యూఎస్‌లో చ‌దువుకుంటూ ప‌నిచేయాలంటే...

అమెరికాలో చ‌దువంటే ఖరీదైన వ్యవ‌హార‌మే. అయితే కొన్ని ప‌రిమితుల‌కు లోబ‌డి అక్కడ చ‌దువుకుంటూ ప‌నిచేసుకోవ‌చ్చు. దీంతో విలువైన ప‌ని అనుభవం సొంతమ‌వుతుంది. అంత‌కుమించి వ‌చ్చిన డ‌బ్బుల‌తో కొంత వ‌ర‌కు ట్యూష‌న్ ఫీజు చెల్లించుకోవ‌చ్చు. వ్యక్తిగ‌త ఖ‌ర్చుల‌కు వినియోగించుకోవ‌చ్చు. అలాగ‌ని చెప్పి అనుమ‌తులు లేకుండా ఎక్కడైనా ప‌నిచేస్తే మాత్రం తీవ్ర నేరంగా ప‌రిగ‌ణిస్తారు. ముంద‌స్తు ప్రణాళిక‌తో ప‌క్కాగా వ్యవ‌హ‌రిస్తే చ‌దువుకుంటూనే కొంత సంపాదించుకోవ‌డం అమెరికాలో సాధ్యమే. అదెలాగో చూద్దాం...

అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం పాఠ్యపుస్తకాల‌కో, త‌ర‌గ‌తి గ‌దుల‌కో ప‌రిమితం కాదు. నేర్చుకున్న అంశాలు ప్రత్యక్ష ప‌ని అనుభ‌వం ద్వారా తెలుసుకోవ‌డం ఆ దేశ‌ విద్యా విధానం ప్రత్యేక‌త‌. ఇలాచేయ‌డం వ‌ల్ల త‌ర‌గ‌తి గ‌దిలో తెలుసుకున్న అంశాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అందుకే అమెరికాలో చ‌దువుకోవ‌డాన్ని కూడా ప‌ని అనుభ‌వంగానే చెప్పుకోవ‌చ్చు. దాదాపు ప్రసిద్ధ అమెరికా విశ్వవిద్యాల‌యాల‌న్నీ లెర్న్‌, అప్లై, ఎర్న్ విధానాన్ని ప్రోత్సహించేవిగానే ఉంటాయి. విద్యార్థులు విజ్ఙానాన్ని విస్తరించుకోవ‌డానికి ప్రొజెక్టులు, క్లబ్‌లు, క్యాంప‌స్ యాక్టివిటీ, ప్రాక్టిక‌ల్ ట్రైనింగ్ ...ఇలా ప‌లు ర‌కాల అవ‌కాశాలు ఉంటాయి. దీంతో నిజ‌మైన ప‌ని అనుభ‌వం సొంత‌మ‌వుతుంది. అంతేకాకుండా చేసిన ప‌నికిగానూ ప్రోత్సాహంగా కొంత మొత్తం చేతికి అందుతుంది. విదేశీ విద్యార్థులు అమెరికా నియ‌మ నిబంధ‌న‌లు తెలుసుకుంటే ఏ స‌మ‌స్యా లేకుండా చ‌దువుతూనే ప‌నిచేస్తూ అనుభ‌వం పొంద‌వ‌చ్చు, చిన్నచిన్న ఖ‌ర్చులకు స‌రిపోయేంత డ‌బ్బులు సంపాదించుకోవ‌చ్చు.

సాధార‌ణంగా అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసానికి వెళ్లే విదేశీ విద్యార్థుల‌కు ఎఫ్‌-1 వీసా మంజూరుచేస్తారు. వీరంతా అక్కడ ప‌నిచేసుకోవ‌డానికి 3 మార్గాలు ఉన్నాయి. అవి..
ఆన్ క్యాంప‌స్ వ‌ర్క్‌
ఆఫ్ క్యాంప‌స్ వ‌ర్క్‌
క‌రిక్యుల‌మ్ ప్రాక్టిక‌ల్ ట్రైనింగ్ (సీపీటీ), ఆప్షన‌ల్ ప్రాక్టిక‌ల్ ట్రైనింగ్ (ఓపీటీ)

ఎఫ్‌-1 వీసాపై వెళ్లిన‌వాళ్లు కోర్సులో ఉన్నన్నాళ్లూ వారానికి 20 గంట‌లు చొప్పున క్యాంప‌స్‌లోనే ఏదో ఒక ప‌నిచేసుకోవ‌చ్చు. ఇందుకోసం యూనివ‌ర్సిటీ క్యాంప‌స్‌లోనే ప‌లు ర‌కాల ఉద్యోగాలు ఉంటాయి. కెఫెటేరియా, ల్యాబ్‌, క్యాంప‌స్ సెంట‌ర్లు...ఇలా క్యాంప‌స్‌లోనే ప‌లు చోట్ల ఉపాధి పొందే మార్గాలు క‌ల్పిస్తారు. అలాగే విద్యార్థులు వారు చ‌దువుతున్న కోర్సుకు సంబంధించి క‌రిక్యుల‌మ్ బేస్డ్ ట్రైనింగ్‌లో చేర‌వ‌చ్చు. సైన్స్‌, టెక్నాల‌జీ, ఇంజినీరింగ్‌, మ్యాథ్స్ (స్టెమ్‌) విభాగాల్లో కోర్సులు చేస్తున్నవాళ్లు రెండేళ్లపాటు క‌రిక్యూల‌మ్ బేస్డ్ ట్రైనింగ్‌లో కొన‌సాగ‌వ‌చ్చు. కోర్సు పూర్తయిన త‌ర్వాత ఆప్షన‌ల్ ప్రాక్టిక‌ల్ ట్రైనింగ్‌లోనూ శిక్షణ తీసుకోవ‌చ్చు. ఇలా సంబంధిత ప‌నిచేయ‌డం వ‌ల్ల కొంత మొత్తం సంపాదించుకోవ‌చ్చు. అలాగే ఎఫ్‌-1 వీసాపై వెళ్లే విద్యార్థులు ఇ-వెరిఫై కంపెనీల్లోనే ప‌నిచేయ‌డం సాధ్యమ‌వుతుంది. విద్యార్థులు ప్రాక్టిక‌ల్ ప‌రిజ్ఞానానికి ఇలాంటి కంపెనీలు, సంస్థల్లో ప‌నిచేయ‌డానికి సంబంధిత యూనివ‌ర్సిటీ నుంచి అనుమ‌తి పొంద‌డం త‌ప్పనిస‌రి. బ‌య‌ట‌కు వెళ్లి ఏడాదిపాటు ప‌ని చేసుకోవ‌చ్చు. ఆప్షన‌ల్ ప్రాక్టిక‌ల్ ట్రైనింగ్(ఓపీటీ) పొందాల‌నుకునేవాళ్లు యూఎస్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ నుంచి అనుమ‌తి తీసుకోవ‌డం త‌ప్పనిస‌రి. ఓపీటీ ద్వారా విద్యార్థులు వారానికి 40 గంట‌లు ప‌నిచేసుకోవ‌చ్చు. కోర్సులో చేరి 9 నెల‌లు పూర్తయిన త‌ర్వాత ఓపీటీకి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఇలా ద‌ర‌ఖాస్తు చేసుకున్న మూడు నెల‌ల‌కు అనుమ‌తి ల‌భిస్తుంది. ఓపీటీ అనుమ‌తి పొందిన‌వాళ్లు కోర్సు పూర్తయిన త‌ర్వాత ఏడాది పాటు యూఎస్‌లో ప‌నిచేసుకోవ‌చ్చు. ఈ ఓపీటీని కోర్సు పూర్తయిన 14 నెల‌ల్లోపు పూర్తిచేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధానంలో అనుమ‌తులు పొందిన‌ విద్యార్థులు తాము చ‌దువు పూర్తి చేసుకున్నకోర్సుకు సంబంధించిన ప‌నినే చేయాల్సి ఉంటుంది. సీపీటీ విధానంలో 12 నెల‌ల కంటే ఎక్కువ ప‌నిచేసిన‌వాళ్లు ఓపీటీకి అర్హులు కారు. కొన్ని యూనివ‌ర్సిటీలు ఇంజినీరింగ్‌లో ఉన్నతవిద్య చ‌దువుతున్నవారికోసం కోఅప్ ప్రోగ్రామ్‌ల‌ను కూడా అందిస్తున్నాయి. ఇలాచేయ‌డం వ‌ల్ల వాళ్లు చ‌దువుతున్నప్పుడే ప్రాక్టిక‌ల్ ప‌రిజ్ఞానం పెంపొందించుకోవ‌డానికి వీల‌వుతుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు
యూఎస్‌లో చ‌దువుకునే విదేశీ విద్యార్థులు స‌రైన అధికారిక అనుమ‌తులు లేకుండా ఎక్కడా ప‌నిచేయ‌రాదు.
కేటాయించిన స‌మ‌యం కంటే ఎక్కువ వ్యవ‌ధి ప‌నిచేయ‌డ‌మూ నేర‌మే.
యూనివ‌ర్సిటీ క్యాంప‌స్‌లో ఉండే ఇంటర్నేష‌న‌ల్ స్టూడెంట్ ఆఫీస్ నుంచి స‌ల‌హాలు తీసుకోవ‌డం ద్వారా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకోవ‌చ్చు.
తాజా నిబంధ‌న‌లు, ప‌ని నియ‌మాలపై పూర్తి అవ‌గాహ‌న పెంపొందించుకోవాలి.
క్యాంప‌స్‌లో ప‌నిచేస్తున్న విద్యార్థులు సైతం ఆ క్యాంప‌స్ లో సంబంధిత అధికారి నుంచి అనుమ‌తులు పొందడం త‌ప్పనిస‌రి.
ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకుని నిబంధ‌న మేర‌కు న‌డుచుకుంటే యూఎస్‌లో చ‌ద‌వ‌డం మ‌రుపురాని అనుభూతిగా మిగులుతుంది. ఎంతో విలువైన‌ ప్రాక్టిక‌ల్ ప‌రిజ్ఞానం సొంత‌మ‌వుతుంది. కొన్ని ఖ‌ర్చులూ తీరుతాయి.
Posted on 23-07-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning