నైపుణ్య వారధి.. 'టాస్క్‌'

* విద్యార్థులు, నిరుద్యోగులకు అండ
* బోధన సిబ్బంది మెలకువలు పెంపు
* 457 కళాశాలలు, వేలాది విద్యార్థులకు తోడ్పాటు
* తొలి ఏడాది పూర్తిచేసుకున్న తెలంగాణ నైపుణ్య, విజ్ఞానాభివృద్ధి సంస్థ
* నమోదుకు జులై 31 వరకూ అవకాశం

ఈనాడు - హైదరాబాద్‌: పోటీ ప్రపంచంలో రాష్ట్ర విద్యార్థులు ముందువరుసలో నిలిచి ఉద్యోగావకాశాలను చేజిక్కించుకునేందుకు అండగా నిలుస్తోంది తెలంగాణ నైపుణ్య, విజ్ఞానాభివృద్ధి సంస్థ (టాస్క్‌). ఏడాది క్రితం ఏర్పాటైన టాస్క్‌.. ఉద్యోగార్థులకు అవసరమైన నైపుణ్యాన్ని అందించడం లక్ష్యంగా ముందుకు వెళ్తొంది. తెలంగాణలో నమోదు చేసుకున్న 457 కళాశాలలు, వేలాది మంది విద్యార్థులకు బాసటగా నిలుస్తూ విద్యార్థులు-విద్యాసంస్థలు-పరిశ్రమలను అనుసంధానం చేస్తోంది. తెలంగాణ ఐటీ శాఖ ద్వారా ఏర్పాటైన టాస్క్‌ ఇప్పటి వరకూ ప్రధానంగా ఐటీ, ఐటీ ఆధారిత సేవల్లో నైపుణ్యం పెంపునకే పరిమితం కాగా.. ఈ ఏడాది ఏరోస్పేస్‌, హెల్త్‌కేర్‌, ఫార్మా, ఫొటోనిక్స్‌, లైఫ్‌ సైన్సెన్‌ వంటి ఇతర రంగాలకు విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రధానంగా సాఫ్ట్‌ స్కిల్స్‌లో ఎక్కువమంది శిక్షణ పొందుతుండగా, తర్వాత స్థానంలో టెక్నికల్‌ స్కిల్స్‌ ఉన్నాయి. తాజాగా మరిన్ని వేలమందికి శిక్షణ ఇచ్చేందుకు విద్యార్థుల నమోదుకు టాస్క్‌ శ్రీకారం చుట్టింది. ఆంగ్లంలో తగిన పరిజ్ఞానంలేక ఉద్యోగాలను పొందడంలో విద్యార్థులు ప్రధానంగా వెనకబడుతున్నారు. ఈ నేపథ్యంలో అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఈసారి కేంబ్రిడ్జి వర్సిటీ ద్వారా మొదటి విడతగా 40 మంది అధ్యాపకులకు శిక్షణ ఇవ్వనున్నారు. వారు 20 మంది చొప్పున అధ్యాపకులకు శిక్షణ ఇస్తారు. బిజినెస్‌ ఇంగ్లిష్‌ సర్టిఫికేషన్‌ (బీఈసీ)నూ నిర్వహిస్తున్నారు.

మీ ప్రపంచాన్ని సృష్టించుకోండి...
ఇంజినీరింగ్‌ విద్యార్థులకు పరిశ్రమలు సొంతంగా నెలకొల్పాలనే ఆసక్తిని కల్పించేందుకు ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ)తో కలసి టాస్క్‌ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనేక అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు.
ఉద్యోగాల సాధనలో అండగా...
నమోదు చేసుకున్న వారు ఉద్యోగాలు పొందేందుకు కావాల్సిన ప్రత్యేక అంశాలపై శిక్షణ ఇచ్చి అవగాహన కల్పిస్తున్నారు. సబ్జెక్ట్‌లో తర్ఫీదు ఇవ్వడంతో బాటు మెలకువలు నేర్పిస్తారు. ఉద్యోగావకాశాలను తెలియజేయడంతో బాటు ఇంటర్వ్యూలకు హాజరయ్యేటట్లు చూస్తారు. సంస్థల అవసరాల మేరకు అభ్యర్థులను సిద్ధం చేసి పంపుతారు.
ఫినిషింగ్‌ స్కూల్‌ ఓ అద్భుతం...
కార్పొరేట్‌ సంస్థల అవసరాలకు తగ్గట్లు శిక్షణకు ఫినిషింగ్‌ స్కూల్‌ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని టాస్క్‌ చేపట్టింది. ఎనిమిది నుంచి 12 వారాలు ఉండే కోర్సు ద్వారా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఆంగ్లం, రీజనింగ్‌, సాఫ్ట్‌స్కిల్స్‌, టెక్నికల్‌ స్కిల్స్‌లో శిక్షణ ఉంటుంది.
నమోదు ఎలా...
జులై 31వ తేదీ నమోదుకు గడువుగా నిర్ణయించారు. బీటెక్‌, డిగ్రీ, పాలిటెక్నిక్‌, ఐటీఐ విద్యార్థులు 2, 3, 4వ సంవత్సరం చదువుతున్నవారు నమోదు చేసుకోవాలి. వీరికి టాస్క్‌ పూర్తి స్థాయిలో తోడ్పాటును అందిస్తుంది. టాస్క్‌ వెబ్‌సైట్‌ ద్వారా నమోదు చేసుకోవచ్చు.
నమోదు చేసుకున్న వారికి సౌకర్యాలు...
* అనేక మాడ్యుల్స్‌ అందుబాటులో ఉంటాయి.
* ఎంపిక చేసుకున్న అంశాల్లో సాంకేతిక నైపుణ్యాల పెంపు.. వ్యక్తిగత నైపుణ్యాభివృద్ధి.
* అందుబాటులో వర్చువల్‌ ల్యాబ్‌లు.
* ఆన్‌లైన్‌ పరీక్షల ద్వారా ప్రతిభ అంచనా.
* నిపుణులు, అనుభజ్ఞుల పాఠాలు.
* వెబ్‌సైట్‌లో ఉద్యోగ ప్రకటనల వివరాలు.
ఉత్తమమైన మానవ వనరులే లక్ష్యం
-సుజీవ్‌ నాయర్‌, సీఈఓ టాస్క్‌
తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ, ఇంజినీరింగ్‌ కోర్సులు పూర్తి చేసి వచ్చే వారు పూర్తి నైపుణ్యంతో బయటకు వెళ్లాలనేది మా ప్రయత్నం. 457 కాలేజీలు నమోదయ్యాయి. గత ఏడాది 40 వేలమందికిపైగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చాం. గతంలో 20లోపు కోర్సులు మాత్రం అందుబాటులో ఉండగా ఈ సంవత్సరం 58 కోర్సులకు పెంచుతున్నాం. ఇప్పటి వరకూ బీటెక్‌ పూర్తిచేసినవారికే ఫినిషింగ్‌ స్కూల్‌ అవకాశం ఉంది. దీన్ని డిగ్రీకీ విస్తరించే ఆలోచన ఉంది.
ఫినిషింగ్‌ స్కూల్‌ నా జీవితంలో కీలకం
-లావణ్య, ఉట్నూరు, ఆదిలాబాద్‌ జిల్లా
బాసర ఐఐఐటీలో 2014లో బీటెక్‌ పూర్తి చేశా. ఒక ఏడాది గ్యాప్‌ వచ్చింది. తర్వాత అనేక ఇంటర్వ్యూలు హాజరైనా ఉద్యోగం రాలేదు. ఇదే సమయంలో టాస్క్‌ ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేసిన ఫినిషింగ్‌ స్కూలులో శిక్షణ పొందడం నా జీవితంలో కీలక పరిణామం. టెక్నికల్‌ స్కిల్స్‌తో బాటు సాఫ్ట్‌ స్కిల్‌పై చక్కటి శిక్షణ ఇచ్చారు. ఇంటర్వ్యూలో సులభంగా నెగ్గి సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం సంపాదించా.
నిరాశ తొలగింది.. విశ్వాసం వచ్చింది
-అజయ్‌కుమార్‌, రఘునాథపల్లి, వరంగల్‌జిల్లా
బీటెక్‌ పూర్తయినా ఉద్యోగం పొందలేకపోయా. ఇంటర్వ్యూలకు వెళ్లడం వెనుదిరగడంతో తీవ్ర నిరాశకు గురైన స్థితిలో టాస్క్‌ ఫినిషింగ్‌ స్కూల్‌లో చేరా. మేం వెనకబడుతున్న కీలక అంశాలపై శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నా.
టాస్క్‌ ద్వారానే ఆత్మవిశ్వాసం
-మునాజ్‌ ముస్తజాబ్‌, ఆర్మూర్‌, నిజామాబాద్‌ జిల్లా
బీటెక్‌ 201లో పూర్తయింది. టాస్క్‌ ఫినిషింగ్‌ స్కూల్‌లో ఉద్యోగానికి అవసరమైన అంశాలపై చక్కటి శిక్షణ ఇచ్చారు. కంపెనీలు ఏం కోరుకుంటాయనే అంశాలపై అవగాహనతో ఉద్యోగం సంపాదించుకోగలిగాను. పోటీ ప్రపంచంలో నిలబడగలననే ఆత్మవిశ్వాసం నాకు టాస్క్‌ ద్వారానే వచ్చింది.
ఇంకా నేర్చుకోవాలని తెలిసింది
-శ్రీకాంత్‌, హుజూరాబాద్‌, కరీంనగర్‌ జిల్లా
ఉద్యోగం పొందాలంటే ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉంటే చాలదు. ఇంకా చాలా అంశాలు అవసరమనే విషయం టాస్క్‌లో చేరిన తర్వాత తెలిసింది. ఉద్యోగం కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాను. నా సమస్యకు టాస్క్‌ పరిష్కారం చూపింది.

Posted on 26-07-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning