ప్రపంచంలో టాప్ ఇంజినీరింగ్ స్పెష‌లైజేష‌న్లు ఇవే...

ప్రపంచ యువ‌త క్రేజీ కోర్సు ఇంజినీరింగ్‌లో.. సీఎస్ఈ. ఈసీఈ, మెకానిక‌ల్‌, ఏరోనాటిక‌ల్‌, అగ్రిక‌ల్చర్‌, ఆర్కిటెక్చర్‌...ఇలా స్పెష‌లైజేష‌న్లూ ఎన్నో ఉన్నాయి. ఒక్కో దేశంలో ఒక్కో స్పెష‌లైజేష‌న్‌కు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అయితే వీటిలో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఆస‌క్తి చూపే స్పెష‌లైజేష‌న్లు కొన్ని ఉన్నాయి. ఆ స్పెష‌లైజేష‌న్లకు సంబంధించి నాణ్యమైన‌ బోధ‌న అందించే విశ్వవిద్యాల‌యాల‌గా కొన్ని సంస్థలు ఖ్యాతి గ‌డించాయి. విశ్వవ్యాప్తంగా డిమాండ్ ఉన్న ఇంజినీరింగ్‌ స్పెష‌లైజేష‌న్లు, వాటిని అందిస్తోన్న ప్రముఖ యూనివ‌ర్సిటీల వివ‌రాలు తెలుసుకుందాం...

విశ్వవ్యాప్తంగా ఏటా మిలియ‌న్ల సంఖ్యలో యువ‌త ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరుతోంది. ఒక్క భార‌త‌దేశం నుంచే సుమారు 12 ల‌క్షల మంది విద్యార్థులు ప్రతి సంవ‌త్సరం బీఈ/ బీటెక్ కోర్సుల్లో చేరుతున్నారు. అలాగే విదేశీ విద్యలో భాగంగా ఎక్కువ మంది విద్యార్థులు ఇంజినీరింగ్ కోర్సుల్లో చేర‌డానికే ప్రాధాన్యమిస్తున్నారు. అన్ని దేశాల నుంచీ ఏటా దాదాపు రెండు ల‌క్షల మంది విద్యార్థులు ఇంజినీరింగ్ విద్య కోసం అమెరికా విమానం ఎక్కుతున్నారు. ఈ విష‌యంలో యూఎస్ త‌ర్వాత స్థానం జ‌ర్మనీదే.

ఇర‌వై ఏళ్ల కింద‌ట‌ విదేశీవిద్య అంటే చాలా ఖ‌రీదైన వ్యవ‌హారం. తాజా ప‌రిణామాల‌తో మ‌ధ్యత‌ర‌గ‌తి కుటుంబాలు సైతం విదేశాల్లో చ‌ద‌వ‌డానికి వెనుకాడ‌డం లేదు. ఆదాయ మార్గాలు పెర‌గ‌డం, రుణాలు సులువుగా ల‌భించ‌డం, స్కాల‌ర్‌షిప్పులు తోడ్పాటునందించ‌డం...త‌దిత‌ర కార‌ణాల‌తో అభివృద్ధి చెందిన‌/ చెందుతోన్న దేశాల నుంచి ఎక్కువ మంది విదేశీ విద్యకు ప్రాధాన్యమిస్తున్నారు. ప్రముఖ విశ్వవిద్యాల‌యాల‌న్నీ ప్రతిభ‌ను స్కాల‌ర్‌షిప్పుల రూపంలో ప్రోత్సహించ‌డంతో త‌ల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు అధిగ‌మించ‌గ‌లుగుతున్నారు. విఖ్యాత‌ హార్వార్డ్ యూనివ‌ర్సిటీలో చ‌దువుతోన్న అండ‌ర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల్లో 60 శాతం మందికి హార్వార్డ్ స్కాల‌ర్‌షిప్పు అందిస్తున్నట్లు ఆ విశ్వవిద్యాల‌యం తెలిపింది. దీంతో హార్వార్డ్‌లో చ‌దువులు అందిన ద్రాక్షగా మారాయి.

ఆయా దేశాల‌వారీ ఉన్న అవ‌స‌రాలు, స్థానిక మార్కెట్‌, ప్రస్తుత ప‌రిస్థితులు...వీటిద్వారా ఒక్కో ప్రాంతంలో ఒక్కో త‌ర‌హా స్పెష‌లైజేష‌న్‌కు ప్రాధాన్యం ఏర్పడింది. ఫ‌లితంగా ఆయా స్పెష‌లైజేష‌న్లకు డిమాండ్ ఉన్న చోట విద్య అభ్యసించ‌డం వ‌ల్ల కొత్త ఆవిష్కర‌ణ‌లు వెలుగులోకి వ‌స్తున్నాయి. దీంతో ఆ దేశాలు కూడా లాభ‌ప‌డుతున్నాయి. డిమాండ్ ఉన్న చోట చ‌ద‌వ‌డం ద్వారా వేత‌నరూపంలో పెద్ద మొత్తంలో అందుకోవ‌డం విద్యార్థుల‌కు క‌లిసొచ్చే అంశం. ఉదాహ‌ర‌ణ‌కు ఏరోనాటిక‌ల్ ఇంజినీరింగే తీసుకుంటే యూఎస్ఏలో స‌గ‌టు వేత‌నం ఏడాదికి యాభై వేల డాల‌ర్లు ల‌భిస్తుంది. అదే ఏరోనాటిక‌ల్ ఇంజినీర్‌కి యూకేలోనైతే 46వేల యూఎస్ డాల‌ర్లు అందుతున్నాయి. ఆస్ట్రేలియాలోకి వ‌చ్చేస‌రికి ఆ వేత‌నం 28వేల యూఎస్ డాల‌ర్లే. ఆయా దేశాల్లో ఉన్న అవ‌స‌రాలు, డిమాండ్ ఈ వ్యత్యాసానికి ప్రధాన కార‌ణాలు. దీంతోపాటు అక్కడ జీవ‌న‌మ‌నుగ‌డ‌కు అయ్యే ఖ‌ర్చులు(కాస్ట్ ఆఫ్ లివింగ్‌) కూడా వేత‌నంతో ముడిప‌డి ఉంటాయి.

టాప్ స్పెష‌లైజేష‌న్లు...

ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌
ఎయిర్‌క్రాఫ్ట్‌, స్పేస్ క్రాఫ్ట్ డిజైన్‌లో ఆస‌క్తి ఉన్నవాళ్లు చేరే బ్రాంచ్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌. ఎయిర్‌క్రాఫ్ట్‌ల న‌మూనా త‌యారుచేయ‌డం, రూపొందించ‌డం, అభివృద్ధి చేయ‌డం, ప‌రిశీలించ‌డం...త‌దిత‌రాంశాల‌ను ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజినీర్లకు నేర్పుతారు. ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ను రెండు ఉప విభాగాల‌గా చెప్పుకోవ‌చ్చు. అవి ఏరోనాటిక‌ల్ ఇంజినీరింగ్‌, ఆస్ట్రోనాటిక‌ల్ ఇంజినీరింగ్.
టాప్ కాలేజీలు..
మ‌సాచ్యుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ, యూఎస్ఏ www.mit.edu
కేంబ్రిడ్జ్ యూనివ‌ర్సిటీ, యూకే https://www.cam.ac.uk/
ఇంపీరియ‌ల్ కాలేజ్, లండ‌న్ https://www.imperial.ac.uk/
స్టాన్‌ఫోర్డ్ యూనివ‌ర్సిటీ, యూఎస్ఏ https://www.stanford.edu/

సివిల్ ఇంజినీరింగ్‌
భారీస్థాయి క‌ట్టడాలు, నిర్మాణాలు, విలాస‌వంత‌మైన వాణిజ్య స‌ముదాయాలు...వీటిపై ఆస‌క్తి ఉన్నవారు చేరే బ్రాంచ్ సివిల్ ఇంజినీరింగ్‌. న‌మూనాలు రూపొందించ‌డం, నిర్మించ‌డం, నిర్వహ‌ణ బాధ్యత‌లు చేప‌ట్టడం ఇవి సివిల్ ఇంజినీరింగ్ ముఖ్య విధులు. సివిల్ ఇంజినీరింగ్‌లోనూ ప‌లు స్పెష‌లైజేష‌న్లు ఉన్నాయి. ఆర్కిటెక్చుర‌ల్ ఇంజినీరింగ్‌, ఎన్విరాన్‌మెంట‌ల్ ఇంజినీరింగ్‌, స్ట్రక్చుర‌ల్ ఇంజినీరింగ్‌, క‌న్‌స్ట్రక్షన్ ఇంజినీరింగ్‌..మొద‌లైన‌వి. మౌలిక వ‌స‌తుల‌కు సంబంధించిన అంశాల‌న్నీ సివిల్ ఇంజినీరింగ్‌లో భాగంగా ఉంటాయి.
టాప్ యూనివ‌ర్సిటీలు
మ‌సాచ్యుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ, యూఎస్ఏ www.mit.edu
యూనివ‌ర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా- బెర్క్‌లీ, యూఎస్ఏ www.berkeley.edu/
నేష‌న‌ల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ సింగ‌పూర్‌, సింగ‌పూర్ www.nus.edu.sg
ఇంపీరియ‌ల్ కాలేజ్, లండ‌న్ https://www.imperial.ac.uk/
కేంబ్రిడ్జ్ యూనివ‌ర్సిటీ, యూకే https://www.cam.ac.uk/

ఎన‌ర్జీ ఇంజినీరింగ్‌
ప్రపంచ‌వ్యాప్తంగా అత్యంత ముఖ్యమైన స్పెష‌లైజేష‌న్లలో కీల‌క‌మైన‌ది ఎన‌ర్జీ ఇంజినీరింగ్. ఈ విభాగం ప‌రిధి చాలా విస్తృతం. ప‌ర్యావ‌ర‌ణంపై ప్రతికూల ప్రభావం లేకుండా త‌క్కువ ముడి స‌రుకును ఉప‌యోగించుకుని పెద్ద మొత్తంలో శ‌క్తిని ఉత్పత్తి చేయ‌డంపై ఎన‌ర్జీ ఇంజినీర్లు దృష్టి సారిస్తారు. అలాగే త‌క్కువ శ‌క్తి ఉప‌యోగించి ఎక్కువ‌ ఫ‌లితాలు రాబ‌ట్టడంపైనా ప‌రిశోధ‌న‌లు నిరంత‌రం కొన‌సాగిస్తుంటారు. ఇందులో ప‌లు స్పెష‌లైజేష‌న్లు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన‌వి...పెట్రోలియం ఇంజినీరింగ్, ప్లాంట్ ఇంజినీరింగ్‌, ఆల్టర్నేటివ్ ఎన‌ర్జీ టెక్నాల‌జీస్‌.
ప్రముఖ విద్యాల‌యాలు
నార్త్ వెస్టర్న్ యూనివ‌ర్సిటీ, యూఎస్ఏ www.northwestern.edu/
యూనివ‌ర్సిటీ ఆఫ్ ఉతాహ్‌, యూఎస్ఏ www.utah.edu/
సిడ్నీ యూనివ‌ర్సిటీ, ఆస్ట్రేలియా www.sydney.edu.au/
నేష‌న‌ల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ సింగ‌పూర్‌, సింగ‌పూర్ www.nus.edu.sg
ఇంపీరియ‌ల్ కాలేజ్, లండ‌న్ https://www.imperial.ac.uk/

కంప్యూట‌ర్ ఇంజినీరింగ్‌
ఎక్కువ మంది భార‌తీయ విద్యార్థులు ప్రాధాన్యమిస్తున్న విభాగం ఇదే. కంప్యూట‌ర్ల న‌మూనా, నిర్మాణం, సూత్రాలు, నిర్వచ‌నాలు...ఇవ‌న్నీ కంప్యూట‌ర్ ఇంజినీరింగ్‌లో ఉంటాయి. ప్రొగ్రామింగ్ లాంగ్వేజ్‌లు రూపొందించ‌డం, వాటిద్వారా వివిధ అనువ‌ర్తనాలు నిర్వహించ‌డం, స‌మాచారాన్ని భ‌ద్రప‌ర‌చ‌డం, కంప్యూట‌ర్ ఆధారిత సేవ‌లు అంత‌రాయం లేకుండా కొన‌సాగించ‌డం...ఇవ‌న్నీ కంప్యూట‌ర్ ఇంజినీరింగ్‌లో భాగ‌మే. కంప్యూట‌ర్ సైన్స్ ప‌రిధికి హ‌ద్దులు లేవు. గ్రాఫిక్స్‌, ప్రొగ్రామింగ్ లాంగ్వేజ్‌లు, ఆప‌రేటింగ్ సిస్టమ్‌, కంప్యూట‌ర్ థియ‌రీ, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ ఇవ‌న్నీ సీఎస్ఈలో అంత‌ర్భాగం. అవ‌స‌రాల‌కు త‌గ్గ సాఫ్ట్‌వేర్ రూపొందించ‌డం, దానికి ఒక నిర్మాణం ఇవ్వడం, త‌యారుచేసిన‌దాన్ని ప‌రీక్షించ‌డం(టెస్టింగ్‌) సాప్ట్‌వేర్ ఇంజినీర్ల విధుల్లో ప్రధాన‌మైన‌వి. హార్డ్‌వేర్ ఇంజినీర్లు కంప్యూట‌ర్ల ప‌నితీరును ప‌ర్యవేక్షిస్తారు. కంప్యూట‌ర్‌లో ఏవైనా స‌మ‌స్యలు ఉంటే ప‌రిష్కరిస్తారు. కోడింగ్‌, క్రిప్టోగ్రఫీ, ఇన్ఫర్మేష‌న్ ప్రొటెక్షన్‌..ఇవ‌న్నీ కంప్యూట‌ర్ ఇంజినీర్ల ప‌నిలో భాగ‌మే.
ప్రముఖ యూనివ‌ర్సిటీలు
కేంబ్రిడ్జ్ యూనివ‌ర్సిటీ, యూకే https://www.cam.ac.uk/
మ‌సాచ్యుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ, యూఎస్ఏ www.mit.edu
ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ, యూకే www.ox.ac.uk/
కాలిఫోర్నియా యూనివ‌ర్సిటీ- బెర్క్‌లీ, యూఎస్ఏ www.berkeley.edu/
ఇంపీరియ‌ల్ కాలేజ్, లండ‌న్ https://www.imperial.ac.uk/

అగ్రిక‌ల్చర‌ల్ ఇంజినీరింగ్‌
టెక్నాల‌జీ, సైన్స్ రెండింటి క‌ల‌యికే అగ్రిక‌ల్చర‌ల్ ఇంజినీరింగ్‌. కోర్సులో భాగంగా వ్యవ‌సాయ‌రంగానికి ఉప‌యోగ‌ప‌డే సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని నేర్పుతారు. అలాగే వ్యవ‌సాయంపైనా ప్రాథ‌మిక అవ‌గాహ‌న క‌లిగిస్తారు. అగ్రిక‌ల్చర‌ల్ ఇంజినీరింగ్‌లో మెకానిక‌ల్‌, కెమిక‌ల్, సివిల్‌, ఎల‌క్ట్రిక‌ల్ విభాగాల‌కు సంబంధించిన అంశాలు మిళిత‌మై ఉంటాయి. ఈ ఇంజినీర్లకు ప్రభుత్వ విభాగాలు, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు ల‌భిస్తాయి.
ప్రముఖ విశ్వవిద్యాల‌యాలు
కాలిఫోర్నియా యూనివ‌ర్సిటీ- డేవిస్, యూఎస్ఏ https://www.ucdavis.edu/
కార్నెల్ యూనివ‌ర్సిటీ, యూఎస్ఏ https://www.cornell.edu/
వేజినింజెన్ యూనివ‌ర్సిటీ, నెద‌ర్లాండ్స్‌ http://www.wageningenur.nl/
కాలిఫోర్నియా యూనివ‌ర్సిటీ- బెర్క్‌లీ, యూఎస్ఏ www.berkeley.edu/
పుర్డ్యూ యూనివ‌ర్సిటీ, యూఎస్ఏ www.purdue.edu/

Posted on 06-08-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning