అంకురానికి ఆసరా!

* ఏపీలో ఆంధ్ర ఏంజెల్స్‌ ఫోరం ఏర్పాటు
* రూ.100 కోట్ల నిధితో నైపుణ్యవంతులకు ప్రోత్సాహం

ఈనాడు - అమరావతి: సరికొత్త ఆవిష్కరణలకు వేదికలవుతోన్న అంకుర సంస్థలకు ఇకపై ఆర్థిక ఇబ్బందులు తొలగిపోనున్నాయి. హైదరాబాద్‌, బెంగళూరు, పుణె తరహాలో ఐటీ రంగానికి చేయూతనిచ్చేందుకు రాష్ట్రంలో ‘ఆంధ్ర ఏంజెల్స్‌ ఫోరం’ను అందుబాటులోకి తెస్తున్నారు. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన ఈ ఫోరంను అక్టోబరులో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభంచనున్నారు. అంకుర సంస్థల ద్వారా ఎన్నో ఆవిష్కరణలు జరుగుతున్నా.. వాటికి సరైన ఆర్థికసాయం అందక చతికిలపడుతున్నాయి. బ్యాంకులు సైతం ఈ సంస్థలకు రుణాలు ఇచ్చేందుకు వెనకాడుతున్న నేపథ్యంలో ఫోరం ద్వారా పెట్టుబడులు లభించనున్నాయి. రాష్ట్రంలోని పారిశ్రామిక, వాణిజ్యవేత్తలతో ఈ ఫోరం ఏర్పాటైంది. ఆర్థిక సాయం కోసం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత మరిన్ని సంస్థలు ఈ ఫొరం ద్వారా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తాయని అధికారులు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ఆంధ్ర ఆంధ్ర ఏంజెల్స్‌ ఫోరం సమన్వయకర్త, ఏపీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రిస్‌ ఫెడరేషన్స్‌ అధ్యక్షుడుగా ఎన్నికైన(ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌) జి.సాంబశివరావు ‘ఈనాడు’తో మాట్లాడుతూ.. ‘‘అంకుర సంస్థలను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ఈ ఫొరం ద్వారా పెట్టుబడులు పెట్టేందుకు 50 మంది పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు ముందుకొచ్చారు. ఇప్పటికే ఒక సంస్థ ఆర్థిక సాయం కోసం ఫోరాన్ని ఆశ్రయించగా.. అంకుర సంస్థ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చాం. ఈ నిధి ద్వారా రూ.100 కోట్లు అందుబాటులో ఉంచుతాం. ఈ ఫోరం ద్వారా అంకుర సంస్థకు ఇచ్చిన సొమ్మును వాటా(ఈక్విటీ)ద్వారా పొందుతాం. ఆర్థిక సాయం పొందే సంస్థకు అనుభవజ్ఞులైన పారిశ్రామికవేత్తలు, నిపుణుల ద్వారా సలహాలు, సూచనలు ఇచ్చి అభివృద్ధికి తోడ్పాటునిస్తాం. దరఖాస్తు చేసుకునే సంస్థ ఆవిష్కరణ లేదా ఉత్పాదనను ఫోరంలోని నిపుణుల బృందం పరిశీలించిన తర్వాతే సాయం అందుతుంది. అంకుర సంస్థలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావడం లేదు. వీటి భవిష్యత్తుపై సరైన అంచనాలు లేకపోవడంతో ఇందుకు వెనకాడుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఏంజిల్స్ ఫోరానికి మాత్రం వాటి జయాపజయాలతో సంబంధం లేదు. నష్టాలు వాటిల్లినా ఫోరానికి ఇబ్బంది ఉండబోదు. 13 జిల్లాల్లో ఎక్కడి నుంచైనా విద్యార్థులు ఈ సాయాన్ని పొందవచ్చు’’ అని తెలిపారు.
అంకుర సంస్థలకు ఆర్థిక, సాంకేతిక సాయం
రాష్ట్రంలో విశాఖపట్నం, కాకినాడ, తిరుపతిలో అంకుర సంస్థలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. అనంతపురంలోనూ త్వరలో మరొక అంకుర సంస్థ అందుబాటులోకి రానుంది. వీటి ద్వారా ఎంతో మంది యువతకు ప్రోత్సాహం లభించనుంది. ప్రభుత్వం ప్రతి విశ్వవిద్యాలయం, ఇంజినీరింగ్‌ కళాశాలల్లో సైతం అంకుర కేంద్రాలను ఏర్పాటుచేసే ఆలోచనలో ఉంది. వీటి ద్వారా ఎక్కువమంది విద్యార్థులకు అవకాశం లభిస్తుంది. ఐటీ అభివృద్ధి చెందుతున్న ఎన్నో నగరాల్లో ఏంజెల్స్‌ ఫోరమ్‌లకు ఆదరణ లభిస్తోంది. సుమారు వంద మంది పారిశ్రామికవేత్తల సహకారంతో ఈ నిధిని సమకూర్చుతారు. ఇదిగాక, ఏపీ ప్రభుత్వం కూడా ఏపీ ఇన్నోవేషన్‌ ఫండ్‌ ద్వారా ప్రోత్సాహక నిధిని అందుబాటులోకి తీసుకొస్తుంది. విద్యార్థులకు అవసరమైన సూచనలు, సలహాలను అందించేందుకు సిలికాన్‌ వ్యాలీలోని స్టార్టప్‌ కంపెనీలతోపాటు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం(యూసీ బెర్కిలీ), టెక్సాస్‌ విశ్వవిద్యాలయం(యూటీ ఆస్టిన్‌)తో ఒప్పందం కుదుర్చుకోనుంది. జర్మనీకి చెందిన సాప్‌ సంస్థ ద్వారా ఖరీదైన అత్యాధునిక సాంకేతిక పరికరాల ద్వారా సాయం లభిస్తుంది. ఏంజెల్స్‌ ఫోరం ద్వారా అంకుర సంస్థలకు ఆర్థిక సాయమే కాదు, వాటిని వెంచర్‌ క్యాప్టలిస్ట్‌(వీసీ)లో ఉంచుతాం.
-జేఏ చౌదరి, సలహాదారు, ఐటీ శాఖ


Posted on 12-08-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning