మార్చి/ ఏప్రిల్ వరకూ పనిచేసి ప్రాజెక్టుల వ్యాపారం జోరుగా సాగిస్తున్నాయి. ఈ సంస్థలన్నీ హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రబలంగా ఉన్నాయి. ఇటువంటి సంస్థలు ఒకే ప్రాజెక్టును ఎందరో విద్యార్థులకు అమ్ముతున్నాయి. ఇవి ప్రధానంగా సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ ఆధారిత నమూనా అనుకరణలు (సిమ్యులేషన్).
ఇవి అన్ని అంశాల్లో తయారై లభిస్తుండడంతో చాలామంది విద్యార్థులు వీటిపట్ల ఆకర్షితులవుతున్నారు. తద్వారా తమలోని ప్రయోగాత్మకతకు మెరుగులు దిద్దుకునే మంచి అవకాశాన్ని పోగొట్టుకుంటున్నారు. అంతే కాదు; ఉద్యోగ సంసిద్ధులుగా అవకాశాన్ని పోగొట్టుకునే ప్రమాదంలోకి జారిపోతున్నారు. ఇటువంటి మార్గంలో ప్రయాణించకపోవడం అన్నివిధాలా ఉత్తమం.
ప్రాజెక్టు నివేదిక రాసేటపుడు...
* బాండ్ పేపర్లే వాడాలి.
* పేపర్‌కి ఒకవైపు మాత్రమే అచ్చు వేయాలి.
* అచ్చు తీసిన లైన్ల మధ్య రెండు లైన్ల ఖాళీ ఉండాలి.
* అధ్యాయాలకు సరైన క్రమసంఖ్యలు ఇవ్వాలి.
* ఒక అధ్యాయంలోని వివిధ భాగాలకు ఒక క్రమ పద్ధతిలో సంఖ్యలనివ్వాలి.
* ప్రతి చిత్రానికీ, పట్టికలకూ క్రమసంఖ్యను ఇవ్వాలి.
* భవిష్యత్తులో ప్రస్తుత ప్రాజెక్టును ఎలా అభివృద్ధి చేయవచ్చో స్పష్టంగా చెప్పాలి.
* సూచక పుస్తకాలు, ప్రచురితమైన పరిశోధన పేపర్లు, వెబ్‌సైట్లు తప్పకుండా రిపోర్టులో చేర్చాలి.
* ప్రాజెక్టు నిర్విఘ్నంగా సాగడానికి సహాయం చేసినవారికి కృతజ్ఞతలు తెలపాలి. ఇందులో కేవలం ప్రిన్సిపల్, విభాగాధిపతి, అంతర్గత గైడ్లనే కాకుండా చదువు చెప్పిన అందరు
అధ్యాపకులనూ, స్నేహితులనూ కూడా చేర్చవచ్చు.

 • Industry      Interaction

  Higher Education

  Job Skills

  Soft Skills

  Comm. English

  Mock Test

  E-learning