ఎక్కువ వేతనం అందిస్తోన్న కోర్సులివే...

మెడిసిన్..మేనేజ్‌మెంట్‌..ఇంజినీరింగ్‌..డ్రాయింగ్‌...ఆర్కిటెక్చర్‌..ఆర్కియాల‌జీ, ఆర్ట్స్‌..సైన్స్‌, హ్యుమాని టీస్‌...ఇలా విశ్వవ్యాప్తంగా వేల సంఖ్యలో కోర్సులు/ కెరీర్లు ఉన్నాయి. ఒక్కో కోర్సులోనూ ఒక్కోర‌క‌మైన ప్రత్యేక‌త ఉంది. సంప్రదాయంగా వెలుగొందుతున్న కోర్సులు కొన్నైతే...ఆధునిక అవ‌స‌రాల రీత్యా ఆవిర్భవించిన‌వి మ‌రికొన్ని. దీంతో విద్యార్థులు ఎంచుకోవ‌డానికి బోలెడ‌న్ని కెరీర్ ఆప్షన్లు అందుబాటులోకొచ్చాయి. అయితే వేత‌నాన్ని ప్రామాణికంగా తీసుకున్నప్పుడు కొన్ని చ‌దువులు అన్నింటికంటే ముందుంటున్నాయి. అలాగే వీటిని పూర్తిచేయ‌డానికి కూడా పెద్ద మొత్తంలో వెచ్చించ‌డమూ త‌ప్పనిస‌రి. ప్రముఖ సంస్థల్లో చ‌దివిన‌వారిలో ఎక్కువ మంది వేత‌నాల రూపంలో ల‌బ్ధి పొందుతున్నారు. అందువ‌ల్ల ఫీజులు పెద్దమొత్తంలో ఉన్నప్పటికీ చెల్లించ‌డానికి వెనుకాడ‌డం లేదు. విశ్వవ్యాప్తంగా పెద్ద మొత్తంలో వేత‌నాలు అందిస్తోన్న కోర్సుల వివ‌రాలు చూద్దాం...

ఎంబీఏ...
ప్రపంచ‌వ్యాప్తంగా ఎక్కువ వేత‌నం అందించే కోర్సుగా మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేష‌న్ (ఎంబీఏ) గుర్తింపు పొందింది. అలాగే ప్రపంచంలో ఎంబీఏ గ్రాడ్యుయేట్లకు పెద్ద జాబ్ మార్కెట్‌గా అమెరికా, భార‌త్‌లు అవ‌త‌రించాయి. మేనేజ్‌మెంట్ కోర్సులు చ‌దివిన‌వాళ్లు ప్రపంచ‌వ్యాప్తంగా ఏటా 14 శాతం వేత‌నంలో వృద్ధి సాధిస్తున్నార‌ని ప్రముఖ బిజినెస్ ప‌త్రిక‌ ఫైనాన్షియ‌ల్ టైమ్స్ తెలిపింది. విశ్వవ్యాప్తంగా ఫైనాన్స్‌, అకౌంటింగ్‌, బిజినెస్ మేనేజ్‌మెంట్‌, ఎకనామిక్స్ స‌బ్జెక్టుల్లో ఏటా 43 శాతం మంది విద్యార్థులు చేరుతున్నార‌ని విశ్వవిద్యాల‌యాల‌కు ర్యాంకులిచ్చే సంస్థ క్యూఎస్ ప్రక‌టించింది.

టాప్‌-5 బిజినెస్ స్కూళ్లు
యూనివ‌ర్సిటీ - వేత‌నం(ఏడాదికి, యూఎస్ డాల‌ర్లలో)
హార్వార్డ్ బిజినెస్ స్కూల్ - 1,80,183 www.hbs.edu
స్టాన్‌ఫోర్డ్ బిజినెస్ గ్రాడ్యుయేట్ స్కూల్ - 1,78,929 www.gsb.stanford.edu
పెనిసిల్వేనియా యూనివ‌ర్సిటీ- వార్థన్ - 1,72,699 www.upenn.edu
కొలంబియా బిజినెస్ స్కూల్ - 1,70,849 www.gsb.columbia.edu
చికాగో యూనివ‌ర్సిటీ (బూత్ బిజినెస్ స్కూల్‌) - 1,62,791 www.chicagobooth.edu

పై యూనివ‌ర్సిటీల‌న్నీ యూఎస్‌లోనివే. ఈ వేత‌నాలు కోర్సు పూర్తయిన మూడేళ్ల త‌ర్వాత ల‌భిస్తున్నవి.

ఇంజినీరింగ్‌
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది యువ‌త‌ను ఆక‌ర్షించ‌డ‌మే కాకుండా, పెద్దమొత్తంలో వేత‌నాలు అందించే కోర్సుగా మేనేజ్‌మెంట్ త‌ర్వాత‌ ఇంజినీరింగ్ గుర్తింపు పొందింది. నేష‌న‌ల్ అసోసియేష‌న్ ఆఫ్ కాలేజెస్ అండ్ ఎంప్లాయీస్ (ఎన్ఏసీఈ), అమెరికా ప్రకారం ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు స‌గ‌టున ఏడాదికి 63 వేల డాల‌ర్ల వేత‌నాన్ని ఆర్జిస్తున్నారు. పెట్రోలియం ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లయితే కెరీర్ ప్రారంభంలోనే 80 వేల డాల‌ర్లు పొందుతున్నారు. యూఎస్ బ్యూరో లేబ‌ర్ స్టాటిస్టిక్స్ 2014-15 ప్రకారం బ‌యోమెడిక‌ల్‌, సివిల్‌, ఎన్విరాన్‌మెంట‌ల్‌, పెట్రోలియం వ‌చ్చే ప‌దేళ్లలో అత్యంత డిమాండ్ ఉన్న ఇంజినీరింగ్ స్పెష‌లైజేష‌న్లగా అవ‌త‌రించ‌నున్నాయి. ఒక్క యూఎస్‌లోనే కాకుండా ప్రపంచ‌వ్యాప్తంగా ఇంజినీర్లకు డిమాండ్ ఎక్కువ‌గా ఉండ‌డంతో వేత‌నాలు కూడా పెద్దమొత్తంలోనే ద‌క్కుతున్నాయి. ప్రతి రంగం ఇంజినీరింగ్‌తో ముడిప‌డి ఉండ‌డం, టెక్నాల‌జీకి ప్రాధాన్యం పెర‌గ‌డం, డిజిట‌ల్ ప్రపంచం విస్తరించ‌డం...త‌దిత‌ర కార‌ణాల‌తో ఇంజినీరింగ్ తిరుగులేని కెరీర్‌గా కొన‌సాగుతోంది.

ఆయా స్పెష‌లైజేష‌న్లవారీ స‌గ‌టు వార్షిక వేత‌నాలు డాల‌ర్లలో
పెట్రోలియం ఇంజినీరింగ్ - ల‌క్ష
మైనింగ్ ఇంజినీరింగ్ - 71,500
కెమిక‌ల్ ఇంజినీరింగ్ - 69,500
కంప్యూట‌ర్ ఇంజినీరింగ్ - 69,100
న్యూక్లియ‌ర్ ఇంజినీరింగ్ - 68,200

మ్యాథ్స్‌
మేనేజ్‌మెంట్‌, ఇంజినీరింగ్ మాదిరి మ్యాథ్స్ కూడా విశ్వవిఖ్యాతి పొందింది. గ‌ణితానుబంధ కోర్సుల‌కూ గిరాకీ పెరిగింది. గ‌ణితం వివిధ రంగాల్లో అనుంధంగా ఉండ‌డం అధిక వేత‌నాల‌కు కార‌ణ‌మ‌వుతుంది. గ‌ణితం, స్టాటిస్టిక్స్ కోర్సులు చ‌దివిన‌వారికి ఏడాదికి 94 వేల డాల‌ర్లు వేత‌న రూపంలో అందుతున్నాయి. డేటా సైంటిస్ట్‌, క్వాంటిటేటివ్ ఎన‌లిస్టుల‌కైతే ల‌క్ష డాల‌ర్ల పైమాటే. డేటా మోడ‌ల‌ర్‌, యాక్చూరియ‌ల్ ఎన‌లిస్ట్‌, క్వాంటిటేటివ్ ఎన‌లిస్ట్ త‌దిత‌ర వృత్తుల్లో మ్యాథ్స్ గ్రాడ్యుయేట్లు రాణిస్తున్నారు. కొన్ని కోర్సుల్లో రాణించ‌డానికి మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ త‌ప్పనిస‌రి కావ‌డంతో గ‌ణితం చ‌దివిన‌వాళ్లకు గిరాకీ ఏర్పడింది.

కంప్యూట‌ర్ సైన్స్
విదేశీ విద్యార్థుల పాపుల‌ర్ ఎంఎస్ కోర్సు కంప్యూట‌ర్ సైన్స్‌. ఈ స‌బ్జెక్టున్న డిమాండే అందుకు కార‌ణం. కంప్యూట‌ర్ సైన్స్ కోర్సును ప్రముఖ సంస్థల్లో చ‌దివిన విద్యార్థుల‌కు వేత‌నాలు భారీ మొత్తంలో అందుతున్నాయి. ప్రస్తుత డిజిట‌ల్ యుగంలో కంప్యూట‌ర్ సైన్స్ గ్రాడ్యుయేట్ల అవ‌స‌రాలు విస్తృత‌మ‌య్యాయి. కెరీర్ ప్రారంభ వేత‌నం స‌గ‌టున ఏడాదికి 75 వేల డాల‌ర్లు ల‌భిస్తోంది. ఆరేడేళ్లు అనుభ‌వం ఉన్నవాళ్లు ఏడాదికి స‌గ‌టున 1,76,000 డాల‌ర్లు ఆర్జిస్తున్నారు. కంప్యూట‌ర్ సైన్స్ కోర్సులు చ‌దివిన‌వాళ్లు డెవ‌ల‌ప‌ర్లు, సిస్టమ్ అడ్మినిస్ట్రేట‌ర్లు, ఐటీ క‌న్సల్టెంట్లగా రాణిస్తున్నారు.
టాప్ యూనివ‌ర్సిటీలు
కొలంబియా యూనివ‌ర్సిటీ www.columbia.edu
కాలిఫోర్నియా యూనివ‌ర్సిటీ-బెర్క్‌లీ www.berkeley.edu
స్టాన్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ www.stanford.edu/
మ‌సాచ్యుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ http://web.mit.edu/
కాలిఫోర్నియా యూనివ‌ర్సిటీ-లాస్ఏంజెల్స్ www.ucla.edu

అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్‌
ఎక్కువ వేత‌నం అందించే కోర్సుల్లో సోష‌ల్ సైన్సెస్ విభాగంలో అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సుకే చోటు ద‌క్కింది. ప్రముఖ సంస్థల్లో ఈ కోర్సులు చ‌దివిన‌వారికి ప్రారంభ‌వేత‌నం 53వేల డాల‌ర్లు ల‌భిస్తోంది. అలాగే మిగిలిన అన్ని కోర్సుల‌తో పోలిస్తే అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ చ‌ద‌వడానికయ్యే వ్యయం కూడా త‌క్కువే. క్రెడిట్ ఎనాల‌సిస్ మేనేజ్‌మెంట్‌, ట్రెజ‌రీ ఎనాల‌సిస్‌, ఆడిటింగ్ అండ్ టాక్స్ అకౌంటెన్సీ విభాగాల్లో కొన‌సాగుతున్నవారికి పెద్ద మొత్తంలో జీతాలు ల‌భిస్తున్నాయి. ఈ రంగంలో మేనేజ‌ర్ స్థాయికి చేరుకున్నవాళ్లు 90 వేల డాల‌ర్ల వేత‌నాన్ని పొందుతున్నారు. ప్రొడ‌క్ట్ కంట్రోల్‌/ ప్రైసింగ్‌లో ఉన్న మ‌ధ్యస్థాయి ఉద్యోగుల‌కు గ‌రిష్ఠంగా 3 ల‌క్షల డాల‌ర్ల వ‌ర‌కు వేత‌నం ద‌క్కుతోంది. అదే ఇన్వెస్టిమెంట్ బ్యాంకింగ్ మిడిల్ లెవెల్ ఉద్యోగుల‌కు 2 లక్షల 30 వేల డాల‌ర్లు, ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్ 2 ల‌క్షల 25 వేల డాల‌ర్లు, ఫైనాన్షియ‌ల్ అండ్ రెగ్యులేట‌రీ రిపోర్టింగ్ 2 ల‌క్షల 20 వేల డాల‌ర్లు, ట్యాక్స్ స్పెష‌లిస్టు 2 ల‌క్షల డాల‌ర్ల వ‌ర‌కు జీతం రూపంలో అందుకుంటున్నారు. వీట‌న్నింటికీ ప‌ని అనుభ‌వం త‌ప్పనిస‌రి.

ఈ వేత‌నాల‌న్నీ ఆ కోర్సులు చ‌దివినంత‌మాత్రాన ద‌క్కవ‌ని గుర్తించాలి. ప్రముఖ సంస్థల్లో చ‌దివి, విష‌య ప‌రిజ్ఞానంతోపాటు ప‌ని అనుభ‌వం ఉన్నవారికే ఇంత పెద్ద మొత్తంలో వేత‌నాలు అందుతున్నాయి. అలాగే ఎక్కువ జీతం ల‌భిస్తుంద‌ని చెప్పి ఆస‌క్తి లేకున్నా ఈ కోర్సుల్లో చేర‌డంవ వ‌ల్ల ప్రయోజ‌నం ఉండ‌దు. ఇష్టమైన రంగంలో రాణిస్తే ఏ కోర్సు ఎంచుకున్నప్పటికీ వేత‌నం, ప్రోత్సాహ‌కాల రూపంలో పెద్ద మొత్తంలో అందుకోవ‌చ్చు.


Posted on 08-08-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning