నైపుణ్యమే నడిపించేది

* మార్కులకే పరిమితమైతే ఉద్యోగం కష్టం
* ప్రణాళికబద్ధ సాధన ముఖ్యం
* బీటెక్ తొలి ఏడాది నుంచే దృష్టి పెట్టాలంటున్న నిపుణులు

ఈనాడు - హైదరాబాద్: ఎంసెట్‌లో ఉత్తీర్ణులందరికీ బీటెక్‌లో సీట్లు దక్కాయి. చేరేవారు లేక ఇంకా వేల సీట్లు మిగిలిపోయాయి. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. లక్షల మంది బీటెక్‌లో చేరుతుంటే ఉద్యోగాలేమో కొందరికే దక్కుతున్నాయి. ఉద్యోగాలున్నా అర్హులు లేరని అధ్యయనాలు చెబుతున్నాయి. మరి బీటెక్‌లో చేరిన వారు నిరుద్యోగులుగా మారాల్సిందేనా?.. నిపుణులు మాత్రం ఈ నాలుగేళ్ల వ్యవధిలో సబ్జెక్టుపై పట్టు, అవసరమైన నైపుణ్యాలు పెంచుకుంటే ఉద్యోగాలు వెతుక్కుంటూ వస్తాయంటున్నారు.
దేశంలో ఏటా దాదాపు 9.5లక్షల మంది బీటెక్‌లో చేరుతున్నారు. వారిలో ఉద్యోగాలు దాదాపు రెండు, రెండున్నర లక్షల మందికే దక్కుతున్నాయి. తెలంగాణ, ఏపీలలో ఏటా లక్షన్నర మంది ఇంజినీరింగ్‌లో కొత్తగా ప్రవేశిస్తున్నారు. ప్రాంగణ నియామకాల్లో 25-30వేల మందికి మించి ఎంపికవడం లేదు. సాఫ్ట్‌వేర్, ఇతర కంపెనీలు ప్రముఖ కళాశాలలకే ప్రాధాన్యమిస్తున్నాయి. అంటే తెలుగు రాష్ట్రాల్లో 35-40 కళాశాలలకు మించి ప్రముఖ కంపెనీలు రావడం లేదు. కొన్ని మాత్రం ఇప్పుడిప్పుడే ద్వితీయ శ్రేణి కళాశాలలకు వెళుతున్నాయి. ప్రముఖ కళాశాలల్లో చేరితే చాలు.. అక్కడి విద్యార్థులందరినీ కంపెనీలు ఎంపిక చేసుకోవని గ్రహించాలి. అదనపు నైపుణ్యాలు, సబ్జెక్టుపై పట్టు, మనస్తత్వాన్ని పరిశీలించి విద్యార్థులను ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీటెక్‌లో చేరినవారు ఉజ్వల భవిష్యత్తు కోసం మొదటి ఏడాది నుంచే ప్రణాళికబద్ధంగా ఉద్యోగ నైపుణ్యాలను నేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

తెలుసుకోండి.. నేర్చుకోండి
* అమెరికాలోని ఎంఐటీ.. మూక్స్ ద్వారా ఆన్‌లైన్ సర్టిఫికెట్‌కోర్సులను అందిస్తోంది. వాటిలో సాఫ్ట్‌వేర్‌కు సంబంధించినవి ఎక్కువ. సందేహాలుంటే వీడియో పాఠాల ద్వారా తీర్చుకోవచ్చు. ఐఐటీ బొంబాయి కొన్ని ఆన్‌లైన్ కోర్సులను అందిస్తోంది. పరీక్ష రాసి పాసైతే సర్టిఫికెట్ ఇస్తారు.
* మైక్రోసాఫ్ట్, ఐబీఎం, ఒరాకిల్, విప్రో, ఇన్ఫోసిస్ వంటి ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలూ వివిధ కళాశాలలతో ఒప్పందం చేసుకొని సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నాయి. తెలంగాణ నైపుణ్యాభివృద్ధి సంస్థ(టాస్కు) పరిధిలో కొన్ని కంపెనీలు శిక్షణ ఇస్తున్నాయి.
* గ్రామీణ ప్రాంతాలవారు, ఇంటర్ వరకు తెలుగులో చదివిన విద్యార్థులు సమాచార, సాంకేతిక నైపుణ్యాలు పెంచుకోవాలి.
* బీటెక్ రెండు, మూడు సంవత్సరాల్లో ఇంటర్న్‌షిప్ చేస్తే కార్యాలయాల్లో వాతావరణం, అక్కడి పనులపై అవగాహన పెరుగుతుంది.
* రెండు, మూడు సంవత్సరాల్లో మినీ ప్రాజెక్టు, నాలుగో ఏడాదిలో మేజర్ ప్రాజెక్టు చేయాలి. ప్రస్తుత సమస్యలకు పరిష్కారం చూపేలా వీటిని పూర్తిచేయాలి. ప్రాంగణ నియామకాల వేళ ముఖాముఖీలో ప్రాజెక్టు గురించి ప్రశ్నిస్తున్నారు.
* బహుళజాతి సంస్థలో ఉద్యోగం చేయాలనుకునే వారు ఏదైనా విదేశీ భాష నేర్చుకుంటే మంచిది.
* ప్రాంగణ నియామకాల వేళ నిర్వహించే రాత పరీక్షలో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్(గణితం), లాజికల్, వెర్బల్ రీజనింగ్ ప్రశ్నలు ఉంటాయి. వాటిని సాధన చేయడం మేలు.
* కళాశాలలకు కంపెనీలు రాకుంటే..అక్కడి విద్యార్థులు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్టు ఇన్ ఇంజినీరింగ్(గేట్)పై మొదటి నుంచి దృష్టిపెట్టాలి. ఒకప్పుడు కేంద్రప్రభుత్వ సంస్థలు ఉద్యోగుల ఎంపిక కోసం కళాశాలలకు వచ్చేవి. ఇప్పుడు కేవలం గేట్ స్కోర్ ద్వారానే ఎంపిక చేసుకుంటున్నాయి. అందులో మంచి స్కోర్ సాధిస్తే బీహెచ్ఈఎల్, ఈసీఐఎల్ తదితర సంస్థల్లో ఉద్యోగం సంపాదించవచ్చు. లేకుంటే ఐఐటీలు, ఎన్ఐటీల్లో అదే స్కోర్‌తో ఎంటెక్‌లో చేరవచ్చు.

సబ్జెక్టుపై లోతైన పరిజ్ఞానం ప్రధానం
బ్రాంచీ ఏదైనా సబ్జెక్టుపై పట్టు సంపాదించడం అత్యవసరమని సీబీఐటీ ప్రిన్సిపాల్ చెన్నకేశవరావు, ఓయూ ఇంజినీరింగ్ కళాశాల ప్లేస్‌మెంట్ అధికారి ఉమామహేశ్వర్‌రావు చెబుతున్నారు. ప్రస్తుతం 80శాతం ఉద్యోగాలు సాఫ్ట్‌వేర్ కంపెనీల్లోనే ఉంటున్నందున.. బీటెక్‌లో ఏ బ్రాంచీ తీసుకున్నా చివరకు విద్యార్థులు 80-90శాతం మంది వాటిల్లోనే చేరుతున్నారు. కంప్యూటర్ సైన్స్, ఐటీయేతర విద్యార్థులనూ కంపెనీలు ఎంపిక చేసుకుంటాయి. చదివిన బ్రాంచీపై విద్యార్థికి సదవగాహన ఉంటే సాఫ్ట్‌వేర్ పని అప్పగించినా వారు సులభంగా నేర్చుకుంటారన్నది కంపెనీ ప్రతినిధుల భావన. అందువల్ల కేవలం మార్కుల కోసం కాక, సబ్జెక్టు అర్థం చేసుకునే రీతిలో చదవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంజినీరింగ్‌లో తొలి ఏడాది కీలకం. చాలమంది ఇంటర్వ్యూల్లో బీటెక్ మొదటి సంవత్సరం చదివిన ప్రాథమికాంశాలను అడిగితే చెప్పలేకపోతున్నారు. ఆది ఎంపికపై ప్రభావం చూపుతోంది.


Posted on 08-08-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning