నైపుణ్యాలకు ‘టాస్క్‌’ నగిషీ!

విద్యార్థుల పరిజ్ఞానాన్నీ, నైపుణ్యాలనూ పెంచేందుకు ఏడాది క్రితం ప్రారంభమైన తెలంగాణ నైపుణ్య, విజ్ఞానాభివృద్ధి సంస్థ (టాస్క్‌)కు ప్రోత్సాహకరమైన స్పందన లభిస్తోంది. ఐటీ, ఐటీ ఆధారిత సేవల నుంచి ఏరోస్పేస్‌, హెల్త్‌కేర్‌, ఫార్మా, లైఫ్‌సైన్సెస్‌ లాంటి ఇతర రంగాలకూ దీని పరిధి విస్తరిస్తున్న సందర్భంలో దీని బహుళ ప్రయోజనాలను గుర్తించటం, సద్వినియోగం చేసుకోవటం విద్యార్థుల కర్తవ్యం!

టాస్క్‌లో సభ్యత్వం ప్రస్తుత విద్యార్థులకు పూర్వ విద్యార్థులకు వేరువేరుగా ఉంటుంది. ప్రస్తుత విద్యార్థుల విషయానికొస్తే.. బీటెక్‌ రెండు, మూడు, నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు నమోదు చేసుకోవచ్చు. డిగ్రీ ముగించి ప్రస్తుతం ఖాళీగా ఉన్న విద్యార్థులు ఫినిషింగ్‌ స్కూలులో సభ్యత్వానికి అర్హులు.
ప్రస్తుతం బీటెక్‌తో సహా, ఏ రంగంలోనైనా డిగ్రీ లేక పీజీ చేస్తున్న విద్యార్థులు, పాలిటెక్నిక్‌ ఐటీఐ చదువుతున్న విద్యార్థులు సభ్యత్వం నమోదు చేసుకోవడానికి అర్హులు. అయితే వీరు తప్పనిసరిగా టాస్క్‌ సభ్యత్వం తీసుకున్న కళాశాలకు చెందిన విద్యార్థులై ఉండాలి. 2016-17 సంవత్సరానికిగానూ వంద రూపాయల అపరాధ రుసుముతో నమోదు చేసుకోవడానికి ఆగస్టు 15 వరకు సమయముంది. సభ్యత్వ రుసుము: * వృత్తి విద్యల్లో డిగ్రీ/ ఏదేనీ పీజీ కోర్సులకు చెందిన జనరల్‌ కేటగిరీ విద్యార్థులకు రూ.1,165 * ఇవే కోర్సులకు చెందిన ఎస్‌సీ, ఎస్‌టీ విద్యార్థులకు రూ.575 * ఇతర డిగ్రీ, పాలిటెక్నిక్‌, ఐటీఐ చదువుతున్న విద్యార్థులకు రూ.575 * ఇవే కోర్సులకు చెందిన ఎస్‌సీ, ఎస్‌టీ విద్యార్థులకు రూ.288
ఆన్‌లైన్‌లో విద్యార్థులు తమ పేర్లను పూర్తి వివరాలతో నమోదు చేసుకోవాలి. ఆధార్‌ సంఖ్య, ఇంటి చిరునామా, విద్యార్హత వివరాలు, ఫొటో వివరాలు ఆన్‌లైన్‌లో నింపి, రుసుము కూడా ఆన్‌లైన్‌లోనే చెల్లించే వీలుంది. సభ్యత్వం కోర్సు ముగిసేంతవరకూ చెల్లుబాటవుతుంది.
సహాయ సహకారాలు
నమోదు చేసుకుంటే ఈ ఉపయోగాలు ఉంటాయి.
* ఆంగ్ల భాష, సాఫ్ట్‌స్కిల్స్‌లో ప్రావీణ్యం
* సోషల్‌ మీడియా, మొబైల్‌, అనలిటిక్స్‌, క్లౌడ్‌ వంటి సరికొత్త సాంకేతికతల్లో శిక్షణ, సర్టిఫికేషన్‌ అవకాశం
* వివిధ రకాల సెమినార్లలో పాల్గొనే అవకాశం
* డిగ్రీ, పాలిటెక్నిక్‌, ఐటీఐ విద్యార్థులకు ఐటీ, మౌలికాంశాలపై అవగాహన, నేర్పుల్లో శిక్షణ
* సహజ సామర్థ్యం, హేతువుల్లో మూల్యాంకన పరీక్షలు
* ప్రోగ్రామింగ్‌లో సహజ సామర్థ్య పరీక్షలు
* కార్పొరేట్‌ సంస్థల సందర్శనకు అవకాశం
* ఈ- శిక్షణ వనరులు అందుబాటులో ఉండడం
* మదింపు పరీక్షల వనరులు ఆన్‌లైన్‌లో లభ్యం
* ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ సహకారంతో టెక్నాలజీ ఉద్యోగపతి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం
* కృత్రిమ (వర్చువల్‌) ప్రయోగశాలల ప్రవేశం
* కోడింగ్‌ పోటీల్లో పాల్గొనే అవకాశం
* నూతన టెక్నాలజీ ఆవిష్కరణలకు సహకారం
* కెరియర్‌ కౌన్సెలింగ్‌, మార్గదర్శనం
* సమర్థంగా ప్రాజెక్టులు చేయడంలో మార్గదర్శనం, సహాయం
* వేసవిలో శిక్షణకు సంబంధించిన మలిదశ (ఇంటర్న్‌షిప్‌)
ఏయే శిక్షణలు?
విద్యార్థులకు ప్రధానంగా ఐదు రకాల శిక్షణలుంటాయి.
1. టెక్నాలజీ ఉద్యోగపతుల కార్యక్రమం: 3, 4 సంవత్సరాల్లో ఉన్న ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ సంయోజనంతో పరిశ్రమల స్థాపనలో రెండు సంవత్సరాల శిక్షణ. వీరికి మౌలికమైన కోర్సులు, టెక్నాలజీకి సంబంధించిన శిక్షణ, ప్రయోగాల కోసం కావాల్సిన వసతులు సమకూర్చడం, నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం, స్టార్టప్‌ సంస్థలు నెలకొల్పడంలో సహాయం మొదలైనవాటిలో తర్ఫీదునిస్తారు. వారు పరిశ్రమలు స్థాపించడానికి ప్రోత్సహిస్తారు.
2. ఐఓటీ- మేకర్స్‌ స్పేస్‌: హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థల సమాఖ్య (హైసియా) సహకారంతో టాస్క్‌ టెక్నాలజీ రంగంలో విద్యార్థుల సహజ ప్రతిభకు సానపెట్టి, వారి వినూత్న ఆలోచనలకు ఆకారమివ్వడానికి ఏర్పరిచిన వేదిక మేకర్స్‌ స్పేస్‌. సమీప భవిష్యత్తులో ఐటీ ఆధారిత సేవల రంగంలో ఎన్నో ఉత్పత్తులు, సేవలకు అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు. మేకర్స్‌ స్పేస్‌ ద్వారా శిక్షణ పొంది, సామర్థ్యాలను పెంచుకుని, ఉద్యోగ సంసిద్ధులైన విద్యార్థులను పరిశ్రమలకు అందించడమే టాస్క్‌ ప్రధాన ఉద్దేశం. మూడంచెల ఈ మేకర్స్‌ స్పేస్‌ కార్యక్రమంలో మొదటి అంచెలో జిజ్ఞాస, అభ్యాస, సాధన, ఆనంద అనే కార్యక్రమాల్లో విద్యార్థి బృందాలు పాల్గొంటాయి.రెండో అంచెలో ఐడియాథాన్‌, హ్యాకథాన్‌ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నవారికి ‘ఎక్సైట్‌’పేరుతో ప్రత్యేక వేసవి శిక్షణఉంటుంది.మూడో అంచెలో ఇంటర్న్‌షిప్‌లు, నియామకాల వ్యవస్థీకరణ ప్రయత్నాలు ఉంటాయి.
3. ఈఎస్‌డీఎం: ఉన్నత విద్యాశాల స్థాయిలోనే చదువులు ఆపేసినవారికి వృత్తివిద్యల్లో 75% రాయితీతో కూడిన మెలకువల్లో శిక్షణ నేర్పి వారు చిన్న ఉద్యోగాలు/ స్వయంఉపాధి కల్పించుకునే వీలు కల్పించేది ఎలక్ట్రానిక్‌ రంగంలో ఉపకరణాల తయారీ వ్యవస్థ (ఈఏడీఎం).
4. సూపర్‌ క్యాంపస్‌: విద్యార్థులు తమ కెరియర్‌ మలచుకోవడానికి కావాల్సిన వివిధ విద్యా వనరులు, సాంకేతిక పాఠ్యాంశాలు, ప్రాంగణ నియామక శిక్షణకు సంబంధించిన వివిధ పాఠ్యాంశాల వనరులు ఆన్‌లైన్‌లో విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి. వీటిని ఉపయోగించుకుని, అభ్యాసం చేయవచ్చు. అదనంగా వివిధ సంస్థల నియామకాల పద్ధతులకు అనుగుణంగా అభ్యాసం కోసం మాదిరి ప్రశ్నపత్రాలు ఉంటాయి. ఈ వనరులను వినియోగించుకుని కెరియర్‌ను ప్రణాళికాబద్ధంగా మలచుకోవచ్చు.
5. టాస్క్‌- సిడాక్‌: ఆఖరిదైన ఈ- వనరులు సి-డాక్‌ సంయోజనంతో టాస్క్‌ అమలుపరుస్తోంది. ఇందులో రెండు రకాల శిక్షణ కార్యక్రమాలుంటాయి. మొదటిది విద్యార్థులకు, అధ్యాపకులకు 30 గంటల కాలవ్యవధి నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయి. ఇక రెండో కార్యక్రమంలో ఇంజినీరింగ్‌ విద్యార్థులకు 6 వారాల శిక్షణ ఉంటుంది. ప్రస్తుతం వీఎల్‌ఎస్‌ఐ, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, ఎలక్ట్రానిక్‌ ప్యాకేజింగ్‌ అనే అంశాల్లో ప్రత్యేక శిక్షణ నిర్వహిస్తోంది. ఇందులో రెండు వారాలు ప్రాజెక్టు కోసం కేటాయిస్తారు. దీనికి ఫీజు ఉంటుంది. శిక్షణ ముగిసిన తరువాత చివరి సంవత్సరంలో ఉద్యోగ నియామకాలను కంపెనీల సహకారంతో నిర్వహిస్తుంది. విద్యార్థులు టాస్క్‌ ద్వారా తమ మెలకువలను, నైపుణ్యాలను పెంచుకోవాలి. డిగ్రీలో మంచి మార్కుల శాతం కూడా సాధిస్తే భవిష్యత్తుకు బంగారు బాట వేసుకున్నట్లే!
సభ్యత్వం లేని కళాశాలల విద్యార్థులు కూడా ‘టాస్క్‌’లో నమోదు అయ్యే అవకాశం ఉంది. వారికోసం ప్రత్యేక ప్రకటన వెలువడుతుంది. దానికోసం వారు టాస్క్‌ అధికారి క వెబ్‌సైటును తరచూ చూస్తుండాలి.

- నీల‌మేఘ‌శ్యామ దేశాయ్‌


Posted on 01-08-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning