విదేశాల్లో ఇంజినీరింగ్ ఫీజుల వివ‌రాలు...

భార‌త్ నుంచి ఎక్కువ మంది విద్యార్థులు పీజీ స్థాయిలో ఇంజినీరింగ్ చ‌దువుల నిమిత్తం యూఎస్ఎ, యూకే, ఆస్ట్రేలియా, కెన‌డా, జ‌ర్మనీ, న్యూజిలాండ్‌, సింగ‌పూర్ త‌దిత‌ర దేశాల‌కు ఎక్కువ‌గా వెళ్తున్నారు. అక్కడి విశ్వవిద్యాల‌యాల్లో బోధ‌న మెరుగ్గా ఉండ‌డం, ఉద్యోగావ‌కాశాలు ఎక్కువ‌గా ల‌భించ‌డంతో భార‌త యువ‌త విదేశీ బాట ప‌డుతోంది. విద్యార్థులు మెచ్చే విదేశీవిద్య ఎంత విలువైన‌దో.. అంత‌కంటే ఖ‌రీదైన‌ది కూడా. అందువ‌ల్ల విదేశాల్లో ఇంజినీరింగ్ పీజీ కోర్సులు (ఎంఎస్‌) చ‌ద‌వాల‌నుకునేవాళ్లు ఆయా దేశాల్లో ఫీజులు ఎలా ఉంటాయో ముందే తెలుసుకుని, ప్రణాళిక రూపొందించుకోవ‌డం ముఖ్యం.

యూఎస్ఏ
భార‌త్ నుంచి అందులోనూ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది విద్యార్థులు ఎంఎస్ కోర్సుల కోసం అమెరికాకు ఎక్కువ‌గా వెళ్తున్నారు. ఇంజినీరింగ్ విద్యలో అమెరికాలో పేరొందిన విశ్వవిద్యాల‌యాలు ఎన్నో ఉండ‌డం, అక్కడ చ‌దివిన‌వారికి భారీ ప్యాకేజీలు ల‌భించ‌డం , ఇంగ్లిష్ మాధ్యమంలో బోధ‌న‌...ఇవ‌న్నీ విద్యార్థుల ఆస‌క్తికి కార‌ణాలు. అయితే ఫీజులు ప‌రంగా చూసిన‌ప్పుడు కూడా ప్రపంచంలో ఖ‌రీదైన విద్యలో అమెరికానే ముందుంటోంది. ఆ దేశంలో ఏ యూనివ‌ర్సిటీలో చేరినప్పటికీ ట్యూష‌న్ ఫీజు క‌నీసం 40 వేల డాల‌ర్లు చెల్లించాల్సిందే. వీటికి వ‌స‌తి, భోజ‌నం, ప్రయాణ‌, ఇత‌ర‌త్రా...ఖ‌ర్చులు అద‌నం. యూఎస్ డిగ్రీతో ప్యాకేజీ రూపంలో ఎంత పెద్ద మొత్తం అందుకోవ‌చ్చో అంత‌కంటే ముందు ఫీజు రూపంలో పెద్ద మొత్తంలోనే వెచ్చించాల్సి ఉంటుంది.

టాప్ యూనివ‌ర్సిటీల్లో పీజీ కోర్సుల ట్యూష‌న్ ఫీజులు (డాల‌ర్లలో)...
మ‌సాచ్యుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ(ఎంఐటీ) 47,000 www.mit.edu
స్టాన్‌ఫోర్డ్ యూనివ‌ర్సిటీ 43,000 www.stanford.edu
కాలిఫోర్నియా యూనివ‌ర్సిటీ-బెర్క్‌లీ 55,000 www.berkeley.edu
హార్వార్డ్ యూనివ‌ర్సిటీ 42,000 www.harvard.edu
కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (కాల్‌టెక్) 44,000 www.caltech.edu

యూకే
ఇంజినీరింగ్ కోసం ఎక్కువ మంది భార‌తీయ విద్యార్తులు యూఎస్ త‌ర్వాత యూఎస్ త‌ర్వాత యూకేకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎందుకంటే ప్రపంచ ప్రఖ్యాత వంద విశ్వవిద్యాల‌యాల్లో ప‌ది ఈ దేశంలోనే ఉన్నాయి. అలాగే చాలా దేశాల్లో పీజీ కోర్సులు రెండేళ్ల వ్యవ‌ధితో ఉంటాయి. కానీ యూకేలో ఏడాది వ్యవ‌ధితో ఎమ్మెస్సీ కోర్సులు పూర్తిచేసుకునే వెసులుబాటు ఉంది. అయితే అమెరికా మాదిరి యూకేలో కూడా ఫీజులు ఎక్కువ‌గానే ఉన్నాయి. చాలా యూనివ‌ర్సిటీలు 19 వేల నుంచి 28 వేల పౌండ్లు ఫీజులు వ‌సూలుచేస్తున్నాయి. భార‌త క‌రెన్సీలో చెప్పుకుంటే రూ.18 ల‌క్షల నుంచి 26 లక్షల వ‌ర‌కు ఫీజులు చెల్లించాలి.

ప్రముఖ విద్యా సంస్థల్లో పీజులిలా(పౌండ్లలో)..
కేంబ్రిడ్జ్ యూనివ‌ర్సిటీ 29,000 www.cam.ac.uk
ఇంపీరియ‌ల్ కాలేజ్, లండ‌న్ 28,000 www.imperial.ac.uk
ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ 19,000 www.ox.ac.uk
మాంచెస్టర్ యూనివ‌ర్సిటీ 21,000 www.manchester.ac.uk
యూనివ‌ర్సిటీ కాలేజ్ లండ‌న్ 22,000 www.ucl.ac.uk

ఆస్ట్రేలియా
విదేశాల్లో ఇంజినీరింగ్ చ‌ద‌వాల‌నుకునే విద్యార్థుల‌కు యూఎస్‌, యూకేల త‌ర్వాత గుర్తొచ్చే దేశం ఆస్ట్రేలియా. విఖ్యాత వంద విశ్వవిద్యాల‌యాల్లో 7 అక్కడే ఉండ‌డంతో విద్యార్థులు ఆ దేశానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఈ దేశంలో సివిల్‌, కంప్యూట‌ర్ సైన్స్ బ్రాంచ్‌లు చ‌ద‌వడానికి విదేశీ విద్యార్థులు ప్రాధాన్యమిస్తున్నారు. ఇక్కడ కూడా విదేశీ విద్యార్థుల‌కు ఫీజులు పెద్దమొత్తంలో ఉన్నాయి. పీజీ కోర్సుల కోసం 36 వేల నుంచి 40 వేల ఆస్ట్రేలియ‌న్ డాల‌ర్లు వ‌సూలు చేస్తున్నారు.

ప్రముఖ విశ్వవిద్యాల‌యీల్లో ఫీజులు (ఆస్ట్రేలియ‌న్ డాల‌ర్లలో)
ఆస్ట్రేలియ‌న్ నేష‌న‌ల్ యూనివ‌ర్సిటీ 38,000 www.anu.edu.au
మెల్‌బోర్న్ యూనివ‌ర్సిటీ 37,000 www.unimelb.edu.au
న్యూ సౌత్‌వేల్స్ యూనివ‌ర్సిటీ 39,000 www.unsw.edu.au
క్వీన్స్‌ల్యాండ్ యూనివ‌ర్సిటీ 34,000 www.business.uq.edu.au
మోనాస్ యూనివ‌ర్సిటీ 38,000 www.monash.edu

కెన‌డా
ఇంజినీరింగ్ విద్యార్థుల‌ను ఆకర్షించే దేశాల్లో కెన‌డా ఒక‌టి. ప్రపంచ‌స్థాయి టొరంటో, బ్రిటిష్ కొలంబియా యూనివ‌ర్సిటీలు కెన‌డాలో ఉన్నాయి. అలాగే మిగిలిన దేశాల‌తో పోలిస్తే ఇక్కడ ఇంజినీరింగ్ కోర్సుల‌కు ఫీజులు త‌క్కువ‌గా ఉంటాయి. పీజీ కోర్సుల నిమిత్తం ఏ యూనివ‌ర్సిటీలో చేరిన‌ప్పటికీ ఒక్కో ట‌ర్మ్‌కూ గ‌రిష్ఠంగా ప‌దివేల‌ కెన‌డా డాల‌ర్లు చెల్లిస్తే స‌రిపోతుంది.

టాప్ యూనివ‌ర్సిటీల్లో ట‌ర్మ్‌ ఫీజులు (కెన‌డా డాల‌ర్లలో)
మెక్‌గిల్ యూనివ‌ర్సిటీ 10,000 www.mcgill.ca
టొరంటో యూనివ‌ర్సిటీ 9,000 www.utoronto.ca
బ్రిటిష్ కొలంబియా యూనివ‌ర్సిటీ 8,000 www.ubc.ca
ఆల్బర్టా యూనివ‌ర్సిటీ 10,000 www.ualberta.ca
మాంట్రియ‌ల్ యూనివ‌ర్సిటీ 8,000 www.umontreal.ca/english

జ‌ర్మనీ
ఇంజినీరింగ్ విద్యను ఉచితంగా అందించే దేశంగా జ‌ర్మనీ పేరొందింది. ఇక్కడి చాలా సంస్థలు ప‌బ్లిక్ ఫండ్‌తో కొన‌సాగ‌డం వ‌ల్ల ఫీజులు దాదాపు ఉండ‌వ‌నే చెప్పుకోవ‌చ్చు. అలాగే ఆటోమోటివ్ ప‌రిశ్రమ‌కు ఈదేశం పెట్టింది పేరు. అందువ‌ల్ల ఇక్కడ ఉన్నత‌మైన‌విగా ఆటోమొబైల్, మెకానిక‌ల్ ఇంజినీరింగ్ కోర్సులు చెప్పుకోవ‌చ్చు. విద్యార్థులు వ‌స‌తి ఖ‌ర్చులు భ‌రించ‌గ‌లిగితే జ‌ర్మనీ వెళ్లి ఫీజు చెల్లించ‌కుండా చ‌దువుకోవ‌డం సాధ్యమే. క్యూఎస్ ప్రపంచ ప్రముఖ యూనివ‌ర్సిటీల్లో జ‌ర్మనీ నుంచి 3 వంద‌లోపు స్థానం పొందాయి. అవి...
టెక్నిక‌ల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ మునిచ్ www.tum.de/en/homepage
హైడెల్‌బ‌ర్గ్ యూనివ‌ర్సిటీ www.uni-heidelberg.de/index_e.html
ల‌డ్‌విగ్ మ్యాక్స్ మిలియ‌న్స్ యూనివ‌ర్సిటీ www.en.uni-muenchen.de

న్యూజిలాండ్
మ‌రీ ఎక్కువ మందిని కాక‌పోయినా కొంత వ‌ర‌కు ఇంజినీరింగ్ విద్యార్థుల‌ను ఆక‌ర్షిస్తోన్న దేశం న్యూజిలాండ్‌. ఈ దేశంలో ఆక్‌లాండ్ యూనివ‌ర్సిటీ https://www.auckland.ac.nz/ పేరుగాంచింది. ఇక్కడ ఇంజినీరింగ్ పీజీ కోర్సుల‌కు 37 వేల న్యూజిలాండ్ డాల‌ర్లు ఫీజుగా వ‌సూలు చేస్తున్నారు.

సింగ‌పూర్‌
ప్రపంచ యువ‌త‌ను ముఖ్యంగా ఎక్కువ మంది తెలుగు విద్యార్థుల‌ను ఆక‌ర్షిస్తోన్న దేశాల్లో సింగ‌పూర్ ఒక‌టి. ఇక్కడ విద్య, జీవ‌న ప్రమాణాలు, వ‌స‌తులు మెరుగ్గా ఉంటాయి. అలాగే ప్రపంచ‌స్థాయి విశ్వవిద్యాల‌యాలు ఉన్నాయి. ఈ దేశంలో ఇంజినీరింగ్ విద్య జ‌గ‌ద్విఖ్యాతి గాంచింది. అలాగే ఖ‌రీదైన‌ది కూడా. క్యూఎస్ వ‌ర‌ల్డ్ ర్యాంకింగ్‌లో నేష‌న‌ల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ సింగ‌పూర్‌, నాన్యంగ్ టెక్నలాజిక‌ల్ యూనివ‌ర్సిటీలు 12, 13 స్థానాల్లో నిలిచాయి. ఈ రెండు యూనివ‌ర్సిటీల్లోనూ ఇంజినీరింగ్ కోసం 30 వేల సింగ‌పూర్ డాల‌ర్లు ఫీజుగా చెల్లించాలి. సింగ‌పూర్‌లో యూజీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల‌కు ప్రముఖ సంస్థల్లో ఫీజులు (సింగ‌పూర్ డాల‌ర్లలో) గ‌రిష్ఠంగా ఇలా ఉన్నాయి.

నేష‌న‌ల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ సింగ‌పూర్ 38,000 www.nus.edu.sg
నాన్యంగ్ టెక్నలాజిక‌ల్ యూనివ‌ర్సిటీ 33,000 www.ntu.edu.sg/
ఎస్ఐఎం యూనివ‌ర్సిటీ 6,500 www.unisim.edu.sg
సింగ‌పూర్ యూనివ‌ర్సిటీ ఆప్ టెక్నాల‌జీ అండ్ డిజైన్ 24,000 www.sutd.edu.sg
సింగ‌పూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ 35,000 www.singaporetech.edu.sg/

ఫీజుల వివ‌రాలు విద్యార్థుల్లో అవ‌గాహ‌న కోస‌మే. ఎంచుకున్న కోర్సులవారీ ఫీజుల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉండ‌వ‌చ్చు.


Posted on 09-08-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning