సాంకేతికత అధ్యయనమే శ్రీరామరక్ష

* 90 శాతం మార్కుల కంటే విజ్ఞానమే ముఖ్యం
* ఐటీ, సాఫ్ట్‌వేర్‌ ఇతర రంగాల ధోరణుల్లో మార్పు
* సైబర్‌ సెక్యూరిటీ, అనలిటిక్స్‌కు ప్రాధాన్యం పెంచాలి
* బ్లాక్‌చైన్‌తో భవిష్యత్తులో ప్రయోజనాలు
* ‘ఈనాడు’తో ఆంధ్రప్రదేశ్‌ ఐటీ రంగ సలహాదారు జేఏ చౌదరి

ఈనాడు - హైదరాబాద్‌: భవిష్యత్తులో ఏర్పడే సాంకేతిక అవసరాలను అంచనా వేస్తూ అధ్యయనం చేస్తేనే ప్రయోజనం సిద్ధిస్తుందని ప్రముఖ ఐటీ రంగ నిపుణుడు, ఆంధ్రప్రదేశ్‌ ఐటీ సలహాదారు జేఏ చౌదరి అన్నారు. మూస పద్ధతులకు స్వస్తి పలికి ఐటీ, సాఫ్ట్‌వేర్‌, ఉత్పత్తి, ఇతర రంగాల అవసరాలకు తగినట్లు ప్రభుత్వపరంగానే కాకుండా విశ్వవిద్యాలయాలు, కళాశాలలు కూడా కృషి చేయాలని సూచించారు. దేశ, విదేశాలకు చెందిన విశ్వవిద్యాలయాలు సైతం వినూత్న అంశాల్లో ఆన్‌లైన్‌ కోర్సులను నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. వీటిని అనుకూలంగా మలుచుకొని విద్యార్థులు ప్రయోజనం పొందాలని సూచించారు. ఇంజినీరింగ్‌ విద్యలో కంప్యూటర్‌ సైన్స్‌, ఈసీఈ, ఇతర కోర్సులతోపాటు సైబర్‌ సెక్యూరిటీ, అనలిటిక్స్‌, ఐఓటీ అండ్‌ క్లౌడ్‌, ఫైనాన్స్‌ టెక్నాలజీ తదితర అంశాల్లో ప్రత్యేక కోర్సులు రావాల్సి ఉందని అన్నారు. ‘బ్లాక్‌చైన్‌’ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా విప్లవాత్మక మార్పులను తీసుకురానుందని చెప్పారు. ఇంజినీరింగ్‌ విద్యతో పాటు సాధారణ బీఎస్సీ, బీకాం, బీఏ పట్టాలతోనూ ఉద్యోగ అవకాశాలు పెరిగాయని ఆయన ‘ఈనాడు’కు తెలిపారు. సాంకేతికతను, అందుబాటులో ఉన్న సౌకర్యాలను ఆయన వివరించారు.
తిరుపతిలో డిజిటల్‌ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌
తిరుపతి ఎస్వీయూ ప్రాంగణంలో ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజిటల్‌ టెక్నాలజీ ద్వారా సైబర్‌ సెక్యూరిటీ స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ, అనలిటిక్స్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ కోర్సులను నవంబరు నుంచి నిర్వహించనున్నాం. వైజాగ్‌ ఫిన్‌టెక్‌ వ్యాలీగా మారనుంది. ఇందులో బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ కోసం ప్రత్యేకంగా సంస్థను ఏర్పాటు చేయనున్నాం. ఇందులో పరిశోధనలు కూడా జరగనున్నాయి. ప్రస్తుతం వెబ్‌సైట్ల హ్యాకింగ్‌ పెరుగుతోంది. బ్లాక్‌చైన్‌ టెక్నాలజీతో ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చు. ఒకే సమాచారాన్ని విడదీసి రకరకాల పద్ధతుల్లో సర్వర్‌లో నిక్షిప్తం చేసే విధానాన్ని బ్లాక్‌చైన్‌ టెక్నాలజీగా పేర్కొంటున్నారు.
విజ్ఞానం ముఖ్యం
మారుతున్న ధోరణులకు అనుగుణంగా నైపుణ్యాలను పెంచుకోనట్లయితే ట్రెడ్‌మిల్లుపై పరిగెత్తేప్పుడు ఆగిపోతే వెంటనే ఎలా పడిపోతామో అలా భవిష్యత్తులోనూ వెనకబడుతాం. సాంకేతిక పరిజ్ఞానం, మెరుగైన నైపుణ్యం ఉంటేనే విద్యార్థులు రాణిస్తారు. 90 శాతం మార్కులు సాధిస్తే ఉద్యోగాలు వచ్చే రోజులు పోయాయి. మారుతున్న విజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్న వారికే ఐటీ, సాఫ్ట్‌వేర్‌ రంగాలు ప్రాధాన్యమిస్తున్నాయి. అమెరికాలో పదో తరగతి విద్యార్థికి మైక్రోసాఫ్ట్‌ మంచి అవకాశాన్నిచ్చింది. అతను ఆన్‌లైన్‌ ద్వారా ఉన్నతవిద్య అభ్యసిస్తున్నాడు. చెన్నైలోని ఓ కంపెనీ పది, ఇంటర్‌ విద్యను ముగించిన విద్యార్థులకు ఉద్యోగావకాశాలను ఇస్తోంది.
జాగ్రత్తపడకుండా ఉంటే నిరుద్యోగులే!
ఇంజినీరింగ్‌ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు డిగ్రీ పట్టాలను ముద్రించి అందించే సంస్థలు కాకూడదు. కాలానుగుణంగా బోధనలో మార్పులు చేపట్టనట్లయితే ఇంజినీరింగ్‌ నిరుద్యోగం పెరుగుతూనే ఉంటుంది. రకరకాల విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన వారికి ఉద్యోగ అవకాశాలను, సదుపాయాలను కల్పించినప్పుడు ఐటీ, సాఫ్ట్‌వేర్‌ రంగాల్లో అసమానతలు కనిపిస్తున్నాయి. వేతనాలపరంగానూ సమస్యలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కాస్త విజ్ఞానం ఉన్న వారికే ఉద్యోగావకాశాలు కల్పిస్తే ఎలాంటి సమస్యలు రావని సంస్థలు భావిస్తున్నాయి. అందువల్లే సాధారణ డిగ్రీ ఉన్నవారికీ ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వచ్చాయి.
ఆటోమేషన్‌కు ప్రాధాన్యం..
సంస్థల్లో యాంత్రిక (ఆటోమేషన్‌) ప్రాధాన్యం పెరిగింది. లోగడ ఆటోమేషన్‌ వ్యవస్థను సమకూర్చుకునేందుకు ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చేది. దీంతో ఐటీ, సాఫ్ట్‌వేర్‌, ఇతర సంస్థలు మానవ వనరులను పెంచుకున్నాయి. ప్రస్తుతం ఉద్యోగులకు భారీగా వేతనాలు చెల్లించాల్సి వస్తుండడంతో ఆటోమేషన్‌ వ్యవస్థపై సంస్థలు దృష్టి సారించాయి. దీనివల్ల సరైన పరిజ్ఞానం లేని వారు ఐటీ, సాఫ్ట్‌వేర్‌ ఇతర రంగాల్లో నిలదోక్కుకోవడం కష్టం. నాలుగు లాంగ్వేజి కోర్సుల్ని నేర్చుకున్నంత మాత్రాన ఉద్యోగాలు వస్తాయని ఇంజినీరింగ్‌ విద్యార్థులు భావించడం.. వచ్చిన ఉద్యోగాలు నిలకడగా ఉంటాయనుకోవడం తగదు. బ్యాంకులు, వాటి శాఖలు విస్తృతంగా గ్రామీణ ప్రాంతాలకు వ్యాపించాయి. బ్యాంకింగ్‌ వ్యవస్థ మాత్రం అలాగే ఉంటుంది. బ్యాంకుల శాఖలు మాత్రం తగ్గిపోయే ప్రమాదం ఉంది. మొబైల్‌ బ్యాంకింగ్‌ వంటి వ్యవస్థలు పటిష్ఠమయ్యే కొద్దీ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడికక్కడ బ్యాంకింగ్‌ కార్యకలాపాలు నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. వీటన్నింటినీ బేరీజు వేసుకుంటూ విద్యార్థి నిరంతర అధ్యయనశీలి కావాలి. విద్యార్థులు ఏకలవ్య గురువులుగా మారాలి. బోధకుల ద్వారా పాఠాలు వినాలనుకోవడం మంచిదే. దేశ, విదేశాల్లో ప్రాచుర్యంలో ఉన్న కోర్సులనూ చదివే అవకాశం అంతర్జాలం కల్పిస్తోంది. వీడియో పాఠాలు అందుబాటులో ఉన్నాయి.


Posted on 14-08-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning