సాంకేతిక వనంలో.. కొలువుల జాతర!

ఇంజినీరు అవ్వాలనే లక్ష్యం ఉన్నవారంతా సాంకేతిక విద్యలోకి ప్రవేశం పొందుతారు. ఎంత బాగా చదివినా పరీక్షల్లో వైవిధ్యం చూపకపోతే మంచి ఫలితాలు సాధించలేరు. ఎన్ని గంటలు కష్టపడి చదివామన్నది కాదు.. పరీక్షల్లో ఎంతబాగా రాశామన్నదే ముఖ్యం. ముఖాముఖిలో ధైర్యంగా, చాకచక్యంగా సమాధానం చెబితేనే ఉపాధి కొలువు.. తలుపు తడుతుంది. ఇదే సూత్రాన్ని పాటించి ప్రాంగణ ఎంపికల్లో ఉద్యోగాలు సాధించారు పులివెందుల జేఎన్‌టీయూఏ కళాశాల విద్యార్థులు.

అనంతపురం జేఎన్‌టీయూ పరిధిలో డిసెంబర్ 21న టాటా కన్సల్టెన్సీ సర్వీస్ కంపెనీ ప్రాంగణ ఎంపికలు నిర్వహించింది. 600 మంది విద్యార్థులు అన్‌లైన్లో రాత పరీక్షలు రాయగా, 258మంది ముఖాముఖికి అర్హత సాధించారు. అన్నింటా నెగ్గిన 76మంది ఉద్యోగాలు సాధించారు. వారిలో పులివెందుల జేఎన్‌యూఏ కళాశాల విద్యార్థులు ఆరుగురు ఉన్నారు. బయోటెక్, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, సీఎస్ఈ ఆఖరి సంవత్సరం చదువుతున్న 234 మంది స్థానిక విద్యార్థులు రాత పరీక్షలు రాయగా.. ఆరుగురు ఉద్యోగాలు సాధించారు. ఏడాదికి రూ.3.24 లక్షలు జీతం పొందనున్నారు. ముఖాముఖిలో ప్రదర్శించిన ప్రతిభ, చాకచక్యం, నైపుణ్యం, ఎదుర్కొన్న ఇబ్బందులు తదితర అనుభవాలు వారి మాటల్లోనే..
విషయ నైపుణ్యంపై పట్టు ఉండాలి..
కోర్సుల్లోని సబ్జెక్టులపై పట్టు ఉంటే ముఖాముఖిలో సులువుగా విజయం సాధించవచ్చు. టాటా కన్సల్టెన్సీ సర్వీస్ కంపెనీ నిర్వహించిన టెక్నికల్ రౌండ్‌లో 40 నిమిషాల్లో 20 ప్రశ్నలు అడిగారు. వాటన్నింటికీధైర్యంగా సమాధానం చెప్పడంతో ఉద్యోగానికి ఎంపికయ్యా. ఆత్మ విశ్వాసం, ఏకాగ్రతతో ఉండాలి. మనసులో ఎలాంటి జంకు లేకుండా సమాధానాలు చెబితే ఉద్యోగం తప్పనిసరి. ప్రఖ్యాతిగాంచిన కంపెనీలో ఉపాధి దొరకడం చాలా ఆనందంగా ఉంది. మాది ప్రొద్దుటూరు. 8వ తరగతి చదువుతున్నప్పుడే తండ్రి వాసుదేవరెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. పాలు ఉత్పత్తి చేస్తూ మా అమ్మ పద్మావతి నన్ను చదివించింది. నా అభ్యున్నతికే సంపాదనంతా ఖర్చు చేసింది. ఆమె కల నేడు నెరవేరింది కష్టాలు తీరనున్నాయి.
శిక్షణ చాలా ఉపయోగపడింది : క్యాట్ పరీక్షకు వేసవి సెలవుల్లో తీసుకున్న శిక్షణ తాజాగా నిర్వహించినముఖాముఖికి ఉపయోగపడింది. రెండు రౌండ్లలో 40 నిమిషాల్లో అడిగిన 35 ప్రశ్నలకు సూటిగా సమాధానాలు చెప్పా. సబ్జెక్టుపై అవగాహన లేకపోతే మంత్రణంలో నెగ్గడం చాలా కష్టం. కష్టపడి చదివిస్తున్న తల్లిదండ్రులు నారాయణ, నాగలక్ష్మిని బాగా చూసుకుంటా. తండ్రి కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. అమ్మ సూచనలు, సలహాలు, మార్గనిర్దేశంతో మంచి భవిష్యత్తు సంపాదించుకున్నా.

- ఎల్లారెడ్డి, ఎలక్ట్రికల్, ప్రొద్దుటూరు
అన్నింటా నైపుణ్యం ఉండాలి...
కేవలం సబ్జెక్ట్స్ పట్టు ఉన్నంత మాత్రాన ప్రాంగణ ఎంపికల్లో ఎంపికవలేరు. ఆన్‌లైన్ పరీక్షలతో పాటు టెక్నికల్, హ్యూమన్ రీసోర్స్ విభాగాల్లో మంత్రణం నిర్వహిస్తారు. హ్యూమన్ రీసోర్స్ రౌండ్‌లో పది నిమిషాల పాటు మనం మాట్లాడే తీరు, నిలబడిన విధానం, ఆత్మవిశ్వాసం, ఆత్మన్యూనతాభావం తదితర అంశాలను పరిశీలిస్తారు. టెక్నికల్ రౌండ్‌లో కోర్సు అంశాలపై ప్రశ్నలు వేస్తారు. రెండింటిల్లోనూ నెగ్గితేనే ఉద్యోగం. తల్లిదండ్రులు చెంచయ్య, అంజలి నెల్లూరులో ఉంటారు. తండ్రి వ్యవసాయం చేస్తూ నన్ను చదివిస్తున్నారు. కుటుంబంలో చదువుకున్నవారు లేకపోవడంతో.. నన్ను బాగా ప్రోత్సహిస్తున్నారు. వచ్చే జీతంతో అమెరికాలో ఎంఎస్ పూర్తిచేస్తా.
- హరిష్‌కుమార్, సీఎస్ఈ, నెల్లూరు

తడబడకుండా చెప్పాలి..
ముఖాముఖిలో అడిగిన ప్రశ్నలకు ఆంగ్లంలో తడబడకుండా చెప్పాలి. తప్పయినా ఫర్వాలేదు కానీ.. భయపడకూడదు. మంత్రణంలో 40 నిమిషాల పాటు ఎలాంటి ఒత్తిడికి గురికాలేదు. భయపడలేదు. అందుకే ఉద్యోగం సాధించగలిగా. టెక్నికల్ రౌండ్‌లో రెండు సెకండ్లలలో జవాబు చెప్పాలి. లేకపోతే ఓటమిచెందినట్లే. టెక్నాలజిలో కొత్త కొత్త ప్రయోగాలు చేయాలని ఉంది. మాది నెల్లూరు జిల్లా కావలి. రామిరెడ్డి, పద్మావతి తల్లిదండ్రులు. నాన్న బ్యాంకు ఉద్యోగిగా పనిచేస్తున్నారు.

- అరవిందాసాయిరెడ్డి, సీఎస్ఈ

యాప్టిట్యూడ్‌పై దృష్టి పెట్టాలి...

యాప్టిట్యూడ్‌పై పూర్తి అవగాహన ఉంటే కంపెనీలు నిర్వహించే మంత్రణంలో సమాధానాలను సులువుగా చెప్పవచ్చు. సాఫ్ట్‌స్కిల్స్‌పై పట్టు లేకపోవడంతోనే చాలా మందికి ఉపాధి చేజారిపోతోంది. వాటితోపాటు సాంకేతిక పరిజ్ఞానం ఉండటంతోనే ప్రాంగణ ఎంపికల్లో ఎంపికయ్యా. మాది గుంటూరు జిల్లా తెనాలి. కోటిరెడ్డి, హిమబిందు తల్లిదండ్రులు. తండ్రి ఆర్టీసీ కండెక్టర్‌గా పనిచేస్తూ నన్ను చదివించారు. ఎంఎస్ చేయాలన్నదే నా కల. తల్లిదండ్రులకు భారం కాకుండా, కుటుంబ పోషణకు అండగా నిలిచేందుకు చదువుతున్నప్పుడే ఉద్యోగం రావడంగా గర్వంగా ఉంది.

- వర్షవర్థనరెడ్డి, సీఎస్ఈ, తెనాలి
 • Industry      Interaction

  Higher Education

  Job Skills

  Soft Skills

  Comm. English

  Mock Test

  E-learning